ఈద్ ముబారక్

  ఈ రోజు ముస్లిం సోదరులంతా ఎంతో భక్తి యుక్తంగా జరుపుకునే బక్రీద్ పండుగ. చాంద్రమానం ప్రకారం చివరి నెలలో 10 వ రోజు జరుపుకునే దుల్ హాగ్ రోజునే బక్రీద్ గా జరుపుకుంటారు. ముస్లింలకు మూల పురుషుడైన ఇబ్రహీం ను దేవదేవుడైన అల్లాహ్ లేక లేక పుట్టిన అతని కుమారుడైన ఇస్సాక్ (13) ను బలి ఇమ్మని చెబుతారు. అందుకు తగ్గ సరంజామా చేపట్టి కొండమీదకు వెళ్లి కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్దపడుతుండగా దేవుడు మెచ్చి నీ కుమారుడిని  ప్రేమిస్తున్నావా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని తెలుసు కుంటానికే  ఈ పరీక్ష పెట్టానని చెప్పి నీవే నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను నేను సంతోషిస్తున్నానంటూ ప్రక్కనే ఉన్న గొర్రెపొటేలును బలి ఇవ్వండని తెలుపుతారు. దేవుడు తమకు చేసిన ఈ సంతోషకరమైన దినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ  ఈ పండుగను ఆచరిస్తారు. ముస్లింలందరూ కొత్త బట్టలు ధరించి మసీద్ కి వెళ్లి శాంతి సౌభ్రాతుత్వాలు వెల్లివిరియాలని ప్రార్దనలు జరుపుతారు. అల్లాహ్ నిర్ణయించిన నిబంధనల మేరకు ఉన్న గొర్రెను, లేదా మేకపోతు లేదా కోడెదూడను బలి ఇస్తారు. అందుకు గానూ  వయస్సు, రూపు రేఖలు నిర్ణయించ బడినవై యుండాలి. కోసిన మాంసాన్ని సగం ఇంటిలో వండుకుంటారు. మరికొంత బందువులకు, మిత్రులకు  ఇవ్వడానికి మరికొంత పేదలకు ఇవ్వవలసి ఉంటుంది. ఇది సహజీవనాన్ని ఉద్భోధించే పండుగ.  మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులకు బక్రీద్ ముబారక్.

కాకతీయ ఉత్సవాలకు ఉలికూ పలుకూ లేని ప్రభుత్వం

  నవంబర్ 24 నుండి 30 వరకు వరంగల్ లో ఘనంగా కాకతీయ ఉత్సవాలను నిర్వహస్తామని ప్రభుత్వం డాబుగా ప్రకటించినా ఇంతవరకు ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదని స్ధానికులు చెబుతున్నారు. రామప్పఅష్టశతాబ్ధి, రుద్రమ పట్టాభి షిక్త పంచశతాబ్ది  రెండూ ఈ ఏడాది వచ్చిన నేపద్యంలో ఉత్సవాలను ఘనంగా జరపాలని ప్రజలు కోరుకున్నప్పటికీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోక పోవడంతో స్ధానికుల నుండి నిరసన వెల్లువెత్తింది. అయితే కాకతీయ ఫెస్టివల్స్ జరుపుతామంటూ ప్రభుత్వం నాలుగు నెలల క్రితం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఇంతవరకు ఏ మాత్రం పనులు ప్రారంభించలేదని  జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఈ ఉత్సవాల నిమిత్తం 20 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా ప్రస్తుతం 5 లేదా 6 కోట్లకు పరిమితం చేశారని తెలుస్తుంది. ఇదిలా వుండగా కాకతీయ వారసత్య సంపదకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలని జిల్లాలోని చరిత్రకారులు, కెయూ అద్యాపకులు పట్టుపడుతున్నారు. రామప్పదేవాలయానికి యునెస్కో గుర్తింపు తెస్తామని అధికారులు ప్రకటించినా చర్యలు మాత్రం శూన్యం అని ప్రజలు వాపోతున్నారు.

