జగ్గారెడ్డి అసలు వ్యూహం ఏమిటి?

  మాస్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి నేత జగ్గారెడ్డి. ఆయన ఒక పార్టీలో ఉంటారు మరోక పార్టీ నేతలను పొగుడుతారు. తెల్లారితే మళ్లీ ఆయన్నే తిడతారు. ఒక రాజకీయవేత్తలో ఇన్ని కోణాలు ఎందుకు చూపిస్తున్నారు అనేది అందరికి అంతు చిక్కని విషయంగా మారింది. జగ్గారెడ్డి స్టైల్ ఏ వేరు, పేరుకే సంగారెడ్డి మాస్ లీడర్ కానీ ఆయన వ్యవహారంపైనే గాంధీ భవన్ నుంచి సంగారెడ్డి వరకు చర్చ జరుగుతోంది. ఒక రోజు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తారు. వెంటనే మరో రోజు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకసారి హరీశ్ రావు పైన పంచులు విసురుతారు. మళ్లీ టైము దొరకగానే ఆయనకు సన్మానం చేస్తారు.  మొన్నటికి మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ప్రత్యక్షంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అరెస్టు కూడా అయ్యారు. కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలని ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. అంతటితో ఊరుకోకుండా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తే అందులో పాల్గొనడానికి ప్రగతి భవన్ దగ్గర వరకూ పోలీసుల కళ్ళుగప్పి ఆటోలో వెళ్లి అక్కడ అరెస్టయ్యారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నినదించారు. ఇలా చేసి ఇరవై నాలుగు గంటలు గడిచిందో లేదో మళ్లీ కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగ్గారెడ్డి.  సంగారెడ్డికి మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీంతో ఏకంగా కేటీఆర్ ఫొటో పక్కన తన ఫొటో వేసుకొని సంగారెడ్డిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఇవన్నీ చూస్తున్న సంగారెడ్డి జనానికి మాత్రం జగ్గారెడ్డి అంతరంగం అంతు పట్టడం లేదు. ఒక వైపు పోరాటం, కార్మికులకు సంఘీభావం, మరోవైపు కేసీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తడం అసలు జగ్గారెడ్డి విషయం ఎవ్వరికి అంతు చిక్కట్లేదు ఇప్పుడు ఈ విషయం సంగారెడ్డిలో చర్చనీయాంశమైంది. ఇంతకు జగ్గారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదంటే టీఆర్ఎస్ లో చేరబోతున్నారా ఇవేవీ ఎవరి ఊహకు అందడం లేదు. మొత్తానికి జగ్గారెడ్డి రోజుకో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నారని సెటైర్ లు విసురుతున్నారు జనం.

మాజీ మంత్రి నారాయణ మౌనం వెనుకు అసలు వ్యూహం ఏమిటి?

  మాజీ మంత్రి నారాయణ ఎక్కడ అన్నది అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజావేదిక కూల్చివేత సమయంలో, రాజధాని రచ్చ జరుగుతున్న సమయంలో బయటకు రాలేదు మంత్రి నారాయణ. అసలు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా నెల్లూరు జిల్లాతో సహా రాష్ట్ర రాజకీయాలకు నారాయణ దూరంగా ఉంటున్నారు. ఆయన తాజా ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచీ పొలిటికల్ గా సైలెంటయ్యారు. నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు, ఒక్క లోక్ సభ వైసిపి గెలిచింది. దీంతో జిల్లాలో టిడిపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు నారాయణ వ్యవహరించారు. ఫలితాలు వచ్చిన తరువాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఏం చేస్తున్నారని హాట్ డిస్కషన్ నడుస్తోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి నారాయణ పూర్తిగా టిడిపి నేతలను దూరం పెట్టారు. తన పక్కనే ఉంటూ తనకిందే గోతులు తీశారనే అనుమానం ఓ వైపు మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన భారం మరో వైపు నారాయణకు దిక్కు తోచకుండా చేశాయి. దీంతో ఆయన దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లాకు చంద్రబాబు వచ్చినపుడు నారాయణ వచ్చారు. రెండ్రోజుల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ మళ్లీ మాయమైపోయారు. అమరావతిలో జరుగుతున్న పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాల్గొనలేదు. ఇటివల చంద్రబాబు కోటరీలో కీలక నేతలు బీజేపీలో చేరడంతో నారాయణ కూడా కమలం వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. అధికార పార్టీలోకి జంప్ అవుతారని మరో వార్త వినిపించింది. కానీ నారాయణ మాత్రం సైలెంట్ గా తన విద్యాసంస్థల పనులు చూసుకుంటున్నారని తెలుస్తోంది. అక్కడ కొత్త కొత్త టార్గెట్ లు పెట్టి విద్యాసంస్థల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకైతే నారాయణ తెర వెనక ఉండే మంత్రాంగం నడుపుతున్నారు. అసలు తను ఉనికి ఎక్కడుందో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

కేసీఆర్ కి దైవ బలం తోడవుతోందా?

