ప్రపంచాన్ని గడగడలాడించాడు... కానీ కుక్కచావు చచ్చాడు...

వేలాది మందిని ఊచకోత కోసి నరమేధం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్స్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న ఐసిస్ అధినేత బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైన్యం నుంచి తప్పించుకోలేక ఆత్మాహుతికి పాల్పడ్డాడని తెలిపారు. చివరి క్షణాల్లో బాగ్దాదీ భయంతో వణకిపోయాడని, పిరికివాడిలా పారిపోయి, తనను తాను అంతం చేసుకున్నాడని ట్రంప్ ప్రకటించారు. బాగ్దాదీ టార్గెట్ గా ఈశాన్య సిరియాలో అమెరికన్ ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. అయితే, అమెరికా సైన్యం రాకతో బాగ్దాదీ భయంతో పారిపోయి, సొరంగం చివరన దాక్కున్నాడు. కానీ, అమెరికా ఆర్మీ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నిర్ధారించుకున్నాక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. బాంబులతో తనను పేల్చేసుకోవడంతో బాగ్దాదీ శరీరం తునాతునకైందని ట్రంప్ వెల్లడించారు. అయితే, డీఎన్ఏ టెస్టుల ద్వారా బాగ్దాదీ మృతిని ధృవీకరించాయని ట్రంప్ స్పష్టంచేశారు. రెండు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ మొత్తాన్ని తాను తిలకించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బాగ్దాదీ మృతి తర్వాత వైట్ హౌస్ నుంచి అమెరికన్లనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.... ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న ఐసిస్ అధినేత కుక్క చావు చచ్చాడని ప్రకటించారు. అమెరికా సైన్యానికి భయపడి బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అయితే, బాగ్దాదీని అంతమొందించాలన్న తమ లక్ష్యం పూర్తికావడంతో ఈశాన్య సిరియా నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

జగన్‌ను కలిసొచ్చాక ఈ ట్విస్ట్ ఏంటి? వేధిస్తున్నారన్న ఆరోపణల్లో మతలబేంటి?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీపావళికి రెండ్రోజుల ముందు బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలవడంతో... కాషాయ గూటికి చేరడతాడంటూ ప్రచారం జరిగింది. అంతలోనే మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో వైసీపీలో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. అయితే, పార్టీ మారతానంటూ తనపై వస్తున్న వార్తలపై పండగ తర్వాత క్లారిటీ ఇస్తానన్న వల్లభనేని వంశీ... సరిగ్గా దీపావళి రోజే... టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి లేఖ రాసిన వల్లభనేని వంశీ... ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండుసార్లు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో అతికష్టంమీద గెలిచానన్న వంశీ.... తనకు వ్యతిరేకంగా కొందరు ఉద్యోగులు, వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అనేక సమస్యలు చుట్టుముట్టాయని, రాజకీయంగా వేధిస్తూ, తన అనుచరులపై కేసులు పెడుతున్నారంటూ బాబుకి రాసిన లేఖలో చెప్పుకొచ్చారు. తన అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, అందుకే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ వెల్లడించారు. అయితే, వంశీ లేఖపై స్పందించిన చంద్రబాబు... రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, తాను... పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా అక్రమ కేసులు, వేధింపులు ఆగవన్న చంద్రబాబు.... ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఐక్యంగా పోరాడదామంటూ వంశీకి పిలుపునిచ్చారు. అయితే, బాబు రియాక్షన్ పైనా వంశీ స్పందించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తనపై తీవ్ర ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గలేదని... అయితే, కనబడే శత్రువుతో యుద్ధం చేయొచ్చు... కానీ కనబడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమంటూ... తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చిచెప్పారు. అయితే, జగన్ ను కలిసొచ్చాక... ప్రభుత్వంపైనా, వైసీపీ నేతలపైనా వల్లభనేని వంశీ ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. తనను రాజకీయంగా వేధిస్తున్నారని, తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అందుకే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. పైగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతా వైసీపీ ప్లాన్ లో భాగమని అంటున్నారు. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన వంశీ ఆరేడు నెలలపాటు సైలెంట్ గా ఉంటారని, ఈలోపు గన్నవరానికి ఉపఎన్నికలొస్తే, అక్కడ స్వల్ప తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధిని యార్లగడ్డ వెంకట్రావును తిరిగి బరిలోకి దింపుతారనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాత కొద్దిరోజులకు వంశీని వైసీపీలోకి రప్పించి ఏదోఒక పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తేలాలంటూ కొన్ని నెలలు ఆగాల్సిందే.

అప్పుడు నంద్యాలలో... ఇప్పుడు హుజూర్ నగర్ లో... కానీ ఆ తర్వాత ఎన్నికల్లోనే తారుమారు...