సైబర్ ప్రలోభాలకు చెక్ చెప్పండి

  సోషల్ నెట్ వర్క్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయనటంలో సందేహంలేదు. అయితే వాటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోక పోతే చాలా నష్ట పోవలసి వస్తుంది. కొన్ని యస్ ఎమ్ యస్ లు  లేదా మెయిల్స్ వస్తాయి. దానిలో మీకు కోట్లడాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నారని మీ పూర్తి వివరాలతో ఫలానా నెంబరుకు యస్ఎమ్మెస్ చేయండి లేదా మాట్లాడండి అంటూ ఒక నెంబరు ఇస్తారు. దానిలోనే మీ ఇ మెయిల్ ఐడిని పంపండంటూ వస్తుంది. మరికొన్ని మా తండ్రికి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పేరు మీద 20000కోట్ల ఆస్తులున్నాయి. లీగల్ గా కొంత రుసుము కట్టవలసి ఉంది. అధి కడితే మేము మీకు ఇంత మొత్తం వాటాగా ఇస్తాం అంటూ కొన్ని డాక్యు మెంట్లు కూడా పెడతారు. అది చూసి సరేనని కట్టామా మన సంగతి అంతే మోసానికి గురి అయిన వారు సైబర్ నేరాల క్రింద కేసు నమోదు చేసిన మళ్లీ మన డబ్బు వస్తాయనేది కల్ల. ఇలాంటి కేసుల్లో ఎక్కువమంది నైజీరియాకు చెందినవారు ఉంటున్నారు. వారు స్టూడెంట్ పాస్, జాబ్, టూరిజం వంటి వీసాలతో ఇక్కడికి ప్రవేశించి గడువు ముగిసినా దేశం లోనే ఉంటూ రకరకాలయిన నేరాలు చేస్తున్నారు. మరికొందరు ఫేక్ మనీ, డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తుంటే మరికొందరు  ఈ  సైబర్ లాటరీలను తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనా లాటరీలు  ప్రయిజ్ మనీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మోసపూరితంగా ఉండే ఇమెయిల్సను ఓపెన్ చెయ్యకూడదు. అనుమానం వస్తే మీ పాస్ వర్డ్ ను మార్చుకొండి. ఇంకా ఏమైనా అనుమానాలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

జననాయకుడిగా క్రేజీవాల్

  రాబర్ట వధేరా కుంభకోణాన్ని,సల్మాన్ ఖుర్షీద్ ట్రస్టు వ్యవహారాన్ని వెలికి తీయడం ద్వారా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న అరవింద్ క్రేజీవాల్ తనకు పార్టీలతో సంబంధం లేదని నాయకుల అక్రమాలను వెలికి తీయడమే ముఖ్యమని బిజెపి పార్టీ నాయకుడు గడ్కరీ మీద ఆరోపణలతో చెప్పకనే చెప్పారు. ఇవి కేవలం మీడియా లో  చర్చలకే కాకుండా సామాన్య మానవుడికి వివిధ పార్టీ నాయకుల అసలు రూపం తెలుసుకునేందుకు ఉపయోగపడిందని కూడా తెలుస్తుంది.  సాకాత్తూ న్యాయ శాఖ మంత్రి అన్యాయాలను బయటకు తెచ్చి తద్వారా మంత్రుల గుణ గణాలను అన్యాయం పై ప్రశ్నిస్తే రాజకీయ నాయకులు వారి నిజరూపాలు ఎలా వుంటాయో కూడా జనాలకు చూపించారు. గడ్కరీ పై ఆర్ ఎస్సెస్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. అదేవిధంగా ఒకటి రెండు రోజుల్లో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో అవినీతి ఆరోఫణలు ఎదుర్కొంటున్నవారితో పాటు క్రొత్తగా సల్మన్ ఖుర్షీద్ పేరు కూడా చేర్చబడింది. కేంద్ర మంత్రివర్గం పెదవి విప్పక పోయినా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడి గారి నిర్వాకం వల్ల పార్టీకి నష్టమేనని కాంగ్రెస్ నాయకులు అంగీకరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చెయ్యనీ చెయ్యక పోనీ, కానీ నేతల పనితీరును, అవినీతిని ఎండగట్టే నాయకుడంటూ ఒకరుండవలసిందేనని ప్రజలు కోరుకుంటున్నారు.

బొత్స సక్సెస్ అవుతారా

  రాష్ట్ర ముఖ్యమంత్రికి , ఉపముఖ్యమంత్రికి  జరుగుతున్న వార్ తో మద్యన బొత్స నలిగిపోతున్నారు. కిరణ్ కుమార్ ఒంటెద్దు పోకడ పార్టీకు దెబ్బ అని ఎంత చెప్పినా అర్దం చేసుకోవడం లేదని, రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మంత్రులను  పార్టీ వర్గాలను కలుపుకు పోవాలని ఎంత చెప్పినా  కిరణ్ కుమార్ ప్రవ ర్తనలో మార్పు రావడం లేదని పిసిసి  ప్రసిడెంట్ బొత్స వాపోతున్నారు. ఇంతకు ముందు కూడా మెదక్ జిల్లా ఇందిరమ్మ బాటకు ఇదే  విధంగా రాజనర్శింహకు ముఖ్యమంత్రికి అభిప్రాయ తేడాలు రావడం వల్లే ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లటం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరికీ సయోద్య కుదిర్చే పనిలో పడ్డ బొత్సకు దామోదర పట్టుదలతో బొత్స ఇరుకున పడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తలపెట్టిన మెదక్ జిల్లా ఇందిరమ్మ బాటకు వెళ్లవలసిందిగా బొత్స ఉపముఖ్యమంత్రిని  కోరారు. అయితే తనకు తెలియకుండా కిరణ్ రూట్ మ్యాప్ ను తన జిల్లాలో తయారు చేయించడం తగదని అందుకే తాను ఇందిరమ్మ బాటకు వెళ్లే ప్రశ్నే లేదని దామోదర తెగేసి చెబుతున్నారు. దీంతో  మెదక్ జిల్లాలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మేల్యాలకు, పార్టీ వర్గాలకు , కార్యకర్తలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. వీరందరకి సయోద్య కుదర్చి ఒక్కతాటిపైకి తేవడం బొత్స సత్యనారాయణకు సాద్యమయ్యే పనేనా అని పార్టీవర్గాలు ఎవరికి తెలిసిన అంచనాలు వారు వేసుకుంటున్నారు.

