హైకోర్ట్ ఆదేశాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆర్టీసి కార్మికులు...

ప్రభుత్వం పట్టు వీడటం లేదు, జేఏసీ నేతలు మెట్టు దిగడం లేదు, పంతం పట్టుదల మధ్య కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 వ రోజు కొనసాగుతోంది. సమ్మెపై హైకోర్ట్ విచారణ చేపట్టనుంది,కార్మిక సంఘాలతో జరిపిన చర్చల సారాంశంపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోంది, కార్మికులు పట్టు వీడాలని ఆదేశించబోతుందా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హై కోర్టు తీర్పు ఏంటి, చర్చలు ముందుకు సాగుతాయా బస్సులు రోడ్డెక్కుతాయా అనేది కాసేపట్లో తెలిసే అవకాశముంది.

చర్చలకు పిలిచినా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో మెట్టు దిగకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై సర్కారు దృష్టి పెట్టింది.  ఈ నెల 26 న జరిగిన చర్చల సారాంశాన్ని కోర్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం తెలపనుంది. సమ్మె ఇదే తరహాలో కొనసాగితే ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచే క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ సంక్షోభంపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కీలక సమీక్ష నిర్వహించారు. నేడు కోర్టుకు ఇవ్వాల్సిన నివేదికను పరిశీలించారు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీలో అద్దె బస్సును పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్ లు ఇవ్వడంతో పాటు ప్రైవేటు రూట్లలో సర్వే చేయాలని నిర్ణయించారు.

దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు, ప్రైవేట్ రూట్లలో త్వరలో సర్వే చేయాలని, ప్రైవేట్ రూట్లు, బస్సుల విధివిధానాలపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇరవై నాలుగు రోజులుగా ఆందోళన బాట పట్టిన కార్మికులు రోజుకో తరహాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసి జెఎసి పిలుపు నిచ్చింది,  కోర్టు విచారణ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె దారి ఎటు అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. తమ డిమాండ్ లు నెరవేరే వరకు సమ్మె కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది, ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ సైతం మద్దతు ప్రకటించింది. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేడర్ కు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.

Teluguone gnews banner