సోమశిల జలాశయంలో రికార్డు స్థాయికి చేరిన నీటి మట్టం

  రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలు అన్ని నిండిపొయాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నీరు చేరింది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికి పూర్తిగా నిండి పోవడంతో జలకళ సంతరించుకుంది.దీంతో 9 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగునీటి వరప్రదాయినిగా భావించే సోమశిల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని కండలేరు రిజర్వాయర్ కు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 77.750 టీఎంసీలు ఉండగా ఇన్ ఫ్లో 29.915 క్యూసెక్ లు, ఔట్ ఫ్లో 36.764 క్యూసెక్ ల నీటిని విడుదల చేస్తున్నారు. సోమశిల గేట్లు ఎత్తివేయడంతో కడప జిల్లాలో పెన్న, పేరూరు తప్పిటవారిపల్లె, గంగపేరూరు తదితర గ్రామాలు నీట మునిగాయి. నీరు దిగువకు వదలడంతో ముంపు గ్రామాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.వందల ఎకరాల్లో పంట నీట మునిగినట్టుగా అధికారులు గుర్తించారు. సోమశిల ప్రాజెక్టు నిండి పోవడంతో జిల్లాలో రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రాజెక్టు చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిస్తున్నారు.మొత్తం ఈ డ్యాం కెపాసిటీ 78 టీఎంసీలతో తొలిసారిగా నిండి చరిత్రలో ఇప్పటి వరకు కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయం అంటే మొత్తం 78 కెపాసిటీల నీటి సామర్థ్యం అనేది తొలిసారిగా వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో సోమశిల నుంచి అధికారులు గేట్లన్నీ కూడా ఎత్తి వేశారు.ఇక్కడి నుండి పెన్నా డెల్టాకు కూడా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.  

మాజీ న్యాయమూర్తిపై సెక్షన్ 354 కేసు నమోదు

  సింధూ శర్మ సంబంధించిన కేసులో ఒక కొత్త పరిణామం చోటుచేసుకుంది. మాజీ న్యాయమూర్తి  జస్టిస్ నూతి రామ్మోహన్ రావు తన కోడలిని దారుణంగా హింసించిన సంగతి తెలిసిందే.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా అతనిపై ఐపిసి 354 సెక్షన్ ను జత చేయాలని సీసీఎస్ అధికారులు కోర్టును అభ్యర్దించారు. ఈ క్రమంలో కోర్టు కూడా జత చేయడానికి అనుమతించడం జరిగింది. ఇప్పటికే సింధుశర్మ ఫిర్యాదు మీద  ఐపీసీ సెక్షన్ 493,323 మరియు డౌరీ అండ్ ప్రోహ్బిషన్ యాక్ట్ 406సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మహిళలతో ఆయన ప్రవర్తించిన విధానాన్ని అభ్యంతరకర విధానాల మీద ఈ 354 సెక్షన్ ని తీసుకోవటం జరిగింది. సింధుశర్మ తన అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడూ ఆమెని ఏ విధంగా చిత్రీహింసలకు గురిచేశారు..రాత్రి పూట ఆమెను బయటకు నెట్టివేసిన పరిస్థితి కానీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తన ఒంటి మీద ఉన్న గాయాలను అన్నింటిని సాక్ష్యాధారాల కింద కోర్టుకు అందించారు. అదే విధంగా సీసీఎస్ అధికారులు కూడా సింధుశర్మ ఇచ్చిన తాజా లేఖను కోర్టుకి అందచేయడంతో  మొత్తానికీ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు పై మరో కేసు కూడా నమోదు అయ్యింది.  

విశాఖ భూ ఆక్రమణలపై సిట్ విచారణ...

  విశాఖ భూ ఆక్రమణలపై సిట్ విచారణ జరపనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్ అరీనా వద్ద అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. మాజీ ఐ.ఏ.ఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడు వరకు సిట్ ఫిర్యాదులు స్వీకరించనుంది. ఆన్ లైన్ లోనూ అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ భూ కుంభకోణాలు మీద సిట్ విచారణ ప్రారంభించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణ అనేది కేవలం అధికార పార్టీని రక్షించే విధంగా ఉండటంతోటి ఇక్కడ ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రొఫార్మాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలోని పదమూడు మండలాలలో భారీ ఎత్తున గత కొన్నేళ్లుగా భూ అక్రమాలు, భూ కుంభకోణాలు జరిగాయని ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం సిటీలో దాదాపుగా పదమూడు మండలాలకు సంబంధించిన ఫిర్యాదులను సిట్ స్వీకరించబోతుంది. నలభై మంది రెవిన్యూ అధికారులు ఈ సిట్ అధికారులకు సహాయకంగా పని చేయబోతున్నారు. ఇందులో భాగంగా రెండేసి మండలాలకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ లో మొట్టమొదటగా ఎవరైనా బయటి నుంచి ఫిర్యాదు చేయటానికి వచ్చే వారి కోసం ఎక్కడికి వెళ్లాలి, ఏ మండలానికి ఏ టేబుళ్లను ఏర్పాటు చేయటం జరిగింది అని తెలియ చెప్పటం కోసం ప్రత్యేకంగా ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 7 వ తారీఖు వరకు సిట్ ఫిర్యాదులను స్వీకరించనుంది.  