  ప్రజాతీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు... ఎందుకంటే ప్రజాస్యామ్యంలో ప్రజలే అత్యంత శక్తిమంతులు... అప్పటివరకు ఎదురులేని పార్టీని కనుమరుగు చేయగలరు... కనీసం డిపాజిట్ కూడా రాని పార్టీని అందలమెక్కించగలరు... ఇది ఎన్నోసార్లు రుజువైంది... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ... విభజన తర్వాత తెలంగాణ అండ్ ఏపీలోనూ అలాంటి తీర్పులెన్నో ప్రజలిచ్చారు. 2014వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కి... తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి కేవలం రెండే రెండు ఎంపీ సీట్లుండగా, పట్టుమని పది అసెంబ్లీ స్థానాలు కూడా లేవు. ఇక, తెలంగాణ ఇచ్చిన పార్టీగా అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంకుతోపాటు మెరుగైన స్థితిలో ఉంది. కానీ 2014 ఎన్నికల్లో పార్టీల లెక్కలు తారుమారు అయ్యాయి. అప్పటివరకు పట్టుమని పది సీట్లు కూడా లేని టీఆర్ఎస్ అధికారంలో రాగా, అప్పటివరకు పవర్ లో ఉన్న కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. ఆ తర్వాత 2018లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు అదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఎవరూ ఊహించనివిధంగా మూడ్నెళ్ల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, మరో రెండు మూడు స్థానాల్లో విజయానికి దగ్గర వరకు వచ్చింది.  ఇక, ఏపీలోనూ అదే జరిగింది. కాంగ్రెస్ ను, సోనియాను ఎదిరించిన నాయకుడిగా, వైఎస్ వారసుడిగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆనాడు జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిచంగా, టీడీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. దాంతో నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీదే అధికారమని అందరూ భావించారు. కానీ 2014లో లెక్కలు మారిపోయాయి. ప్రజలు చంద్రబాబుకి జైకొట్టారు. ఎవరూ ఊహించనివిధంగా టీడీపీకి ఘనవిజయం కట్టబెట్టారు. అయితే, బాబు అధికారంలో ఉండగా, 2017లో జరిగిన నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ, టీడీపీ నువ్వానేనా అన్నాయి. తమ పాలనపై ప్రజావ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు చంద్రబాబు.... 2019లో అధికారంలోకి వచ్చేది తానేనంటూ... సంకేతాలు ఇవ్వడానికి హోరాహోరీగా తలపడ్డారు. అయితే, మొత్తం టీడీపీ యంత్రాంగాన్నే రంగంలోకి దించిన చంద్రబాబు... ఇంటింటి ప్రచారంతో నంద్యాలలో ఘనవిజయం సాధించారు. అయితే, వందల కోట్ల రూపాయలు వెదజల్లి అక్రమంగా గెలిచారనే వైసీపీ ఆరోపించింది. అది నిజమో కాదో తెలియదు కానీ, సరిగ్గా ఏడాదిన్నర తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం పాలైంది. ఎన్నడూలేనివిధంగా దారుణ ఫలితాలను టీడీపీకి ప్రజలిచ్చారు. అయితే, నంద్యాలలో ఏం జరిగిందో... ఇప్పుడు హుజూర్ నగర్లోనూ అదే జరిగిందని టీకాంగ్రెస్ నేతలంటున్నారు. కేసీఆర్ వందలకోట్ల రూపాయలను పంచి అక్రమంగా గెలిచిందని ఆరోపిస్తున్నారు. మరి అది నిజమోకాదో తేలాలంటే నవంబర్ లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంతోకొంత బయటపడుతుంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు రాకపోతే మాత్రం టీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ స్టార్ట్ అయ్యినట్లే భావించాల్సి ఉంటుంది.   

హర్యానాలో బీజేపీలో లెక్కలు తప్పాయి.. అసలు కారణమిదే!!

  హర్యానాలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ... జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే, గత పాలకులతో పోల్చితే అద్భుత పాలన అందించామని, ఈసారి 70 ప్లస్ సీట్లు రావడం ఖాయమని కమలదళం వేసుకున్న లెక్కలు అంచనాలు తారుమారు కావడంపై బీజేపీ పోస్టుమార్టం మొదలుపెట్టింది. సీట్లు తగ్గడానికి అసలెక్కడ తప్పు జరిగిందంటూ అంతర్మథనం మొదలైంది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్వీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని పదికి పది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాదు లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 58శాతం ఓట్లను బీజేపీ సాధించింది. అయితే, 150 రోజుల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఊహించనివిధంగా షాకిచ్చారు. లోక్ సభ రిజల్ట్స్ ను చూసి, ఈసారి 70 ప్లస్ సీట్లతో బీజేపీ ఘనవిజయం ఖాయమని అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. మరి అందుకు భిన్నంగా ఫలితాలు ఎలా వచ్చాయంటూ బీజేపీ అగ్రనాయకత్వం పోస్టుమార్టం మొదలుపెట్టింది.  హర్యానా ఫలితాలను గమనిస్తే, ఖట్టర్ పరిపాలనపై ప్రజలు అంత సంతృప్తికరంగా లేరనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగం, మహిళలపై దాడులు, పెరుగుతున్న ధరలు బీజేపీపై ప్రతికూల ప్రభావం కనబర్చాయని అంటున్నారు. ఇక, హర్యానాలో జాట్ లదే ఆధిపత్యం. కానీ బీజేపీ... నాన్ జాట్ అయిన ఖట్టర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అసలు జాట్ల ఆధిపత్యానికి గండికొట్టాలన్నదే బీజేపీ వ్యూహం. కానీ అదే బీజేపీకి వ్యతిరేకంగా జాట్లంతా సంఘటితం కావడానికి దారితీసింది. చివరికి, జాట్ల కారణంగానే బీజేపీ అనుకున్న సీట్లు సాధించలేకపోయిందని అంచనాకి వస్తున్నారు. అయితే, మళ్లీ ఖట్టర్ నే ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ అధిష్టానం కూర్చోబెడుతోంది. మరి ఈసారి ఏమాత్రం తేడా కొట్టినా, ముందుముందు అది ఢిల్లీ పీఠానికే ముప్పు తెచ్చిపెట్టడం ఖాయం.  

