ప్లాస్టిక్ కాగితాలు ఏరిన వారికి ప్రశంసా పత్రాలు...

  ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాలని కోరుతూ మల్కాజిగిరి లోని మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్థానికులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలందరూ కలిసి పోరాడాలని తీర్మానం చేశారు. గత పది రోజులుగా కాలనీ లోని ప్లాస్టిక్ కాగితాలు ఏరిన వారికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్లాస్టిక్ ని వాడద్దు, ప్లాస్టిక్ వాడకం పై నిషేధం విధించాలంటూ మల్లికార్జున్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో సదస్సుకు హాజరైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాట్లాడుతూ, రెండు వేల జూట్ బ్యాగ్స్ ను ఉచితంగా పంపిణీ చేసి ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లతో ఇరవై నిమిషాల పాటు సమయాన్ని గడిపి ప్లాస్టిక్ మీద అవగాహన తీసుకురావటం జరిగిందన్నారు. రెండు వేల పదిహేను నుంచి మొదలు పెట్టిన ఈ యుద్ధం ఇప్పుడు మోదీగారి పుణ్యమా అంటూ ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పటం వల్ల ప్రతి ఒక్క డిపార్టుమెంటు, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్లాస్టిక్ మీద యుద్ధం మరల మొదలు పెట్టారని అన్నారు. ఇది చాలా సంతోషంగా అనిపించింది అని ఇటీవలె పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్లు వారం రోజుల నుంచి ప్లాస్టిక్ విసర్జన కార్యక్రమం మొదలుపెట్టారని ఇది చాలా కష్ట తరంగా ఉందని అన్నారు. ఎందుకంటే గ్రామాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో పప్పు ఉప్పు వేసుకుంటున్నారని, వాటివల్ల క్యాన్సర్ వస్తుందన్నా కూడా తొందరగా వాళ్ళు ఎలాంటి అవగాహన చేసుకోలేకపోతున్నారన్నారు.

జనాలు చనిపోతున్నా పట్టించుకోరా... తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్!!

  తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ సోకి పలువురు మృతిచెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారించింది. మనుషులు చనిపోతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది. డెంగ్యూ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా స్పందించరా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. డెంగ్యూపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తెలిపింది.

బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజు మృతదేహం లభ్యం

  కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.బోటు వెలికితీయడంతో మృతుల కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. బోటు నుంచి వెలికితీసిన ఎనిమిది మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజుతో పాటు బోటులో ప్రయాణించిన వరంగల్ కు చెందిన పర్యాటకుడు కొమ్ముల రవీందర్ మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన ఆరు మృతదేహాలు ఎవరివన్నది నిర్ధారించాల్సి ఉంది. మొత్తం మృతదేహాల్లో ఒక్కటి మాత్రమే మహిళది. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వెలికితీసిన వశిష్ట బోటులో ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. బురదలో కూరుకుపోయి కొన్ని బోటు రేకులకు పట్టుకుని కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలన్నీ బోటు ఏసీ క్యాబిన్ లో ఉన్నాయి. బోటు గల్లంతైన రోజునే గల్లంతయిన వాళ్లంతా ఏసీ క్యాబిన్ లో ఉండి ఉంటారని అనుమానించారు. దానికి తగ్గట్టుగానే కొన్ని మృతదేహాలు అందులో చిక్కుకొని ఉన్నాయి. ఇవి ఎవరివో గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారిలో పన్నెండు మంది జాడ తెలియాల్సి ఉండగా ఇప్పటికే ఎనిమిది బయటపడటంతో మిగిలిన నలుగురి జాడ కోసం బోటు ఉన్న ప్రాంతాల్లోనే గాలిస్తున్నారు.మృత దేహాలు బాగా కుళ్ళీపోయి ఉండటంటో ఎవరివో గుర్తించటం చాలా కష్టంగా మారింది. మృతుల బంధువులు కుటుంబ సభ్యుల రోదనలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాదకర వాతావరణం నెలకొంది.

తప్పని తిప్పలు.. కరీంనగర్ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం

  జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది, గంగాధర క్రాస్ రోడ్స్ లో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే ప్రయాణ సమయంలో బస్సు లో అరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు నిలిచిపోవడంతో కిందకు దిగి తోసి ప్రయాణికులు చమటలు కక్కారు. తాత్కాలిక డ్రైవర్ కావటంతో నానా పాట్లు పడ్డారు, తమ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు, దీంతో వారికి డబ్బులు తిరిగి చెల్లించారు. తాత్కాలిక డ్రైవర్ లతో అటు ప్రమాదాలు జరుగుతూ ఉండగా ఈరోజు సాంకేతిక లోపంతో బస్సులు ఆగిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. సమస్యలైతే ఉత్పన్నమవుతూనే ఉన్నాయి, వీటి పరిష్కారం దిశగా అధికారులు ఇప్పటివరకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటి వరకైతే అటు ప్రభుత్వం గానీ అధికారులు గానీ తాత్కాలిక డ్రైవర్ లు, కండక్టర్ లతోనే బస్సులు నడిపిస్తున్నారు. నిన్న కరీంనగర్ నుంచి సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వేములవాడకు వెళుతుండగా ఆ బస్సు వెంకట్రావుపేట దగ్గర డీజిల్ లేక ఆగిపోయింది. తాజాగా ఈ రోజు కరీంనగర్ జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సు గంగాధర ఎక్స్ రోడ్ దగ్గర సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది. బస్సు అలా రోడ్ మద్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు బస్సులు నడిపిస్తున్న వారంతా తాత్కాలిక డ్రైవర్లు కావడంతో బస్సులో వచ్చే సాంకేతిక లోపాలను అప్పటికప్పుడు బాగుచేసే నైపుణ్యం ఉండదు కాబట్టి ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణలో మున్సిపల్  ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్ట్...

  మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయ స్థానం కొట్టివేసింది. హై కోర్టు తీర్పుతో తెలంగాణలో ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అవుతుంది. దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశముంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో హడావుడిగా వార్డుల పునర్విభజన చేయడం, ఓటరు జాబితా రూపకల్పన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గణనకు గడువు కుదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను హై కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో పురపాలక మండలి ఎన్నికలకు గరిష్టంగా తీసుకోవాల్సిన సమయాన్ని మాత్రమే తెలపారని కనీస సమయం ఎంతనేది ఎక్కడా లేదని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అభిప్రాయపడింది.  తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్ పదకొండు ప్రకారం అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాను అనుసరించి మున్సిపల్ ఎన్నికలకు ఓటరు జాబితా రూపొందించుకోవచ్చని కోర్టు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గణన చాలా సులువని అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పనిని మరింత తేలిగ్గా చేయవచ్చని చెప్పింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ఓటర్లకు సంబంధించి తప్పుగా గుర్తించిన ఒక్క ఓటర్ ని కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు చూపలేకపోయారన్న న్యాయస్థానం ఈ అంశానికి సంబంధించి ఒక్క ఓటరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని తెలిపింది. న్యాయవాదులు చేసిన వాదనలు ఆమోదించదగ్గవి కాదని స్పష్టం చేసింది. జూలై మూడున జారీ చేసిన నోటిఫికేషన్ ను ఎంత వరకు అమలు చేయలేదని ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించి అదనపు ఏజీ ఎన్నికల కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. ఎన్నికల కమిషన్ ఇంకా ఎన్నికల క్యాలెండర్ ను ప్రకటించలేదని దానిని రూపొందించే లోపు ఓటరు జాబితా ఎప్పుడైనా ఖరారు చేసుకునే అవకాశముందని కోర్టు తెలిపింది. జూలై మూడు న జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేయడం సరి కాదని తేల్చి చెప్పింది. ఈ కారణాలతో రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లో కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.  డెబ్బై మునిసిపాలిటీల ఎన్నికలపై హై కోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర స్టే ఆదేశాలు ఇచ్చారని వాటిని ఎత్తి వేయాలని అదనపు ఏజి జె రామచంద్ర రావు అభ్యర్థించారు. దానిని తిరస్కరించిన ధర్మాసనం ఆ అంశాన్ని సింగిల్ జడ్జి ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి కోర్టులో స్టే ను ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నూట ఇరవై మునిసిపాలిటీలు పది కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగవచ్చు. రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు పదమూడు కార్పొరేషన్లున్నాయి.వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు సిద్దిపేట, అచ్చంపేట మునిసిపాలిటీల పాలక మండళ్లకు పదవీ కాలం ముగియ లేదు. మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన నకిరేకల్ తో పాటు మరో చోట ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం ముగిసిపోలేదు. ఇతర కారణాలతో మరో నాలుగు చోట్ల ఎన్నికలు వెంటనే నిర్వహించే వీల్లేదని తెలుస్తుంది. మున్సిపాలిటీలకూ రిజర్వేషన్ లను త్వరలో ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే వారంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. వార్డుల విభజన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఎన్నికల సిబ్బంది శిక్షణా చాలా వరకూ పూర్తయింది. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ఎన్నికలపై వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు అధికారులు. 

ఫైబర్ నెట్ కు తప్పని జరిమానా...

  ఆంధ్రజ్యోతి ప్రసారాల పునరుద్ధరణ విషయంలో తన ఆదేశాల అమలుకు సంబంధించి ఆలస్యం చేసినందుకు ఫైబర్ నెట్ జరిమానా చెల్లించాల్సిందేనని టీడీ శాట్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి మరొకసారి పునరావృతం కావొద్దని సూటిగా చెప్పేసింది. ఛానల్ ప్రసారాల నిలిపివేతపై ఏబీఎన్, టీవీ ఫైవ్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ ల పై ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ శివకీర్తి సింగ్ విచారణ జరిపారు. సాంకేతిక సమస్య పేరిట తప్పించుకునే ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెండు రోజుల క్రితమే ఫైబర్ నెట్ లో ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించక తప్పలేదు. ప్రసారాలు పునరుద్ధరించామని జరిమానా విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది జిఎన్ రెడ్డి టిడి శాట్ ను అభ్యర్థించారు. టీవీ ఫైవ్ కేసులో ఇప్పటికే విధించిన జరిమానాను మాఫీ చేయాలని వేడుకున్నారు. ఫైబర్ నెట్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిపారు.  నిజంగా ఆ ఛానళ్ల ప్రసారాలను పునరుద్దరించారా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉపశమనం కలిగిందని జస్టిస్ శివకీర్తి సింగ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రసారాలను పునరుద్దరించాలని గత నెల ఇరవై నాలుగున తాము ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. ఈ ఆదేశాల అమలులో ఆలస్యం చేసినందున జరిమానా చెల్లించి తీరాల్సిందేనని దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ప్రసారాల పునరుద్దరణలో ఆలస్యానికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ఛానల్ పునరుద్ధరణ అంశంపై విచారణను ముగిస్తున్నామని జరిమానా విధింపు పై విచారణ కొనసాగిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను నవంబర్ పద్నాలుగు వ తేదీకి వాయిదా వేసింది. జరిమానా ఎందుకు విధించకూడదో వివరిస్తూ రెండు రోజల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని చట్ట పరంగా నడుచుకోవాలంటూ ఫైబర్ నెట్ ను జస్టిస్ శివకీర్తి సింగ్ ఆదేశించారు.  ఏబిఎన్ తరపు న్యాయవాది రాజశ్రీ వాదనలు వినిపించారు. భవిష్యత్ లో ఛానల్ నిలిపివేత వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ మేరకు ఉత్తర్వుల్లో తెలపాలని కోరారు. ఛానల్ స్క్రీన్ నాణ్యతగా ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ పధ్ధెనిమిదిన అదే నెల ఇరవై నాలుగు న టీవీ5 ఛానల్ ను పునరుద్ధరించాలని ఆదేశించినా చాలా ఆలస్యంగా ఆ పని చేసినందుకు మూడు ప్రైవేటు ఎంఎస్వో సంస్థలకు ట్రైబ్యునల్ జరిమానా విధించింది. మాస్టర్ ఛానల్ కమ్యునిటీ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ సిరి డిజిటల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్ట్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అయిదు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని టీవీ 5 కు చెల్లించాలని ఆదేశించింది.  