పేరు గొప్ప, ఊరు దిబ్బ.. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత

  'సర్కార్ దవాఖానాకు రాను బిడ్డో నేను రాను బిడ్డో' అంటూ సినిమా పాట ఇది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొంది. మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. గోలి బిల్ల లేక పేదవాడి గుండె ఆగిపోతుంది. చివరకు అత్యవసర మందులు కూడా లేకపోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.ప్రైవేటు మెడికల్ షాపులో మందులు కొనే స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలువ లేక పేదవాడి జేబుకు చిల్లులు పడుతున్నాయి.  వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పేద వారికి మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తోంది కాని నిర్వహణలో అన్ని లొపాలే.. అధికారులకు శాఖలకు మధ్య సమన్వయ లోపం రోగుల పాలిట శాపంగా మారుతుంది. ఇంత పెద్ద ఆస్పత్రిలో మందులు లేవు. కనీసం ప్రతి రోజూ అత్యవసరంగా ఉపయోగించే మందులు కూడా దొరకడం లేదు.దీంతో ఆస్పత్రికి వస్తున్న రోగుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పాము కాటు, తేలు కాటు ,కుక్కకాటు, పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించే అత్యవసర మందులు కూడా అందుబాటులో లేవంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం రెండు వేల మంది వరకు జ్వరాలతో ఎంజియం ఆసుపత్రికి వస్తుంటారు వారికి ప్యారాసిటమాల్, యాంటీ బయటిక్ ట్యాబ్లెట్స్ కూడా లేవంటే ఎంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.ఇక విధిలేని పరిస్థితుల్లో వందలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు మందుల షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు పేద రోగులు. ఈ దుస్థితి చూసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయలాంటిది.వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు చత్తీస్ ఘడ్ ,మహారాష్ట్ర నుండి కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు ప్రజలు. కానీ ఇక్కడ మందుల కొరత ఉండటంతో పేద రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పేద వాడి ప్రాణాలంటే గాల్లో పెట్టిన దీపంలా మారింది.

ఆర్టీసీని మీరే కాపాడాలి.. గవర్నర్ కు వినతి పత్రం అందించిన అఖిలపక్షం

  ఆర్టీసీ సమ్మె ఎన్ని రోజులైనా ఒక కొలిక్కి రావడం లేదు. ఒక పక్క తమకు ఏది పట్టనట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తొంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని గవర్నర్ ను కోరారు అఖిల పక్ష నేతలు. సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై  ఫిర్యాదు చేసారు. గవర్నర్ జోక్యం చేసుకొని ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అఖిల పక్షం వినతి పై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు నేతలు. కార్మికులు చేస్తున్న సమ్మె ఇరవై ఏడు రోజులు దాటినా సర్కారు పట్టించుకోవడం లేదని సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు సూచనలు, కార్మికుల ఆత్మహత్యలపై గవర్నర్ కు వివరించారు.  ఆర్టీసీలో కేంద్ర భాగస్వామ్యం కూడా ఉందని సమ్మె విషయంలో కేంద్రం కూడా స్పందించాలని కోరారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఆర్టీసీ ఆదాయం రూ.3900 కోట్ల నుంచి రూ.4900 కోట్లకు ఎగబాకిందని తెలియజేశారు. కార్మికులు ఎవ్వరూ కూడా తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీతభత్యాల కోసం సమ్మె చేయడం లేదని.. ఆర్టీసీని కాపాడమనే వారు కొరుతున్నారని తెలిపారు. వెంటనే చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కార్మికుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీలో ఆర్టీసీ విలీనంతో అక్కడి కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారని తెలంగాణలో మాత్రం జీతాలు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు నేతలు. కార్మికులు, ఉద్యోగులు, టీచర్లు అంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. గవర్నర్ పవర్స్ ఉపయోగించి కార్మికులను కాపాడాలని కోరారు. అప్పులున్నాయని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వం చేసిన అప్పులకు ఏం చేయాలని ప్రశ్నించారు టిడిపి నేత రావుల.  ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మ గౌరవంతో ఆర్టీసీ రక్షణ కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు ఓయూ విద్యార్థులు. ఆర్టీసీ అమరులకు నివాళులర్పిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి కొవ్వత్తుల ర్యాలీ చేశారు విద్యార్థులు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం సమస్య లు పరిష్కరిం చే వరకు సమ్మెపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు ఓయూ విద్యార్థి సంఘాలు. అందరూ ఒక్కదాటిపై ఉన్నా కూడా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాడని సామన్య ప్రజలు వాపోతున్నారు.

108, 104 ఉద్యోగులకు సీఎం వై.యస్ జగన్ తీపి కబురు...

