తెలంగాణా గ్రూప్-1 నోటిఫికేషన్ కు కొంత కాలం వేచి చూడాల్సిందే...
posted on Oct 28, 2019 @ 5:50PM
తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు, అభ్యర్ధులకు మరి కొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఆయా శాఖల ఖాళీల వివరాలు పంపించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రూప్-1 నోటిఫికేషన్ వస్తుందని ఎప్పట్నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్ధులు కూడా దానికోసం అదే స్థాయిలో ఎదురు చూస్తూనే వున్నారు. ప్రభుత్వ శాఖలు ఖాళీల జాబితాను ఇప్పటి వరకు పంపించలేదు, పదహారు శాఖలకు లేఖలు రాసినా కనీసం ఒక్క శాఖ కూడా స్పందించలేదు.
ఏ ఒక్క డిపార్టుమెంటు కూడా జవాబు ఇవ్వలేదని టీ.ఎస్.పీ.ఎస్.సి వర్గాలు చెప్తున్నాయి. గ్రూప్-1 పోస్టులు, స్టేట్ క్యాడర్ పోస్టులు అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వం మల్టీ జోనల్ పోస్టులుగా మార్చింది. మల్టీ జోనల్ పోస్టులుగా మార్పు చేయడం పై కొన్ని శాఖలు అభ్యంతరం చెప్తున్నాయి. ప్రధానంగా రెవిన్యూ, పోలీస్ విభాగాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి, తమకు ఐఏఎస్, ఐపీఎస్ ప్రమోషన్ లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ శాఖలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులపై కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణ పేట జిల్లాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులలో చేర్చాల్సి ఉంటుంది. మరోవైపు వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతామని సీ.ఎం కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే తప్ప గ్రూప్-1 పోస్టులకు ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్-1 ఒక్క పోస్టుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు, దీంతో ఇప్పటి వరకు గ్రూప్-1 పోస్టు నోటిఫికేషన్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఉద్యోగార్థులు మరికొంతకాలం ఆగక తప్పదు.