ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సిఎం జగన్...
posted on Oct 28, 2019 @ 3:04PM
మరో నాలుగు రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కావలసి ఉంటుంది. రివర్స్ టెండరింగ్ కారణంగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి అదే సమయంలో భారీ వర్షాలు వరదల వల్ల కూడా పనులు జరిగే అవకాశం కనిపించలేదు. ఈ కాలంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టుకు టెండర్ లను ఖరారు చేసింది. నవంబరు ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని కూడా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలుమార్లు ప్రకటించారు.
ఈ పూర్వ రంగంలో ముఖ్యమంత్రి జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు ఇతర ప్రాజెక్టులపై సమీక్షలో చర్చ జరిగింది. పోలవరం డిపిఆర్-2 ఆమోదం కేంద్రం నుంచి రావలసిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలపై కూడా జగన్ చర్చించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, గోదావరి నదులను అనుసంధానం చేయడం, గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రణాళికల పైన చర్చ జరిగింది. అయితే జూన్ నెల 22 న గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనులపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సారి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి సాగు నీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆ కమిటీలో ఆదేశించారు. జలవనరులతో పాటు రహదారులు, భవనాల శాఖ, మున్సిపల్ సీఆర్డీయే శాఖలోనే కాంట్రాక్టు పైనా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని నిపుణుల కమిటీకి అప్పుడు జగన్ స్పష్టం చేశారు.