విశాఖకు చేరిన సిట్ బృందం...

  విశాఖలో భూస్కాంపై వైకపా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం మొదటిసారిగా విశాఖకు చేరుకుంది. ప్రస్తుతానికి అతిథి గృహంలో బస చేస్తున్న విజయ్ కుమార్ బృందం విచారణ ప్రారంభించబోతోంది. కాసేపట్లో జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులతో విజయ్ కుమార్ భేటీ అవుతారు. విశాఖలో భూ కుంభకోణం ఆరోపణలపై అప్పట్లో టిడిపి ఒక సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ ఆ నివేదిక బయటకు రాలేదు. దీంతో రెండు వేల పదిహెడులో సిట్ నివేదించిన అంశాలు భూ ఆక్రమణ ఎంత మేర జరిగింది, వాటిల్లో ఎవరెవరి ప్రమేయం ఉంది, రాజకీయ నాయకుల హస్తం ఎంత, కేసు నుంచి తప్పించుకున్న అధికారులెవరు ఇలా అనేక అంశాల పై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఎవ్వరినీ వదలొద్దు అంటూ ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఈ స్కాం వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఈ రోజు జిల్లా ఉన్నతాధికారుల తోనూ, కలెక్టర్ తోనూ భేటీ కానున్నారు సిట్ అధికారులు. ప్రధానంగా ప్రభుత్వం వాళ్ళకు మూడు నెలల కాలన్ని  విచారణకు నిర్దేశించింది. మూడు నెలల కాలంలోనే విచారణ చేపట్టాల్సిన అవసరం అధికారులకు ఉంది. ఈ నేపథ్యం లోనే  బాధితులు, చాలామంది ఫిర్యాదు దారులు, బాధితుల బంధువులు కూడా వీళ్లని కలిసేందుకు వస్తారు కాబట్టి విచారణకు సంబంధించినటువంటి బిల్డింగ్ ని పరిశీలించడంతో పాటు, ఏ మేర దీనిపై విచారణ చేపట్టాలి, ఎక్కడ విచారణ చేపట్టాలి అనేటువంటిది గతంలో కూడా సిట్ దర్యాప్తు జరిపింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి భూ రికార్డుల్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కారణంగానే సిట్ విశాఖకు రావటం జరిగింది.  

ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ పైచేయి... ఉద్యోగులందరికీ ఇదో హెచ్చరిక...

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మొదట్నుంచీ కఠిన వైఖరిని ప్రదర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు తన మాట నెగ్గించుకున్నట్లే కనిపిస్తోంది. ఆరునూరైనాసరే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పిన కేసీఆర్... తన స్టాండ్ లో మార్పు లేదని మరోసారి స్పష్టంచేశారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, వాళ్లసలు ఉద్యోగులే కాదంటూ ప్రకటించిన కేసీఆర్... ఇక చర్యలు జరిపే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ తీర్పు కాపీ ఇంకా అందలేదంటూ మూడ్రోజులు ఆలస్యంగా చర్చల ప్రక్రియపై స్పందించారు. అయితే, కార్మికులతో అసలు చర్చలు జరిపే ప్రసక్తే లేదని ముందుగా, ఆర్టీసీ మరో ఆల్విన్ కాకూడదనే తమ ప్రయత్నమంటూ ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ పేరుతో మీడియాకి ప్రకటనలిచ్చిన ప్రభుత్వం... అర్ధరాత్రి తర్వాత చర్చల ప్రక్రియ కోసం కొత్తగా కమిటీని వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, హైకోర్టు తీర్పు కాపీపై సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నందున ఇతర డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే చర్చలకు రాబోమని తామెప్పుడూ చెప్పలేదంటూ కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపినట్లు తీర్పు కాపీలో ఉన్నట్లు కేసీఆర్ ప్రస్తావించారు. దాంతో దేనికోసమైతే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారో... ఆ ప్రధాన డిమాండును వదులుకున్నట్లయ్యింది. అంతేకాదు హైకోర్టు నేరుగా ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీకే చర్చలు జరపాలని ఆదేశించడంతో ఆయనే స్పందించేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరుగురు అధికారులతో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక ఇచ్చాక ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కోర్టుకు నివేదించనున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ కఠిన వైఖరి, తన మాటే నెగ్గాలన్న మొండితనం... మిగతా ఉద్యోగులందరికీ ఒక హెచ్చరికలాంటిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుముందు ఇతర ఉద్యోగ సంఘాలు ఏవైనా డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరముందంటున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు... ముఖ్యంగా టీజీవోలు, టీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాలు.... ఇటీవల సీఎస్ కు ఇఛ్చిన డిమాండ్లపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న మాట వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ పైచేయి సాధిస్తే... అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక హెచ్చరికలాంటిదే.