పార్టీ పెట్టిన 10 నెలల్లోనే కింగ్ మేకర్ గా... హర్యానాలో మారుమోగుతోన్న దుష్యంత్ పేరు

  హర్యానాలో హంగ్ ఫలితాలు రావడంతో బీజేపీ, జేజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అనూహ్యంగా 10 సీట్లు కైవసం చేసుకున్న జేజేపీకి డిప్యూటీ సీఎంతోపాటు రెండు మంత్రి పదవులు దక్కించుకోబోతోంది. అయితే, నిన్నమొన్నటి వరకు జేజేపీ అంటే ఎవరికీ తెలియదు... ఎందుకంటే, ఈ పార్టీని ఏర్పాటుచేసి కనీసం ఏడాది కూడా పూర్తికాలేదు. 2018 డిసెంబర్ లో జన్ నాయక్ జనతా పార్టీని నెలకొల్పిన దుష్యంత్ చౌతాలా... హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లు సాధించి కింగ్ మేకర్ గా నిలిచారు. అయితే, దుష్యంత్ చౌతాలా ఫ్యామిలీకి హర్యానాలో భారీ పొలిటికల్ హిస్టరీయే ఉంది. దుష్యంత్ చౌతాలా ముత్తాత... దేవీలాల్ చౌతాలా హర్యానాకు రెండుసార్లు సీఎంగా పని చేశారు. ఇక, దుష్యంత్ తాత ఓం ప్రకాష్ చౌతాలా నాలుగుసార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే, చౌతాలా కుటుంబ పార్టీగా ఉన్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ ఎల్డీ)లో జరిగిన అంతర్గత పోరే.. జేజేపీ ఏర్పాటు కావడానికి కారణమైంది.  2018లో ఓం ప్రకాష్ చౌతాలా కుమారులైన అభయ్, అజయ్ మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవకు అజయ్, అతని కుమారులైన దుష్యంత్, దిగ్విజయ్ లే కారణమంటూ ఐఎన్ ఎల్డీ నుంచి బహిష్కరించారు. దాంతో అజయ్ కుమారుడైన దుష్యంత్... తన ముత్తాత పేరు మీద జన్ నాయక్ జనతా పార్టీని అసెంబ్లీ బరిలోకి దిగారు. అయితే, హర్యానా రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐఎన్ ఎల్డీకి ఒకే ఒక్క స్థానం రాగా, చీలిక వర్గమైన జేజేపీ అనూహ్యంగా పది సీట్లు గెలుచుకుని హర్యానా ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారింది. అంతేకాదు హర్యానాలో జాట్లను సంఘటితం చేయడంలో దుష్యంత్ కీలకపాత్ర పోషించారు. దాంతో జాట్లంతా ఐఎన్ ఎల్డీని వదిలిపెట్టి జేజేపీకి మద్దతు పలికారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దుష్యంత్ పోల్ మేనేజ్మెంట్ లో విజయం సాధించారు. జేజేపీకి కనీసం డిపాజిట్లు కూడా రావన్న ఐఎన్ ఎల్డీ అధినేత అభయ్ చౌతాలాకు షాకిస్తూ... ఇఫ్పుడు ఏకంగా కింగ్ మేకర్ గా నిలిచారు. అయితే, చౌతాలా ఫ్యామిలీపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, చివరికి ఫ్యామిలీ మొత్తం జైలుకెళ్లిచ్చినా... రైతులు, జాట్ కులస్తుల్లో మాత్రం ఆ కుటుంబానికి ఉన్న పట్టు, ఆదరణ తగ్గలేదని ఏమాత్రం తగ్గలేదని మరోసారి ఈ ఎన్నికలు నిరూపించాయి.

మీకు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ గారు.. ఇప్పటికైనా మేల్కోండి

  తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శ్రీనవ్య (28) అనే వివాహిత గతనెల 11న డెంగ్యూ కారణంగా మృతిచెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆమె భర్త చందనకుమార్‌ (35) కుమార్తె యోషిత(4)తో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ మరణాలు ఎక్కువయ్యాయి. నివారణకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వ్యక్తమవనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ గారు? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారు. ఇప్పుడు మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు. రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదు. మండపేటలో శ్రీ నవ్య డెంగ్యూ తో చనిపోయారు. ఆ బాధతో ఆమె భర్త చందు,కూతురు యోషిత ఆత్మహత్యకి పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి." అని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

చర్చలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. సమ్మెకు ఫుల్ స్టాప్ పడనుందా?

  కేసీఆర్ సర్కార్ వర్సెస్ ఆర్టీసీ సమ్మె అంశం ఓ కొలిక్కొచ్చేలా ఉందని అనిపిస్తోంది. మొన్నటివరకు ‘చర్చల్లేవ్‌.. సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌’ అన్న సీఎం కేసీఆర్‌ కార్మిక సంఘాలతో చర్చలకు అనుమతించారు. విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందిగా ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎర్రమంజిల్ లో చర్చలు జరగబోతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త వేతనాల అమలు, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు ఈనెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. వీటిలో 21 డిమాండ్లు పరిష్కరించదగినవేనని, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టి, పరిష్కరించాలంటూ హైకోర్టు సూచించింది. ఈనెల 28న జరిగే తదుపరి విచారణ కల్లా చర్చల సారాంశాన్ని వివరించాలని ఆదేశించింది. దాంతో, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ డిమాండ్లపై అధ్యయనం చేసి పూర్తి నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సునీల్‌ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సమీక్షలో తేల్చారు. హైకోర్టు సూచించిన 21 డిమాండ్లలో 12 వరకు డిమాండ్లకు పెద్దగా ఆర్థికపరమైన చిక్కులు లేవన్న నిర్ధారణకు వచ్చారు. వీటిపై కార్మిక జేఏసీతో చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే.. చర్చల సందర్భంగా, కార్మిక సంఘాలు సూచించే ఇతర డిమాండ్లనూ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం.  ఈరోజుతోనైనా సమ్మెకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

తూచ్ బీజేపీలోకి కాదు.. వైసీపీలోకి వల్లభనేని వంశీ.. రాజ్యసభ ఫిక్స్!!

