మూడున ముహూర్తం... లేదంటే ఈరోజే... జగన్ గూటిలోకే వల్లభనేని వంశీ.!

విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా ...లేఖలు, వాట్సప్ చాట్ లతో... మొత్తం కథ నడిపించిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... మొత్తానికి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనకు అవకాశమిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే... నియోజకవర్గంలో తనకు ఎదురవుతోన్న సమస్యలను ఏకరవు పెట్టడం ద్వారా తెలుగుదేశం నుంచి స్మూత్ గా ఎగ్జిట్ కావాలన్నది వంశీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, జగన్ చెంతకు చేరాలనుకున్న వంశీ... ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపైనా... వైసీపీ నేతలపై... ఆరోపణలు చేయడం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. వైసీపీపైనే విమర్శలుచేసి... అదే పార్టీలోకి ఎలా వెళ్తారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు, వంశీ రాకపై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగి... 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాయని గుర్తుచేస్తున్నారు. అయితే, ఎన్నికల సమయంలో... వంశీ నుంచి వ్యక్తిగతంగా అనేకసార్లు బెదిరింపులను ఎదుర్కొన్నానని, అలాంటి వ్యక్తిని ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ... తన అసంతృప్తిని జగన్ కు తెలియజేందుకు ప్రయత్నించారు. అయితే, సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చినా... యార్లగడ్డకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దాంతో నిరాశతోనే యార్లగడ్డ వెనుదిరిగాడు. అంతేకాదు ఒకవేళ ఉపఎన్నిక వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని యార్లగడ్డ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, వంశీ... వైసీపీలో చేరితే.... యార్లగడ్డను టీడీపీలోకి రప్పించాలని తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గన్నవరంలో ఉపఎన్నిక వస్తే, టీడీపీ తరపున యార్లగడ్డను బరిలోకి దింపాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

4రోజులు... 80గంటలకు పైగా ఆపరేషన్... అయినా సుజీత్ కథ విషాదాంతం

తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర బోరుబావిలో పడ్డ బాలుడు సుజీత్ కథ విషాదాంతంగా ముగిసింది. బాలుడిని సురక్షితంగా బయటికి తీసేందుకు దాదాపు నాలుగు రోజులుగా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే సమయం మించిపోవడంతో విగత జీవిగా మారాడు. శుక్రవారం సాయంత్రం రెండేళ్ల సుజిత్ విల్సన్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వినియోగంలో లేని బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాలుడు 35 అడుగుల లోతులో ఉన్నట్లు మొదట కెమెరాల ద్వారా గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, బోరు బావికి పక్కన తవ్వకం చేపట్టారు. అయితే, రాయి అడ్డు తగలడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కు అంతరాయం కలిగింది. మరోవైపు అక్కడ భూమి తడిగా ఉండటంతో, 30 అడుగుల నుంచి 70 అడుగులకు, ఆ తర్వాత 90 అడుగుల కిందకి బాలుడు జారిపోయాడు. అదే సమయంలో మట్టి పేరుకుపోవడంతో బాలుడి పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు. మరోవైపు అప్పటివరకు వినిపించిన బాలుడు ఏడుపు కూడా ఆగిపోవడంతో ఏదో కీడు శంకించింది. అయినాసరే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. సుజీత్ క్షేమంగా రావాలని తమిళనాడు మొత్తం పూజలు, ప్రార్థనలు చేయడంతో ప్రాణాలతో బయటికొస్తాడని అంతా ఆశించారు. ముఖ్యమంత్రి పళిని నుంచి సూపర్ స్టార్ రజనీ వరకు అందరూ సుజీత్... సేఫ్ గా బయటికి రావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ సైతం సుజీత్ క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్లో మోడీ తెలిపారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ను దగ్గరుండి స్వయంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. అయితే, అప్పటికే బాలుడు అపస్మారకస్థితిలో చలనలం లేనట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. చివరికి మంగళవారం తెల్లవారుజామున సుజీత్ మృతదేహానికి బోరు బావి నుంచి బయటికి తీశారు. బాలుడి మృతదేహం కుళ్లిపోవడంతో పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, 80గంటలకు పైగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి బోరుబావికి సమాంతరంగా 80 అడుగుల గొయ్యి తవ్వినా, బాలుడిని కాపాడలేకపోయామని, రాతి నేల కావడం, మరోవైపు వర్షం అడ్డంకిగా మారాయని అధికారులు తెలిపారు. మొత్తానికి సుజీత్ కథ విషాదాంతం కావడంతో బాలుడి తల్లిదండ్రులతోపాటు తమిళ ప్రజలు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు.

నేటి కోర్టు తీర్పు పై ఆర్టీసీ జేఏసీ ఉత్కంఠ

ఆర్టీసీ జేఏసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో ఇరవై ఐదో రోజుకు చేరుకుంది. మొత్తం ఇరవై ఆరు డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన కార్మికులు ప్రభుత్వం పై తమదైన శైలిలో తిరుగుబాటును కొనసాగిస్తూ వస్తున్నారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో సమ్మెకు దిగిన కార్మిక సంఘాల జేఏసీ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.  రోజుకో రకంగా నిరసనలతో తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మరోసారి సమావేశం అవ్వనుంది.  హైకోర్ట్ ఇచ్చే తీర్పు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కార్మిక సంఘాల నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణపై నేడు సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తమ సమస్యలకు ప్రభుత్వం అంగీకరుంచకపోవటంతో పోరాటాన్ని ఎలా ముందు కు తీసుకెళ్లాలి అన్న విషయం పై చర్చించబోతున్నారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులు రేపు సరూర్ నగర్ లో జరగబోయే బహిరంగ సభపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. నేటి మధ్యాహ్నం కోర్టు తీర్పు తర్వాత కార్యాచరణను ప్రకటించే ఆలోచనలో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఉన్నట్లుగా తెలుస్తోంది . సతుపల్లి లో ఒక ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. దీనికి  సంబంధించి సంతాప సభలను ఆర్టీసి జెఎసి నాయకులు  అన్ని డిపోల లో ఏర్పాటు చేసి ఆమెకు సంతాపం తెలపనున్నారు. నేటి కోర్టు తీర్పు విషయం లో ఆర్టీసి జెఎసి నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠతో‌  ఎదురు చూస్తున్నారు. సమ్మె ఎప్పుడు ఆగుతుందా మళ్ళీ తిరిగి బస్సులు యధావిధంగా తిరుగుతాయా అని ప్రజలు నేడు కోర్టు ఇచ్చే తీర్పు పై ఎన్నో ఆశలతో‌ ఉన్నారు. సంతాప సభలను పదకొండు గంటల కల్లా పూర్తి చేసి, కోర్టు తీర్పు వచ్చాక రేపై సరూర్ నగర్ బహిరంగ సభపై తదుపరి ప్రణాలికని సిద్దం చేసుకోవాలని ఆర్టీసి జెఎసి నాయకులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

వంశీ ఎపిసోడ్‌లో వైసీపీ రియాక్షనేంటి? యార్లగడ్డపై జగన్‌కు సానుభూతి ఉందా?

వల్లభనేని వంశీ అసలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారో లేదో తెలియదు కానీ... గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మాత్రం కాకరేపుతోంది. వంశీ వైసీపీలోకి వస్తున్నాడన్న ప్రచారంతో గన్నవరం ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోతున్నాడు. ఇక యార్లగడ్డ అనుచరుల నుంచైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వంశీ, యార్లగడ్డ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వ్యక్తిగతంగా ఇద్దరూ తలపడ్డారు. అయితే, కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో వంశీ చేతిలో యార్లగడ్డ ఓటమి పాలయ్యారు. కానీ, ఒకానొక టైమ్ లో గెలుపుపై వంశీ ఆశలు వదిలేసుకున్నారు. అందుకే, ఫలితాలకు ముందే యార్లగడ్డకు ఫోన్లు చేయడం, ఇంటికి అనుచరులను పంపడంలాంటి పనుల ద్వారా వంశీ బెదిరింపులకు సైతం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, గన్నవరం మాత్రం అనూహ్యంగా వంశీ గెలవడంతో... ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డపై జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అంటారు. ఎందుకంటే జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ... అతితక్కువ టైమ్ లోనే వల్లభనేని వంశీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు గెలుపు అంచులదాకా వచ్చి... స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే, యార్లగడ్డను ఇబ్బంది పెట్టడం జగన్ కు ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వంశీ రాకకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. మొన్న జగన్ ను కలిసిన వంశీ... తాను వైసీపీలో చేరితే... గన్నవరంలో యార్లగడ్డ ఉండొద్దని ప్రతిపాదన పెట్టారట. అయితే, వంశీ కండీషన్ కు జగన్ ఒప్పుకోలేదని, వంశీ ఇష్యూ హోల్డ్ లోకి వెళ్లిందని అంటున్నారు. అయితే, వంశీపై జగన్‌కు సాఫ్ట్‌ కార్నర్‌ ఉందంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో బెజవాడ నడిబొడ్డున జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే మాట కూడా వినిపించింది. అయితే, వల్లభనేని వంశీ... తన లేఖలో వైసీపీ మీద కూడా విమర్శలు చేయడం... ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని... అలాగే తన అనుచరులపై దాడులు పెరిగిపోయాయని... స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించడం చూస్తుంటే... వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, వైసీపీలోకి వెళ్లాలనుకుంటే, అదే పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, అదంతా వంశీ వ్యూహమనే వాళ్లూ ఉన్నారు. మరి వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

వల్లభనేని గేమ్ ప్లానా? బాబు నమ్మకమా? రసవత్తరంగా గన్నవరం రాజకీయం

వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం తెలుగుదేశంలో కలకలం రేపుతోంది. వంశీ లేఖ రాయడం... అంతే స్పీడుగా బాబు రిప్లై ఇవ్వడం... వంశీ థ్యాంక్స్ చెప్పడం... మళ్లీ చంద్రబాబు రియాక్టవడం... ఇలా గన్నవరం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవరాల్ ఎపిసోడ్ ను గమనిస్తే.... విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండానే మొత్తం కథ నడుస్తోంది. అయితే, వంశీ వ్యూహాన్ని పసిగట్టిన కొందరు టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. అయితే, వంశీ వ్యూహం ఎలాగున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం సానుకూల దృక్పథంతోనే స్పందిస్తూ.... వల్లభనేని పార్టీ వీడకుండా నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే, గన్నవరం ఇష్యూపై అత్యవసర సమావేశం నిర్వహించిన చంద్రబాబు... వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రంగంలోకి దింపారు. వంశీతో చర్చలు జరిపిన కేశినేని, కొనకళ్ల... వల్లభనేనిని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు. అయితే, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ ప్రకటించినప్పటికీ, వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారంటూ ఆరోపించడంతో ఎక్కడో ఒక మూల వల్లభనేనిపై బాబుకి ఇంకా నమ్మకముందంటున్నారు తెలుగుదేశం నేతలు. అందుకే వంశీని బుజ్జగించి, టీడీపీలో కొనసాగేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఇదంతా వంశీ గేమ్ ప్లాన్ అనుకున్నా... జగన్ సిద్ధాంతం ప్రకారం ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుందని, అలా కాకుండా వైసీపీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఒకవైపు వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, మరోవైపు వల్లభనేనికి మద్దతుగా గన్నవరం టీడీపీ కేడర్‌ రాజీనామాలకు సిద్ధమవడం తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంశీకి మద్దతుగా నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలు రాజీనామాకు సిద్ధమయ్యారు. వంశీ నిర్ణయం ఏదైనా ఆయన వెంటే ఉంటామంటూ తేల్చిచెబుతున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ ఎపిసోడ్ అటు టీడీపీలోనూ... ఇటు వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.

