హైదరాబాద్ యూనివర్సిటీలో తెలంగాణ హవా
posted on Oct 16, 2012 @ 11:10AM
హైదరాబాద్ యూనివర్సిటీలోకూడా తెలంగాణ పొగరాజుకుంది. అక్టోబర్ 18న జరగబోయే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలకు తెలంగాణ విద్యార్ధి సంఘం సిద్ధమౌతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మూడు విద్యార్ది సంఘాలు ఏకమై ఎస్ ఎఫ్ ఐ, ఎబివిపి, అంబేత్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీలో తెలంగాణ వేడి ఈ మధ్య కాలంలోనే మొదలయ్యిందని విద్యార్ధి సంఘాలు చెబుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రవాదులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్దులు ఏకమై పోటీకి దిగాయని విద్యార్ధి సంఘాలు నేతలు అంటున్నారు. జనరల్ బాడీ మీటింగ్ లో ఓ విద్యార్ది తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడ్డంవల్ల కొంత ఉద్రిక్త పరిస్థితికూడా ఏర్పడినట్టు తెలుస్తోంది. బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ సంఘాలు తెలంగాణ వాదం గొడుగుకింద పనిచేస్తున్నాయి. తెలంగాణ సంఘాలకు దీటుగా మిగతా విద్యార్ధి సంఘాలుకూడా ఏకమై డెమొక్రటిక్ ఫ్రంట్ కింద ఏర్పడ్డాయి. ఈ సారి ఎన్నికల చాలా వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయని పరిశీలకు గట్టిగా చెబుతున్నారు. ముందెన్నడూ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్ది సంఘం ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితుల్ని చూడలేదంటున్నారు.