మూడున ముహూర్తం... లేదంటే ఈరోజే... జగన్ గూటిలోకే వల్లభనేని వంశీ.!
posted on Oct 29, 2019 @ 11:19AM
విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా ...లేఖలు, వాట్సప్ చాట్ లతో... మొత్తం కథ నడిపించిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... మొత్తానికి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనకు అవకాశమిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే... నియోజకవర్గంలో తనకు ఎదురవుతోన్న సమస్యలను ఏకరవు పెట్టడం ద్వారా తెలుగుదేశం నుంచి స్మూత్ గా ఎగ్జిట్ కావాలన్నది వంశీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, జగన్ చెంతకు చేరాలనుకున్న వంశీ... ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపైనా... వైసీపీ నేతలపై... ఆరోపణలు చేయడం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. వైసీపీపైనే విమర్శలుచేసి... అదే పార్టీలోకి ఎలా వెళ్తారనే చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు, వంశీ రాకపై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగి... 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాయని గుర్తుచేస్తున్నారు. అయితే, ఎన్నికల సమయంలో... వంశీ నుంచి వ్యక్తిగతంగా అనేకసార్లు బెదిరింపులను ఎదుర్కొన్నానని, అలాంటి వ్యక్తిని ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ... తన అసంతృప్తిని జగన్ కు తెలియజేందుకు ప్రయత్నించారు. అయితే, సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చినా... యార్లగడ్డకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దాంతో నిరాశతోనే యార్లగడ్డ వెనుదిరిగాడు. అంతేకాదు ఒకవేళ ఉపఎన్నిక వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని యార్లగడ్డ భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే, వంశీ... వైసీపీలో చేరితే.... యార్లగడ్డను టీడీపీలోకి రప్పించాలని తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గన్నవరంలో ఉపఎన్నిక వస్తే, టీడీపీ తరపున యార్లగడ్డను బరిలోకి దింపాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.