బోస్టన్ నివేదికలోనూ జగన్ మాటే... ఇక అధ్యయనాలు ఎందుకు?
posted on Jan 4, 2020 9:16AM
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక సమర్పించింది. అయితే, అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌కే బోస్టన్ సంస్థ కూడా జైకొట్టింది. అమరావతిని పక్కన పెట్టేసిన బోస్టన్ గ్రూప్... రాజధాని నిర్మాణం కోసం రెండు ఆప్షన్లను సూచించింది. ఆప్షన్-1 ప్రకారం... విశాఖలో సచివాలయం, ప్రభుత్వ శాఖలు... అత్యవసర అసెంబ్లీ సమావేశాలు, కౌన్సిల్, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, 15 శాఖల ఏర్పాటు... కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక, రెండో ఆప్షన్ ప్రకారం.... అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, విశాఖలో సెక్రటేరియట్, సీఎం, గవర్నర్ కార్యాలయాలు, కర్నూలులో హైకోర్టు నిర్మాణం చేపట్టాలని సూచించింది. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్ కనెక్టివిటీ ఉందని... అలాగే, విశాఖలో మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసులు ఉన్నాయంటూ వైజాగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
మరోవైపు అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టకూడదో కూడా బోస్టన్ గ్రూప్ వివరించింది. 2009లో వచ్చిన వరదల్లో ప్రస్తుత అమరావతి ప్రాంతం మునిగిపోయిందని... అందుకే ఆ ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని నివేదికలో తెలిపింది. అమరావతి మట్టిలో నాణ్యత లేదని... బహుళ నిర్మాణాలు అసాధ్యమని బోస్టన్ గ్రూప్ వివరించింది. 13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించి... అధ్యయనం చేసిన బోస్టన్ సంస్థ... 7 జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయని... అలాగే 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉందని తెలిపింది. ఇక, ఏపీకి ప్రస్తుతం 2.25 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయని... దక్షిణాదిలోనే ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉందని వివరించింది. అదే సమయంలో, ఏపీ అభివృద్ధికి ఏ విధానాలు చేపట్టాలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సూచించింది.
ఇక, ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్ ఇవ్వడం... ఇఫ్పుడు బోస్టన్ సంస్థ కూడా నివేదిక ఇవ్వడంతో... ఈ రెండు నివేదికపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. జనవరి ఆరున తొలిసారి సమావేశంకానున్న హైపవర్ కమిటీ.... జీఎన్‌రావు అండ్ బోస్టన్ నివేదికలపై చర్చించనుంది. అలాగే, జనవరి 8న సమావేశంకానున్న ఏపీ మంత్రివర్గం కూడా జీఎన్‌రావు అండ్ బోస్టన్ నివేదికలపై చర్చించనుంది.