దటీజ్ పూరీ

  కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా డైరెక్టర్ పూరి సహనంతో సక్సెస్ సాధించారని సహచర నిర్మాతలు, డైరక్టర్లతో పాటు సినీ పరిశ్రమ యావత్తూ అనుకుంటున్నారు. తెలంగాణ ఏరియాలో పవన్ కల్యాణ్ కున్న ఫాలోయింగ్ని తగ్గించడానికే తెలంగాణ వాదులు ఇలా చేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యంతరకర సీన్లు కట్ చేస్తామని చెప్పిన తరువాత తెలంగాణవాదులు రీళ్లను, తగులబెట్టటం, పవన్ కల్యాణ్ ఫ్లెక్స్లలను, పోస్టర్లను చింపటం  అభిమానులను కొట్టటం తోపాటు నైజాం ఏరియా బయ్యర్ దిల్ రాజు, పూరి జగన్నాద్ ఇళ్లమీద, ఆఫీసలు మీద దాడి చేయడం తెలిసిందే. అయితే ఎక్కడా ఉద్యేగాలకు తావు నియ్యకుండా సంయమనం పాటించి రెండు రోజుల్లో సినిమా మళ్లీ ప్రదర్శనకు తెచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానిగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరం గ్రేటం చేసిన శ్రవణ్ ని ఎదుర్కుంటాం అన్న అభిమాన సంఘాలను శాంత పరచి, రాస్తారోకో చేస్తామన్న అభిమానులను దానివల్ల గొడవలు మరింత పెరుగుతాయని చెప్పి సినిమాను పండుగ రోజుల్లో హౌస్ ఫుల్ కలెకన్లలో నడిపించారు. అధిష్టానం తమ వాదనలు పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ అజెండాను పక్కన పెట్టటం, ఇదిగో తెలంగాణ అదిగో తెలంగణా అని ప్రస్తం తం  ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రస్టేషన్ లో ఉన్న తెలంగాణ నాయకులు రాంబాబు సినిమాని ఇష్యూ చెద్దామనుకుంటె కుదుర లేదు. మిగతా ఫ్రొడ్యూసర్లు, డైరెక్టర్లు దానిపై స్పందించ కుండా పూరీ చూసుకుంటుంతో  మీడియాలో కూడా రాద్దాంతం చేయటం కుదరలేదు. ఏది ఏమైనా ప్రస్తుతానికి హైదరాబాద్ సినిమా పరిశ్రమకు అంత సేఫ్ కాదని మాత్రం అనుకుంటూ విశాఖ పట్టణానికి  తరలి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నుండి పలు పరిశ్రమలు, ఐటి పరిశ్రమలు ఇతర రాష్టామలకు తరలిపోవడం తెలిసిందే.

గంటా పంట పండినట్టే!

  మళ్లీ ఎన్నికల లోపు ఇదే చివరి విస్తరణ అని ఎప్పటికప్పుడు చెప్పే ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరోసారి కేబినెట్‌ను విస్తరిస్తున్నారు. ఈసారి ప్రధానంగా పార్టీని బలోపేతం చేసేందుకు కేబినెట్‌లో మార్పులు తెస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్‌ గాంధీని కేబినెట్‌లోకి తీసుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఆదివారం జరగనున్న కేంద్ర కేబినెట్‌ విస్తరణలో చిరంజీవికి టూరిజం మంత్రిత్వ శాఖను కట్టబెట్టే అవకాశం వుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. రాయలసీమలో జగన్‌ హవాను అడ్డుకోవడానికి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి, తెలంగాణలో చంద్రబాబుకు ఓటుబ్యాంకుగా మారుతున్న మాదిగల దృష్టిని కాంగ్రెస్‌వైపు మరల్చడంకోసం సర్వే సత్యనారాయణకు మంత్రి పదవులు ఇవ్వవచ్చని అంచనా. చిరంజీవికి మంత్రి పదవి కొంతకాలంగా పెండిరగ్‌లో వుంది. ఈసారి కేబినెట్‌లోకి తీసుకొని, ఊహిస్తున్న విధంగా టూరిజం శాఖను అప్పగించే పక్షంలో రాష్ట్ర మంత్రి, ప్రజారాజ్యీయుడు గంటా శ్రీనివాసరావు పంట పండినట్టేనని భావిస్తున్నారు. విజయవాడ దగ్గర భవానీ ఐలాండ్‌తో పాటు అనేక టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి గంటాకు వ్యాపార ప్రయోజనాలు ఇమిడి వున్నాయి. విశాఖలో చిరంజీవి సినిమా స్టూడియో నిర్మాణం చేయబోతున్నారని కూడా స్వయానా గంటా వెల్లడిరచారు. వైజాగ్‌ను సినిమా షూటింగ్‌ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో గంటా తదితరులు వున్నారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి టూరిజం శాఖ దక్కితే గంటా తదితరుల ఆశలన్నీ నెరవేరినట్టే!

