టీఆర్ఎస్ నేతల్లో రాజ్యసభ రెండో స్థానం పై పెరిగిన ఉత్కంఠత...
posted on Jan 3, 2020 @ 1:20PM
మాజీ ఎంపీ కవిత రాజ్య సభకు వెళ్లడం దాదాపు ఖాయమైందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలో ఖాళీ కానున్న రెండు స్థానాల్లో ఒకటి ఆమెకు కేటాయిస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. రెండవ సీటు ఎవరికి దక్కుతుందనే విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 7, ఆంధ్ర ప్రదేశ్ కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించగా ప్రస్తుతం తెలంగాణ నుంచి 5 రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ కు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, కెప్టెన్ వి లక్ష్మికాంతరావు, డి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తూన్నారు.వాటిలో మరో రెండు స్థానాలకు బిజెపికి చెందిన గరికపాటి మోహన్ రావు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోటాలోకి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఏడాదిలో ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో 2 తెలంగాణకు, 4 ఏపీకి చెందినట్లు సమాచారం. తెలంగాణ నుంచి గరికిపాటి, కేవీపీ పదవీ విరమణ చేస్తారు. ఏపీ కోటాలో ఉన్న కేకే కూడా అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ కు చెందిన వారు కాదు. అయితే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల బలం దృష్ట్యా ఆ రెండు స్థానాలు టిఆర్ఎస్ కి ఏకగ్రీవంగా దక్కుతాయి.
వాస్తవానికి ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ 9 న ఖాళీ కానున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి, మార్చిలోనే ఎన్నికల ప్రక్రియను ముగించనుంది. గడువు సమీపిస్తుండటంతో అధికార టీఆర్ఎస్ లో రెండు రాజ్యసభ అభ్యర్ధులు ఎవరివనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ కోటాలో ఉన్న కేకేకు మళ్లీ సభ్యత్వం దక్కడం అనుమానమేనన్న చర్చ కూడా టీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది. వయసు రీత్యా ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపక పోవచ్చునంటూ కొన్న ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి . కేకే అనుభవానికి తగినట్లుగా ఏదో ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒక స్థానం సీఎం కేసీఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు ఖాయమంటున్నారు కొందరు నేతలు. ఢిల్లీ స్థాయిలో పార్టీ పరమైన వ్యవహారాలను గతంలో వినోద్ కుమార్ చూసుకునేవారు. ప్రస్తుతం ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికి పరిమితమయ్యారు. దీంతో కేసీఆర్ కు నమ్మకంగా ఢిల్లీ స్థాయిలో పార్టీ ప్రభుత్వ పనులను చక్కబెట్టే వారు లేకుండా పోయారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్ సభ సభ్యురాలిగా పనిచేసి ఉండటం ఢిల్లీలో ఉన్న పరిచయాలు తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ భాషలపై పట్టు, చొరవ రాజ్యసభ అభ్యర్ధిగా కవిత ఎంపికకు మార్గం సుగమం చేస్తాయని పార్టీలో చర్చ జరుగుతోంది. 2 వ సీటుకోసం పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, నాయిని నరసింహరెడ్డి, సిరికొండ మధుసూధనాచారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పొంగులేటికి 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రాజ్యసభ సీటు పై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి ఎమ్మెల్సీగా వెళ్లటానికి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి రెన్యువల్ కాకపోవడంతో నాయిని కొంత అసంతృప్తిగా ఉన్నారు.మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాతే రాజ్యసభ బెర్తుల పై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.రాజ్యసభ రెండో స్థానం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.