  ప్రస్తుతం ఏపీలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఉదయం వంశీ బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కలిశారు. ప్రకాశంలో జరుగుతున్న గాంధీ సంకల్ప యాత్రకు సుజనా కారులోనే వంశీ వెళ్లటంతో.. వంశీ బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటానికి ఎంతో సమయం పట్టలేదు. ఉదయం సుజనా తో కలిసి యాత్రలో కనిపించిన వంశీ.. సాయంత్రానికి సీఎం జగన్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. దీంతో అసలేం జరుగుతుందో అర్థంగాక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. వల్లభనేని వంశీ తన చిరకాల మిత్రుడు మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పేర్ని నానితో కలిసి మధ్యాహ్నం 3గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటకుపైగా జగన్‌తో చర్చలు జరిపారు. ఇటీవల వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన్ను 10వ నిందితుడిగా చేర్చారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని, దీనిపై ఆధారాలతో గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ విషయమై వంశీ జగన్ ని కలిసారని అంటున్నారు. మరోవైపు ఈ భేటీలో పార్టీ మారడంపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.  కాగా, శుక్రవారం టీడీపీ ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వంశీ పాల్గొనకుండా సీఎం తోనే భేటీ అయ్యారు. దీంతో వంశీ పార్టీ మారడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వంశీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. తాను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇంత స్థాయిలో తన మద్దతుదారులపైన, అనుచరులపైన దాడులు గానీ, ఆస్తులకు నష్టం గానీ జరగలేదని పేర్కొన్నారు. ఈ అంశాలను సీఎంకు వివరించానని చెప్పారు. ఇక పార్టీ మారే అంశంపై దీపావళి తర్వాత స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.   వంశీ మాటలను బట్టి చూస్తుంటే పార్టీ మారటం ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయనకు పార్టీ మారే ఉద్దేశం లేకపోతే.. నేను టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పేవారు, అంతేకాని ఇలా దీపావళి తర్వాత స్పష్టత ఇస్తా అనేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ వర్గాల నుంచి కూడా ఇటువంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తానని సీఎంను కలిసిన సందర్భంగా వంశీ చెప్పారని, సీఎం కూడా సానుకూలంగా స్పం దించారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యేలెవరైనా వైసీపీలో చేరాలంటే ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలన్న జగన్‌ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశాయి. మరి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా?. ఒకవేళ చేరితే ఆయనను రాజ్యసభకు పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. వంశీని రాజ్యసభకు పంపి.. వైసీపీ నేత యార్లగడ్డ వెంకటేశ్వర రావుని గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మరి దీనిలో నిజమెంత? వంశీ నిజంగానే వైసీపీ కండువా కప్పుకోనున్నారా అనేది దీపావళి తర్వాత తేలిపోనుంది.

వల్లభనేని వంశీ సిఎం జగన్ తో కలిసి పని చేయనున్నారా..?

  సీఎం జగన్ తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం వద్దకు వెళ్లిన వంశీ అరగంట పాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తనపై పెట్టిన అక్రమ కేసులను సీఎంకు వివరించినట్లు సమాచారం. కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ తో వంశీ చెప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  కృష్ణా జిల్లాకు చెందిన తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అదే విధంగా మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి పేర్ని నాని ఇరువురూ కలిసి వల్లభనేని వంశీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్ళారు. సుమారు అరగంట సేపు భేటి అయ్యారు, ఈ భేటీలో ప్రధానంగా తనపై పెట్టిన కేసు గురించి వివరించినట్లు తెలుస్తోంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు అని చెప్తూ ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసులో పదవ నిందితుడిగా వంశీని చేర్చారు. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు వివరించారు.

కమలనాథుల్లో గుబులు పుట్టిస్తున్న శివసేన...

  మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. 50-50 ఫార్ములా అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్న శివసేన ఇప్పుడు తన గళాన్ని మరింత పెంచింది. అధికారాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక శివసేన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీని విమర్శిస్తూ ప్రచురితమైన ఎడిటోరియల్ వ్యాసం మరింత కలకలం రేపుతోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే బిజెపికి ఓట్లు తగ్గడాన్ని ప్రస్తావిస్తూ కమలం పార్టీని ఎండగట్టింది. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి అంటూ కమలనాథులకు శివసేన సూచించింది. మీ అంతట మీకు మహారాష్ట్ర ప్రజలు మెజారిటీ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ బిజెపికి చురకలు వేసింది. తమవల్లే బిజెపి గెలిచింది అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేసింది. శివాజీ పేరుతో అవకాశవాద రాజకీయాలను సతారా ప్రజలు అనుమతించరు అంటూ వ్యాఖ్యానించింది. సతారాలో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఉదయన్ రాజె భోంస్లే పరాజయాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఎన్సీపీ పై ప్రశంసలు గుప్పించింది. మహారాష్ట్ర లోని  288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాలతో బీజేపీ  103 సీట్లు శివసేన  56 సీట్లలో విజయం సాధించాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు శివసేన కొత్త పల్లవి అందుకుంది, ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేసింది. అధికారం చెరిసగం పంచుకోవాలి అన్న మెలికపెట్టింది. బీజేపీ కాదంటే కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం కూడా శివసేనకుంది. ఇదే ఇప్పుడు కమలనాథుల్లో గుబులు పుట్టిస్తోంది. మరో పక్క ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండు శివసేన శ్రేణుల్లో మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఆదిత్య ఠాక్రే భవిష్యత్ సీఎం అంటూ మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు భారీ పోస్టర్ లు ఏర్పాటు చేయడం బీజేపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాంతో శివసేనను దారికి తెచ్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అటు సామ్నాలో ఎడిటోరియల్ వ్యవహారంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. అధికార గర్వం తలకెక్కినప్పుడే ప్రజలు దాన్ని దించుతారు అంటూ తమ పార్టీ అధినేత ఉత్తవ్ వ్యాఖ్యలు చేశారని అదే ఎడిటోరియల్లో వచ్చింది అన్నారు, దీనిపై ఎలాంటి వివాదమూ లేదన్నారు.

హర్యానాలో వేడెక్కిన సీఎం కుర్చీ ఆట!!