సుజీత్ కోసం తల్లడిల్లుతోన్న తమిళనాడు... క్షేమంగా బయటికి రావాలంటూ మోడీ ట్వీట్

తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర బోరుబావిలో పడ్డ బాలుడ్ని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు... సుజీత్‌ను సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వి బాలుడిని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. బావిలోకి ఆక్సిజన్ పంపుతూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సుజిత్ విల్సన్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వినియోగంలో లేని బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాలుడు 35 అడుగుల లోతులో ఉన్నట్లు కెమెరాల ద్వారా గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, బోరు బావికి పక్కన తవ్వకం చేపట్టారు. అయితే, రాయి అడ్డు తగలడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. మరోవైపు అక్కడ భూమి తడిగా ఉండటంతో, మొదట 30 అడుగుల నుంచి 70 అడుగులకు, ఆ తర్వాత 90 అడుగుల కిందకి బాలుడు జారిపోయాడు. అదే సమయంలో మట్టి పేరుకుపోవడంతో బాలుడి పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు అప్పటివరకు వినిపించిన బాలుడు ఏడుపు కూడా ఆగిపోయింది. దాంతో బాలుడు క్షేమంగా ఉన్నాడో లేదోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అయితే, బాలుడు క్షేమంగా రావాలంటూ తమిళనాట ప్రజలు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పళిని నుంచి సూపర్ స్టార్ రజనీ వరకు అందరూ సుజీత్... సేఫ్ గా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం సుజీత్ కోసం ఆరా తీశారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సుజీత్ క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్లో మోడీ తెలిపారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం... బాలుడు అపస్మారకస్థితిలో ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయన్నారు. అయితే, నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఇచ్చిన షాక్...

    ప్రధాని నరేంద్ర మోదీ విమానానికి పాక్ గగనతలం నుంచి ప్రయాణించటానికి పాక్ అనుమతి ఇవ్వలేదు, దీనిపై భారత్ మండిపడింది. మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను పాక్ తోసిపుచ్చడంతో దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని భారత్ యోచిస్తోంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐ సీ ఏ వో దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లే యోచనలో ఉంది. ఒక దేశానికి సంబంధించి మరో దేశ గగనతలంపై ప్రయాణ అనుమతి అంశాలను ఐ సి ఏ వో చూసుకుంటోంది. ఇప్పటికే రెండు సార్లు పాక్ గగనతలంపై ప్రయాణించటానికి తిరస్కరించటం పై భారత్ పాక్ మీద ఆగ్రహంగా ఉంది. దాంతో ఈ సారి పాక్ కు గుణపాఠం నేర్పాలని భావిస్తున్న భారత్ ఐ సీ ఏ వో తలుపు తడుతోంది. గత నెలలో అమెరికా పర్యటన సందర్భం లోనూ పాక్ తమ గగనతలం నుంచి ప్రధాన మోదీ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించింది. అంతకుముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఐస్ ల్యాండ్ పర్యటన సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తరువాత కొద్దికాలం గగనతల మార్గాలను మూసివేసిన పాక్ అనంతరం కొన్నాళ్ల తరవాత తెరిచింది. ఇటీవల కాష్మీర్ విషయంలో ఆర్టికల్ 370 ను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో పాక్ మళ్లీ భారత విమానాలకు గగనతలాన్ని మూసివేస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న భారత్ పాక్ కు ఎలాగైనా బుధ్ధి చెప్పాలని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అయిన ఐ సీ ఏ వో దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని భారత్ భావిస్తుంది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి నుంచి వీడటానికి కారణాలు ఇవేనా...?

  రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్టుగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించారు. ఈ మేరకు టిడిపి అధినేతకు రాజీనామా లేఖ పంపారు, తెలుగుదేశం పార్టీతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా వంశీ లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండుసార్లు అవకాశం కల్పించినందుకు లేఖలో చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. గత అయిదేళ్లుగా నియోజక వర్గ అభివృద్ధి కోసం ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చానన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు, అధికారులు ఎన్ని కుట్రలు చేసినా అతికష్టం మీద గెలిచానని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా తనపై తన అనుచరులపై పెరుగుతున్న వేధింపులతో ఇబ్బంది పడుతున్నామన్నారు. అనుచరులను ఇబ్బంది పెట్టలేక తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టుగా ప్రకటించారు. వల్లభనేని వంశీ రెండు రోజుల కిందట సీఎం జగన్ ను కలిశారు, ఆయన వైసీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. వ్యూహాత్మకంగా టిడిపికి రాజీనామా చేయించి తటస్థ సభ్యునిగా అసెంబ్లీలో కొనసాగించే వ్యూహాన్ని వైసిపి అమలు చేయబోతోందని ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే వల్లభనేని వంశీ టిడిపికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు అయితే వంశీ మరో లేఖను స్పీకర్ కు పంపుతారో లేదో అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. స్పీకర్ కు పంపినా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే మాత్రం వైసీపీతో కలిసి వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేస్తున్నారని భావించవచ్చని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. కేసుల విషయంలో వల్లభనేని వంశీ చాలా కాలంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నకిలీ పట్టాల కేసు కూడా కొద్ది రోజుల కిందట నమోదయ్యింది. ఇది అక్రమ కేసని కొద్ది రోజులుగా ఆయన వాదిస్తున్నారు, ఈ అక్రమంలో అటు సుజనా చౌదరి తోనూ ఇటు జగన్ తోనూ సంప్రదింపులు జరిపారు చివరికి రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా చంద్రబాబుకు లేఖ రాశారు కానీ, ఇది వ్యూహాత్మక అడుగేనని ఆయన వైసిపికి సన్నిహితంగా ఉండటం ఖాయమని ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వైసిపి లో చేరేందుకు గన్నవరం వైసీపీ క్యాడర్ వ్యతిరేకతతో ఉంది, ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పై ఎనిమిదొందల ఓట్ల తేడాతో గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులతో వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు. పార్టీ మారేందుకు వీలుగా వైసీపీ సర్కారులో మంత్రులుగా ఉన్న తన పాత స్నేహితులు కొడాలి నాని, పేర్ని నానిలతో తెరవెనుక సంప్రదింపులు ప్రారంభించిన వంశీ చివరి అడుగుగా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీలో చేరేందుకు తన ఆసక్తిని జగన్ వద్ద ఆయన వ్యక్తం చేశారు, అయితే వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ విధించిన రాజీనామా నిబంధన భవిష్యత్తుపై హామీ ఇస్తే అందుకు తాను సిద్ధమేనని వంశీ సీఎం జగన్ కు తెలిపారు. దీంతో ముందు టిడిపికి రాజీనామా చేయమని ఆ తర్వాత చూద్దామని జగన్ వంశీకి చెప్పినట్లు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగితే బిజెపి లోకి చేరమని పెరుగుతున్న ఒత్తిళ్లు తనతోపాటు అనుచరులపై పోలీసులు కేసుల వేధింపులు ఇతర కారణాల నేపథ్యంలో వంశీ ఆ పదవిని వదులుకుంటున్నట్లు సమాచారం. అయితే వైసీపీ పెద్దల నుంచి భవిష్యత్తుపై హామీ లభించిన నేపథ్యం లోనే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రతిపాదన పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు అర్థమవుతుంది. దీంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ తెలిపారు. పార్టీ సభ్యత్వం వరకూ అయితే చంద్రబాబుకు పంపిన లేఖ సరిపోతుంది కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్ కు నిర్ణీత ఫార్మెట్ లో రాజీనామా లేఖను పంపించాల్సి ఉంది. ఇది ఎప్పుడు పంపుతారన్న దానిపై వంశీ క్లారిటీ ఇవ్వలేదు కానీ, టిడిపి ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం వంశీ పార్టీ అధినేతకు మిగతా వారికి తెలియజేసినట్టు ఒక లేఖ మాత్రం పంపించి వదిలేశారు. దీనిబట్టి అయన వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది.   ప్రస్తుతం వైసీపీలో వంశీ రాకపై గన్నవరం నియోజక వర్గ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయనను వైసీపీలో చేర్చుకుంటే జగన్ చెబుతున్న నైతిక విలువలకు అర్థం లేకుండా పోతుంది. గత టిడిపి సర్కారు తన పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడంపై తుదికంట పోరాటం చేస్తున్న జగన్ ఇప్పుడు వంశీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశాలు లేవు. దీంతో మధ్యేమార్గంగా వంశీ రాజీనామా చేయడం దాన్ని ఆమోదించకుండా వదిలేయడం ద్వారా ఆయనను టిడిపి సభ్యుడుగా కాకుండా స్వతంత్ర సభ్యుడుగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా గన్నవరం నియోజకవర్గంలో టిడిపికి పెద్ద దెబ్బకొట్టడం రాబోయే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ పట్టు పెంచుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మరో వైపు వంశీ లేఖపై చంద్రబాబు స్పందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనిపై మరోసారి వంశీ స్పందించారు, తన లేఖకు చంద్రబాబు స్పందించడంపై వల్లభనేని వంశీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో తన సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. నా ఆవేదనను అర్థం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, ఎలాంటి దాపరికం లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ ముందుంచుతానని వంశీ అన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీకు చెప్పిన విధంగా మీ మార్గదర్శకం లోనే నడిచానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నా మీ ఆదేశాలతోనే తొలిసారి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినా అయిదేళ్లు విలువైన కాలం వృధా అయిందని ఏనాడు బాధపడలేదన్నారు. ఓ సీనియర్ నేతపై ఐపీఎస్ అధికారిపై ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది, అప్రజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేందుకు ప్రత్యర్ధులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసునని ఆ విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావు ఇవ్వకుండా నాకిష్టం లేదని వంశీ పేర్కొన్నారు. ప్రభుత్వం హింసను ఎదుర్కునేందుకు మీ అడుగుజాడలో నడిచానని అన్యాయాన్ని ఎదుర్కొనడంలో మీ మద్దతును గుర్తుంచుకుంటానని వంశీ తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా వంశీ పాజిటివ్ గా స్పందించడం అయోమయానికి గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం వంశీ రాకపై ప్రస్తుత గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు తగిన న్యాయం చేసి స్పష్టమైన హామీ ఇచ్చి తరువాత వంశీని చేర్చుకోవచ్చని అంటున్నారు. ఇక వైసిపి నుంచి వంశీకి ఎమ్మెల్సీ తో పాటు జిల్లా అధ్యక్ష పదవికి ఆఫర్ ఉందని కొందరు అంటుండగా వంశీని రాజ్యసభకు పంపించి యార్లగడ్డని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేది జగన్ వ్యూహంగా మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతానికి టిడిపికి రాజీనామా చేసిన వంశీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

తెలంగాణా గ్రూప్-1 నోటిఫికేషన్ కు కొంత కాలం వేచి చూడాల్సిందే...

  తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు, అభ్యర్ధులకు మరి కొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఆయా శాఖల ఖాళీల వివరాలు పంపించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రూప్-1 నోటిఫికేషన్ వస్తుందని ఎప్పట్నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్ధులు కూడా దానికోసం అదే స్థాయిలో ఎదురు చూస్తూనే వున్నారు. ప్రభుత్వ శాఖలు ఖాళీల జాబితాను ఇప్పటి వరకు పంపించలేదు, పదహారు శాఖలకు లేఖలు రాసినా కనీసం ఒక్క శాఖ కూడా స్పందించలేదు. ఏ ఒక్క డిపార్టుమెంటు కూడా జవాబు ఇవ్వలేదని టీ.ఎస్.పీ.ఎస్.సి వర్గాలు చెప్తున్నాయి. గ్రూప్-1 పోస్టులు, స్టేట్ క్యాడర్ పోస్టులు అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వం మల్టీ జోనల్ పోస్టులుగా మార్చింది. మల్టీ జోనల్ పోస్టులుగా మార్పు చేయడం పై కొన్ని శాఖలు అభ్యంతరం చెప్తున్నాయి. ప్రధానంగా రెవిన్యూ, పోలీస్ విభాగాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి, తమకు ఐఏఎస్, ఐపీఎస్ ప్రమోషన్ లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ శాఖలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులపై కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణ పేట జిల్లాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులలో చేర్చాల్సి ఉంటుంది. మరోవైపు వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతామని సీ.ఎం కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే తప్ప గ్రూప్-1 పోస్టులకు ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్-1 ఒక్క పోస్టుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు, దీంతో ఇప్పటి వరకు గ్రూప్-1 పోస్టు నోటిఫికేషన్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఉద్యోగార్థులు మరికొంతకాలం ఆగక తప్పదు.  

