సీఎం కూతురు కవిత ఓడిపోగా లేనిది పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి ఓడిపోతే ఏమైంది : జగ్గారెడ్డి
posted on Oct 28, 2019 @ 4:57PM
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీ పుంజుకున్నాక మిగిలిన రాష్ర్టాలపై హైకమాండ్ దృష్టి సారించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని పునర్ వ్యవస్థీకరించాలని సోనియా భావిస్తున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సారథులను నియమించాలని సీనియర్ లకు బాధ్యతలు అప్పగించినట్టు ఢిల్లీ వర్గాల భోగట్టా. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికిప్పుడు పార్టీ నాయకత్వ మార్పు ఉంటుందా అనేది గత కొద్ది రోజులుగా తెలంగాణాలో నడుస్తున్న చర్చ. పిసిసి మార్పు అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది, హుజూర్ నగర్ ఉప ఎన్నికల తరువాత దీనిపై కసరత్తు జరుగుతోందని ఊహాగానాలు వినపడ్డాయి.
ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావటం, అది కూడా కాంగ్రెస్ కు ఊహించని పరాభవం ఎదురైంది. దీంతో అంతా ఉత్తమ్ పార్టీ పదవికి రాజీనామా చేస్తారని భావించారు, అధిష్టానంతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో ఓటమిపై నివేదిక సమర్పించారు. అయితే ఉత్తమ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ జగ్గారెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు. సీఎం కూతురు కవిత ఓడిపోగా లేనిది పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి ఓడిపోతే అదో పెద్ద సమస్యా అంటూ చర్చను లేవనెత్తారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు వచ్చిన తరువాత సోనియా గాంధీ పార్టీ నిర్మాణం మీద దృష్టి సారిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్ లను నియమించే అంశంపై అధిష్టానంలో చర్చయితే మొదలైంది.
ఏపీకి పీసీసీ చీఫ్ ఎవరన్న దాని మీద కూడా చర్చించారు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ల ఎన్నికకు సంబంధించిన అంశంపై వీరప్ప మొయిలీ, జైరాం రమేష్ లకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఏపీకి మాత్రం మాజీ మంత్రి శైలజానాథ్ పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే ఎవరికి బాధ్యతలు ఇవ్వాలన్న దానిమీద చర్చ హాట్ టాపిగ్గా మారింది. టిపిసిసి చీఫ్ రేసులో ప్రస్తుతం శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఉన్నారు అయితే, వీరిలో ఎవరిని పదవి వరిస్తుందన్నది చూడాలి. రేవంత్ కు సీనియర్ల నుంచి వ్యతిరేకత నడుస్తోంది, హైకమాండ్ కు నివేదికలిచ్చారు. అధిష్టానం మనసులో ఏముందో ఉత్తమ్, సోనియా గాంధీ భేటీ తరువాత తెలిసే అవకాశముంది, అప్పటి వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.