డియల్ రవీంద్ర అవుట్ ... ఆదినారాయణ ఇన్
posted on Oct 16, 2012 @ 12:07PM
కడప జిల్లా, జమ్మలమడుగుకు చెందిన ఆదినారాయణ తీరే వేరు. ఈయనకు ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఏ పనైనా సాధించేవరకు వెనుకడుగు వేయని నాయకుడిగా ఆయనకు గుర్తింపువుంది. దాంతో ఈయనను మంత్రి పదవి వరించనుంది. ఎమ్మేల్యేగా రెండుసార్లు ఈయన అదే నియోజక వర్గంనుండి గెలిచారు. అయితే కడప జిల్లా నుండి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఆదినారాయణ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారు. కడప జిల్లానుండి ప్రాధినిద్యం వహిస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డికి ముఖ్యమంత్రికి మధ్య పచ్చగడ్దేస్తే భగ్గుమంటుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా బాహాటంగానే చెప్పుకుంటారు. పదవి చేపట్టగానే డి.ఎల్. విషయంలో దూకుడు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ విద్యాశాఖను రెండుగా విభజించి రవీంద్రా రెడ్డి అధికారాలను బాగా తగ్గించారు. ఇదే జిల్లాకు చెందిన రామచంద్రయ్య దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆ శాఖ మీద పట్టులేదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఆదినారాయణకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో పట్టు దొరుకుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా అనుకుంటున్నట్టు సమాచారం.