  వైద్య ఆరోగ్య రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచిన 108, 104 వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో ఆయా వాహనాల్లో పని చేసే ఉద్యోగులకు వైయస్ జగన్ ప్రభుత్వం వరం అందించనుంది. పాదయాత్రల్లో వారి కష్టాలను తెలుసుకున్న వైయస్ జగన్ వాటిని పూర్తిగా రూపుమాపేందుకు సమాయత్తమవుతున్నారు. అత్యవసర సమయాల్లో అపర సంజీవనిగా నిలిచిన 108 వాహనాల నిర్వహణ ఉద్యోగుల కష్టాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వాటికి ఇంధనం కూడా లేక మూలన పడేస్తున్న సందర్భాలూ అనేకం. మరోవైపు రిపేర్ లు వస్తే ఇక షెడ్డుకే, అవసరానికి తగ్గట్టు వాహనాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. పిలిచిన అరగంటకు కూడా వాహనాలు రాని పరిస్థితి, ఈ దుస్థితిని ఉద్యోగులు పలుమార్లు పాద యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వివరించారు. రాజన్న స్వప్నంగా నిలిచిన ఈ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చర్యలు చేపట్టారు. ఈ వాహనాల్లో పని చేసే టెక్నిషియన్ కు 30,000 జీతాన్ని నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వాహన పైలెట్ కు కూడా 28,000 జీతాన్ని ప్రకటించారు. కావలిసినన్ని వాహనాలతో పాటు వాటి నిర్వహణలో లోటు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు 104 వాహనాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరిన్ని వాహనాలను కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో జీతభత్యాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో పని చేసే ఏ.ఎన్.ఎం, ల్యాబ్ టెక్నీషియన్, పారా మెడికల్ సిబ్బందికి 28,000 జీతాన్ని నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్యుల సర్వీసు రాబోయే వైద్యుల నియామకంలో వెయిటేజ్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినందుకు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సీ.ఎం వై.యస్ జగన్ పూనుకోవడం హర్షణీయమని ఉద్యోగులంటున్నారు. మొత్తం మీద అత్యవసర సేవలకు సంజీవ వనాలనిచ్చిన 108, 104 ఉద్యోగులకు సీఎం వై.యస్ జగన్ తీపి కబురు చెప్పారు.

రైతు భరోసా సొమ్ములు స్వాహా చేసిన వైసీపీ నాయకులు

రైతే రాజు అని మాటలకే సరిపెడుతుంది అధికార పక్షం. అధికారం చేతిలొ ఉందటంతో తాము ఆడిందే ఆట పాడిందే పాట అనే ధోరణి వైసిపి నేతల్లో రోజు రోజుకూ ఎక్కువవుతోంది. కౌలు రైతుల పేరుతో రైతు భరోసా సొమ్మును స్వాహా చేశారు. ఫిర్యాదుపై ఈ  విచారణ జరిపిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు తహసీల్దారు. దీనిపై వైసీపీ స్థానిక నేతలు మండిపడుతున్నారు. కూడేరు మండలంలో భూ యజమానులకు తెలియకుండా కౌలు రైతుల పేరుతో జాబితా తయారు చేసి.. రైతు భరోసా పథకం లబ్ధి పొందారు. కౌలు రైతుల జాబితాలో పేర్లు ఉన్న వారికి పదిహేను వందల రూపాయలు చేతులో పెట్టారు. మిగిలిన పది వేల రూపాయలను మండలానికి చెందిన నలుగురు వైసీపీ నేతలు కాజేశారు. తమ భూముల పేరుతో ఇతరులు కౌలు రైతులుగా రైతు భరోసా లబ్ధి పొందిన విషయం తెలుసుకున్న బాధిత రైతులు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.కౌలు రైతులుగా జాబితాలో ఉన్నవారు కూడా పదిహేను వందలు ఇచ్చి మిగిలిన సొమ్ము గ్రామానికి చెందిన నలుగురు వైసీపీ నేతలు దిగమింగారు అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బాధితులకు హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన అంశాలను సమగ్రంగా విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక పంపుతామని గ్రామస్తులు కౌలు రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత  అధికారులపై చర్యలు తీసుకుంటానని బాధితులకు తెలిపారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పదుల సంఖ్యలో తహసీల్దారు చాంబర్ లోకి వెళ్లి తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేశారు. తమ వారి పేర్లు ఎందుకు బయటకు వెల్లడించారంటూ దురుసుగా ప్రవర్తించారు. ఓ దశలో తహసీల్దారుపై దాడి చేస్తారేమోనన్న అంతా వాతావరణం చాంబర్ లో ఏర్పడింది. దీంతో ఆందోళనకు గురైన తహసీల్దార్ తెల్లకాగితంపై తాను వివరాలు వెల్లడించలేదంటూ రాసిచ్చారు.  

పోలవరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ :- రివర్స్ టెండరింగ్ పై స్టే ఎత్తివేత

  పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో హై కోర్టు స్టే ఎత్తివేసింది. రివర్స్ టెండర్ వేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతిపక్షానికి ఎదురు దెబ్బ తగిలిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పోలవరంలో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్నా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో దిగువ కోర్టు విధించిన స్టేను హై కోర్టు ఇవాళ ఎత్తివేసింది. దీంతో ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తరువాత రిట్ పిటిషన్ కు విలువ ఉండదని అడ్వకేట్ జనరల్ వాదనతో హై కోర్టు ఏకీభవించదని మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. బ్యాంక్ గ్యారెంటీలను ఎన్ క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ను కూడా హై కోర్టు పక్కన పెట్టింది. హై కోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి అనిల్ కుమార్ గోదావరిలో వరద తగ్గు ముఖం పట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నామన్నారు. హై కోర్టు తీర్పు ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ అని ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణం పై విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు గత ఐదు నెలలుగా నిలిచిపోయాయి. వరదల సమయంలో పనులు జరగవని ప్రభుత్వం చెబుతునే ఉంది. ఇప్పుడు కూడా మరో రెండు నెలల పాటు ప్రారంభమయ్యే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. మేఘా సంస్థతో రివర్స్ టెండరింగ్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఇలా చేసుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. గత పీపీఏ సమావేశంలో జరగాల్సిన పనులకు రివర్స్ టెండర్ లలో పిలిచిన పనులకు మధ్య తేడాను గుర్తించారు. ఈ క్రమంలో పీపీఏ వెలిబుచ్చే సందేహాలను క్లియర్ చేసిన తర్వాత ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాతే మేఘా కంపెనీ పనులు ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత భారీ మిషనరీ అవసరం ఉంటుంది.కాబట్టి వాటిని తెప్పించటానికి కొంత సమయం పట్టే అవకాశముంది. అయితే న్యాయపరంగా పోలవరం ప్రాజెక్టులో అడ్డంకులు తొలగినట్టుగా భావించొచ్చు. నవంబర్ లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.  

విజయవాడలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు...

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నేడు అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు ప్రత్యేక నివాళి, మూడు రోజుల పాటు అలరించనున్న కార్యక్రమాలు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు, స్వాతంత్ర సమరయోధుల వారుసులకు సన్మానాలూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. దీంతో పాటు స్వాతంత్య్ర పోరాటాలు, త్యాగాలు చేసిన మహానీయుల కుటుంబ సభ్యులు, బంధువులను ఘనంగా సన్మా నించనున్నారు. రాష్ర్టానికి చెందిన స్వర్గీయ పింగళి వెంకయ్య పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కోటిరెడ్డి, వావిలాల గోపాల కృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు బంధువులను రాష్ట్రావతరణ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళల ప్రదర్శన స్టాల్స్ తో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ఆహారపు అలవాట్లు, ప్రసిద్ధి చెందిన పంటకాలను ప్రజలకందించేందుకు 25 ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్ల ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చీరలు, డ్రస్ మెటీరియల్స్, రుద్రాక్షలు, పూజ సామగ్రితో కూడిన స్టాల్స్ సందర్శకులను కనువిందు చేయనున్నాయి. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలిత కళా ప్రదర్శనలతో మూడు రోజుల పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పుర ప్రముఖులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.  

కరీంనగర్ లో ఉద్రిక్తత, గుండె పోటుతో ఆర్.టి.సి కార్మికుడు మృతి...

  కరీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది, గుండె పోటుతో మృతి చెందిన ఆర్.టి.సి కార్మికుడు నంగునూరి బాబు మృతదేహంతో అరబపల్లిలో కార్మికులు చేపట్టిన సమ్మెతో ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తేనే డ్రైవరు బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామని లేకుంటే ఇక్కడ నుంచి శవాన్ని కదిలించేది లేదని ఆర్టీసీ కార్మికులు భీష్మించారు. సమ్మెకు పరిష్కారం డ్రైవరు బాబుదే చివరి మరణం కావాలంటూ అంత్యక్రియలు చేపట్టకుండా నిలిపేశారు. ఈ ఆందోళనలో పలు రాజకీయ పార్టీలతో పాటుగా ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్నారు. ఈ ఘటనకు నిరసనగా కరీంనగర్ టౌన్ బందుకు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ఆర్టీసి కార్మికులంతా కరీంనగర్ చేరుకోవాలంటూ జెఎసి నేత అశ్వత్థామరెడ్డి పిలిపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుడు గుండెపొటు మరణం తరువాత కరీంనగర్ లో ఉద్రిక్తత నెలకొంది, దీనికి తోడుగా ఆర్టీసీ కార్మికులు రాజకీయ నేతల చలో కరీంనగర్ పిలుపు టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తుంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని అదే విధంగా చనిపోయిన ఆర్టీసీ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలి అని, వాళ్ల కుటుంబాలకు యాభై లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వాళ్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు . డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇరవై ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇది ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మెగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిరసన తెలిపారు అయితే  తాజా సమ్మె దాన్ని అధిగమించింది. మరోవైపు కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతుంది. ప్రభుత్వం మొండిపట్టు వీడి తమ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.  

చర్చల దిశగా గన్నవరం రాజకీయం :- వల్లభనేని వంశీ అలక వీడేనా ?

  గన్నవరం రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశల మేరకు కేశినేని నాని మరియు బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు..వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు. బుధవారం రాత్రి ఎంపీ కేశినేని నాని ఇంటికి వల్లభనేని వంశీ వెళ్లగా.. అక్కడికి కొనకళ్ల నారాయణ కూడా వచ్చారు. దదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. వంశీ తన అభిప్రాయాలను వివరించినప్పటికీ.. మరొసారి ఆలొచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేశినేని నాని కొరారు. వంశీ సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ లోనే కొనసాగాలని కొరుతున్నప్పటికి.. ప్రస్తుత ప్రభుత్వం అనేక మంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని అందువల్ల వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెర్కొన్నారు. తనను ఆర్ధికంగా.. రాజకీయంగా.. దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు పూర్తిగా రంగం సిద్ధమైనట్లుగా గన్నవరంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నవంబర్ మూడు లేదా నాలుగో తేదీల్లో ఆయన వైసీపీ లో చేరే అవకాశముందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇంకా వంశీ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు.. రాజీనామా చేయకుండా వైసిపి లో చేరితే అది పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుంది కనుక వైసిపి అధిష్టానం ఆదేశాల మేరకు వంశీ నడుచుకునే అవకాశముందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ లోని కొంత మంది నేతలు తన పట్ల వ్యవహరించిన తీరుపై కూడా వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీని బుజ్జగించేందుకు నాని , కొనకళ్ల నారాయణ ప్రయత్నించారు. చిన్న చిన్న కేసులకు భయపడి పార్టీ ని వీడటం మంచిది కాదని రాజకీయంగానే సమస్యను ఎదుర్కోవాలని అందుకు చంద్రబాబు కూడా నీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వంశీకి చెప్పాల్సిందంతా చెప్పామని బంతి ఇప్పుడు వంశీ కోర్టు లోనే ఉందని కేశినేని నాని చెబుతున్నారు.వంశీ పై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కు సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరకకపొవటంతో తాను జగన్ ని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని వెంకట్రావు ఇప్పటికే ప్రకటించారు.