ఉగ్రవాదులకు సాయం చేయకుండా పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచాలని ఈయు బృం దాన్ని కోరిన మోడీ...

    భారత ప్రధాని పాకిస్థాన్ పై దౌత్యపరంగా సర్జికల్ స్ట్రైక్ చేశారు, యురోపియన్ యూనియన్ బృందంతో కాశ్మీర్ పై కీలక చర్చలు జరిపారు మోదీ. శాంతి కోసం ఈయు బృందం చేసిన కృషిని ఆయన కొనియాడారు, కశ్మీర్ లో వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. పాక్ ప్రచారాన్ని నమ్మవద్దని మీరక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితిని చూడాలని యురోపియన్ ఎంపీలను ప్రధాని కోరారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాలని యూరోపియన్ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. యురోపియన్ దేశాలతో భారత్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు మోదీ, వాణిజ్య బంధం మరింత పెరిగిందన్నారు. భారత్ లో యూరోపియన్ దేశాల పెట్టుబడులు పెరిగాయన్నారు, ఉగ్రవాదులకు సాయం చేయకుండా పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచాలని మోదీ ఈయు బృందాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి చూపించేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. మంగళవారం యురోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం కశ్మీర్ లో పర్యటిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ బృందం ఇదే కావడం విశేషం. ప్రధాని మోదీతో ఈయు బృందం కీలక సమావేశం జరిపింది, కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను ఈయు బృందానికి వివరించారు ప్రధాని. జమ్మూకాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులపై ప్రపంచానికి పాకిస్తాన్ తప్పుడు సమాచారం ఇస్తోంది. పాక్ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ఈయు బృందానికి అన్ని వివరాలు భారత్ వెల్లడించబోతోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఈయు బృందం భేటీ అవుతుంది. జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది కానీ, కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని ప్రపంచానికి ఈయు బృందం పర్యటన తేట తెల్లం చేయబోతుంది. అంతర్జాతీయ మీడియాలో కూడా కాశ్మీర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కశ్మీర్ నేతలు మాత్రం ఈయు బృందం పర్యటనపై ఆచి తూచి స్పందిస్తున్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో కాకుండా ఈయూ బృందం స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో వాస్తవ పరిస్థితిని ఈయు బృందానికి వివరిస్తారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అయితే కాశ్మీర్ లో ఈయూ బృందం పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఈయు బృందం పర్యటనకు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే కాశ్మీర్ లో ఈయు బృందం పర్యటనను రద్దు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల మొత్తం డిమాండ్ లలో ఆర్థిక భారం కాని డిమాండ్ల పై చర్చ జరపాలి: హైకోర్ట్

ఆర్టీసీ కార్మికుల మొత్తం నలభై ఐదు డిమాండ్ లలో కార్పొరేషన్ పై ఆర్థిక భారం కాని డిమాండ్ల పై చర్చ జరగాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. మొదట ఇరవై యొక్క డిమాండ్లపై చర్చ జరిగితేనే కార్మికులలో కొంత ఆత్మ స్థైర్యం కలుగుతుంది అని వివరించింది న్యాయస్థానం. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, కార్మిక సంఘాల విలీనం సహా అన్ని డిమాండ్ల పై కూడా చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఇరవై ఒక్క డిమాండ్ల పై చర్చ చేపడదామన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు మాట వినలేదు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటికు వెళ్లిపోయారు. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఒక్క డిమాండ్ పైనే పట్టు పట్టకుండా మిగతా డిమాండ్ల పై చర్చలు జరపవచ్చు కదా అని హై కోర్టు తెలిపింది. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టి మిగిలిన వాటిపై చర్చించాలని హై కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారు. కేవలం ఇరవై ఒక్క డిమాండ్ల పైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు ఇతర డిమాండ్ల పై చర్చించలేదు. యూనియన్ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. మొత్తం నలభై ఐదు డిమాండ్ లకు సంబంధించి సమ్మె నోటీసులు ఇచ్చాం, కేవలం ఇరవై ఒక్క డిమాండ్ లను చర్చిస్తామంటే తామెలా ఒప్పుకుంటామంటూ కార్మిక సంఘాలు వాదనలు వినిపించారు కానీ, హైకోర్ట్ మాత్రం మొదట ఇరవై ఒక్క డిమాండ్ లకు సంబంధించి చర్చ జరిగితేనే ఇరు వర్గాల మధ్య సయోద్య కుదురుతుందని అలా అయితే ప్రజలకు కూడా కొంత ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పింది. అయితే ఇరు వర్గాల వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి, వాదనలు పూర్తి అయిన తరువాత హైకోర్ట్ ఏం చెప్తుంది అనేది తేలనుంది. సెప్టెంబర్ నెల జీతాల విషయం కూడా ఈ వాదనలో ఆర్టీసీ కార్మిక సంఘాలు అడగనున్నారు.