  హర్యానాలో స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కనీస మెజారిటీకి కావలసిన సంఖ్యను సమకూర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్ధులు మద్దతు పలకడంతో ఇంకొందర్ని ఆకట్టుకొనేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. మోదీ నేతృత్వం లోని బిజెపికి తాను బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు హర్యానా లోకీత్ పార్టీ నేత స్వతంత్ర అభ్యర్థి గోపాల్ ఖండ ప్రకటించారు. ఆయన బాటలోనే ఇండిపెండెంట్ లుగా గెలిచిన రంజిత్ చౌతాలా, సోంబీర్ సంగ్వాన్, నయన్ పాల్ రావత్, ధరంపాల్ గోండర్ సైతం కమలదళానికి మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నారు. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్  46, ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బిజెపి నిలిచిన కనీస మెజారిటీకి అడుగు దూరంలో నిలిచిపోయింది. నలభై స్థానాలను గెలిచిన బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలంటే మరో ఆరుగురి మద్దతు కావాలి. దాంతో స్వతంత్రులతో పాటు జెజెపిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. అటు కాంగ్రెస్ ముప్పై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది. ఎనిమిది చోట్ల స్వతంత్రులు గెలవగా ఒకచోట ఐఎన్ఎల్డీ అభ్యర్థి విజయం సాధించారు. మరో పక్క హర్యానాలో తాజా పరిస్థితిని చర్చించేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీ వెళ్లారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయ్యారు. తమకు మద్దతు ఇస్తున్న స్వతంత్రులను సైతం బీజేపీ నేతలు ఢిల్లీ చేరినట్టు తెలుస్తోంది. ఒక పక్క బిజెపి మరో పక్క కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు పావులు కదుపుతూ ఉండటంతో హర్యానాలో రాజకీయం హీట్ పెంచుతోంది. జెజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా తమవైపే జెజెపిని లాక్కోవాలి అన్నది బిజెపి నేతల వ్యూహంగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో జెజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అన్నది నిర్ణయించేందుకు జెజెపి అధినేత దుష్యంత్ చౌతాలా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తొంభై స్థానాలున్న హర్యానాలో జెజెపి పది స్థానాలను దక్కించుకుంది, మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం వద్ద కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. హర్యానాలో తాజా పరిణామాలు ఎన్నికల ఫలితాలపై చర్చించారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మొత్తం మీద స్వతంత్రుల మద్దతుతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక కాంగ్రెస్,జెజెపిలు కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేస్తాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

సీఎం భార్య భారతితో నమ్రత భేటీ!!

  ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్‌ భారతితో, సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత భేటీ అయ్యారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ‘గ్రామం ఫౌండేషన్’ పేరుతో గ్రామంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను భారతికి నమ్రత వివరించారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు నమ్రత ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లి భారతితో నమ్రత భేటీ అయ్యారు.తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. అంతకు ముందు నమ్రత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మహేష్ బాబు తండ్రి, సినీ నటుడు కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెం. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించారు. కొత్తగా కొన్నింటికి శ్రీకారం చుట్టారు. ఈ గ్రామ అభివృద్ధి బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు.

టీడీపీకి మరో షాక్.. బీజేపీలోకి వల్లభనేని.. సుజనాతో భేటీ!!

  ఏపీలో ఆపరేషన్ కమలం దెబ్బకి సైకిల్ కి పంచర్ పడేలా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల పరాజయం తరువాత పలువురు కీలక నేతలు టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరారు. మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే.. టీడీపీ కోలుకోవడం కష్టమని అంటున్నారు. అయితే తాజాగా టీడీపీ శ్రేణులకు షాకిచ్చే మరో వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి బీజేపీలో చేరటానికి సిద్దమవుతున్నారంటూ ప్రచారం మొదలైంది.     నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు.. వంశీ పార్టీ మార్పు వార్తల వెనుక ఓ కారణముంది. తాజాగా వంశీ.. బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలిశారు. సుజనాచౌదరి కొద్దిరోజుల క్రితం టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు ఏపీ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, ఆయనకు టీడీపీ నేతలతో సత్సబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో వంశీ సుజనాచౌదరిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశంలో జరుగుతున్న గాంధీ సంకల్ప యాత్రకు సుజనా కారులోనే వంశీ వెళ్లటం మరిన్ని అనుమానాలకు దారి తీస్తుంది. వంశీ బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయా వర్గాల్లో వినిపిస్తుంది. అంతేకాదు వంశీ ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే ఆయన టీడీపీకి షాకిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సుజనా చౌదరితో ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా భేటీ అయ్యారని తెలుస్తోంది. కరణం బలరాం నివాసంలో సుజనా భోజనం చేసినట్టు సమాచారం. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సుజనాతో టీడీపీ నేతల వరుస భేటీలు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారిందనే చెప్పాలి.

సందిగ్ధంలో పడ్డ బీజేపీ.. తదుపరి అడుగులు ఏమిటి?