జగన్ కి సీబీఐ కోర్టు షాక్.. సీఎం అయినా వారం వారం రావాల్సిందే!!

  అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ని సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీఎంగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ తన పిటిషన్‌లో కోరారు. సీఎం హోదాలో ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వస్తే  సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ తదితర వాటికి ఒక్కరోజుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని.. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని, దీనివల్ల మరింత భారమని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.  అయితే జగన్‌ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారనే అరెస్టు చేశామని, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే హాజరు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ స్పెషల్‌ పీపీ వాదనలు వినిపించారు. అదీగాక.. హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ గతంలో దాఖలు చేసుకున్న పిటిషన్లను రెండు పర్యాయాలు సీబీఐ కోర్టు కొట్టివేసిందని, దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. సీబీఐ కోర్టు తీర్పును సమర్థిస్తూ జగన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. హోదాను కారణంగా చూపించి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరరాదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నవంబరు 1న తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు రెండు వారాల క్రితం ప్రకటించింది. దీంతో ఈరోజు తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే కోర్టు.. సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ.. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటీషన్ ని కొట్టివేసింది.

శివసేనకు కాంగ్రెస్-ఎన్సీపీ ఓపెన్ ఆఫర్... శరద్ పవార్ తో సంజయ్ రౌత్ మంతనాలు

  మహారాష్ట్ర రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి పదవి చెరిసగమంటోన్న శివసేన తన పట్టువీడకపోవడంతో... ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. అయితే, శివసేన శాసనసభాపక్ష సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో టచ్ ‌లో ఉన్నామన్న ఉద్ధవ్.... శివ సైనికుడే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రకటించారు. 50-50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోతే అసలు చర్చలకే వెళ్లబోమని ఉద్ధవ్ ఠాక్రే తేల్చిచెప్పారు. ఇక, బీజేపీ, శివసేన మధ్య జరుగుతోన్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తోన్న కాంగ్రెస్‌-ఎన్సీపీ... ఓపెన్ ఆఫర్ ప్రకటించాయి. శివసేనకు అన్ని దారులూ తెరిచే ఉంచామని, ప్రతిపాదనలతో వస్తే మద్దతిచ్చేందుకు సిద్ధమని చెబుతున్నాయి. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105.... శివసేనకు 56... కాంగ్రెస్‌కు 44... ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 ఏ పార్టీకి రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై పీఠముడి కొనసాగుతోంది. కానీ ఎన్నికలకు ముందే కూటమిగా పోటీచేసిన శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా.... ముఖ్యమంత్రి పదవి చెరిసగమంటూ ఉద్ధవ్ మెలిక పెట్టడంతో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. ఇక, శివసేన తరపున వాయిస్ వినిపించే ఎంపీ సంజయ్ రౌత్... ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమవడంతో... మరాఠా రాజకీయం కొత్త మలుపు తిరగొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

వీరోచితంగా పోరాడి...వెన్నుచూపుతావా? అలాగైతే జీవితాంతం పారిపోవాల్సిందే...

తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేయడంతో గన్నవరం నియోజకవర్గంలో చెలరేగిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటు టీడీపీలోనూ, అటు వైసీపీలోనూ వంశీ మంటలు ఇంకా చల్లారలేదు. అసలేం జరుగుతుందో క్లారిటీ లేక రెండు పార్టీల్లో లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేని టీడీపీ... వల్లభనేని వంశీని కాపాడుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వల్లభనేనిని ఏదోవిధంగా పార్టీలోనే కొనసాగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇక, చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.... వల్లభనేని వంశీతో మూడు గంటలపాటు చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా చంద్రబాబుతోపాటు తెలుగుదేశం కుటుంబం మొత్తం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కుటుంబంలో, వ్యాపారాల్లో ఉన్నట్లే... రాజకీయాల్లోనూ సమస్యలు ఉంటాయని, అయితే రాజకీయంగా రాటుదేలాలంటే కొన్ని ఒత్తిళ్తు భరించక తప్పదని కేశినేని అన్నారు. అయినా వీరోచితంగా పోరాడి గెలిచిన వంశీ.... ఇప్పుడు వెన్నుచూపడం మంచిది కాదని హితవు పలికారు. పారిపోవడం మొదలుపెడితే... జీవితాంతం పారిపోవాల్సి వస్తుందన్నారు. అయితే, వంశీకి చెప్పాల్సినదంతా చెప్పామన్న కేశినేని నాని, బంతి ఇప్పుడు వల్లభనేని కోర్టులో ఉందన్నారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో.... పార్టీకి వల్లభనేని కూడా అంతే అవసరమన్నారు. అయితే, వంశీ ఎటూతేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు స్వయంగా కేశినేనే వ్యాఖ్యానించడంతో... వల్లభనేని... టీడీపీ చేయి దాటినట్లే కనిపిస్తున్నారు.