సీఎం కూతురు కవిత ఓడిపోగా లేనిది పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి ఓడిపోతే ఏమైంది : జగ్గారెడ్డి

  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీ పుంజుకున్నాక మిగిలిన రాష్ర్టాలపై హైకమాండ్ దృష్టి సారించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని పునర్ వ్యవస్థీకరించాలని సోనియా భావిస్తున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సారథులను నియమించాలని సీనియర్ లకు బాధ్యతలు అప్పగించినట్టు ఢిల్లీ వర్గాల భోగట్టా. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికిప్పుడు పార్టీ నాయకత్వ మార్పు ఉంటుందా అనేది గత కొద్ది రోజులుగా తెలంగాణాలో నడుస్తున్న చర్చ. పిసిసి మార్పు అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది, హుజూర్ నగర్ ఉప ఎన్నికల తరువాత దీనిపై కసరత్తు జరుగుతోందని ఊహాగానాలు వినపడ్డాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు  రావటం, అది కూడా కాంగ్రెస్ కు ఊహించని పరాభవం ఎదురైంది. దీంతో అంతా ఉత్తమ్ పార్టీ పదవికి రాజీనామా చేస్తారని భావించారు, అధిష్టానంతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో ఓటమిపై నివేదిక సమర్పించారు. అయితే ఉత్తమ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ జగ్గారెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు. సీఎం కూతురు కవిత ఓడిపోగా లేనిది పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి ఓడిపోతే అదో పెద్ద సమస్యా అంటూ చర్చను లేవనెత్తారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు వచ్చిన తరువాత సోనియా గాంధీ పార్టీ నిర్మాణం మీద దృష్టి సారిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్ లను నియమించే అంశంపై అధిష్టానంలో చర్చయితే మొదలైంది. ఏపీకి పీసీసీ చీఫ్ ఎవరన్న దాని మీద కూడా చర్చించారు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ల ఎన్నికకు సంబంధించిన అంశంపై వీరప్ప మొయిలీ, జైరాం రమేష్ లకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఏపీకి మాత్రం మాజీ మంత్రి శైలజానాథ్ పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే ఎవరికి బాధ్యతలు ఇవ్వాలన్న దానిమీద చర్చ హాట్ టాపిగ్గా మారింది. టిపిసిసి చీఫ్ రేసులో ప్రస్తుతం శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఉన్నారు అయితే, వీరిలో ఎవరిని పదవి వరిస్తుందన్నది చూడాలి. రేవంత్ కు సీనియర్ల నుంచి వ్యతిరేకత నడుస్తోంది, హైకమాండ్ కు నివేదికలిచ్చారు. అధిష్టానం మనసులో ఏముందో ఉత్తమ్, సోనియా గాంధీ భేటీ తరువాత తెలిసే అవకాశముంది, అప్పటి వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.

మహారాష్ట్రలో పట్టు వీడని శివసేన స్పందించని బిజెపి...

  మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది, గవర్నర్ భగతసింగ్ కోషియారిని శివసేన, బీజేపీ నేతలు వేరువేరుగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ తో ఇవాళ ఉదయం భేటీ అయ్యారు సీఎం ఫడ్నవీస్, తర్వాత శివసేన నేత దివాకర్ రావత్ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన డిమాండ్ పై ఇప్పటి వరకూ బిజెపి నేతలు స్పందించలేదు. అయితే గవర్నర్ తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని అటు బీజేపీ, శివసేన నేతలు చెప్తున్నారు కానీ, పరిస్థితి అలా కనిపించట్లేదు. ఉద్దవ్ థాకరే 50-50 ఫార్ములా కోసం పట్టుబడుతున్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల ముప్పైవ తేదీన ముంబై చేరుకుంటారు. అమిత్ షా వచ్చిన తరువాత ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివసేన నేత ఆదిత్య ఠాక్రే ను సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ప్రస్తుతానికి మహారాష్ట్రలో ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు, ఎన్నికల సమయంలో శివసేన ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలని చూసింది కానీ, బిజెపి శివసేనకు ఆ అవకాశం ఇవ్వకుండా తానే ఎక్కువ సీట్లలో పోటీ చేయటం జరిగింది. దాదాపు 160 సీట్లలో బిజెపి పోటీ చేయగా, 124 సీట్లలో శివసేన పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి ఊహించిన స్థాయిలో సీట్లు బిజెపికి రాలేదు, శివసేన తాను గతంలో వచ్చిన సీట్లకన్నా కొన్ని మెరుగైన ఫలితాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా సీట్లను సాధిస్తామనే నమ్మకంతో బిజెపి ఉన్నప్పటికీ అన్ని సీట్లు రాకపోవడంతో ఖచ్చితంగా శివసేన మీద పూర్తిస్థాయిగా ఆధారపడవలసిన అవసరం అయితే ప్రస్తుతం నెలకొంది. ఇదే అదునుగా చూసుకొని శివసేన తన తన బలాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది, తన మార్క్ రాజకీయాన్ని మహారాష్ట్రలో మొదలుపెట్టింది. అయితే ఈరోజు గవర్నర్ ను రెండు పార్టీల నేతలు అటు బిజెపి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ మరోపక్క దివాకర్ రాతే శివసేన నుంచి ఆయన కూడా వెళ్లి గవర్నర్ ను కలవడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత కేవలం వారు దీపావళి శుభాకాంక్షలు తెలపటం కోసం మాత్రమే గవర్నర్ ను కలిశాం తప్ప వేరే రాజకీయ ఉద్దేశమేం లేదని చెప్పారు.  

ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సిఎం జగన్...

  మరో నాలుగు రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కావలసి ఉంటుంది. రివర్స్ టెండరింగ్ కారణంగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి అదే సమయంలో భారీ వర్షాలు వరదల వల్ల కూడా పనులు జరిగే అవకాశం కనిపించలేదు. ఈ కాలంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టుకు టెండర్ లను ఖరారు చేసింది. నవంబరు ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని కూడా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలుమార్లు ప్రకటించారు. ఈ పూర్వ రంగంలో ముఖ్యమంత్రి జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు ఇతర ప్రాజెక్టులపై సమీక్షలో చర్చ జరిగింది. పోలవరం డిపిఆర్-2 ఆమోదం కేంద్రం నుంచి రావలసిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలపై కూడా జగన్ చర్చించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, గోదావరి నదులను అనుసంధానం చేయడం, గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రణాళికల పైన చర్చ జరిగింది. అయితే జూన్ నెల  22 న గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనులపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సారి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి సాగు నీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆ కమిటీలో ఆదేశించారు. జలవనరులతో పాటు రహదారులు, భవనాల శాఖ, మున్సిపల్ సీఆర్డీయే శాఖలోనే కాంట్రాక్టు పైనా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని నిపుణుల కమిటీకి అప్పుడు జగన్ స్పష్టం చేశారు.

