పోలీసు లాఠీఛార్జ్: సొమ్మసిల్లిన టిడిపి మాజీ మంత్రి
posted on Dec 23, 2012 @ 4:16PM
సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ తెదేపా నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు ఆదివారం నర్సరావుపేటలో ధర్నా చేపట్టారు. సహకారశాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు తెదేపా నేతలు, కార్యకర్తలు యత్నించారు. వీరిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. కోడెలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టణంలో పోలీసులు 144సెక్షన్ విధించినా తెదేపా శ్రేణులు ధర్నా చేస్తున్నారు. దీంతో స్టేషన్ ముందు బైఠాయించిన కార్యకర్తలపై పోలీసులు మరోసారి లాఠీఛార్జి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కోడెల శివప్రసాదరావుపై కూడా పోలీసులు చేయిచేసుకున్నారు. దీంతో కోడెల పోలీస్‌స్టేషన్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు సపర్యలు చేశారు. అనంతరం పోలీసుల దాడిని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోడెల సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిని అరెస్టుచేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల చర్యకు నిరసనగా దుకాణాలు మూసివేశారు.