4రోజులు... 80గంటలకు పైగా ఆపరేషన్... అయినా సుజీత్ కథ విషాదాంతం
posted on Oct 29, 2019 @ 11:14AM
తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర బోరుబావిలో పడ్డ బాలుడు సుజీత్ కథ విషాదాంతంగా ముగిసింది. బాలుడిని సురక్షితంగా బయటికి తీసేందుకు దాదాపు నాలుగు రోజులుగా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే సమయం మించిపోవడంతో విగత జీవిగా మారాడు. శుక్రవారం సాయంత్రం రెండేళ్ల సుజిత్ విల్సన్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వినియోగంలో లేని బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాలుడు 35 అడుగుల లోతులో ఉన్నట్లు మొదట కెమెరాల ద్వారా గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, బోరు బావికి పక్కన తవ్వకం చేపట్టారు. అయితే, రాయి అడ్డు తగలడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కు అంతరాయం కలిగింది. మరోవైపు అక్కడ భూమి తడిగా ఉండటంతో, 30 అడుగుల నుంచి 70 అడుగులకు, ఆ తర్వాత 90 అడుగుల కిందకి బాలుడు జారిపోయాడు. అదే సమయంలో మట్టి పేరుకుపోవడంతో బాలుడి పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు. మరోవైపు అప్పటివరకు వినిపించిన బాలుడు ఏడుపు కూడా ఆగిపోవడంతో ఏదో కీడు శంకించింది. అయినాసరే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రయత్నాలను ప్రారంభించారు.
సుజీత్ క్షేమంగా రావాలని తమిళనాడు మొత్తం పూజలు, ప్రార్థనలు చేయడంతో ప్రాణాలతో బయటికొస్తాడని అంతా ఆశించారు. ముఖ్యమంత్రి పళిని నుంచి సూపర్ స్టార్ రజనీ వరకు అందరూ సుజీత్... సేఫ్ గా బయటికి రావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ సైతం సుజీత్ క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్లో మోడీ తెలిపారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ను దగ్గరుండి స్వయంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. అయితే, అప్పటికే బాలుడు అపస్మారకస్థితిలో చలనలం లేనట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. చివరికి మంగళవారం తెల్లవారుజామున సుజీత్ మృతదేహానికి బోరు బావి నుంచి బయటికి తీశారు.
బాలుడి మృతదేహం కుళ్లిపోవడంతో పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, 80గంటలకు పైగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి బోరుబావికి సమాంతరంగా 80 అడుగుల గొయ్యి తవ్వినా, బాలుడిని కాపాడలేకపోయామని, రాతి నేల కావడం, మరోవైపు వర్షం అడ్డంకిగా మారాయని అధికారులు తెలిపారు. మొత్తానికి సుజీత్ కథ విషాదాంతం కావడంతో బాలుడి తల్లిదండ్రులతోపాటు తమిళ ప్రజలు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు.