వల్లభనేని గేమ్ ప్లానా? బాబు నమ్మకమా? రసవత్తరంగా గన్నవరం రాజకీయం
posted on Oct 29, 2019 @ 10:12AM
వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం తెలుగుదేశంలో కలకలం రేపుతోంది. వంశీ లేఖ రాయడం... అంతే స్పీడుగా బాబు రిప్లై ఇవ్వడం... వంశీ థ్యాంక్స్ చెప్పడం... మళ్లీ చంద్రబాబు రియాక్టవడం... ఇలా గన్నవరం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవరాల్ ఎపిసోడ్ ను గమనిస్తే.... విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండానే మొత్తం కథ నడుస్తోంది. అయితే, వంశీ వ్యూహాన్ని పసిగట్టిన కొందరు టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. అయితే, వంశీ వ్యూహం ఎలాగున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం సానుకూల దృక్పథంతోనే స్పందిస్తూ.... వల్లభనేని పార్టీ వీడకుండా నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే, గన్నవరం ఇష్యూపై అత్యవసర సమావేశం నిర్వహించిన చంద్రబాబు... వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రంగంలోకి దింపారు. వంశీతో చర్చలు జరిపిన కేశినేని, కొనకళ్ల... వల్లభనేనిని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు.
అయితే, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ ప్రకటించినప్పటికీ, వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారంటూ ఆరోపించడంతో ఎక్కడో ఒక మూల వల్లభనేనిపై బాబుకి ఇంకా నమ్మకముందంటున్నారు తెలుగుదేశం నేతలు. అందుకే వంశీని బుజ్జగించి, టీడీపీలో కొనసాగేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఇదంతా వంశీ గేమ్ ప్లాన్ అనుకున్నా... జగన్ సిద్ధాంతం ప్రకారం ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుందని, అలా కాకుండా వైసీపీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
ఒకవైపు వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, మరోవైపు వల్లభనేనికి మద్దతుగా గన్నవరం టీడీపీ కేడర్ రాజీనామాలకు సిద్ధమవడం తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంశీకి మద్దతుగా నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలు రాజీనామాకు సిద్ధమయ్యారు. వంశీ నిర్ణయం ఏదైనా ఆయన వెంటే ఉంటామంటూ తేల్చిచెబుతున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ ఎపిసోడ్ అటు టీడీపీలోనూ... ఇటు వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.