మూడు సిలండర్ల మతలబు

  సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్ల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కుప్పిగంతులు వేస్తున్నాయి. సబ్సిడీ సిలండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఆరుకు తెగ్గోసేసింది. ఆ ఆరింటికి కూడా పూర్తి డబ్బు ముందుగా కట్టేస్తే, సబ్సిడీ మొత్తాన్ని తీరిగ్గా వినియోగదారుల బ్యాంకు ఎకౌంట్లలో వేసే ఆలోచన చేస్తున్నారు. గ్యాస్‌ బండను మధ్యతరగతికి గుదిబండగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతుంటే, వాతలెట్టి జోలపాట పాడినట్టుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరో మూడు సిలిండర్ల సబ్సిడీ భారాన్ని అప్పగించారు. అయితే ఈ భారాన్ని మోయడానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలేవీ సుముఖంగా లేవు. కేవలం గుజరాత్‌లో ఎన్నికల ప్రచార నిమిత్తమే సోనియా ఈ మాట అన్నారు కానీ, పట్టుబట్టి అమలు చేయించే ఉద్దేశం ఏమీ లేదని అంటున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితే దీనికి ఉదాహరణ. సోనియాగాంధీ ప్రకటన చేసి వారాలు గడుస్తున్నా దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కేవలం దీపం పథకం లబ్ధిదారులకు మాత్రమే మూడు సిలండర్లు ఇస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా కిరణ్‌ సర్కారు తీరుపై రుసరుసలాడారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మాత్రం... ప్రధాని మన్మోహన్‌ టైపులో ‘డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా’ అంటున్నారు. వెక్కిరిస్తున్న ఖాళీ ఖజానాను చూపిస్తున్నారు.

కాంగ్రెస్‌లో మరో వికెట్‌ డౌన్‌

  మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. నవంబర్‌ 19న జగన్‌ పార్టీలో చేరడానికి ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో జలగం కుటుంబానికి కాంగ్రెస్‌లో చాలా ప్రాధాన్యం ఇచ్చారు. జలగం అంటే ఇందిరాగాంధీకి ప్రత్యేక అభిమానం వుండేది. ఆ అభిమానంతోనే ముఖ్యమంత్రి పదవికూడా ఇచ్చారు. అయితే పూర్వపు గుర్తింపు లభించడం లేదని కుమారుడు ఆగ్రహంతో వున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఇవ్వనందుకు గుర్రుగా వున్నారు. తనకు టిక్కెట్‌ ఇచ్చి వుంటే ఖమ్మం జిల్లాలో కనీసం పది అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకునేదని, టిక్కెట్‌ ఇవ్వని కారణంగా ఐదు చోట్ల పార్టీ ఓడిపోయిందని జలగం వెంకటరావు అన్నారు. అంటే తనకు టిక్కెట్‌ దక్కలేదనే దుగ్ధతో ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలవడానికి ఆయన పరోక్షంగా కృషి చేశారని అనుకోవాలా? ఐదు సీట్లలో గెలుపు ఓటములను నిర్ణయించగల సామర్ధ్యం వున్న వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేసినట్టు? ఇవి సమాధానం లేని ప్రశ్నలు.

