ఉగ్రవాదులకు సాయం చేయకుండా పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచాలని ఈయు బృం దాన్ని కోరిన మోడీ...
posted on Oct 28, 2019 @ 5:42PM
భారత ప్రధాని పాకిస్థాన్ పై దౌత్యపరంగా సర్జికల్ స్ట్రైక్ చేశారు, యురోపియన్ యూనియన్ బృందంతో కాశ్మీర్ పై కీలక చర్చలు జరిపారు మోదీ. శాంతి కోసం ఈయు బృందం చేసిన కృషిని ఆయన కొనియాడారు, కశ్మీర్ లో వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. పాక్ ప్రచారాన్ని నమ్మవద్దని మీరక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితిని చూడాలని యురోపియన్ ఎంపీలను ప్రధాని కోరారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాలని యూరోపియన్ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. యురోపియన్ దేశాలతో భారత్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు మోదీ, వాణిజ్య బంధం మరింత పెరిగిందన్నారు. భారత్ లో యూరోపియన్ దేశాల పెట్టుబడులు పెరిగాయన్నారు, ఉగ్రవాదులకు సాయం చేయకుండా పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచాలని మోదీ ఈయు బృందాన్ని కోరారు.
జమ్మూ కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి చూపించేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. మంగళవారం యురోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం కశ్మీర్ లో పర్యటిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ బృందం ఇదే కావడం విశేషం. ప్రధాని మోదీతో ఈయు బృందం కీలక సమావేశం జరిపింది, కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను ఈయు బృందానికి వివరించారు ప్రధాని. జమ్మూకాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులపై ప్రపంచానికి పాకిస్తాన్ తప్పుడు సమాచారం ఇస్తోంది. పాక్ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ఈయు బృందానికి అన్ని వివరాలు భారత్ వెల్లడించబోతోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఈయు బృందం భేటీ అవుతుంది. జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది కానీ, కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని ప్రపంచానికి ఈయు బృందం పర్యటన తేట తెల్లం చేయబోతుంది.
అంతర్జాతీయ మీడియాలో కూడా కాశ్మీర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కశ్మీర్ నేతలు మాత్రం ఈయు బృందం పర్యటనపై ఆచి తూచి స్పందిస్తున్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో కాకుండా ఈయూ బృందం స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో వాస్తవ పరిస్థితిని ఈయు బృందానికి వివరిస్తారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అయితే కాశ్మీర్ లో ఈయూ బృందం పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఈయు బృందం పర్యటనకు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే కాశ్మీర్ లో ఈయు బృందం పర్యటనను రద్దు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు.