75 రోజులు పూర్తయిన ‘వస్తున్నా...మీ కోసం’
posted on Dec 20, 2012 @ 11:21AM
ప్రజల కష్ట సుఖాలు తెల్సుకోవాలని, వారి కష్టాల్లో భాగస్వామి కావాలనే ఉద్దేశ్యంతో తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు ఎంతో చిత్తశుద్దితో మొదలు పెట్టిన ‘వస్తున్నా...మీ కోసం’ పాద యాత్రకు నిన్నటితో 75 రోజులు పూర్తయ్యాయి. అనంతపురం జిల్లా ఓ ఆంజనేయ స్వామి గుడి నుండి గత అక్టోబర్ 2 వ తేదీన బాబు తన పాద యాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.
ఈ 75 రోజుల్లో ఆయన ఆరోగ్యం నానా రకాలుగా దెబ్బతింది. ఒంట్లో షుగర్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. ఆయన కాళ్ళకు సగటు వ్యక్తి దాదాపు నడవలేని స్థితిలో ఉండే విధంగా బొబ్బలు కట్టాయి. అయినా, ఆయన ఇవేమీ ఆయన లెక్క చేయలేదు. ఈ యాత్రలో బాబు ఇప్పటివరకూ అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు పూర్తి చేశారు. ప్రస్తుతం బాబు కరీంనగర్ జిల్లాలో తన యాత్రను సాగిస్తున్నారు. ఈ యాత్ర 74 రోజులు పూర్తయ్యేటప్పటికి బాబు 1251 కిలోమీటర్ల మేర తన యాత్రను పూర్తి చేశారు.
ఆయన యాత్ర ప్రారంభమయి ఇప్పటికి 79 రోజులయింది. అయితే, మధ్యలో కాలికి గాయం అయిన కారణంగా ఓ సారి, ఎర్రన్నాయుడు మృతి కారణంగా మరో సారి మొత్తం నాలుగు రోజులు ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బాబు ఎంతో సాహసోపేతంగా తన యాత్రను కొనసాగిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.