  మహారాష్ట్రలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా అధికారం మాత్రం బీజేపీకే దక్కనుంది. అటు హర్యానాలో మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను బిజెపి అందుకోలేకపోయింది. మరాఠా గడ్డపై మళ్లీ కాషాయ ధ్వజం ఎగిరింది. అయితే బీజేపీ రెపరపలు కాస్త తగ్గాయి. అధికారం మరోసారి కమలానికే దక్కనుంది.. కానీ మిత్ర పక్షం శివసేన షరతుల తంతు కలవరపెడుతోంది. బిజెపికి ఇటీవలి కాలంలో తొలిసారి మహారాష్ట్ర రూపంలో కఠినమైన ఎన్నికల పరీక్ష ఎదురైంది. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి శివసేనతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో సులువుగా అధికారంలోకి వస్తామని బిజెపి భావించింది. కానీ మునుపటి బలం కోల్పోయి శివసేనపై పూర్తిగా ఆధారపడి తప్పనిసరైతే ఆ పార్టీతో ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునేందుకు అంగీకరించాల్సిన పరిస్థితి ఎదురైంది.  2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. అయినప్పటికీ అప్పట్లో బీజేపీ 122 స్థానాల్లో నెగ్గింది. ఈ సారి 105 స్థానానలకే పరిమితమైంది. శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. గతంతో పోల్చితే ఎన్సీపీ-కాంగ్రెస్ ల కూటమి బాగా పుంజుకున్నప్పటికీ అధికారానికి ఆమడ దూరంలో నిలిచింది. బీజేపీని రెబల్స్ దెబ్బకొట్టగా, ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి ఎంఐఎం పోటీ ఇరకాటంలోకి నెట్టింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, శివసేన కలిసి మ్యాజిక్ మార్కును దాటాయి. అయితే రెండొందలకు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యానికి కూటమి ఆమడ దూరంలో నిలిచింది. శివసేన అనూహ్యంగా తమకు సగం కాలం అధికారం పంచాలనే షరతును బయటకు తీసుకొచ్చింది.  ఇక అటు హర్యానాలో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. తొంభై సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి డెబ్బై పై చిలుకు స్థానాలు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. ఈవీఎంలను లెక్కించే సరికి ఖాతా నలభై దాటలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించలేక చతికల పడిపోయింది. కాంగ్రెస్ అంచనాలను మించి పుంజుకొని 31 సీట్లు సాధించింది. కొత్తపార్టీ జననాయక్ జనతాపార్టీ పది స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ఐఎన్ఎల్డీ పార్టీ చీలికలతో కుదేలై చివరకు ఒక్క స్థానానికి పరిమితమైంది. సమాజ్ వాది పార్టీ రెండు స్థానాలను గెలుచుకోగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.  ఓ రకంగా 2018లో కర్ణాటక అసెంబ్లీ తరహా పరిస్థితి ఇప్పుడు హర్యాణలో ఏర్పడింది.మ్యాజిక్ మార్కును చేరుకోలేక పోయినప్పటికీ పరిస్థితి ప్రస్తుతం బీజేపీకే ఎక్కువ అనుకూలంగా ఉంది. బీజేపీకి తగ్గిన సీట్లు ఆరు. విజయం సాధించిన ఏడుగురు స్వతంత్రుల్లో ఐదుగురు బిజెపి రెబల్సే. టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో ఇండిపెండెంట్ లుగా బరిలో దిగారు. వీరందరినీ తమ వైపు తిప్పుకోవడం బీజేపీకీ కష్టమేమీ కాదు. ఖట్టర్ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. క్రీడా ప్రముఖుల్లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఓడిపోయారు. తొలి సారిగా బరిలో దిగిన ఇరవై తొమ్మిదేళ్ళ బబితా కుమారి కూడా భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ ఒక్కరే గెలుపొందారు. టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ కూడా ఓటమి చెందారు.ఇక బీజేపీ తదుపరి అడుగులు ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది.

జలకళను సంతరించుకున్న డ్యామ్ లు... శ్రీశైలం డ్యాం కొత్త రికార్డు!!

  భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతా జలమయమవుతోంది. దీనితో నదులు నిండు కుండను తలపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ళతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనితో పది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ ఏడాదిలో ఏడు సార్లు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం విశేషం. ఈ మూడు దశాబ్దాల్లో ఇలా జరగటం ఇదే తొలిసారని అంటున్నారు. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 211.95 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 5.1 లక్షల క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 6.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది, సెప్టెంబర్ తొమ్మిది, పంతొమ్మిది, ఇరవై ఆరు, అక్టోబరు తొమ్మిది, పదమూడు వ తేదీ ఇలా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఒకే ఏడాది ఇన్నిసార్లు క్రస్ట్ గేట్లు ఎత్తిన దాఖలాలు లేవు. మరోవైపు తుంగభద్ర డ్యామ్ కు కూడా భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల లోనూ ఇదే పరిస్థితి. దీనితో జూరాల నలభై రెండు గేట్లను ఎత్తారు. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో సాగర్ పధ్ధెనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. వీలైనంత త్వరగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాత దారికి భిన్నంగా వెళ్లి సంచలనం సృష్టించిన యువ కెరటం!!

