గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి నుంచి వీడటానికి కారణాలు ఇవేనా...?
posted on Oct 28, 2019 @ 6:38PM
రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్టుగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించారు. ఈ మేరకు టిడిపి అధినేతకు రాజీనామా లేఖ పంపారు, తెలుగుదేశం పార్టీతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా వంశీ లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండుసార్లు అవకాశం కల్పించినందుకు లేఖలో చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. గత అయిదేళ్లుగా నియోజక వర్గ అభివృద్ధి కోసం ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చానన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు, అధికారులు ఎన్ని కుట్రలు చేసినా అతికష్టం మీద గెలిచానని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా తనపై తన అనుచరులపై పెరుగుతున్న వేధింపులతో ఇబ్బంది పడుతున్నామన్నారు. అనుచరులను ఇబ్బంది పెట్టలేక తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టుగా ప్రకటించారు. వల్లభనేని వంశీ రెండు రోజుల కిందట సీఎం జగన్ ను కలిశారు, ఆయన వైసీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. వ్యూహాత్మకంగా టిడిపికి రాజీనామా చేయించి తటస్థ సభ్యునిగా అసెంబ్లీలో కొనసాగించే వ్యూహాన్ని వైసిపి అమలు చేయబోతోందని ప్రకటించారు.
దానికి తగ్గట్లుగానే వల్లభనేని వంశీ టిడిపికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు అయితే వంశీ మరో లేఖను స్పీకర్ కు పంపుతారో లేదో అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. స్పీకర్ కు పంపినా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే మాత్రం వైసీపీతో కలిసి వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేస్తున్నారని భావించవచ్చని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. కేసుల విషయంలో వల్లభనేని వంశీ చాలా కాలంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నకిలీ పట్టాల కేసు కూడా కొద్ది రోజుల కిందట నమోదయ్యింది. ఇది అక్రమ కేసని కొద్ది రోజులుగా ఆయన వాదిస్తున్నారు, ఈ అక్రమంలో అటు సుజనా చౌదరి తోనూ ఇటు జగన్ తోనూ సంప్రదింపులు జరిపారు చివరికి రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా చంద్రబాబుకు లేఖ రాశారు కానీ, ఇది వ్యూహాత్మక అడుగేనని ఆయన వైసిపికి సన్నిహితంగా ఉండటం ఖాయమని ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వైసిపి లో చేరేందుకు గన్నవరం వైసీపీ క్యాడర్ వ్యతిరేకతతో ఉంది, ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పై ఎనిమిదొందల ఓట్ల తేడాతో గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులతో వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు. పార్టీ మారేందుకు వీలుగా వైసీపీ సర్కారులో మంత్రులుగా ఉన్న తన పాత స్నేహితులు కొడాలి నాని, పేర్ని నానిలతో తెరవెనుక సంప్రదింపులు ప్రారంభించిన వంశీ చివరి అడుగుగా సీఎం జగన్ తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో వైసీపీలో చేరేందుకు తన ఆసక్తిని జగన్ వద్ద ఆయన వ్యక్తం చేశారు, అయితే వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ విధించిన రాజీనామా నిబంధన భవిష్యత్తుపై హామీ ఇస్తే అందుకు తాను సిద్ధమేనని వంశీ సీఎం జగన్ కు తెలిపారు. దీంతో ముందు టిడిపికి రాజీనామా చేయమని ఆ తర్వాత చూద్దామని జగన్ వంశీకి చెప్పినట్లు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగితే బిజెపి లోకి చేరమని పెరుగుతున్న ఒత్తిళ్లు తనతోపాటు అనుచరులపై పోలీసులు కేసుల వేధింపులు ఇతర కారణాల నేపథ్యంలో వంశీ ఆ పదవిని వదులుకుంటున్నట్లు సమాచారం. అయితే వైసీపీ పెద్దల నుంచి భవిష్యత్తుపై హామీ లభించిన నేపథ్యం లోనే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రతిపాదన పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు అర్థమవుతుంది. దీంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ తెలిపారు. పార్టీ సభ్యత్వం వరకూ అయితే చంద్రబాబుకు పంపిన లేఖ సరిపోతుంది కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్ కు నిర్ణీత ఫార్మెట్ లో రాజీనామా లేఖను పంపించాల్సి ఉంది. ఇది ఎప్పుడు పంపుతారన్న దానిపై వంశీ క్లారిటీ ఇవ్వలేదు కానీ, టిడిపి ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం వంశీ పార్టీ అధినేతకు మిగతా వారికి తెలియజేసినట్టు ఒక లేఖ మాత్రం పంపించి వదిలేశారు. దీనిబట్టి అయన వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీలో వంశీ రాకపై గన్నవరం నియోజక వర్గ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయనను వైసీపీలో చేర్చుకుంటే జగన్ చెబుతున్న నైతిక విలువలకు అర్థం లేకుండా పోతుంది. గత టిడిపి సర్కారు తన పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడంపై తుదికంట పోరాటం చేస్తున్న జగన్ ఇప్పుడు వంశీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశాలు లేవు. దీంతో మధ్యేమార్గంగా వంశీ రాజీనామా చేయడం దాన్ని ఆమోదించకుండా వదిలేయడం ద్వారా ఆయనను టిడిపి సభ్యుడుగా కాకుండా స్వతంత్ర సభ్యుడుగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా గన్నవరం నియోజకవర్గంలో టిడిపికి పెద్ద దెబ్బకొట్టడం రాబోయే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ పట్టు పెంచుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మరో వైపు వంశీ లేఖపై చంద్రబాబు స్పందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనిపై మరోసారి వంశీ స్పందించారు, తన లేఖకు చంద్రబాబు స్పందించడంపై వల్లభనేని వంశీ కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీలో తన సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. నా ఆవేదనను అర్థం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, ఎలాంటి దాపరికం లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ ముందుంచుతానని వంశీ అన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీకు చెప్పిన విధంగా మీ మార్గదర్శకం లోనే నడిచానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నా మీ ఆదేశాలతోనే తొలిసారి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినా అయిదేళ్లు విలువైన కాలం వృధా అయిందని ఏనాడు బాధపడలేదన్నారు. ఓ సీనియర్ నేతపై ఐపీఎస్ అధికారిపై ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది, అప్రజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేందుకు ప్రత్యర్ధులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసునని ఆ విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావు ఇవ్వకుండా నాకిష్టం లేదని వంశీ పేర్కొన్నారు.
ప్రభుత్వం హింసను ఎదుర్కునేందుకు మీ అడుగుజాడలో నడిచానని అన్యాయాన్ని ఎదుర్కొనడంలో మీ మద్దతును గుర్తుంచుకుంటానని వంశీ తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా వంశీ పాజిటివ్ గా స్పందించడం అయోమయానికి గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం వంశీ రాకపై ప్రస్తుత గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు తగిన న్యాయం చేసి స్పష్టమైన హామీ ఇచ్చి తరువాత వంశీని చేర్చుకోవచ్చని అంటున్నారు. ఇక వైసిపి నుంచి వంశీకి ఎమ్మెల్సీ తో పాటు జిల్లా అధ్యక్ష పదవికి ఆఫర్ ఉందని కొందరు అంటుండగా వంశీని రాజ్యసభకు పంపించి యార్లగడ్డని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేది జగన్ వ్యూహంగా మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతానికి టిడిపికి రాజీనామా చేసిన వంశీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.