కంటే కూతుర్నే కనాలి... కానీ కీర్తిలాంటి కూతురు వద్దే వద్దు...

కంటే కూతురినే కనాలంటారు... ఎందుకంటే వృద్ధాప్యంలో కొడుకు కంటే కూతురే ఆదరిస్తుందని, బాగా చూసుకుంటుందని... అమ్మలాగా మారి ఒక ముద్ద అన్నం పెడుతుందని, లాలిస్తుందని, తోడూనీడగా ఉంటుందని, భూదేవంతా ఓపికతో కష్టాన్ని భరిస్తుందని, కంటికి రెప్పలా చూసుకుంటుందని ఆ మాటన్నారు. అయితే ఇది నిజమే. ఊరికే ఆ మాట అనలేదు. తల్లిదండ్రులపట్ల కూతురు చూపించే ప్రేమ అప్యాయతలకు హద్దులే ఉండవు. అందుకే కంటే కూతురినే కనాలన్నారు. కానీ కీర్తి లాంటి కూతురు మాత్రం ఏ తల్లిదండ్రులకూ ఉండకూడదంటున్నారు పోలీసులు. ఎందుకంటే కూతురనే మాటకే ఈ కీర్తి... అపకీర్తి తెచ్చిందని, తన కామవాంఛలు తీర్చుకోవడానికి కన్నతల్లినే కడతేర్చిన కిరాతకురాలంటూ మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హయత్ నగర్ రజిత మర్డర్ కేసులో కూతురు కీర్తిరెడ్డితోపాటు ఆమె ప్రియుడు శశికుమార్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పక్కా ప్లాన్‌ తోనే కీర్తి, శశి కలిసి... రజితను గొంతునులిమి చంపేశారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గతంలోనూ ఒకసారి నిద్రమాత్రలిచ్చి తల్లి రజితను చంపేందుకు కీర్తి ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మైనర్ గా ఉన్నప్పుడే బాయ్ ఫ్రెండ్ బాల్ రెడ్డి అత్యాచారం చేయడం... కీర్తి గర్భం దాల్చిందని, అయితే అబార్షన్ చేయించుకోవడానికి సాయంచేసిన శశి... ఆ తర్వాత కీర్తిని లొంగదీసుకున్నాడని సీసీ వివరించారు. కీర్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకున్న శశి.. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడని, దాంతో శశి చెప్పినట్లు కీర్తి నడుచుకునేదని, అలా శశికి భయపడే తల్లి రజితను హత్య చేసిందన్నారు మహేశ్ భగవత్. దృశ్యం సినిమాను తలపించేలా రజిత మర్డర్ జరిగిందన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ఇద్దరూ కలిసి రజితను చంపేసి... మృతదేహాన్ని రామన్నపేట దగ్గర రైల్వేట్రాక్‌పై పడేశారని కేసు డిటైల్స్ వెల్లడించారు. కీర్తి ఆస్తిపై కన్నేసిన శశినే ఈ మర్డర్ కథ నడిపించాడని తెలిపారు. అయితే, రజిత హత్య తర్వాత తప్పించుకునేందుకు కీర్తిరెడ్డి ప్రయత్నించిందని సీపీ వెల్లడించారు. తన తల్లిలాగా గొంతు మార్చి.. బాల్‌రెడ్డికి ఫోన్ చేసిన కీర్తిరెడ్డి... తాను వైజాగ్‌ వెళ్తున్నట్లు నమ్మించిందని తెలిపారు. ఇక, ఇలాంటి ఘటనే గుంటూరులో జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చింది కూతురు. భర్త, భాయ్ ఫ్రెండ్ తో కలిసి... కన్నతల్లినే చంపేసింది. దాంతో, నిందితురాలు భార్గవితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు.

విశాఖలో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

  ప్రశాంతమైన విశాఖ నగరంలో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా గ్యాంగ్ రేప్ వ్యవహారం ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అఘాయిత్యానికి ఒడిగట్టారు దుర్మార్గులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు మైనర్లున్నారు.  కాలేజ్ కు వెళుతున్నామని ఇంటి నుండి బయలుదేరిన ఆ యువతిని ఒక పరిచయస్తుడు మాయ మాటలు చెప్పి పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపైకి తీసుకెళ్లాడు. కైలాసగిరికి తీసుకువెళ్లి అక్కడ కూల్ డ్రింక్ లో ఆ యువతికి తెలియకుండా మద్యాన్ని కలిపాడు. మాటల్లో పెట్టి ఆమెకు ఆ డ్రింక్ మొత్తం  తాగించాడు. మత్తులోకి జారుకున్న తరువాత  ఆ యువతిపై నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో బీట్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి పరిశీలిస్తే అక్కడ ఘోరాన్ని చూసి షాక్ కు గురయ్యారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని బాధితురాలిని చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు.  కేజీహెచ్ లో వైద్య సేవలు పొందుతున్న బాధితురాలుని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కూడా సూచించారు. ఈ ఘటన పై మహిళా సంఘాలు స్పందిస్తూ  అమ్మాయి ట్యూషన్ అని ఇంట్లో చెప్పి వెళ్ళిందని, వాళ్లు చాలా పేద కుటుంబం అని ఒక్కత్తే కూతురు అని వెల్లడించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అమ్మాయి నర్సింగ్ కోసం కోచింగ్ వెళుతుంది. తను కోచింగ్ కి వెళ్లిందనే ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు అని వెల్లడించారు. పేరెంట్స్, స్కూల్సు, పౌర సమాజం, పోలీసులు నలుగురు కలిసి ఏకతాటిగా వచ్చి వీటి పై అవగాహన కల్పించి పిల్లల్ని కంట్రోల్లో పెట్టినప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు తగ్గు ముఖం పట్టే అవకాశముందని మహిళా సంఘాలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