హైకోర్ట్ ఆదేశాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆర్టీసి కార్మికులు...

ప్రభుత్వం పట్టు వీడటం లేదు, జేఏసీ నేతలు మెట్టు దిగడం లేదు, పంతం పట్టుదల మధ్య కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 వ రోజు కొనసాగుతోంది. సమ్మెపై హైకోర్ట్ విచారణ చేపట్టనుంది,కార్మిక సంఘాలతో జరిపిన చర్చల సారాంశంపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోంది, కార్మికులు పట్టు వీడాలని ఆదేశించబోతుందా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హై కోర్టు తీర్పు ఏంటి, చర్చలు ముందుకు సాగుతాయా బస్సులు రోడ్డెక్కుతాయా అనేది కాసేపట్లో తెలిసే అవకాశముంది. చర్చలకు పిలిచినా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో మెట్టు దిగకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై సర్కారు దృష్టి పెట్టింది.  ఈ నెల 26 న జరిగిన చర్చల సారాంశాన్ని కోర్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం తెలపనుంది. సమ్మె ఇదే తరహాలో కొనసాగితే ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచే క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ సంక్షోభంపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కీలక సమీక్ష నిర్వహించారు. నేడు కోర్టుకు ఇవ్వాల్సిన నివేదికను పరిశీలించారు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీలో అద్దె బస్సును పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్ లు ఇవ్వడంతో పాటు ప్రైవేటు రూట్లలో సర్వే చేయాలని నిర్ణయించారు. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు, ప్రైవేట్ రూట్లలో త్వరలో సర్వే చేయాలని, ప్రైవేట్ రూట్లు, బస్సుల విధివిధానాలపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇరవై నాలుగు రోజులుగా ఆందోళన బాట పట్టిన కార్మికులు రోజుకో తరహాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసి జెఎసి పిలుపు నిచ్చింది,  కోర్టు విచారణ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె దారి ఎటు అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. తమ డిమాండ్ లు నెరవేరే వరకు సమ్మె కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది, ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ సైతం మద్దతు ప్రకటించింది. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేడర్ కు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.

నల్లగొండ జిల్లాలోని స్థానిక ఎస్.బీ.ఐ లో చోరీ యత్నం...

నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది, స్థానిక ఎస్.బీ.ఐ లోకి చొరబడ్డ దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగానికి కన్నం వేసిన దొంగలు గ్రిల్స్ ని తొలగించి లోపలికి వెళ్లారు. నగదు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లోకి చొరబడి నగదును అపహరించారు. ఉదయం బ్యాంక్ ని తెరిచిన ఉద్యోగులు గ్రిల్స్ కట్ చేసి ఉండటం, లోపలి నగదు ఎత్తుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసు అధికారులు మరియు బ్యాంకు అధికారులు కలిసి ఇది ప్రొఫెషనల్ దొంగ కాదు కేవలం స్థానికంగా ఉండే దొంగ మాత్రమే ఇలా దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చారు. అయితే బ్యాంక్ లో ఏటువంటి నగదు పోలేదని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ బ్యాంకుకు రాత్రి వాచ్ మేన్ కూడా లేడు. సాధారణంగా బ్యాంకుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆలారం సిస్టం ఉంటుంది, ఈ బ్యాంకుకు అది కూడా లేదు. గ్రిల్ ని తొలగించి లోపలికి వెళ్ళిన దొంగ అద్దాలను పగులగొట్టి గ్రిల్ కి ఉన్నటువంటి తాళాన్ని కూడా బయటకు విసిరేశాడు.సిసి టివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎటువంటి మాస్క్ లేకుండా ఒక్క దొంగ మాత్రమే లోపలికి ప్రవేశించాడని చెప్తున్నారు. నల్గొండలో మెయిన్ బ్రాంచ్ గా ఉన్నటువంటి ఈ ఎస్.బి.ఐ లో దొంగతనం జరిగింది అనటంతో బ్యాంకు కష్టమర్లలో గుబులు పుట్టుకుంది. అయితే ఎటువంటి నగదు పోలేదని అధికారులు వెల్లడించిన తరువాత కష్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆధారాలను సేకరించిన పోలీసులు దొంగను పట్టుకోవాటానికి దర్యాప్తు ముమ్మరం చేశారు.  

నార్సింగిలో ఘనంగా జరిగిన యాదవుల సదర్ ఉత్సవాలు...

జంట నగరాల్లో నివసించే యాదవులు సంస్కృతి వేడుకగా నిర్వహించే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ నార్సింగ్ లో ఘనంగా జరిగాయి. నార్సింగ్ మాజీ సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. యాదవులతో స్థానికులు భారీ దున్నపోతులను సుందరంగా అలంకరించి ఈ సదర్ ఉత్సవాలకు తీసుకొచ్చారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ సదర్ వేడుకల్లో పాల్గొని ఆనందించారు. దున్నపోతుల్ని గ్రామంలో తిప్పుతూ వాటితో విన్యాసాలు చేయించారు. వెంకటేశ్ యాదవ్ తండ్రి హయాం నుంచి నార్సింగి లో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అతిపెద్ద పశువుల సంత కూడా ఇక్కడే ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని భారీ దున్నపోతులని ఇక్కడికి తీసుకొస్తారు. దీంతో ఏటా దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్న యాదవ సోదరులు ఈసారి ఉత్సవాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దున్నపోతుల తిండి దగ్గర నుంచి వాటికిచ్చే శిక్షణ వరకు అవి చేసే సాహసాలు ఉత్సవాల్లో ప్రదర్శనకు తీసుకొస్తారు. ఈసారి నార్సింగి లో పంజాబ్ కు చెందిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ దున్నపోతుతో యాదవ సోదరులు విన్యాసాలు చేస్తుంటే మరోవైపు వాటిపై ఎక్కిన చిన్నారులు డీజే మ్యూజిక్ కు స్టెప్పులేశారు. దీపావళి సందర్భంగా యాదవులు నగరం లోని పలుచోట్ల సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రం లోని ట్రైనింగ్ ఇచ్చిన దున్నపోతులతో పాటు పక్క రాష్ట్రాల నుంచి తెస్తున్న భారీ దున్నలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాచిగూడ చెప్పల్ బజార్ లో బీజేవైఎం నాయకుడు సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనం ఆకట్టుకుంది. తమ వృత్తిలో భాగమైన దున్నపోతులతో సాహస కార్యక్రమాలు చేపట్టారు. ఈ సదర్ వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. సదర్ ఉత్సవాల్లో దున్నపోతులని అందంగా అలంకరించిన యజమానులకు బహుమతులను అందజేశారు. రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎల్బీనగర్ నియోజకవర్గమైన కొత్తపేటలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి, యాదవుల ఐక్యతకు నిదర్శనంగా చెప్పుకునే ఈ వేడుకల్ని యాదవ సంఘం నాయకులు పండగలా జరుపుకున్నారు. ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న సదరులో సర్తాజ్ అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది, హర్యానాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్ర సింగ్ కు చెందిన సర్తాజ్ ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. ఇరవై ఏడు కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల్లో ప్రదర్శించేందుకు అఖిల భారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది.

