ఉత్సాహంగా...ఉల్లాసంగా....తూ.గో.తెలుగుదేశం?
posted on Oct 17, 2012 9:28AM
తెలుగుదేశం పార్టీ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఈ పార్టీ ప్రారంభసమయంలో ఉన్నంత ఉత్సాహం మళ్లీ ఇప్పుడు పుట్టుకొచ్చింది. వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మాటంటేనే శిలాశాసనంగా భావించి అప్పటి నాయకులు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి సాయంతో జిల్లాను జల్లెడ వేశారు. అదే తరహాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కార్యదర్శి దాట్ల బుచ్చిబాబు తదితరులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కీలకమైన సమస్యలు చర్చించారు. అలానే ఇటీవల సైన్‌ఫ్లూతో బాధపడుతున్న తాళ్లరేవు మండల వాసులకు తెలుగుదేశం నేతలు దగ్గరికి వెళ్లి భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. ప్రత్యేకించి ఈ మండలంలో మాస్క్‌లు ధరించటం ద్వారా సైన్‌ఫ్లూ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చన్న వైద్యుల సూచనలకు దాట్ల గౌరవమిచ్చి దాదాపు రూ.20వేల సొంతడబ్బుతో మాస్క్‌లు తెప్పించి పంపిణీ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టులున్న తాళ్లరేవు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి స్పందన వస్తోంది. అలానే జిల్లాలోని కీలకమైన సమస్యలున్న ప్రాంతాలకు వెళ్లేందుకు నేతలు సన్నద్ధమయ్యారు. బాబు పాదయాత్రలు వచ్చేలోపు ఉత్సాహంగా కార్యకర్తలందరూ సమస్యలపై నివేదిక రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నివేదికను బాబు ముందుంచి ఆ తరువాత జిల్లా యంత్రాంగంతో పోరాటానికి సైతం సై అంటున్నారు. గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఇంత స్పీడుగా ఉంటుందని తాము అనుకోలేదని ఇతరపార్టీల నేతలు కితాబులిస్తున్నారు. ఏమైనా బాబు పాదయాత్రలు పార్టీలో అంతర్లీనంగా ఉత్సాహాన్ని నింపింది అని అందరూ అంగీకరిస్తున్నారు.