భారీ వర్షాలతో కళకళలాడుతున్న డ్యామ్‌లు

  రాష్ట్రమంతా భారీ వర్షాలతో ముంచెత్తుతోంది.కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేస్తూనే డ్యామ్ గేట్ల నుంచి కూడా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఔట్ ఫ్లో రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్కులు ఉంది. ఈ సీజన్ లో ఇలా డ్యామ్ గేట్లు ఎత్తడం ఏడోసారి కావడం విశేషం. సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలానికి వరద కొనసాగుతుండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులు. మధ్యాహ్నానికే ఔట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఓ అడుగు తక్కువగా మాత్రమే ఉంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు టీఎంసీల నీరుంది. ఈ సీజన్ లో శ్రీశైలానికి రికార్డు స్థాయిలో పన్నెండు వందల ముప్పై ఆరు టిఎంసిల నీరు వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాల వల్ల ఈ సారి ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కర్నాటకలో భారీ వర్షాలతో తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద వహిస్తోంది. ప్రస్తుతం ముప్పై మూడు గేట్లు ఎత్తి లక్షా యాభై వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వంద టీఎంసీల నీటి మట్టంతో కళకళలాడుతోంది. ఇటు శ్రీశైలం నుంచి సాగర్ కు వరద పోటుతో దిగువకు నీటి విడుదల పెరిగింది. సాగర్ పన్నెండు క్రస్ట్ గేట్లు, పన్నెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో రెండు పాయింట్ రెండు నాలుగు లక్షలు ఉంది. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం మూడు వందల పది టీఎంసీల నిల్వ ఉంది. ఇన్ ఫ్లో మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడిచి పెడుతున్నారు. ఒక సీజన్ లో సాగర్ గేట్లు పదకొండు సార్లు ఎత్తడం రికార్డు అంటున్నారు. శ్రీశైలం నుంచి ప్రస్తుత వర్షాకాలం ఏడు వందల ఎనభై టీఎంసీల వరద వచ్చింది.పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  

తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు...

  తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు, రహదారులు, చెరువులను తలపిస్తుండటమే కాక పలుచోట్ల ఇళ్లు, పంటలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణానదీ పరివాహక గ్రామా ముత్యాల వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో భవానీ ముక్తేశ్వరాలయం నీట మునిగిపోయింది. వర్షాల కారణంగా ఆలయం రెండు నెలల్లో నాలుగు సార్లు నీట మునిగింది. మచిలీపట్నంలో కూడా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఇళ్ళల్లోకి వరద నీరు చేరుకుంది. రోడ్ల మీద మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోవడంతో చిరు వ్యాపారు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఆలయం నీటమునిగిపోయింది.  ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా లోని తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ ముప్పై మూడు గేట్లను ఎత్తివేసి లక్షా నలభై ఏడు వేల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేయటంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రాలయం నది దగ్గర భక్తులు స్నానాలకు వెళ్లద్దని శ్రీమఠం అధికారులు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అమలాపురంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. హౌసింగ్ బోర్డు కాలనీ లోని పలు ఇళ్లు నీట మునిగాయి. స్పందించి మున్సిపల్ సిబ్బంది నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపించారు. కోనసీమలోని పదహారు మండలాల్లో ఎనభై ఐదు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.  పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొవ్వూరులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా మండలాల్లో వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు చనిపోతాయనీ ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న నలభై ఎనిమిది గంటలు మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఏపీ తీరానికి సమీపంగా వస్తోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఓ ఎంపీకి ఉన్న విలువ కూడా సీఎంకు లేదా? జగన్ ఢిల్లీ టూర్ పై ఆగని విమర్శలు

  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ఢిల్లీలో తేడా కొట్టకపోతే ఈ విమర్శలు రావన్నది అంతే నిజం. 24గంటల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత కేంద్ర హోంమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వడం... పైగా ఏమీ మాట్లాడకుండానే కేవలం వినతిపత్రం తీసుకుని పంపేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇక, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏకంగా జగన్ కి ఇచ్చిన అపాయింట్ మెంట్లను రద్దు చేసుకున్నారన్న సంగతి... ఢిల్లీలోనూ... ఏపీలో కలకలం రేపుతోంది. అయితే, ఈ ఆరోపణలను వైసీపీ కేంద్ర కార్యాలయం ఖండించినప్పటికినీ, విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇఫ్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ... జగన్ ఢిల్లీ టూర్ పై సెటైర్లు వేయగా, సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ సాధారణ ఎంపీకి ఉన్న విలువ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్ర పెద్దలు అసలెందుకు జగన్ కు విలువ ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు జగన్ ఢిల్లీ పర్యటనలో ఏఏ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారో... ఎన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపిందో చెప్పాలన్నారు. అంతేకాదు జగన్ ఢిల్లీ టూర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించి... వివరాలు చెప్పాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.

జంట నగరాలను భయపెడుతున్న డెంగ్యూ జ్వరాలు...

