జగన్ కేసు వేగం పెంచిన సిబిఐ
posted on Dec 23, 2012 @ 10:11AM
జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంభందించి సిబిఐ తన కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ కేసుకు సంభందించి సిబిఐ ఇప్పటికే పూర్తి అవగాహనకు వచ్చింది. ఇందులో నిందితులుగా ఉన్న మంత్రులను, అధికారులను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి రాకపోతే ఉన్న ఇతర బ్రహ్మాస్త్రాలను ప్రయోగించేందుకు కూడా దర్యాప్తు సంస్థ సిద్దం అయినట్లు తెలుస్తోంది.
ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇప్పటికే పొందింది. మంత్రులు ధర్మాన, మోపిదేవిలను ప్రాసిక్యూషన్ చేసేందుకు రంగం సిద్దం చేసింది. ధర్మాన ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అసలు ఈ విషయంలో ప్రభుత్వ అనుమతి అవసరం లేదనే కొత్త అంశాన్ని సిబిఐ తెరఫైకి తెచ్చింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను సిబిఐ అధికారులు కోర్టు ముందు ఉంచారు. ఇక ఐఏఎస్ అధికారులకు సంభందించిన ఫైలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చక్కర్లు కొడుతోంది.
ప్రభుత్వం ధర్మాన విషయంలో వ్యవహరించిన తీరుకు కాస్త ఊపిరి పీల్చుకున్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు సిబిఐ కొత్త ఎత్తుగడకు ఖంగు తిన్నారు. కాగా, సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వచ్చే మార్చి నెలాఖరుకు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఈ అనుమతుల్లో జాప్యం పెద్ద ప్రతిభందకంగా నిలుస్తోంది.