వల్లభనేని వంశీపై కుట్ర చేసిన అజ్ఞాత శత్రువు దేవినేని ఉమానేనా?

  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి గుడ్ బై చెప్తారు అనుకుంటే.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ని కలిసిన వంశీ.. మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు అంశంపై దీపావళి తరువాత స్పష్టత ఇస్తానన్నారు. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరతారని భావించారంతా. కానీ అనూహ్యంగా రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నట్టుగా వంశీ ప్రకటించారు.  టీడీపీ అధినేత చంద్రబాబుకి వంశీ తన రాజీనామా లేఖను పంపారు. రాజకీయ కుట్రలు, దాడుల నుంచి తన అనుచరులని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీ తెలిపారు. అయితే వంశీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కేవలం అధికార పార్టీ నేత రాజకీయ వేధింపులే కాదు.. సొంత పార్టీ నేత కుట్రలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా ప్రకటన అనంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యక్ష శత్రువుతోనైనా పోరాడొచ్చు కానీ అజ్ఞాత శత్రువుతో పోరాడలేమన్నారు. దీంతో ఇప్పుడు ఆ అజ్ఞాత శత్రువు ఎవరా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలైతే ఆ అజ్ఞాత శత్రువు మాజీ మంత్రి దేవినేని ఉమా అని భావిస్తున్నారు. కృష్ణ జిల్లాలో పార్టీ పరంగా చంద్రబాబు.. దేవినేని ఉమాకి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదే చంద్రబాబు చేస్తున్న పెద్ద తప్పని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అసలు దేవినేని తీరు వల్లే జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని కార్యకర్తలు మండిపడుతున్నారు. కొడాలి నాని వంటి వారు పార్టీని వీడటానికి కూడా ఉమానే కారణమని అంటున్నారు. అంతెందుకు ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా ఉమా తీరే కారణమని వార్తలొచ్చాయి. కృష్ణా టీడీపీ అంటే ఉమా, ఉమా అంటే కృష్ణా టీడీపీ.. అన్నట్టుగా ఉమా ఫీలవుతారని.. జిల్లాలో తాను చెప్పిందే జరగాలని చూస్తారని అంటున్నారు. జిల్లా టీడీపీ నేతలంతా ఆయన చెప్పినట్టే వినాలని, వినకపోతే వారిని ఎదగనివ్వకుండా కుట్రలు చేస్తారని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వంశీ విషయంలో కూడా ఆ అజ్ఞాత శత్రువు ఉమానే అయ్యుంటారని అంటున్నారు. ఉమా తీరు వల్ల జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అధిష్టానం కూడా ఉమా మాటకే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని పట్టించుకోకపోవడంతో.. ఏం చేయాలో తెలియక వారు పార్టీని వీడుతున్నారని అంటున్నారు. ఉమా ఇప్పటికైనా తన తీరు మార్చుకొని, అందర్నీ కలుపుకొని పోతూ జిల్లాలో పార్టీకి భవిష్యత్తు ఉండేలా చూడాలని హితవు పలుకుతున్నారు. ఒకవేళ ఉమా తన తీరు మార్చుకోకపోతే.. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కళ్లుతెరిచి.. ఉమా చెప్పినదానికల్లా తల ఊపకుండా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని.. ఉమాని, పార్టీని గాడిలో పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.

వంశీని వైసిపి లోకి తీసుకోవద్దు : యార్లగడ్డ వెంకట్రావ్

కృష్ణాజిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ వైసీపీ లో చేరుతారు అంటూ వస్తున్న వార్తలు స్థానిక వైసీపీ నాయకుల్లో తీవ్ర అలజడికి దారితీశాయి. బిజెపి నేత సుజనా చౌదరిని గుంటూరులో కలిసిన వల్లభనేని వంశీ ఆ వెంటనే తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. నాటి పరిణామాలకు కొనసాగింపుగా వంశీ తెలుగు దేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు లేఖ రాయడం, ఆ లేఖకి వంశీ సమాధానం ఇవ్వడం వంటి అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్టు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అప్రమత్తమయ్యారు, వంశీ కారణంగా టిడిపి హయాంలో వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఇప్పుడు అతనే పార్టీ లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని యార్లగడ్డ ఆందోళన చెందుతున్నారు. వంశీని వైసిపి లోకి తీసుకోవద్దని ఆయన జగన్ ను కోరుతున్నారు, జగన్ తమకు న్యాయం చేస్తారని యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు, ఈ కోణంలోనే ఈ రోజు మధ్యాహ్నం ముఖ్య మంత్రి జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం అయితే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సి.ఎం జగన్ మోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ఈ సమీక్ష సమావేశం జరగనుంది, మధ్యాహ్నం తరువాత గన్నవరం వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు రెండు రెండున్నర ఆ ప్రాంతంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.