బాబు యాత్రకు బాలయ్య ఊతం

  చంద్రబాబు పాదయాత్ర పాలమూరులో దిగ్విజయంగా సాగుతోంది. తెలంగాణ వాదులనుంచి ప్రతిఘటన చప్పబడిపోయింది. బీసీలు, ఎస్సీలు బాబుకు అండగా వుండడంతో తెలంగాణ వాదుల నిరసన మీడియా ప్రకటనలకు పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మహబూబ్‌నగర్‌ జిల్లా అమరవాయి వద్ద చంద్రబాబును కలవడానికి వెళ్లడం, కుశలప్రశ్నలు వేయడం, అక్కడ ప్రజలతో కాసేపు గడపడం ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో నూతన ఉత్సాహాన్ని నింపింది. నిజానికి బాలకృష్ణకూడా పాదయాత్రలో పాల్గొంటారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా, జనం తొక్కిసలాటలు లాంటి వాటిని దృష్టిలో వుంచుకొని బాలయ్య తన పాదయాత్రను విరమించుకున్నారని అంటున్నారు. అయినప్పటికీ తాను కూడా పాదయాత్ర చేసే విషయం గురించి ఆలోచిస్తానని చెప్పారు. చంద్రబాబు పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని బాలయ్య కితాబు ఇచ్చారు. అనారోగ్యంతో వున్నప్పటికీ చంద్రబాబు ప్రజలకోసం పాదయాత్ర చేస్తున్నారని బాలయ్య చెప్పారు. బాబు పాదయాత్ర 25వ రోజున బాలకృష్ణ రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌.టి.రామారావు కుటుంబంనుంచి ఇలా అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి యాత్రలో పాల్గొనే పక్షంలో చంద్రబాబు పాదయాత్ర మరింత సక్సెస్‌ అవుతుందని చెప్పవచ్చు.

పీటీఓ ఎస్పీ లక్ష్మీ నారాయణ సస్పెన్షన్

  పోలీస్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ టెక్నికల్ విభాగం ఎస్పీ లక్ష్మీ నారాయణని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెడ్ కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడారన్న అభియోగంపై శాఖ పరమైన విచారణ జరిపిన తర్వాత క్రమశిక్షణ చర్యకింద ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారంలో సస్పెన్షన్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శర్మని ఉద్యోగంనుంచి తొలగించారు. ఉద్యోగం పోయిందని తెలిసిన వెంటనే పోలీస్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాల్ని పూర్తిగా బైట పెడతానంటూ శర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇదివరలోకూడా అవినీతికి సంబంధించిన వివరాలంటూ శర్మ.. కొన్ని శాఖాపరమైన వివరాలతోకూడిన సీడీల్ని బైటపెట్టడం పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు తీవ్రస్థాయిలో ఆగ్రహం కలిగించింది.

పారిశ్రామిక వర్గాలకు దసరా చేదు

  కార్మికులకు రెండే పెద్ద పండుగలు ఉంటాయి. ఒకటి దసరా కాగా రెండోది సంక్రాంతి. ఈ రెండు పండుగలకు ప్రతి యాజమాన్యం తమ దగ్గర పని చేసే కార్మికులకి కొత్త బట్టలు, స్వీట్లు, బోనస్ ఇచ్చేవి అయితే ఈ సంవత్సరం దసరా ఒక చేదు అనుభవాన్ని మాత్రమే ఇస్తుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన నిర్వాకానికి గానూ విద్యుత్ కోతలతో పరిశ్రమలు అతలాకుతమయ్యాయని దాంతో కార్మిక వర్గాలకు మొత్తం జీతం ఇచ్చే పరిస్థితుల్లో లేమని ఇటువంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని ఆవేదని వ్యక్తం చేశారు. వారంలో మూడు రోజులు పారిశ్రామిక వాడలకు ఫవర్ హాలిడే రోజుకు 9 గంటలు మాత్రమే ఉంటే కరెంటు వల్ల  ఉత్పత్తిని పెంచడం కాదుకదా ఆర్డర్లకు సరిపడా కూడార ఉత్పత్తి చేయలేకపోయామని దాంతో ఆర్డర్లు కూడా పోయాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. సగం సగం జీతాలతో ఇల్లు గడిచే పరిస్ధితే లేదని అటువంటి పరిస్ధితుల్లో ఇంకా పండుగ ఎక్కడిదని దిగాలుగా ప్రశ్నిస్తున్నారు శ్రామికులు. ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రభుత్వం కరెంటు కోతలను నిలుపు చేసి వేలాది పరిశ్రమలను ఆదుకోవాలని,  లకలాది కుటుంబాలకు రానున్న సంక్రాంతికైనా తమను పండుగ చేసుకొనే అవకాశం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.

