ఇక నామినేటేడ్ పదవుల భర్తీ ?
posted on Dec 24, 2012 6:28AM
రాష్ట్రం లో కార్పోరేషన్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సమయంలో పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయాలంటే, ఈ పదవులను వెంటనే భర్తీ చేయాల్సి ఉంటుందని పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రతి జిల్లాకు ఓ కార్పోరేషన్ పదవి, ప్రతి నియోజక వర్గానికి ఓ డైరెక్టర్ పదవి ఇవ్వాలనేది పార్టీ వ్యూహంగా సమాచారం. ఈ పదవులకు కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యానారాయణ, చిరంజీవి ఇప్పటికే తమ తమ వర్గాల జాబితాలను పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వరకూ కార్పోరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రతి కార్పోరేషన్ కు ఓ చైర్మన్, సుమారు పదివరకూ డైరెక్టర్ పదవులూ ఉంటాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళుతున్న వలసలను ఆపేందుకు కొంత మంది ఎంఎల్ఏ లకు కీలకమైన కార్పోరేషన్ పదవులను ఇవ్వాలని కూడా కిరణ్ కుమార్ వద్దకు ఓ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిగేలవలేని ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను పొందడానికి ఆయా వర్గాల నేతలకు కూడా ఈ నామినేటేడ్ పదవులను ఇవ్వాలనేది పార్టీ వ్యూహమని తెలుస్తోంది. గాదె వెంకట రెడ్డి కి ఎపిఎస్ ఆర్టిసి చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.