  మహారాష్ట్రకు కొత్త కుర్రాడొచ్చాడు. ఇరవై తొమ్మిది ఏళ్ల కుర్రాడు ఈ ఎన్నికల్లో చరిత్ర సృష్టించాడు. ఠాక్రే వారసుడిగా తొలిసారి ఎన్నికల్లో పాల్గొనడమే కాదు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేవలం వర్లీ నియోజకవర్గంలోనే కాదు ఆదిత్య ఠాక్రే ప్రభావం మహారాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. యువకుడిగా యూత్ ఓటర్లను ఆకట్టుకున్నారు. శివసేనను బాల్ ఠాక్రే పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ ఠాక్రే కుటుంబంలో ఎవరూ ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా ఠాక్రే వారసుడు ఆదిత్య ఎన్నికల్లో పాల్గొన్నారు. వర్లీ నుంచి ఘన విజయం సాధించారు. అటు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన అదరగొట్టింది. ఈ ఎన్నికల్లో పార్టీ గణనీయంగా పుంజుకుంది. అయితే దీని వెనుక యువనాయకుడి కృషి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా యూత్ ఓటర్లను ఆకర్షించడంలో ఆదిత్య ఠాక్రే కీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు. యువకుడిగా యూత్ ఓటర్లను ఆకట్టుకోవడం మాత్రమే కాదు సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకున్నారు.  పక్కా మాస్ లీడర్ గా కనిపించే ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారనగానే ఆసక్తి పెరిగింది. అయితే శివసేన బలంగా ఉన్న నియోజక వర్గాల్లో వర్లీ ఒకటి. కానీ ఇక్కడ ఆదిత్య ఠాక్రే విజయం నల్లేరు మీద నడకలా సాగ లేదు. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఆదిత్య ఠాక్రే ప్రచారం కూడా వినూత్నంగా సాగింది. తన తాత బాల్ థాక్రేకు భిన్నంగా ప్రజల్లోకి వెళ్లారు ఆదిత్య ఠాక్రే. ఒకప్పుడు దక్షిణాది నుంచి ముంబైకి వచ్చిన వాళ్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాల్ ఠాక్రే. బజావో పొంగి హఠావో లుంగీ అంటూ దాడులు చేశారు. కానీ ఆదిత్య మాత్రం తన తాత మాటకు భిన్నంగా వ్యవహరించారు. వర్లీ ఎన్నికల ప్రచారంలో లుంగీతో కనిపించారు. ఈ వార్తను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం లోనూ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా శివసేన మరాఠా పార్టీ అనే ముద్ర నుంచి తప్పించేందుకు ఆదిత్య ఠాక్రే ప్రయత్నాలు చేశారు. దక్షిణాది సెటిలర్ లను ఆకట్టుకునేందుకు లుంగీ కట్టడమే కాదు పాదయాత్రలు, బస్సుయాత్రలతో అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు. తాను అందరి వాడినంటూ చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. శివసేన బలంగా ఉన్న వర్గాల్లోకి పార్టీని మరింత ధృడంగా తీసుకుళ్లారు. అయితే ఆదిత్య మేకోవర్ మార్చడంలోనూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఆదిత్య ఠాక్రే జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఆరే అటవిని రక్షించాలంటూ సాగుతున్న ఆందోళనకు మద్దతు పలికారు. చెట్ల నరికివేతను అడ్డుకుంటామని చెప్పారు. ముంబైలో బెస్ట్ బస్ సర్వీసుల కోసం ధర్నాలు చేశారు ఆదిత్య ఠాక్రే. ఇలా శివసేన యువ నాయకుడిగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.  ఇక ఇప్పుడు నేరుగా ఎన్నికలలోకి రావడంతో పార్టీలో మరింత కీలకంగా మారారు. జన ఆశీర్వాద యాత్రలో దాదాపు ఐదు వేల కిలోమీటర్లు తిరిగారు. ప్రజలతో మాట్లాడారు. వారితో మమేకమయ్యారు. వర్లీ ఎన్నికల్లోనే కాదు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఆదిత్య ఫేస్ ఫ్రెష్ గా ఉంది. అందుకే ఆయనకు మద్దతు లభించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో సింగిల్ పార్టీగా ఎదుగుతామని బిజెపి భావిస్తున్న సమయంలో శివసేన పుంజుకోవడం ఆదిత్య ఠాక్రే లాంటి యువ నాయకుడు తెరపైకి రావడం ఎన్నికల్లోనూ ఆ పార్టీకి కలిసొచ్చింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఆధిత్య ప్రభావం స్పష్టంగా కనిపించింది. సీఎం పదవిని పంచుకుంటే ఆదిత్య ఠాక్రేకు ఆ అవకాశం దక్కనుందని చెబుతున్నారు. ఠాక్రే సీఎం అయితే అది సంచలనమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు...

  అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పట్టణంలోని కోకాపేట జంక్షన్, తోటపాలెం నాయుడు, రాజీవ్ నగర్ కాలనీలలోఇళ్లల్లోకి మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఎస్ లింగాల వలస దగ్గర ఏడొంపుల గడ్డ వంతెన మీద నుంచి నీరు పొంగి పొర్లడంతో పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొబ్బిలి, ఎస్ కోటతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. విజయనగరం జిల్లాలోని సీతానగరం సమీపంలో గల సువర్ణముఖి నదిపైన వంతెన కుంగిపోయింది. దీంతో ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న రాకపోకలను అధికార యంత్రాంగం నిలిపివేసింది. ద్విచక్ర వాహనాలకు మాత్రమే వంతెన పై నుంచి అనుమతిస్తున్నారు.  కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం పరిధిలోని కృష్ణానది పరివాహక గ్రామాల్లో వరద నీటిలో పంట మునిగిపోయింది. మున్నేరు నది పోటెత్తడంతో రావిరాల గ్రామ పరిధిలోని ప్రత్తి, వరి, మిరప పంటలు నీట మునిగాయి. ముత్యాల గ్రామానికి ప్రధాన రహదారి పై చంద్రమ్మ కయ్యి పైకి నీరు చేరడంతో ముత్యాల, జగ్గయ్యపేట పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంటూరు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో అచ్చంపేట, అమరావతి మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. అమరావతి నుంచి విజయవాడ మార్గంలో పెద్దమద్దూరు దగ్గర లెవల్ వంతెన నీట మునిగింది. దీంతో రవాణాకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలేరు, సుద్దగడ్డ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయం నుంచి ఏడు వేల క్యూసెక్యుల నీరు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డిలో జోరు వాన కురవగా మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న మొక్కలు తడిసిపోయాయి.కూరగాయలు వరదలో కొట్టుకుపోయాయి. అటు వరంగల్ లోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ఓ ప్రైవేటు బస్సు వాన నీటిలో చిక్కుకుపోయింది. అల్పపీడన ప్రభావం శ్రీకాకుళం జిల్లా పై ఎక్కువగా కనిపిస్తుంది. భారీ వర్షాలకు పాలకొండ డివిజన్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజాంలోకి భారీగా వరద నీరు చేరడంతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి.

గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కలకలం...