నామినేటెడ్ పదవులపై ఆరంభం లోనే అసంతప్తి

  ఎప్పుడెప్పుడా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తారా అని ఎదురు చూసిన అధికార కాంగ్రెస్ వర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణీ నాయకులు మొదట్లోనే అసంతప్తి చెందుతున్నారు.  విజయ దశమిని పురస్కరించుకొని సోమవారం రాష్ట్రస్దాయి పోస్టులను ప్రకటించారు. అందులో అధికార బాషాసంఘం అద్యకడుగా కష్ణాజిల్లాకు చెందిన మండలి బుద్ద ప్రసాద్ ను, మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా మంత్రి నేదురు మిల్లి రాజ్యలకిని నియమించగా మైనార్టీ కమీషనర్ గా అభిద్ రసూల్ ఖాన్ పేర్లు ఖరారు కావడంతో రాష్ట్రంలోని బిసిలు డీలా పడుతున్నారు. రాష్ట్రస్దాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అధిష్టానం సూచించిన పేర్లను సీ ఎం ఖరారు చేయగా మిగిలిన పోస్టులకు గానూ సీఎం, బొత్సా లు ప్రత్యేక దష్టి సారిస్తారు. అసంతప్తులు వెల్లువ కాకుండా జాగ్రత్తగా ఉండండని ముందే అధిష్టానం కోరింది. అయితే ప్రస్తుతం నామినేటెడ్ పదవులకు నియమితులైన రాజ్యలక్మి, మండలి ఇద్దరూ పార్టీ కార్యక్రమాలకు హాజరు కానివారని, గాందీభవన్ లో  నిర్వహించే ఏ మీటింగ్ కూ వచ్చిన పాపాన పోలేదని  అటువంటి వారికి పదవులు కట్టబెట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా ఉండే యువతకు ఇచ్చినట్లయితే బావుండేదని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇకనుండైనా ద్వితీయ శ్రేణులకు, బిసిలకు పదవులను ఇస్తూ అన్ని పార్టీలు బిసిలకు పెద్ద పీట వేస్తుంటే కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా వ్వవహరిస్తుందని, పార్టీలోని మాజీలకు కాకుండా యువతకు ప్రాధాన్యత నివ్వడం ద్వారా రానున్న ఎన్నికలకు సిద్దమవ్వాలని నాయకులు కోరుతున్నారు

రాజేంద్రప్రసాద్ తీరుతో తెలుగుధేశంకు తల బొప్పి

  చంద్రబాబునాయుడు ఆచి తూచి అడుగులు వేస్తూ ఒక్కో వర్గానికి చేరువవుతూ అధికార పక్షానికి, వైసిపికి చెమటలు పట్టిస్తుంటే ఎమ్మేల్సీ రాజేంద్రప్రసాద్ మాత్రం తన నోటి మాటలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని సహచర నాయకులు విసుగు చెందుతున్నారు.  చంద్రబాబునాయుడు  బిసిలకు పెద్దపీట వేసి, మాదిగల వర్గీకరణతో  మాదిగలను, చేనేత పరిశ్రమలకు రాయతీలను ప్రకటించడం ద్వారా వారిని ఆకట్టుకుంటూ పాదయాత్ర చేస్తుంటే రాజేంద్రప్రసాద్ మాత్రం బిసిలను దూరం చేసే వాఖ్యలను చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. బిసిలంటే వివిధ కుల వత్తులకు చెందిన వారే కాకుండా మాల, మాదిగ క్రైస్తవులతో పాటు, దూదేకులు మరికొన్నివర్గాలకు చెందిన ముస్లింలు కూడా వస్తారు. పదే పదే వైయస్సార్  పార్టీకి గౌరవ అద్యకురాలైన విజయమ్మను బైబిల్ పట్టుకు తిరుగుతున్నారంటూ విమర్శించడం ద్వారా వారినందరినీ పోగొట్టు కోవలసి ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మాదిగల వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండటంతో వారి ఓట్లన్నీ తాము రాబట్టే ప్రయత్నం చేస్తుంటే వారిలో ఉన్న దళిత క్రైస్తవుల ఓట్లకు రాజేంద్ర తూట్లు పొడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఏ పార్టీ నాయకులైనా ప్రజలను ఓట్లకు అభ్యర్దించే సమయంలో అన్ని మతాలకు చెందిన ఆలయాలను సందర్శించటం మామూలని దీనిలోకి మత గ్రంధాలను తీసుకొచ్చి విషయాన్ని సాగ తీయ కూడదని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.