  చండీయాగం, ఆయుత చండీయాగం, రాజశ్యామల యాగం ఇలా దేశంలో ఎవరూ చేయనంత గొప్పగా కేసీఆర్ యాగాలు చేస్తూంటారు. పొలిటికల్ నిర్ణయాలకే  కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను కేసీఆర్ తన ప్రత్యేకతను చూపిస్తారు. తాజాగా గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమవుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇల్లు పూర్తి అవ్వగానే ప్రయుత చండీ యాగం నిర్వహించనున్నట్టుగా సమాచారం. గతంలో నిర్వహించిన అయుత చండీ యాగానికి రెట్టింపు ఏర్పాట్లూ ఈ యాగానికి అవసరం. తెలంగాణ సీఎం కేసీఆర్ కి దైవభక్తి చాలా ఎక్కువ. ఉద్యమకాలంలో అనేక యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీ యాగం నిర్వహించి దేశవ్యాప్తంగా కేసీఆర్ యాగాలపై చర్చ మొదలయ్యేలా చేశారు. అంత గొప్పగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిష్టతో నిర్వహిస్తారు కేసీఆర్. దైవదర్శనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలన్నీ దాదాపు దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని నెలల్లోనే యాదాద్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా మహాసుదర్శన యగాన్ని జరుపుతానని గతంలోనే సీఎం ప్రకటించారు. దాదాపు పది లక్షల మందితో భారీ ఏర్పాట్లతో ఆ యాగం జరగనుంది.  అయితే అంత కంటే ముందే కేసీఆర్ వ్యక్తి గతంగా మరో యాగం చేయనున్నారు. గతంలో ఆయుత చండీ యాగం పూర్తయిన సందర్భంగా ప్రయుత చండీ యాగం నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ భారీ యాగాన్ని నిర్వహించనున్నారు. తన ఫామ్ హౌస్ లో కొత్తగా నిర్మించిన ఇంటి నిర్మాణం పూర్తి అవ్వగానే ఈ యాగం చేయనున్నట్లు సమాచారం. వెయ్యికి పైగా కుండలతో వేల మంది రుత్వికులు పురోహితులతో లక్షల సార్లు చండీమాత పారాయణం చేస్తారు. అత్యంత కఠిన నియమ నిబంధనలతో పరిశుద్ధమైన వాతావరణంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రయుత చండీ యాగాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేయాలి. దేశంలో ప్రయుత చండీ యాగాలు చాలా అరుదుగా జరిగాయి. ఈ జనరేషన్ లో దాదాపుగా ఇదే మొదటిది అని చెప్పొచ్చు. కేసీఆర్ ఈ యాగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.మరి ఈ యాగం ఎలా జరుపుతారు అన్నది వేచి చూడాలి.

ఆ రెండు పార్టీలు శివసేనకు మద్దతిస్తే కమలనాథుల పని అంతే...

  పాక్ పై మెరుపు దాడులు పని చేయలేదా, దేశభక్తిని రగల్చడంలో బీజేపీ విఫలమైందా, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు బీజేపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చాయనే అంటున్నారు విశ్లేషకులు. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి, హర్యానాలో ఎక్కువ స్థానాల్లో బీజేపీ సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్ ల మద్దతు కోసం బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు, మహారాష్ట్రలో బీజేపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే బీజేపీ ఆధిక్యం తక్కువ సీట్లలో కనిపిస్తుంది, శివసేన బాగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కూడా ఎక్కువ సీట్లలో ఆధిక్యం కనబర్చింది. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు శివసేనకు మద్దతిస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరితే కమలనాథులు తలలు పట్టుకునే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే సీఎం పదవి తమకివ్వాలని, క్యాబినెట్ లో సగం పదవులు కావాలని శివసేన డిమాండ్ చేస్తోంది కానీ, బీజేపీ నేతలు మాత్రం అంతా సర్దుకుంటుందని శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. అమిత్ షా క్యాబినెట్ లోకి రావడం బీజేపీకి కలిసి రాలేదా, నడ్డా వ్యూహాలూ ఫలించలేదా, కమలం పార్టీలో అంతర్మథనం మొదలైంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో అమిత్ షా బిజీ కావడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. పార్టీని పటిష్టం చేయడానికి జేపీ నడ్డాకు పూర్తి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బెంగాల్ లో కూడా బీజేపీ చాలా కష్టపడాల్సి వస్తుంది, ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లాంటి నేతల మరణంతో అక్కడ బీజేపీ నాయకత్వం కొద్దిగా బలహీనమైంది. మహారాష్ట్ర విషయానకొస్తే నాగ్ పూర్ ఆరెస్సెస్ కు పుట్టినిల్లు, ఈ ఎన్నికలను సంఘ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఊహించిన ఫలితాలు అక్కడ రావడం లేదు, దేశభక్తి, ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ నేతలు బాగా ప్రచారం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా పని చేసినప్పటికీ ఊహించిన ఫలితాలు రాలేదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రైతు సమస్యల కారణంగా రెండు రాష్ట్రాలలో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. తెరమీదకు 50-50 ఫార్ములా!!

  మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం దిశగా సాగుతోంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి కూడా బలపడింది. మొత్తం 288 సీట్లలో బీజేపీ శివసేన కూటమి నూట అరవై ఐదు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి తొంభై ఆరు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి, ఎంఐఎం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఇరవై ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.  మహారాష్ట్రలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్లంతా స్వీట్ లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అధికారం దిశగా బీజేపీ శివసేన అడుగులు వేస్తోంది, దాదాపు నూట అరవై ఐదు స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు కావడంతో అవసరమైన దానికన్నా ఇరవై సీట్లే ఎక్కువ వచ్చాయి కానీ, గతంలో ఈ కూటమి గెలిచిన సీట్లకన్నా ఇరవై సీట్లు తగ్గడంతో ఇప్పుడు కొత్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. బీజేపీ శివసేన కూటమి గెలిచినప్పటికీ వారికి మొత్తంగా గతంలో గెలిచిన సీట్ల కంటే ఈ సారి సీట్లు మాత్రం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రచారం చేయకుండా ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపించని కాంగ్రెస్ గానీ, ఎన్సీపీ గానీ గతంలో కన్నా కొన్ని సీట్లు ఎక్కువగా సాధించారు. మరీ ముఖ్యంగా ఎన్సీపీ అయితే యాభై మార్కును దాటింది, గతంలో ఎన్సీపీ కేవలం నలభై రెండు, నలభై మూడుకు మాత్రమే పరిమితమైంది. గతంలో అరవై రెండు సీట్లు గెలిచిన శివసేన ఈ సారి డెబ్బై మార్కుకు దగ్గరగా వచ్చింది. ఈ ఎన్నికలలో సక్సెస్ రేట్ శివసేనది పెరిగింది, బిజెపిది తగ్గింది. ప్రభుత్వంలో తమ ప్రాబల్యాన్ని చూపించుకోవడానికి ఈ ఫలితాలు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. దీనిపై శివసేన ఎంపీ రావత్ మాట్లాడుతూ 50-50 ఫార్ములా ఎన్నికల ముందు అనుకున్నాం అని ఇప్పుడు ప్రభుత్వంలో అదే పాటిస్తామని అన్నారు. ఆయన నేరుగా చెప్పకపోయినా ముఖ్యమంత్రి పదవిని రెండున్నర సంవత్సరాలు ఒక పార్టీ తరువాత రెండున్నర సంవత్సరాలు ఇంకొక పార్టీ శివసేన, బిజెపి పంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. శివసేనకు సంబంధించిన వ్యక్తిని కూడా ఈసారి ముఖ్యమంత్రి చెయ్యాలనేది శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో అది జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ముఖ్యమైన నాయకులు ఎవరైతే మహారాష్ట్ర ఎన్నికల్లో నిల్చున్నారో వాళ్ళందరూ విజయం సాధించారు. వారిలో ప్రముఖంగా అజిత్ పవార్ గురించి చెప్పుకోవచ్చు, లక్ష మెజారిటీని ఆయన దాటారు. బారామతి నుంచి పోటీ చేసిన ఆయన అక్కడ పోలైన ఓట్లలో ఎనభై ఐదు శాతం ఓట్లు ఆయన దక్కించుకున్నారు. వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు, దాదాపు అరవై వేల ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. సౌత్ నాగ్ పూర్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం మహారాష్ట్ర పైన తన ప్రభావాన్ని చూపింది. దాదాపు నలభై ఆరు నియోజక వర్గాల్లో ఎంఐఎం సాధించిన ఓట్లతో గెలుపు అవకాశాలు మారాయి. దీంతో బిజెపికి కొంత లాభం చేకూరింది. 

బండ్ల గణేష్ కు 14 రోజుల రిమాండ్!!

  సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 4 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. 2011లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో 2013లో బండ్ల పై మహేష్ చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో బండ్ల పై కడప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, కోర్టు విచారణకు బండ్ల హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో, బండ్ల ను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

హుజూర్‌నగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం.. రికార్డు మెజారిటీ!!

  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తనకి తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కారు జోరుకి హస్తం కుదేలైంది. హుజూర్‌నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం మొదలుకుని చివరి రౌండ్ వరకూ కారు స్పీడ్‌ గా దూసుకెళ్లింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ హస్తం హవా కనిపించలేదు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీల సంగతి సరేసరి. ఇండిపెండెంట్‌ అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమవ్వగా.. ఇండిపెండెంట్‌ అభ్యర్థి మూడో స్థానం దక్కించుకున్నారు.    పార్టీ                 ఓట్లు టీఆరెఎస్         112796 కాంగ్రెస్              69563 బీజేపీ                  2621 టీడీపీ                 1827

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చనున్న సిఎం జగన్...

  ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు సిఎం వైఎస్ జగన్. మహిళల్లో, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు వైయస్సార్ బాల సంజీవనీ, వైయస్సార్ బాలామృతం పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టనున్నారు. అందుకు పైలట్ ప్రాజెక్టును రూపొందించారు. గర్భవతులకు, బాలింతలకు నెలకు 1062 రూపాయల విలువైన పౌష్టిక ఆహారాన్ని అందించనున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరే ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా ప్రజారోగ్యానికి, మాతా శిశువుల పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీని ఆరోగ్యాంధ్రాగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం పై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణపై చర్చించిన ఆయన మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన సబ్ ప్లాన్ ప్రాంతాల్లోని గర్భవతులు, ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మాతా శిశువులకు పౌష్టికాహారాన్ని అందించటానికి వైయస్సార్ బాల సంజీవని, వైయస్సార్ బాలామృతం పేరుతో వారిని ఆదుకోనున్నారు. అందుకు గాను 77 గిరిజన సబ్ ప్లాన్ మండలాలను ఎంపిక చేసిన అధికారులు డిసెంబర్ నుంచి ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును అనుసరించి గర్భవతులకు, బాలింతలకు నెలకు 1062 రూపాయల విలువైన ఆహారం అందించనున్నారు. 25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలతో పాటు 500 రూపాయల విలువ చేసే వైయస్సార్ బాల సంజీవని కిట్ అందించనున్నారు. వైయస్సార్ బాల సంజీవని కిట్లు మొదటి వారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్ ఆటా, రెండోవారం అరకేజీ వేరుశెనగలతో చేసిన చిక్కి, మూడో వారం అరకేజీ రాగి ఫ్లేవర్, అరకేజీ బెల్లం, నాలుగో వారం అరకేజీ నువ్వుల ఉండలు అందజేస్తారు. ఆరు నెలల నుంచి మూడేళ్ళ లోపు చిన్నారులకు నెలలో ప్రతిరోజు గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు వైయస్సార్ బాలామృతం కిట్ లో భాగంగా 600 రూపాయల విలువ చేసే పౌష్టికాహారం ఇవ్వనున్నారు. అలాగే మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజుల పౌష్టికాహారం అందించనున్నారు. నెలలో 25 రోజుల పాటు భోజనం,గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం అందజేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 36 గిరిజన మండలాలను ఎంపిక చేయగా శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఏడు, విశాఖపట్నం జిల్లాలో పదకొండు, తూర్పు గోదావరి జిల్లాలో పదకొండు, పశ్చిమగోదారి జిల్లాలో ఆరు ఉన్నాయి. సబ్ ప్లాన్ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పంతొమ్మిది, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, విశాఖపట్నం జిల్లాలో ఆరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో మూడు, కర్నూలు జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో మూడు, కలిపి మొత్తం 41 మండలాలను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలపై ప్రజల్లో మంచి స్పందన వస్తోంది అని చెప్పారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. అది చూసి ఓర్వలేకే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యం అందక ఏ ఒక్క పేదవాడు చనిపోకూడదన్న ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని చెప్పారు, ఒంగోలు రిమ్స్ ను సందర్శించిన మంత్రి అక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు, అనంతరం డీ.అర్.డి.ఎ ఆఫీస్ లో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఆళ్ల నానితో పాటు మరో మంత్రి బాలినేని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 

ఉపఎన్నికలంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలు... బైపోల్స్ లో గులాబీ పార్టీకి ఎదురే లేదు

  నిజమే, ఉపఎన్నికలంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలు... ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపఎన్నికలను కేసీఆర్ అస్త్రంగా మార్చుకుని ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ ప్రజల నాడిని కేంద్రానికి తెలియజేసేందుకు ఉపఎన్నికలను కేసీఆర్ అస్త్రంగా వాడేవారు. పదేపదే రాజీనామాలు చేస్తూ ఉపఎన్నికలకు వెళ్లేవారు. ఉపఎన్నికలకు వెళ్లడమే కాదు... అదేస్థాయిలో ఘనవిజయం సాధించేవారు. దాంతో ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురే లేకపోవడంతో... ఉపఎన్నికలంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలన్నంతా గులాబీ పార్టీ పేరు తెచ్చుకుంది. అయితే, ఒకే ఒక్కసారి టీఆర్ఎస్ కు చుక్కెదురైంది. వైఎస్ హయాంలో కేసీఆర్ స్ట్రాటజీకి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కు ఊహించనివిధంగా ప్రజలు షాకిచ్చారు. ఆ ఒక్క సందర్భంగా మినహా మిగతా అన్ని ఉపఎన్నికల్లోనూ కేసీఆర్ వ్యూహం పక్కాగా వర్కవుట్ అయ్యాయి. ఇక, ఇఫ్పుడు కూడా హుజూర్ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఫలించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం.... కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పాతడం ద్వారా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురే లేదని రుజువైంది.

తమిళనాట స్టాలిన్ కు షాక్... అనూహ్యంగా పుంజుకున్న అన్నాడీఎంకే...