  ఆడదాని కోసం రాజుల సైతం రాజ్యాలే కొల్పొయారు.గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ వివాదాస్పదంగా మారింది. చివరకు ఓ ఉద్యోగి ఆత్మహత్య యత్నం దాకా వ్యవహారం వెళ్లింది. అంతేనా ఇదే విషయాన్ని ఆ ఉద్యోగి పోలీస్ అఫీషియల్ గ్రూప్ లో వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది. విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.  జిల్లా ఎస్పీ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రుద్ర నాగు, జంగం నాగరాజు ఇద్దరితో ఓ ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఇద్దరికీ తెలియటంతో ఘర్షణ పడ్డారు. ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించుకున్నారు. మహిళను వదలకపోతే బావుండదు అంటూ రుద్ర నాగును నాగరాజు బెదిరించాడు. విషయాన్ని అతని భార్య కుటుంబ సభ్యులకు చెప్పాడు. భార్యకు, తల్లికి విషయం తెలియటం.. మరోవైపు ఆ ఔట్ సోర్సింగ్ మహిళా మొహం చాటేయడంతో రుద్ర నాకు ఆత్మహత్య యత్నం చేశాడు. అంతకుముందు ఆత్మహత్యకు కారణాలపై వీడియో తీసి పోలీసుల అఫీషియల్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. రుద్ర నాగును సెల్ టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు తాడేపల్లి పరిసరాల్లో ఉన్నట్టుగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ఆఫీస్ లో గతంలోనూ ఇటువంటి ఘటనలు జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఇలాంటి ఘటనలు ఇక పై జరగకుండా ఉండాలని అధికారులు ఆదేశించారు.

మహారాష్ట్ర, హర్యానా ఫలితాలతో బీజేపీ పరేషాన్.. జమిలీ తప్పేలా లేదు!!

  రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఒకటి ఉత్తరాది రాష్ట్రం, మరొకటి పడమటిది. కాగా రాష్ట్రాలలో వేర్వేరు రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీకి వచ్చిన ఫలితం మాత్రం ఒక్కటే. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కానీ భారీ మెజారిటీ మాత్రం రాలేదు. హర్యానాలో మెజారిటీ తగ్గి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. మోదీ నాయకత్వం, అమిత్ షా మంత్రాంగం, ఫడ్నవీస్, కఠారి లీడ్ పనిచేసి ఎక్కడికో వెళ్తామని అనుకుంటే ఉన్నచోటే ఉన్నట్టుగా తయారైంది పార్టీ పరిస్థితి. జాతీయవాదంతో ప్రత్యర్ధులను ఓడిద్దామనుకుంటే ఆర్టికల్ 370 రద్దుతో ఓట్ల పంట పండుతుందని అనుకుంటే అంచనాలూ తారుమారయ్యాయి. సెంటిమెంట్ తో కొట్టాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు. హర్యానాలో జాట్ల సెంటిమెంట్ ముందు జాతీయవాదం పనిచేయలేదు. మహారాష్ట్రలో గ్రౌండ్ రియాలిటీ బిజెపికి అనుకూలంగా లేవన్న విషయం అర్థమైపోయింది. శరద్ పవార్ చెప్పింది కూడా అదే. విపక్షాలు గెలవకపోయినా బీజేపీ బలం మాత్రం తగ్గుతుంది.  ఫలితాలపై బిజెపి విశ్లేషణ మొదలైంది. అనుకూలమనకున్న పరిస్థితులు ప్రతికూలంగా మారటానికి కారణమేంటన్న ప్రశ్న తలెత్తింది. ప్రాంతీయ పరిస్థితులే తప్ప జాతీయవాదం వేర్వేరు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచెయ్యదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడూ అనుకూలతలు ఉండవని ప్రతి ఎన్నికకూ పరిస్థితులు మారతాయని బిజెపి అర్థం చేసుకుంది. ఇప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు నడిస్తేనే అధికారంలో కొనసాగే వీలుంటుందని గుర్తించింది. అందుకే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలోపే మరోసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించి ఐదేళ్ళపాటు అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. జమిలీ ఎన్నికల ఆలోచన బిజెపిలో చాలా రోజులుగా ఉన్నదే. 2023 నాటికి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే వరుసగా మూడు సార్లు గెలిచిన కాంగ్రెసేతర పార్టీగా కూడా రికార్డులకెక్కే వీలుంటుందని బిజెపి భావిస్తోంది. జమిలి ఎన్నికలతో రాష్ట్రాల్లోనూ బలమైన శక్తిగా అవతరించే వీలుంటుందని నమ్ముతోంది.  గతంలో చాలాసార్లు జమిలీ ఎన్నికలపై చర్చ జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జమిలీ మాట మరుగున పడిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఫలితాలూ కొత్త అనుమానాలకు తావిచ్చాయి. విపక్షాలు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చూడాలంటే జమిలీ కూడా ఒక మార్గమని బిజెపి నమ్ముతోంది. 2024 మధ్యలో సాధారణ ఎన్నికలు నిర్వహించేకంటే 2023 జనవరి, ఫిబ్రవరి లోనే జమిలీ ఎన్నికలు పూర్తి చేస్తే పరిణామాలు తమకు అనుకూలంగా ఉంటాయని బిజెపి విశ్వాసం. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా ఆ విషయాన్ని నిర్భయంగా ప్రస్తావించారు. బిజెపి ఇప్పుడు ద్విముఖ వ్యూహంతో కదుల్తోంది. త్వరలో జరగబోయే కీలక రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడం మొదటి వ్యూహం.కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలను బలపడకుండా చూసుకుంటూ జమిలీ ఎన్నికలకు సిద్ధం కావడం రెండో వ్యూహం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు మీద నేరుగా పాకిస్థాన్ మీద సర్జికల్ దాడులు జరిపింది. రెండు రాష్ట్రాల పోలింగ్ ముందు రోజు ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడులు జరిపింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలోని విపక్షాలపై సర్జికల్ దాడులు చేయాలని అనుకుంటోంది. అదే జమిలి ఎన్నికలు. ప్రతిసారీ మోదీ వ్యూహాలు పని చేయని పరిస్థితులు వస్తే అప్పుడు ఇబ్బందులు ఎదురుకాకుండా కాస్త ముందే ఎన్నికలు పూర్తి చేయాలని తీర్మానించుకుని ఉండొచ్చన్నది ఒక వాదన.