ఫవర్ ఫుల్ కాని, పనులు నిల్

  ఇదో వింతైన తీరు ఎక్కడైనా అధికారంలో ఉండే పార్టీనే తమ నేతల పనులకు నియోజక వర్గాలకు పనులు చేసి పెడుతారు. అధికార పక్షంలో ఉండే సర్పంచ్ కూడా తన ఊరికి చెందిన పనులు చకచకా చేయించు కోవచ్చునని సంబర పడుతారు. కాని మన రాష్ట్రంలో పరిస్ధితులు ఇందుకు పూర్తిగా భిన్నం. సాకాత్తూ మంత్రులు, ఎమ్మేల్యేలే పనులు జరిపించుకోలేక పోతున్నారు.  మంత్రులు  పరిశీలించి పెట్టిన నోట్  ల మీద లేదా తత్ సంభందిత ఫైల్సు మీద సంతకాలు చేయకుండా  నెలలు, సంవత్సరాలు ముఖ్యమంత్రి పెండింగ్ లో పెడుతుంటే నియోజకవర్గాలకు వెళ్లటానికి  మంత్రులకే భయమేసి హైదరాబాద్ దాటి వెళ్లటం లేదు. అయితే ప్రతిఅక్షాలకు చెందిన నేతలు ఫోన్ చేస్తే చాలు నిముషాల్లో పనులయిపోవడమే కాక ఫోన్  చేసి  అధికారులు అయ్యా తమరి పని చేసేసామని చెబుతుంటే అదికార ఎమ్మేల్యేలకు, మంత్రులకు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వరావు కున్న పలుకుబడి అధికార నేతలకు లేదు.  ఖరీఫ్ పంటకు నీళ్లు వదలాలని ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ నాయకులు గాని అదికారలు గాని పట్టించు కున్న ఫాపాన పోలేదు. అయితే రబీ పంటకు నీళ్లు వదలాలి అనంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి నీళ్లు వదిలటమే కాక పోన్ చేసి మరీ చెప్పారు. అలాగే ఖమ్మం జిల్లాలోకి ముఖ్యమంత్రిని రానివ్వ మంటూ తెలుగుదేశం నాయకులు పట్టు బడితే ముందు రోజు రాత్రికే వారి కోరికలన్నీ నెరవేర్చి ఖమ్మం జిల్లా చేరుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి . నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లదంతా ఇదే తంతు. దాంతో ఇక్కడి అధికార నేతలు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక సతమత మవుతున్నారు.

ఫైర్ బ్రాండ్ తీరుపై విమర్శలు

  రేణుకా చౌదరి వ్యవహారం ఈ మద్య ఎందుకో పలు విమర్శలకు తావిస్తుంది.  ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆమె శైలి వివాదాస్పదమవుతుంది. గతంలో  యస్సి, యస్టీ స్టూడెంట్స్ తన కారుకు అడ్డుగా వచ్చి మెస్ చార్జీలను, స్కాలర్ షిప్పులను పెంచాలని డిమాండ్ చేస్తే పరిశీలిస్తాననో లేదా సంబంధిత అధికారులతో మాట్లాడతాననో చెబితే సరిపోయేది. కాని ఎప్పుడు అడగాలో ఎలా అడగాలో తెలియదా అంటూ వారిపై విరుచుకు పడ్డారు. హర్యానాలో ఆడవాళ్లపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని మీడియా గొంతు చించు కుంటే  మహిళా సంఘాలన్నీ స్వరాలు కలిపితే, సామాజిక వేత్తలంతా ఆడపిల్లలకు భద్రత పెంచాలని గొడవ పెడుతుంటే తాను మాత్రం ఇది సాధారణ విషయమేనని, ప్రపంచం అంతటా జరుగుతున్న లా అండ్ ఆర్డర్ సమస్యేనని తేలికగా తీసివేసి పలు విమర్శల పాలయ్యారు. అలాగే తాజాగా ఖమ్మం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ తో గిరిజనేతరులకు పహాణీలు ఎందుకివ్వలేదని జెసి నాయక్ తో వాగ్వివాదం జరపటమేకాక, రైతులను రెచ్చగొడుతూ పురుగు మందులు తాగమనడం వివాదం అయ్యింది. గిరిజనులకు చెందిన భూమి  గిరిజనేతరులకు ఇవ్వడం చట్టవిరుద్దం అని ఎంత చెప్పినా వినకుండా కలెక్టర్ ను దూషించడం, అలాగే కార్యకర్తలను, రైతులను రెచ్చగొట్టి దాదాపు జెసి పై దాడి చేయించినంత పని జరగడంతో తన సమకంలోనే జెసిని కార్యకర్తలు దుర్బాషలాడుతున్న వారించకపోవడం పలువిమర్శలకు తావిచ్చినట్లయింది.