  డెంగ్యూ జ్వరాల ప్రభావంతో ఆసుపత్రుల దగ్గర ప్రజలు బారులు తీరుతున్నారు. చాలా మంది చిన్న పిల్లలతో వచ్చి ఆసుపత్రి దగ్గర క్యూ కడుతున్నారు. కేవలం హైదరాబాద్ లోని జంట నగరాలలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన సంఖ్య రెండు వేల పది డెంగ్యూ కేసులు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మరిన్ని కేసులు ఉండే అవకాశం ఉండటంతో అప్రమత్తమయిన వైద్య బృందం పూర్తిస్థాయిలో మెడిసిన్స్ ని అందుబాటులో ఉంచారు. అలాగే డాక్టర్ లను కూడా వేరే హాస్పటల్స్ నుంచి ఫీవర్ హాస్పిటల్స్ కి డిప్యుటేషన్ మీద పిలిపించుకుని ట్రీట్మెంట్స్ అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా పూర్తి స్థాయిలో అందరూ రోగాల బారిన పడుతున్న వాళ్లు అలాగే డెంగ్యూ కేసులతో పాటు మలేరియా కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. డాక్టర్స్ మరియు మెడికల్ సిబ్బంది చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరముంది అని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు పగలు కుట్టే టైగర్ దోమ నుండి చాలా ప్రివెంటివ్ గా ఉండాలి అని చెప్పి సూచిస్తున్నారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ విధంగా ఉంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అని డి.ఎం అండ్ హెచ్.ఒ విభాగం కూడా తెలియజేసింది. తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం హైజీన్ లోపం వల్ల కూడా డెంగ్యూ ఎక్కువగా ప్రభలుతోందని అధికారులు అంటున్నారు.

ఆ ఐదు మృతదేహాలు ఎక్కడ?

  ఎట్టకేలకు రాయల్ వశిష్టా బోటును వెలికితీశారు. ఆపరేషన్ వశిష్ట ముగిసినట్టేనా అంటే లేదనే చెప్పుకోవాలి. బోటు బయటపడితే బోటులో మిగితా మృతదేహాలన్నీ దొరుకుతాయని అంతా భావించారు. కానీ బోటు బయటకొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది. బోటులో పన్నెండు మృతదేహాలు దొరకాల్సి ఉంది. కానీ అందులో కేవలం ఏడు డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. అంటే మిగతా ఐదు మృతదేహాల సంగతేంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగానే మిగిలింది.  సెప్టెంబర్ పదిహేనున రాహుల్ వశిష్ట బోటు నీళ్లలో మునిగింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు అందులో డెబ్బై ఏడు మంది ప్రయాణికులు ఉన్నట్టు లెక్క తేల్చారు అధికారులు. అయితే బోటు మునుగుతున్నప్పుడు ఇరవై ఆరు మందిని కచ్చులూరుకి చెందిన గిరిజనులు కాపాడారు. ఇక నిన్న బోటుతో పాటు బయటపడ్డ ఏడు మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం నలభై ఆరు డెడ్ బాడీస్ బయటకొచ్చాయి. అంటే ఇంకా ఐదు డెడ్ బాడీలు బయటకు రావలసి ఉంది. బోటులో ఆ మృతదేహాలు దొరకలేదంటే అవి నదిలో కొట్టుకు పోయాయో లేక బోటులో ఉన్న వారి సంఖ్య కరెక్ట్ కాదా అన్నది సందేహం. అధికారుల లెక్కల ప్రకారం ప్రమాదం జరిగే సమయంలో బోటులో డెబ్బై ఏడు మంది ఉన్నారని బలంగా వాదిస్తున్నారు అధికారులు. దీంతో ఆ అయిదు మృతదేహాలు ఏమయ్యాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇంతకీ ఐదు మృతదేహాలు ఎవరివి అవి ఎక్కడికి వెళ్లాయి అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. దీంతో బోటును వెలికి తీసినప్పటికీ ఆపరేషన్ వశిష్ట పూర్తి కాలేదని చెప్పాల్సిన పరిస్థితి.

టీటీడీ పాలక మండలిలో ఈ అంశాల పై చర్చలు జరగనున్నాయా?

  నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. నలభై నాలుగు అంశాలతో రూపొందించిన అజెండా పై చర్చించనున్న పాలక మండలి సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం కానుంది. అన్నమయ్య భవన్ లో సమావేశం కానున్న పాలక మండలి నలభై నాలుగు అంశాలతో రూపొందించిన అజెండా పై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా స్విమ్స్ ను టీటీడీ పరిధిలోకి తీసుకురావటంతో పాటు గరుడ భారతికి నిధుల కేటాయింపుపై పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీతో పాటు బాలాజీ రిజర్వాయర్ కి నిధుల మంజూరుపై కూడా పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉద్యోగులను పే స్కేల్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా విధుల్లోకి తీసుకునే అంశంతో పాటు ఇందులో స్ధానికులకు అధిక ప్రాధాన్యత కల్పించే అంశంపై పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. వివిధ టీటీడీ విద్యా సంస్థల్లో హాస్టళ్ల పరిస్థితి నిర్మాణంతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో కళ్యాణ మండపాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపే అవకాశముంది. ప్రజా సంబంధాల విభాగంలో పని చేస్తున్న ఓఎస్డీకి జీతం పెంపుకు ఆమోద ముద్ర వేసే అవకాశముంది. గతంలో డిప్యూటీ లా ఆఫీసర్ గా విధులు నిర్వహించిన వెంకట సుబ్బనాయుడును ఓఎస్డీ లా విభాగానికి వెంకటశర్మను ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిగా నియమించే అవకాశముంది. ఎస్వీ ఆయుర్వేద కళాశాలల్లో పీజీ కోర్సులకు ఎస్టీ రిజర్వేషన్ లు కల్పించటంతో పాటు టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్యం పై కూడా పాలక మండలి సమావేశంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఆస్థాన విద్వాంసురాలిగా శోభరాజ్ కు మరో రెండేళ్లు పొడిగింపు కల్పించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.  

