వైకాపా సమావేశాలపై ‘బాబు’ ముద్ర?
posted on Oct 17, 2012 9:26AM
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలకు వస్తున్న స్పందన ద్వారా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సమావేశాలను ప్రభావితం చేస్తున్నారు. బాబుకు పెరిగిన ఇమేజ్ వైకాపా కార్యకర్తల ద్వారానే అని రాజకీయపరిశీలకులు ఇటీవల తేల్చిన విషయం ‘తెలుగువన్.కామ్‘ పాఠకులకు తెలిసిందే. గతంలో వైకాపా సమావేశమంటే ఒకటే హడావుడి కనిపించేది. సమావేశానికి పరిశీలకులు, రాష్ట్రనాయకులు రావటం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నంత అంశంగా వైకాపా ద్వితీయశ్రేణి నాయకులు బోలెడు హంగామా చేసేవారు. ఈసారి అసలు ఏ మాత్రం పెద్దగా పబ్లిసిటీ స్టంట్లు లేకుండా జిల్లా సమావేశాలు అయిందనిపించారు. అయితే వైకాపా కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లాల పరిశీలకులు కృషి చేశారు. దీనిలో భాగంగానే కార్యకర్తలను వారు ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు. తమకున్న బలం కార్యకర్తలే అని నేతలు చెప్పుకుంటున్నారు. విఐపిలంటే మీరే అని కూడా నేతలు ప్రశంసిస్తున్నారు. అలానే ద్వితీయశ్రేణి నాయకులను కూడా పొగడ్తలతో నేతలు ముంచెత్తుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం కాకినాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ పరిశీలకులు భూమానాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరందరూ షర్మిల పాదయాత్రల సందర్భంగా ఆమెకు స్వాగతం ఎలా ఉండాలి? ఆమె పాదయాత్రకు భంగం కలగకుండా సహకరించాల్సిన తీరు వంటి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చించారు. చివరాఖరున సమావేశం ముగిసిన తరువాత బాబు పాదయాత్రల ప్రభావం సమావేశంపై పడిందా? లేదా? అన్న అంశాలపై నాయకులు చర్చలు జరిపారు. ఈ రహస్యచర్చల ద్వారా అంచనాలు వేసుకుని షర్మిల పాదయాత్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నాయకులు ఒకరినొకరు హెచ్చరించుకున్నారు.