నరేశ్ వచ్చాకే ఎందుకిలా? రాజశేఖర్ కోపానికి కారణమేంటి?
posted on Jan 3, 2020 @ 10:34AM
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు కొత్త కాదు... నరేష్ అధ్యక్షుడు కాకముందు కూడా జరిగాయి. అయితే, 2019 సెప్టెంబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నరేశ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ప్రమాణ స్వీకారం రోజున నరేశ్ మాట్లాడిన తీరుపై 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నరేశ్... నేను, నేను అని కాకుండా... మేమంతా అని ప్రస్తావిస్తే బాగుండేదని చురకలు అంటించారు. అప్పటి నుంచి నరేశ్‌కు, రాజశేఖర్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.
2019 అక్టోబర్‌లో కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో వివాదం చోటు చేసుకుంది. మా అధ్యక్షుడు నరేష్‌కు, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ ఉందని జీవితా, రాజశేఖర్‌లు మా సభ్యులకు మెసేజ్‌లు పంపారు. నరేష్ మినహా మిగిలినవారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ నరేష్ తరపు న్యాయవాది జీవితా రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని... కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదన్నారు.
మా సభ్యులకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉండటం వల్లే... ఈ మీటింగ్ పెట్టుకున్నామని జీవితా రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఇది ఒక నార్మల్ మీటింగ్ మాత్రమేనని... దీనికి కోర్టు పర్మిషన్లు ఏం అవసరం లేదని చెప్పుకొచ్చారు. మాలో 1000 మంది సభ్యులు ఉన్నారని... అందులో 20 శాతం సభ్యుల ఆమోదం ఉంటే... మీటింగ్ పెట్టుకోవచ్చని... దీనికి కోర్టు పర్మిషన్ అవసరం లేదని జీవిత వివరణ ఇచ్చారు. అలాగే... మీటింగ్‌కు అటెండ్ కాని సభ్యులు కూడా... తమతో ఫోన్‌లో టచ్ ఉన్నట్లు జీవిత వెల్లడించారు. తమకు.... మా అధ్యక్షుడు నరేష్‌కి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని జీవిత తెలిపారు.
అయితే, నరేశ్, జీవిత, రాజశేఖర్... మా ఎన్నికల్లో గెలవడానికి మెగా మద్దతే కారణమంటున్నారు. అందుకే, ఎన్నికల సమయంలో జీవితా రాజశేఖర్ లు... చిరంజీవి ఇంటికెళ్లి మద్దతు కోరారు. అభిప్రాయభేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, చిరంజీవి వారిస్తున్నా రాజశేఖర్.... మాలో గొడవలను బయటపెట్టడంతో... కథ అడ్డం తిరిగింది. రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు. రాజశేఖర్ ది చిన్న పిల్లాడి మనస్తత్వమంటూ జీవిత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా... వేదికపై వేడి సెగలు కొనసాగాయి. అయితే, రాజశేఖర్ వాదనలోనూ నిజం ఉందంటున్నారు కొందరు. ఏదేమైనా మెగాస్టార్ మాటకు విలువ లేకుండా చేసి రాజశేఖర్ అనవసరంగా కొత్త తలనొప్పులు తెచ్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.