అందంతో బడాబాబులను ట్రాప్ చేస్తున్న హనీ దంపతులు...

  అందాన్ని పెట్టుబడిగా పేడుతూ మన చుట్టూ రోజు ఎన్నొ మోసాలు జరుగుతుంటాయి. అలాంటి ఒక మోసమే ఈ మధ్య తెగ హల్ చల్ చేస్తోంది. కరిష్కా అనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేసే అమ్మాయి అందాన్ని పెట్టుబడిగా పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కన్నది. అందుకు భర్త విజయ్ కుమార్ కూడా సై అన్నాడు. ఇంకేముంది అసలే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం, ఇక బడాబాబులకు గాలం వేసే పనిలో పడింది. అయితే ఆమె వలలో నగరానికి చెందిన ఒక వ్యాపార వేత్త పడ్డాడు.హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రిసార్టులు, హోటళ్లు, పబ్బులు ఇద్దరూ తెగ ఎంజాయ్ చేశారు. దాదాపు మూడు నెలల పాటు ఇద్దరూ సరదాగా గడిపారు.  కనిష్క వ్యాపారవేత్తతో చనువుగా ఉన్న సమయంలో ఆమె భర్త విజయ్ కుమార్ ఫొటోలు తీయటం, వీడియోలు రికార్డు చేయటం వంటివి చేశాడు. ఓ రోజు ఇద్దరు శంషాబాద్ సమీపంలోని ఒక రిసార్టుకు వెళ్లారు. అయితే తనను ట్రాప్ చేసిన సంగతి తెలీని సదరు వ్యాపారికి ఆమె మత్తుమందు ఇచ్చింది. ఇక సీన్ లోకి ఎంటరైన భర్త విజయ్ కుమార్ అక్కడ సినిమా సన్నివేశాన్ని క్రియేట్ చేశాడు. ఫర్నిచర్ ధ్వంసం చేశాడు కరిష్కను రక్తం వచ్చేలా కొట్టి స్వల్పంగా గాయపరిచాడు. స్ప్రుహలోకొచ్చిన వ్యాపారితో విజయ్ కుమార్ గొడవపడ్డాడు. తన భార్యతో గడిపి సరసం ఆడతావా అంటూ బెదిరించాడు. ఓ దశలో పిస్టల్ తో కూడా బెదిరించాడు.దీంతో భయపడిపోయిన సదరు వ్యాపారి స్పాట్ కు ఇరవై లక్షలు తెప్పించి వారికి ఇచ్చాడు. దాంతో పాటు మరో కోటి రూపాయలకు బాండ్ పేపర్ కూడా రాయించుకోవటంతో తనకేమీ కాదని సైలెంట్ అయ్యాడు.  అయితే విజయకుమార్ నుండి మరిన్ని డబ్బులు కావాలంటూ బెదిరింపులు రావడంతో బాధితుడు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హనీ దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ కిలాడీ లేడీ బారిన పడి ఒక ఎన్నారై కూడా బాధపడినట్టుగా తెలుస్తోంది. మరికొందరు వ్యాపారవేత్తలూ బలైనట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితులు ఇక పై ఇలాంటి పరిస్థితులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వాపోయారు.

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... సీడ్ క్యాపిటల్ నిర్మాణ ఒప్పందం రద్దు

  ఏపీ రాజధాని అమరావతిలో అంతులేని అవినీతి దాగి ఉందని చెబుతూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఒప్పందాన్ని రద్దు చేసింది. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను సింగపూర్ సంస్థలకు గత ప్రభుత్వం అప్పగించింది .ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఖర్చు కానుండగా సింగపూర్ సంస్థ భారీగా లాభపడుతుందని కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ చెప్తోంది.  సింగపూర్ కంపెనీల కన్సార్టియంతో చర్చలు జరిపిన ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్ట్ గా ఎంతో ప్రచారం పొందిన సీడ్ క్యాపిటల్ ఒప్పందంపై రాష్ట్ర మంత్రులు ,అధికారులు సింగపూర్ కన్సార్టియంతో ఈ నెల ఇరవై ఒకటిన చర్చలు జరిపారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పరస్పర అంగీకారంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి సింగపూర్ కంపెనీ అంగీకరించింది. దీని పై మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధానిలో స్టార్టప్ ఏరియా ను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం భావించింది ఇందుకోసం 2017 మే 15న సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ఒప్పందం చేసుకుంది  1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలన్నది ప్లాన్. వీటిలో నూట డెబ్బై ఎకరాలు నదీ తీరంలో ఉన్నాయి. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత సీఆర్డీఏది. అందుకోసం సిఆర్డిఏ రెండు వేల నూట పధ్ధెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్ ,సెంబ్ కార్ప్ సంస్థలతో కన్సార్టియం ఏర్పడింది. సింగపూర్ సంస్థలే కన్సార్టియం అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేసింది గత ప్రభుత్వం అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్ ఏడీపీ పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది.ఎస్పివిలో కన్సార్టియమ్ కి యాభై ఎనిమిది శాతం వాటా ఉంటుంది. దీని కింద మూడు వందల ఆరు కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఎస్పివిలో ఏడీసీకి నలభై రెండు శాతం వాటా ఉండగా దాని కింద రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ కన్సార్టియం డెబ్బై ఎనిమిది కోట్లు ఏడీసీ యాభై రెండు కోట్లు పెట్టుబడిని జమ చేశాయి. మరోవైపు నదీ తీరంలో అభివృద్ధి పనులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబందనలు ఇబ్బందిగా మారడంతో పనులు మొదలు కాలేదు.