కేంద్రమంత్రి ఆదేశాలను భేఖాతరు చేసిన సర్కార్

  కేంద్ర గిరిజన శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాష్ట్రంలోని గిరిజనులు నివసించే అటవీభూముల్లో బాక్సైట్ తవ్వకాలను నిలుపు చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన ఉత్తర్యులను అమలు చేయకపోవడం పై  మండి పడుతున్నారు. ఆరునెలల  ముందు రాష్ట్ర గవర్నర్ కు ఈవిషయమై ఒక లేఖను కూడా సంధించారు. అయితే గిరిజనులకు అడ్డంకులు తేవద్దంటూ కేవలం ఒక ప్రసంగంలో చెప్పి అంతకు మించి ప్రయత్నాలేవీ గవర్నర్ చేయక పోవడంతో  తనే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉత్తర్యులకు స్పందించకుండా ఉంటే త్వరలో తనకున్న అధికారాలను ఉపయోగించడానికి ఆయన సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంతో  రాష్ట్రప్రభుత్వం తమ ఆదాయాన్ని కోల్పోతుందని, ఇప్పటికే రాష్ట్ర ఆర్దిక పరిస్దితి బావుండలేదని అందుకే అమలు చేయడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.  చట్ట ప్రకారం ఆదీవాసీల హక్కుల పరిరకణకు తాను కట్టుబడి ఉన్నానని తాత్కాలిక ప్రయోజనాలకోసం శాశ్వత ప్రయోజనాలను ఫణంగా పెట్టకూడదని కేంద్రమంత్రి సర్కార్ కు తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో  ఈ వివాధం ఏపరిస్థితులకు దారి తీస్తుందోనని పారిశ్రామిక వర్గాలు కలవర పడుతున్నాయి

అత్తమీద కోపం దుత్త మీద చూపుతున్నారు

  కేంద్ర అధినాయకత్యం ప్రత్యేక తెలంగాణ మీద ఏమాత్రం శ్రధ్ద చూపటం లేదు దాంతో ప్రజలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక ఫ్రస్టేషన్  ఫీలయ్యిన తెలంగాణ నాయకత్యం సినిమాల మీద, నాయకుల మీద తమ ప్రతాపం చూపుతున్నారని  ఆంధ్రనాయకులు, తెలంగాణ నాయకులు చెబుతున్నారు.  దానిలో భాగంగానే కెమేరా మెన్ గంగతో రాంబాబు సినిమాను అడ్డుకున్నారని వారు చెబుతున్నారు. అలాగే ఏదో విధంగా ప్రజల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి నాయకులు తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని రెచ్చ కొట్టి ఆంద్రనాయకులను అడ్డుకుంటున్నారని తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు బాహాటంగానే  చెబుతున్నారు. అన్ని పార్టీలను కలుపుకు పోయి తెలంగాణ తెచ్చుకునేందుకు ప్రయత్నించకుండా వారిని నిలువరించే ప్రయత్నంలో తమకు తామే చేటుతెచ్చుకుంటున్నారని వారు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర పరువు పోగొట్టుకున్న తెలంగాణ నాయకులు త్వరలో   ప్రజల మద్యకు వెళ్లటానికి కూడా ఇబ్బందులు పడే పరిస్దితులు తెచ్చుకుంటున్నారని వారు చెబుతున్నారు. కాబట్టి ఇకనైనా తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్రంగా తీసుకురావడానికి మరింత ముందుచూపుతో వ్యవహరించాలని తాలంగాణకోసం పనిచేస్తున్న మరొక వర్గం వారు  చెబుతున్నారు.

వై పోలీస్ ఫెయిల్ కి అనుమతి నివ్వాలి

  రాజకీయాలు అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ  కేన్సర్ లా ఆక్రమించిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ వ్యవస్ధ దీని బారిన పడినట్లు ఇంకే విభాగం పడలేదన్నది జగమెరిగిన సత్యం. ఎందరో  నియమ నిబద్దత గల పోలీసులు, పోలీసు ఆఫీసర్లు రాజకీయనాయకుల వత్తిళ్లకు తలొగ్గకుండా చట్టం ముందు అందరూ సమానమే నని  పని చేసే వాళ్లు తమ కేరీర్ విషయంలో ఎంతగా నష్ట పోతున్నారో తెలియాలంటే వై పోలీస్ ఫెయిల్ కి అనుమతి నివ్వాలని పోలీసులు కోరుతున్నారు. దీని వల్ల రాజకీయ నాయకులు పోలీసుపై చేసే ఒత్తిడులు, మాటవినని వారికి వారు చేసే అవమానాలు, అవహేళలే కాకుండా పని చేయని పోలీసులుగా ముద్రవేసి ట్రాన్స్ ఫర్లు చేయడం, సెలవులపై పంపడం  వంటివి తెలియాలని, అందుకు వినయ్ కుమార్ సింగ్ రాసిన వై పోలీస్ ఫెయిల్ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వాలని కోరింది. అలా ఇవ్వని పక్షంలో ప్రజలకు సరైన సేవలు అందించడం కుదరదని వారు తెలిపారు.  భూపతి బాబునుండి , గౌతం కుమార్ వరకు వివిధనాయకుల వల్ల సెలవులపై వెళ్లటం, వి ఆర్ యస్ తీసుకోవడం   ఇందులో పొందుపరచారని తెలుస్తుంది. ప్రజలకు సరైన పోలీసు సేవలు అందించాలంటే వై పోలీస్ ఫెయిల్ ప్రజల ముందుకు రావాల్సిందేనని పోలీసు ఉన్నతాదికారులు కోరుతున్నారు.