శవంతో వ్యాపారం చేస్తున్న ఎంజీఎం మార్చురీ సిబ్బంది...

  వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు.కానీ ఇక్కడ జరిగే ఈ వ్యాపారం చూస్తుంటే ఇంత దారుణమా అనే అందరిలో ఒక భయం పుట్టుకొస్తుంది. వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా ఉన్న వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలోని పోస్టుమార్టం విభాగానికి వివిధ జిల్లాల్లో అనేక ప్రమాదాల్లో వివిధ కారణాల చేత మృతి చెందిన శవాలకు రోజుకు సుమారు పది నుండి పదిహేను మృతదేహాలకు పోస్టుమార్టమ్ చేయాల్సిన పరిస్థితులుంటాయి. ఇవి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్. కొన్ని సందర్భాల్లో నిజాంబాద్ జిల్లాకు చెందిన మెడికో లీగల్ కేసులకు సంబంధించిన పార్థివ దేహాలను వారి మృతికి గల కారణాలను వెలుగులోకి తేవడానికి పోస్టు మార్టం నిమిత్తం ఇక్కడికి తీసుకు వస్తారు. ఇక్కడ ఆరుగురు ఫోరెన్సిక్ వైద్యులు ఉండాల్సింది ఇద్దరే ఉన్నారు. వీరిలో ఒకరు డెప్యుటేషన్ పై వచ్చిన వైద్యులే కావడంతో పోస్టుమార్టం కేసులో చేయడంలో కింద స్థాయి సిబ్బంది చేతివాటంతో మృతుల బంధువులు ఏం చేయాలో తెలియని స్థితిలో వారు ఏం చెబితే అదే జరుగుతుంది.  ఇక్కడ సమస్యలకు కొదవులేదు, ఎలకలు రాజ్యమేలతాయి, శవాలను పెట్టేందుకు ఫ్రీజర్ కొరత ఉంది, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోరు. అయితే ఇక్కడ జరుగుతుంది మాత్రం మృతుని బంధువులకు తీరని శోకాన్ని మిగల్చటమే కాక ఆర్ధికపరమైన సమస్యను తెచ్చిపెట్టి ఉండటంతో పోస్టు మార్టం చేసిన పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి సిబ్బంది అడుగుతున్న లంఛాలు వేళల్లో ఇవ్వలేక తమ పేదరికాన్ని బయటపెట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఒక దశలో అప్పు చేసి ఖర్చులకు తెచ్చుకున్న డబ్బులు పోస్టుమర్టం చేసే సిబ్బందికి ఇచ్చి జేబులు ఖాళీ చేసుకొని ఇంటి దారి పట్టే పరిస్థితులున్నాయంటే నమ్మక తప్పదు. చనిపోయిన కుటుంబాలు విషాదంలో ఉన్న పోస్టుమార్టం సిబ్బంది జేబులు తడపందే ఇక్కడ పని జరగదు. పేదరికంలో ఉన్నాం కష్టపడి దూరం నుంచి వచ్చాం కనికరించండి అని వేడుకున్నా పోస్టుమార్టం సిబ్బంది కనికరించడు కదా మాకేం తెలియదు డాక్టర్ వచ్చాకే పోస్టుమార్టం చేస్తామని కింది స్థాయి సిబ్బంది చెప్పడంతో బెంబేలెత్తుతున్న మృతుల కుటుంబ సభ్యులు డాక్టర్ వస్తే లంచం ఎక్కువ పోతుందేమోననే భయంతో జేబులో ఎంతుంటే అంత ముట్టచెప్పి ప్రాణం పోయినా పరిహారం చెల్లించక తప్పడం లేదంటూ దిగమింగి జేబుల్లో ఉన్నదంతా పోస్టుమార్టం సిబ్బందికీ ముట్టచెప్పి నిలువుగా కోసిన మృతదేహాన్ని కన్నీటి దక్కని కడుపులో దిగమింగి తీసుకెళుతున్న సంఘటనలూ నిత్యకృత్యమయ్యాయని పోస్టుమార్టం విభాగానికి వచ్చిన మృతుల బంధువుల ఆరోపించారు. తమ బంధువు అనుకోకుండా పురుగుల మందు తాగి వైద్యం జరుగుతుండగానే మృతి చెందాడని నిర్ధారించిన డాక్టర్లు పోస్టు మార్టం నిమిత్తం ఇక్కడికి పంపిస్తే ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి కాలయాపన చేస్తూ డాక్టర్ వస్తేనే పోస్టుమార్టం జరగుతుందని ఒకరి తరువాత ఇంకొకరు తమ వద్దకు వచ్చి డబ్బులు ఇస్తే త్వరగా పోస్టుమర్టం చేస్తామని బేరాలు ఆడుతున్నారని వారు ఆరోపించారు.దేవుడు కరుణించక కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో మేమంటే పోస్టుమార్టం కూడా మూడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తమది నిరుపేద కుటుంబం అని చెప్పినా కనికరించడం లేదని ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా పన్నెండు వందలు ఇస్తామని సిబ్బందికి చెప్పినా పట్టించుకోక పోవటంతో మీరు పోస్ట్ మార్టం చేసి ఎప్పుడిచ్చినా తీసుకెళ్తామని తమ వద్ద మాత్రం మూడు వేలు లేవని చెప్పామని పోస్టుమార్టం సిబ్బంది పెడుతున్న ఇబ్బందులుకు కన్నీరుమున్నీరుగా విలపించారు. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటలకు ఎంజిఎంకు పోస్టుమార్టం విభాగం సిబ్బంది పాల్పడటం పట్ల డాక్టర్లే కాదు డాక్టర్ వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరూ తలదించుకునేలా ఉండటం సమాజానికి ఎంతైనా పెను ప్రమాదమే. అయితే పోయిన ప్రాణం తిరిగి రాదని నమ్మే కుటుంబాలకైనా తమ బంధువును కడసారి చూసుకోవాలనే తపనకు ఆర్ధికపరమైన అడ్డంకి ఏ కుటుంబానికి భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉండాల్సిన డాక్టర్లు ఇలాంటి పనులను చేయడంలో తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు బంధువులు. మొత్తానికి ఈ మార్చురీల చూస్తే అతి భయంకరమైన సినిమాలు తీసే దర్శకుల సైతం  భయపడేలా ఉంది.