విశాఖలో ఫోర్జరీ స్కాం తో రెచ్చిపోతున్న కేటుగాళ్లు...

  స్మార్ట్ సిటీగా విశాఖ పరుగులు తీస్తోంది. అభివృద్ధి అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు క్రైమ్ రేటు కూడా పరుగులు తీస్తోంది అందుకు నిదర్శనమే గుర్రాల కోటేశ్వరావు అండ్ గ్యాంగ్ ఖతర్నాక్ దందా.దొంగలు ఇళ్లను దోచుకుంటారు, కానీ ఆ గ్యాంగ్ మాత్రం దొంగలనే టార్గెట్ చేశారు. అలాగని అది బెదిరింపుల వ్యవహారం కాదు ఫోర్జరీ మంత్రం బెయిల్ కుతంత్రంగా ఉంది. బస్తా నిండా స్టాంపులు, డాక్యుమెంట్లు, వాటిపై పచ్చ సంతకాలు అలాగని ఈ గెజిటెడ్ కాగితాలన్నీ ఏ సర్కారు కార్యాలయంలో కాదు అధీకృత స్టాంప్ వెండర్ డాక్యుమెంట్ రైటర్ తాలూకువో కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే వీటి వెనక పెద్ద చరిత్రే ఉంది.  సాగర తీరం స్మార్ట్ సిటీ విశాఖలో నయా దందా నడుస్తోంది. విశాఖ పోలీసులు స్మార్ట్ గా ఈ ఎవ్వారాన్ని బ్రేక్ చేశారు. న్యాయస్థానాలనే తప్పుదోవ పట్టించిన బెయిల్ గేమ్ గుట్టును రట్టు చేశారు. జైలుకెళ్లిన వాళ్ళే టార్గెట్ గా బెయిల్ బిజినెస్ ను దౌడు తీయించిన కోటన్ అండ్ గ్యాంగుకు చెక్ పెట్టారు విశాఖ పోలీసులు. అసలు ఈ గ్యాంగ్ ఎవరు వీళ్ళు ఆపరేట్ చేస్తున్న సింగిల్ విండో స్కామ్ ఏంటి అనేది చర్చనీయంగా మారింది.  రోడ్డు ప్రమాదాలు, గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నిందితులకు కోటన్ అండ్ గ్యాంగ్ కొండంత అండ. వాళ్ళు ఇలాగ డబ్బులివ్వగానే వీళ్ళు అలా బెయిల్ సంపాదించిపెడతారు. బెయిల్ తెచ్చేలా వచ్చేలా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించడం నకిలీ ష్యూరిటీలతో మస్కా కొట్టించడం అవసరమైతే సరసమైన ధరల్లోనే డమ్మీ వ్యక్తులను ఏర్పాటు చేయడం ఈ ముఠా స్పెషాలిటీ. యాక్సిడెంట్, చోరీ గట్రా కేసులకు సింగిల్ రేటు, గంజాయి కేసు కాస్త ఘాటు ఎక్కువ కాబట్టి డబుల్ రేటు ఫిక్స్ చేస్తారు. క్యాష్ కొడితే చాలు నకిలీ ఆధార్ కార్డులు, ఫోర్జరీ సంతకాలతో ష్యూరిటీ బాండ్ లు రెడీ మేడ్ గా సిద్ధం ఐపోతాయి. ఇలా ఎన్నో కేసుల్లో ఎందరో నిందితులకు బెయిల్ ఇప్పించారు ఈ గ్యాంగ్. సింగిల్ విండో ఫోర్జరీ స్కాంతో కేటుగాళ్లు ఇద్దరు బెయిల్ బాటలో బయటకు వచ్చి మళ్లీ నేరాలతో చెలరేగారు. ఖాకీలకు మస్కా కొట్టడమే కాదు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి కోర్టుల్లో సైతం తప్పుదోవ పట్టించిన కోటన్ అండ్ గ్యాంగ్ కు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. తీగ లాగితే డొంకంతా బయటపడింది. అసలు ఈ కోటన్ అండ్ గ్యాంగ్ ఫోర్జరీ స్కాం ఎన్ని రోజులుగా సాగుతోంది, వీళ్ల వెనుక అదృశ్య వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అనేది పోలీసులు దర్యప్తులో తేలాల్సిన అంశాలు.