  మరో ఏడాదిన్నరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని కలలు కంటోన్న డీఎంకే అధినేత స్టాలిన్ కు తమిళ ప్రజలు షాకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ఏకపక్ష ఫలితాలను సాధించి అన్నాడీఎంకేకు షాకిచ్చిన డీఎంకేకు కేవలం వందే వంద రోజుల్లో ప్రజలు రివర్స్ పంచ్ ఇచ్చారు. తమిళినాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఊహించనివిధంగా అన్నాడీఎంకే విజయం సాధించింది.  జయలలిత మరణం తర్వాత కుమ్ములాటలతో అన్నాడీఎంకే చతికిలపడటంతో... నాలుగు నెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 39 స్థానాలకు 22 సీట్లను డీఎంకే గెలుచుకుంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జోరు మీదున్న డీఎంకే దూకుడుకు ఉపఎన్నికల్లో బ్రేకులు పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఉపఎన్నికల్లోకూడా డీఎంకేనే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ... అనూహ్యంగా అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. మొత్తానికి జయలలిత మరణం తర్వాత అనేక ఒడిదుడులకు గురైన అన్నాడీఎంకేలో ఈ ఉపఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మరి, 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ట్రెండ్ ఇలానే కొనసాగుతుందో? లేక డీఎంకేకి పట్టం కడతారో? ఈ రెండు పార్టీలను కాదని రజనీని అందలమెక్కిస్తారో చూడాలి.

రేవంత్ అనుమానాలే నిజమయ్యాయా? కంచుకోటలో ఉత్తమ్ ఎందుకు చతికిలపడ్డారు?

  హుజూర్ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఫలించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే గులాబీ జెండా పాతడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్న టీఆర్ఎస్ అధినేత స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది. తన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకోలేని ఉత్తమ్... ఇక తెలంగాణలో పార్టీని ఎలా నడిపించగలరన్న సంకేతాలను కేసీఆర్ ప్రజల్లోకి పంపారు. అయితే తన సొంత నియోజకవర్గంలో... పైగా తన కంచుకోటైన సిట్టింగ్ సీటును కోల్పోవడం ద్వారా సొంత పార్టీలో కూడా ఉత్తమ్ విమర్శలను ఎదుర్కోనున్నారు. పీసీసీ పదవి నుంచి వెంటనే వైదొలగాలన్న డిమాండ్ పెరగనుంది. సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకోలేని ఉత్తమ్ ఇక రాష్ట్రంలో పార్టీని ఎలా గెలిపించగలరనే విమర్శలు పెరగడం ఖాయం. దాంతో, పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే, హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై మొదట్లో రచ్చ జరిగింది. ఉత్తమ్ భార్య పద్మావతి ఎంపికను రేవంత్ తీవ్రంగా వ్యతిరేకించారు. పద్మావతికి ప్రత్యామ్నాయంగా రేవంత్ మరో అభ్యర్ధిని తెరపైకి తెచ్చారు. అయితే రేవంత్ పై సీనియర్లంతా ఏకమై మాటల దాడి చేయడంతో గాంధీభవన్ లో రచ్చ నడిచింది. చివరికి పద్మావతి పేరును సోనియా ఓకే చేయడంతో... అంతా కలిసి హుజూర్ నగర్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. రేవంత్ కూడా ఒక రోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటూ విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతలంతా హుజూర్ నగర్ లో క్యాంపైన్ చేశారు. కానీ ఎవరూ ఊహించనివిధంగా భారీ తేడాతో పద్మావతి ఓడిపోవడంతో కాంగ్రెస్ లీడర్లు షాక్ కి గురవుతున్నారు. అయితే, టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపునకు ఉత్తమ్ ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత కూడా కారణమనే మాటలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడుసార్లు ఉత్తమ్ గెలిచి ఉండటంతో ప్రజలు మార్పు కోరుకున్నారని అంటున్నారు. అదే సమయంలో అధికారంలో టీఆర్ఎస్ ఉండటంతో ఇక్కడ కూడా అదే పార్టీని గెలిపిస్తే మంచిదనే అభిప్రాయమే సైదిరెడ్డి విజయానికి కారణమనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే, రేవంత్ చెప్పినట్లుగా ఉత్తమ్ ఫ్యామిలీ నుంచి కాకుండా మరో అభ్యర్ధిని రంగంలోకి దింపి ఉంటే... కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో.

హుజూర్ నగర్ లో ఊహించిందే జరిగింది... కానీ అన్ని రౌండ్లలో ఆధిక్యంపైనే డౌట్స్...

  హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. హుజూర్ నగర్ లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న సర్వే సంస్థల లెక్క తప్పలేదు. అంతేకాదు 18వేల నుంచి 25వేల వరకు మెజారిటీ కూడా రావొచ్చ అంచనా కూడా నిజమైంది. హుజూర్ నగర్ లో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏమాత్రం లేదని... కేసీఆర్ పరిపాలన, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల ప్రభావమే ఓటర్లపై ఆధికంగా ఉందన్న  సర్వే సంస్థల మాటలు అక్షరాలా నిజమని రుజువైంది. అయితే, మొదట్నుంచీ ఊహించినట్లుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు నడిచినప్పటికీ.... ఏ రౌండ్ లోనూ సైదిరెడ్డికి పద్మావతి పోటీ ఇవ్వలేకపోయింది. ప్రతి రౌండ్ లోనూ పద్మావతిపై సైదిరెడ్డి పైచేయి సాధించారు. దాంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ప్రతి రౌండులోనూ టీఆర్ఎస్ కు వేల ఓట్లు ఎలా ఆధిక్యం వస్తుందంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు.  ఇక, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటోన్న బీజేపీకి హుజూర్ నగర్ లో డిపాజిట్ కూడా దక్కలేదు. అలాగే, తెలుగుదేశం కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. హుజూర్ నగర్లో ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లంతు అయ్యింది.  

మహారాష్ట్రలో కుర్రాడొచ్చాడు... ముఖ్యమంత్రి పీఠంపై శివసేన కన్ను

  మహారాష్ట్రలో బీజేపీ అంచనాలు తప్పాయి. శివసేన అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బీజేపీకి మరాఠా ప్రజలు షాకిచ్చారు. గతంతో పోల్చితే బీజేపీకి భారీగా సీట్లు తగ్గాయి. ఇక, బీజేపీ మిత్రపక్షమైన శివసేన మాత్రం అనూహ్యంగా పుంజుకుని గతంతో పోల్చితే రెట్టింపు సీట్లు సాధించింది. వంద సీట్లకు అటుఇటూగా బీజేపీ ఉంటే.... శివసేన 60 స్థానాలకు పైగా సాధించింది. దాంతో శివసేన ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసింది. శివసేన లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేకపోవడంతో... ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ప్రతిపాదిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయాలని శివసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.ఇక, శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో శివసేనను ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే లీడ్ చేశారు. దాంతో 29ఏళ్ల ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. అంతేకాదు రాజకీయాల్లోకి రావడం రావడమే.... ఎవరూ ఊహించని విధంగా పార్టీని ముందుకు నడిపించి... గతంతో పోల్చితే అత్యధిక సీట్లు సాధించేలా చేశారు. దాంతో మహారాష్ట్రలో ఇప్పుడు ఆదిత్య ఠాక్రే పేరు మారుమోగిపోతోంది. శివసేనను అద్భుతంగా లీడ్ చేయడమే కాకుండా... 60కి పైగా సీట్లు సాధించడతో... ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకే ఇవ్వాలంటోన్న ఠాక్రే అభిమానులు... ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒక, ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకోకపోతే.... కాంగ్రెస్, ఎన్సీపీతో జత కట్టాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే... మరాఠా సామ్రాజ్యానికి కొత్త కుర్రాడొచ్చడనేది అర్ధమవుతోంది. ఒక, శివసేన డిమాండ్ కు బీజేపీ ఒఫ్పుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని ఆదిత్య ఠాక్రే అధిష్టించడం ఖాయమే.

తలకిందులైన ఎగ్జిట్ పోల్స్... మహారాష్ట్ర, హర్యానాలో అంచనాలు తారుమారు

  మహారాష్ట్ర, హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అండ్ మిత్రపక్షాలు క్లీన్ స్వీప్ చేస్తాయంటూ ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాటలు తారుమారు అయ్యాయి. ఇక, కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేదంటూ సర్వే సంస్థలు వేసిన అంచనాలు మొత్తం మారిపోయాయి. ఏ సంస్థా అంచనా వేయని విధంగా మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజలు తీర్పిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా దృష్టిపెట్టకపోయినా సరే... ప్రజలు మాత్రం పరువు నిలిపారు. మహారాష్ట్రలో బీజేపీ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తారుమారు అయ్యాయి. గతంలో పోల్చితే బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గిపోగా... మిత్రపక్షమైన శివసేన మాత్రం భారీగా పుంజుకుంది. ఇక, కాంగ్రెస్ కంటే దాని మిత్రపక్షమైన ఎన్సీపీ ఎక్కువ స్థానాలు సాధించింది. అసలు కాంగ్రెస్, ఎన్సీపీకి కలిపి50-60 స్థానాలు కూడా దాటవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే... వంద సీట్ల వరకు సాధించాయి. ఇక, హర్యానాలో బీజేపీ అంచనాలు తప్పాయి. బీజేపీ ఏకపక్ష విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ లెక్కలు కూడా తారుమారు అయ్యాయి. గతంతో పోల్చితే భారీగా సీట్లు కోల్పోయిన బీజేపీ.... కనీస మెజారిటీకి ఆరేడు సీట్లు దూరంలో ఆగిపోయింది. ఇక, కనీసం పోటీ కూడా ఇవ్వలేదు అనుకున్న కాంగ్రెస్ మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. 30కి పైగా సీట్లు సాధించి బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. అలాగే, ఏ పార్టీకి కనీసం మెజారిటీ రాకపోవడంతో హర్యానాలో హంగ్ ఫలితాలు నమోదయ్యాయి. దాంతో ఇండిపెండెంట్స్, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని అటు బీజేపీ... ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.