ఆర్టీసీ మరో ఆల్విన్ కాకూడదు... కార్మికులతో చర్చల ప్రసక్తే లేదన్న కేసీఆర్

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కఠిన వైఖరి ప్రదర్శించారు. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై మంత్రి పువ్వాడ, సంబంధిత ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్... కార్మికుల్ని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. యూనియన్లు లేని ఆర్టీసీనే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్‌ ప్రకటించారు. ఆర్టీసీ నష్టాలకు యూనియన్లే కారణమన్న కేసీఆర్‌... యూనియన్లు లేకపోతే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలపైనా చర్చించిన కేసీఆర్... సంస్థ నష్టాల్లో ఉంటే జీతాలు పెంచమని ఏ న్యాయస్థానమూ చెప్పదని అన్నారు. ఆల్విన్ కంపెనీ మూతపడితే ఎవరూ ఏమీ చేయలేకపోయారని గుర్తుచేసిన కేసీఆర్... ఆర్టీసీ మరో ఆల్విన్ కంపెనీ కాకూడదనే తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇక, ఆర్టీసీ దివాలా పరిస్థితిని హైకోర్టు ముందుంచాలని ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని గతంలో ప్రకటించిన సీఎం కేసీఆర్... ఇప్పుడు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమన్నా ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. అయితే, సమ్మె విరమిస్తామని ఒక వర్గం తమకు సంకేతాలు పంపిందని, కానీ యూనియన్లతో లాలూచీ పడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. హైకోర్టు ఆదేశించినాసరే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్... పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మినహాయింపు కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారా? నవంబర్ 1న తీర్పు అనుకూలంగా రానుందా?

  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రులకు ముందస్తు సమాచారమిచ్చి ఢిల్లీ వెళ్లిన జగన్ కు ఊహించనివిధంగా చుక్కెదురైనట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు 24గంటల సుదీర్ఘ ఎదురుచూపులు తర్వాత అమిత్‌షా అపాయింట్ మెంట్‌ ఇవ్వడం... అదే సమయంలో మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలవకుండానే... ఢిల్లీ నుంచి వెనుదిరగడంపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటానికి సమయం ఇవ్వకుండా కేవలం వినతిపత్రం మాత్రమే తీసుకుని జగన్ ను పంపేశారని తెలుస్తోంది. అంతేకాదు జగన్ ముందుగా అపాయింట్ మెంట్లు ఇచ్చిన కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్‌, ప్రహ్లాద్ జోషిలు ఆ తర్వాత రద్దు చేసుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్ర సమస్యల కోసం జగన్ ఢిల్లీ వెళ్లలేదని, తన కేసులను మాఫీ చేసుకోవడానికే వెళ్లారని ఆరోపించింది. ముఖ్యంగా సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసమే కేంద్ర హోంమంత్రిని కలిశారని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే, తెలుగుదేశం ఆరోపణలకు కౌంటరిచ్చిన వైసీపీ..... అమిత్‌షాతో 45 నిమిషాలతోపాటు సమావేశమైన జగన్మోహన్ రెడ్డి... రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై చర్చించారని తెలిపింది. ఒకవైపు బర్త్ డే... మరోవైపు బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకపోయినా అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇక, ఏపీ సమస్యలపై ఇతర మంత్రులతో తాను మాట్లాడతానని అమిత్‌షా మాటివ్వడంతోనే... రవిశంకర్ ప్రసాద్‌, ప్రహ్లాద్ జోషిలను కలవకుండానే జగన్మోహన్ రెడ్డి‌.... ఢిల్లీ నుంచి వెనుదిరిగారని వైసీపీ కేంద్ర కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆరోపణలు, విమర్శలు, ఊహాగానాలు ఎలాగున్నా.... ఢిల్లీ పర్యటనపై జగన్మోహన్ రెడ్డి అసంతృప్తికి లోనైనట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 24గంటలు వెయిట్ చేసినా అమిత్ షాతో పూర్తిస్థాయి మీటింగ్ జరగలేదని జగన్ అసహనానికి గురయ్యారని అంటున్నారు. అయితే, నవంబర్ 1న సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ వెళ్లారనే మాట వినిపిస్తోంది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేయడం, కోర్టులో వాడివేడి వాదనలు జరిగిన నేపథ్యంలో... ముందస్తు జాగ్రత్తతోనే... జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని అంటున్నారు. ఇందులో నిజముందో లేదో తెలియదు గానీ, నవంబర్ 1న మాత్రం జగన్ కు అనుకూలంగా తీర్పు ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.  

