రక్తి కడుతున్న బాబు ప్రసంగాలు
posted on Oct 17, 2012 @ 9:30AM
ఎంఎ పాలిటిక్స్ చదివిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన విద్య, వాక్‌పటిమకు పరీక్షపెట్టుకున్నారు. పాదయాత్రల్లో భాగంగా ఆయన ఓసారి టీచర్ పాత్ర పోషించారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళా సాధికారతపై విద్యార్థినులకు ఆసక్తికరంగా బోధించారు. ఓ టీచర్ విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు ఎలా ఎదురు ప్రశ్నలు వేసి చెబుతుంటారో అదే తరహాలో బాబు వ్యవహరించారు. మహిళలు రోజువారీ పడతున్న బాధలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే జరుగుతున్న మార్పులపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు బాబు కృషి చేశారు. ప్రత్యేకించి మహిళలు స్వేచ్ఛగా ఎలా ఎదగాలో కళాశాల విద్యార్థినులే రోల్‌మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆకాంక్ష ఆయన చేసిన ప్రసంగాన్ని రక్తికట్టించింది. ఓ మాజీముఖ్యమంత్రి లెక్చరర్లతో సమానంగా బోధించటం మరిచిపోలేనిదని ఆ కళాశాల ప్రిన్పిపాల్ విజయారాణి వ్యాఖ్యానించారు. ఇది చారిత్రకఘట్టంగా విద్యార్థినుల మదిలో నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.