హోరా హోరీగా మారిన హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు...

  రాష్ట్ర ప్రజలు అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఆయా పార్టీలకు చెందినటువంటి ఏజెంట్ లు కౌంటింగ్ హాల్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్, పద్మావతి రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు,విజయం ఎవరిదో ఈ రోజు తెలియనుంది. ముఖ్యంగా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గరనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్వోతో పాటు కేంద్రం పంపించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులతో పాటు వంద మంది సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. దాదాపు మొత్తం పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేసి ఇరవై రెండు రౌండ్స్ గా ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఒక్కొక్క రౌండ్ అయితే దాదాపు ఇరవై నిమిషాల సమయం తీసుకుంటున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మరి కొద్దిసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశం కన్పిస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత సర్వీస్ ఓట్లు నూట ఒక్క సర్వీస్ ఓట్లున్నాయి. ఆ సర్వీస్ ఓట్లను లెక్కించిన తరవాత ఆ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినటువంటి ఈవీఎంలని ప్రత్యేక పహారా మధ్య ఈ కౌంటింగ్  కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ ఈవీఎంలన్నీ తెరచి  ఏజంట్ల సమక్షంలో రౌండ్స్ వారిగా లెక్కిస్తున్నారు. మొత్తం మీద ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఇప్పటికే ప్రభుత్వం పై ప్రతిపక్షాల చేస్తున్నటువంటి విమర్శలకు దీటుగా ఈ స్థానాన్ని గెలిచి సరైనటువంటి జవాబు ఇవ్వాలనే ఉత్సాహంతో టిఆర్ఎస్ ఉంది. అలాగే హుజూర్ నగర్ ఆవిర్భవించి తాను మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగువ సారి తన భార్య గెలుపుతో అక్కడ సత్తా చాటాలని కాంగ్రెస్  కూడా భావిస్తోంది. కానీ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరేలా ఉంది.

ఉత్కంఠంగా మారిన మూడు రాష్ట్రాల కౌంటింగ్

ఎన్నికల కౌంటింగ్ మొదలైన సందర్భంగా అందరిలో ఉత్కంఠత వాతావరణం నెలకొంది.హర్యానాలో మొత్తం తొంభై శాసన సభ స్థానాలకు గాను ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హర్యానాలో కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బిజెపి అధికంగా దృష్టి పెడితే, కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోల్చి చూస్తే హర్యానాలో పోలింగ్ డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు నుంచి అరవై ఎనిమిది శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవిలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ చీలిక వర్గం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక మహారాష్ట్ర శాసన సభలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బిజెపి నూట అరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే మిత్ర పక్షం శివసేన నూట ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నూట నలభై ఏడు స్థానాల్లో ఎన్సీపీ నూట ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి.వాళ్ళ వ్యూహాలు నిజమైతాయో లేదో వేచి చూడాలి.

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తెలంగాణ రైతులు

తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలు నీట మునిగాయి, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరకాలం నుంచి పండించిన పంటలు వర్షానికి ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల పంటలన్నీ కూడా నేల పాలయ్యాయి. మూడు రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షాలకు పంట నష్టపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఓ వరిపొలం కురుస్తున్నటువంటి వర్షాలకు, గాలులకు ఒక్కసారిగా అంతా కూడా నేలమట్టం అయినటువంటి పరిస్థితి. ఈ విధంగా వరి పొలమే కాకుండా మొక్కజొన్న, ప్రత్తి మరియు కూరగాయల పొలాలు కూడా నాశనం అయ్యాయి. అకాల వర్షం వల్ల బాగా దెబ్బతింటుంది రైతాంగం అని దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏదైనా నష్ట పరిహారం చెల్లించి తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులకు కన్నీటినే మిగిల్చాయి, ఈ వర్షం ఇంకా ఐదు రోజుల పాటు కురవనుంది. అప్పులు చేసి మరీ పంటలపై పెట్టుబడులు పెట్టి పంట చేతికందుతుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు వర్షం నిరాశే మిగిల్చింది. అకాలంగా వచ్చిన వర్షం రైతులను అప్పుల పాలు చేయడమే కాక కొందరి రైతులకు బ్రతకడానికి కష్ట తరంగా మార్చింది. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు తమని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

స్పెషల్ కోర్టులో హాజీపూర్ కేసు....

మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. స్కూల్ కి వెళ్ళీ చదువుకోవల్సిన విద్యార్ధులను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన భువనగిరి జిల్లా హాజీపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వేళ్తే వరుస హత్యల కేసులో విచారణ ప్రారంభించింది భువనగిరి స్పెషల్ కోర్టు. ఈ నెల పద్నాలుగు నుంచి పధ్ధెనిమిది వరకు ట్రైల్ నడిచింది. చార్జ్ షీట్ కాపీలతో పాటు డిఎన్ఎ ఫోరెన్సిక్ రిపోర్ట్ లను కోర్టుకు సమర్పించారు పోలీసులు. చార్జిషీట్ లో మూడు వందల మంది సాక్షులున్నారు,సాక్షులు సహా బాధిత కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లను కోర్టు రికార్డ్ చేసింది. మరో నలభై ఐదు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మూడు రేప్ మరియు మర్డర్ కేసులలో  శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేసు హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు. దాదాపుగా ముగ్గురు విద్యార్థులను పదవ తరగతి విద్యార్ధితో పాటుగా ఏడవ తరగతి విద్యార్ధులు మొత్తం ముగ్గురు విద్యార్థులను కూడా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి చాలా పెద్ద సమస్య ఎదురయ్యింది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ కోర్టు కూడా ఇప్పటికే  సిద్దం అయ్యింది. ఆ స్పెషల్ కోర్టుకు సంబంధించినటువంటి విచారణ ఈ నెల 14 వ తేదీన హజిపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు ట్రయల్ ప్రారంభమైంది. ఈ ట్రయల్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు దాఖలు చేసిన ఈ మూడు కేసుల చార్జిషీట్ లతో పాటుగా దాదాపు మూడు వందల మంది సాక్ష్యాలను ఈ మూడు కేసుల్లోని చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును దాదాపుగా టెక్నికల్ సాక్ష్యాలతో పాటుగా అతను చేసినటువంటి హత్యాచారాలకు సంబంధించి ఫిజికల్ సాక్ష్యాలు కూడా పోలీసులు వివిధ రూపాల్లో రాబట్టారు.

జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన బాబు

ఉపాధి హామీ నిధులు రెండు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు చంద్రబాబు. టిడిపి హయాంలో చేపట్టిన నరేగా పనులపై వైసిపి ఎన్నో ఆరోపణలు చేసిన ఒక్కదాన్ని కూడా నిరూపించలేక పోయిందని అన్నారు. కేంద్రం ఇప్పుడు నిధులు విడుదల చేసిన వైసిపి ప్రభుత్వం విడుదల చేయడం లేదని చంద్రబాబు విమర్శించారు. 5-8-2019 ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు, 8-7-2019 ఆరు వందల నలభై ఒక్క కోట్లు, 9-4-2019  మూడు వందల అరవై కోట్లు మొత్తం కలిపి పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చారు. మన వాట ఆరు వందల పదిహేను కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. రెండూ కలిపితే మొత్తం 2460  కోట్ల రూపాయలు  డబ్బులున్నాయి. ఆ డబ్బులు మొత్తాన్ని కూడా మూడు రోజులలో తమ అకౌంట్ లో వేయాలని, డబ్బులు పంచాయతీలోకి వెళ్ళిపోవాలి అని ఆయన సూచించారు, మూడురోజులలో అకౌంట్ లోకి డబ్బులు జమకాకపోతే కనుక పన్నెండు శాతం వడ్డీతో ఇవ్వాలని చంద్రబాబు తెలియజేశారు.దానిపైననే ఇప్పుడు గొడవ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తమ అకౌంట్ లోకి డబ్బులు రావాలని , ఇప్పుడు సర్పంచ్లు లేక పోయినాకనీసం పంచాయతీల ఎకౌంట్ కి అయిన రావాలి అని ఆయన వెల్లడించారు. పంచాయతీ అకౌంట్ నుంచి మొదట ఎవరు వచ్చి పనులు చేస్తారో  వాళ్ళకు డబ్బులు ఇచ్చేసేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దొంగ లెక్కలు రాయడంలో ఆరితేరిన జగన్ అడ్డంగా దొరికిపోయాడని అన్నారు చంద్రబాబు. రంగులు ఎక్కడ పడితే అక్కడ వేయడం కాదని వారి ముఖాలకు వేసుకుంటే అరాచకాల చేస్తోంది వారేనని జనం గుర్తుపడతారని కామెంట్ చేశారు. ప్రతి ఒక్క ఊరిలో సిమెంట్ రోడ్లు వేశామని, మురికి కాలువలు కట్టామని,బిల్డింగ్స్ కట్టామని, స్మశానాలు కట్టామని,ఏడు లక్షల పంటకుంటలు తవ్వితే అన్ని పంటకుంటలకు నీళ్లు సంవత్సరానికి పదిసార్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. పదిసార్లు వచ్చాయి కాబట్టి భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని, కరువు తీరిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత వరకు ఒక తట్ట మట్టి వేయలేదు ఇరిగేషన్ లో రంగులు మార్చారు ప్రధాన వాళ్ల ముఖాలకే రంగులేసుకోవటమే సరిపోతుంది. వీళ్ళు దొంగల కింద చలామణి అవుతారు కాబట్టి వాళ్ళు ముఖానికి  వేసుకొని తిరిగితే పబ్లిక్ గుర్తుపడతారు జాగ్రత్తగా ఉండాలని  బాబు భావాన్ని వెల్లడించారు.