గాంధీభవన్లో మళ్లీ రేవంత్ ప్రకంపనలు... అధిష్టానానికి మరోసారి సీనియర్ల ఫిర్యాదు.!

  నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో... నరులెవరు నడవనది ఆ రూట్లో నేనడిచెదరో... పొగరని అందరు అన్నా... అది నా నైజం... తెగువని కొందరు అన్నా-అది నా మేనరిజం... నేను ఒక్కడిని ఒకవైపు... లోకం ఒకవైపు... ఈ పాట సరిగ్గా అతికినట్లు రేవంత్ రెడ్డికి సరిపోతుందేమో... ఎందుకంటే, టీఆర్ఎస్ లో ఉన్నా... టీడీపీలో ఉన్నా... ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా... రేవంత్ రెడ్డి స్టైలే వేరు... రేవంత్ ఏం మాట్లాడినా... ఏం చేసినా సంచలనమే... అన్న అడుగేస్తే మాస్... అన్న చెయ్యేస్తే మాస్ అన్నట్లుగా రేవంత్ కి నిజంగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ... ఇక రేవంత్ నోరు విప్పాడంటే... పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మించిన డైలాగ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి... అందుకే, కేసీఆర్ కు సరైనోడు రేవంతే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  అయితే, సముద్రంలాంటి కాంగ్రెస్ లో ఎవరైనా మాట నెగ్గించుకోవాలంటే ఆషామాషీ కాదు... అలాంటిది తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ తనదైన ముద్ర వేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ దూకుడే సీనియర్లకు నచ్చడం లేదట. మొన్నటికిమొన్న హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై ఘాటు వ్యాఖ్యలుచేసి సంచలనం సృష్టించిన రేవంత్... ప్రగతి భవన్ ముట్టడితో మరోసారి టీకాంగ్రెస్ లో కలకలం రేపారు. అసలు ఎవర్ని అడిగి, ఎవరితో చర్చించి రేవంత్... ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చాడని వీహెచ్, జగ్గారెడ్డి లాంటి లీడర్లు ఫైరవుతున్నారు. రేవంత్ పిలుపునిస్తే తాము ఆందోళనలో పాల్గొనాలా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. మరో అడుగు ముందుకేసి, రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదుచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ తన సొంత అజెండాను పార్టీపై రుద్దుతున్నాడని సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీని సైతం పక్కనబెట్టి తానొక్కడే హైలేట్ కావాలని చూస్తున్నాడని ఫైరవుతున్నారు. అయితే, రేవంత్ వ్యూహాన్ని కొందరు నేతలు మెచ్చుకుంటున్నారు. రేవంత్ లాగా అందరూ పనిచేస్తే కాంగ్రెస్ పుంజుకుంటుందని అంటున్నారు. మరింత రేవంత్ తాజా ఎపిసోడ్ గాంధీభవన్లో ఎలాంటి ప్రకంపలను సృష్టిస్తుందో చూడాలి.

కౌంటింగ్‌కి ముందే చేతులెత్తేసిన నేతలు.. ఎగ్జిట్ పల్స్ పై టీకాంగ్రెస్‌లో టెన్షన్...

ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మమని పైకి చెబుతున్నా... తెలంగాణ కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు మొదలైందట. హుజూర్ నగర్ బైపోరులో గెలుపు గులాబీ పార్టీదేనని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పడమే కాకుండా 25వేల వరకు మెజారిటీ వస్తుందని ప్రకటించడంపై ఉత్తమ్ సహా ముఖ్యనేతలంతా షాక్ అయ్యారట. ఎందుకంటే, హుజూర్ నగర్ ... ఒకవైపు కాంగ్రెస్ సిట్టింగ్ కావడం... మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కంచుకోట అవడంతో... కచ్చితంగా మళ్లీ తామే గెలుస్తామన్న ధీమాతో టీకాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కలిసొచ్చి భారీ మెజారిటీ సైతం వస్తుందని లెక్కలేశారు. అంతేకాదు హుజూర్ నగర్ ను భారీ మెజారిటీతో మరోసారి చేజిక్కించుకుని, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, కేసీఆర్ పాలనపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ జనంలోకి వెళ్లాలని కలలుగన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ ను దారుణంగా ఓడించి కాంగ్రెస్ శ్రేణుల్లో భరోసా నింపాలని భావించారు. అయితే, కాంగ్రెస్ లీడర్ల ఆశలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ దే గెలుపు అని చెబుతుండటంతో ఉత్తమ్ తోపాటు టీపీసీసీ ముఖ్య నేతల్లో టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ లో ఆందోళన మొదలైందని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మమని పైకి చెబుతున్నా... ఎక్కడ సిట్టింగ్ సీటు చేజారిపోతుందోనని భయపడుతున్నారట. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమై టీఆర్ఎస్ గెలిస్తే... సొంత పార్టీలోనే విమర్శలు వస్తాయని ఉత్తమ్ వణికిపోతున్నారట. ఎందుకంటే, సొంత సీటునే కాపాడుకోలేనివాళ్లు... ఇక పార్టీని ఎలా కాపాడుతారంటూ విమర్శలు చెలరేగడం ఖాయం. అలాగే, టీకాంగ్రెస్ లో ఉత్తమ్ పరపతి కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ ఆలోచించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఉత్తమ్ భయపడుతున్నారట. అయితే, ఒకపక్క గుబులు ఉన్నప్పటికీ, కచ్చితంగా తన సతీమణి గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఉత్తమ్. మరి, ఎగ్జిట్ పల్స్ నిజమవుతాయో... లేక ఉత్తమ్ నమ్మకం గెలుస్తుందో చూడాలి.