అమరావతిలో సకల జనుల సమ్మె... భువనేశ్వరిపై అంబటి సెటైర్లు...
posted on Jan 3, 2020 @ 9:59AM
అమరావతి రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఇక, రాజధాని గ్రామాల్లో సకల జనుల సమ్మెకు రైతులు పిలుపునిచ్చారు. సమ్మె నుంచి హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, పాల కేంద్రాలను మినహాయింపు ఇచ్చారు. ఇక, రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ధర్నాలు, వంటావార్పులతో నిరసనలను హోరెత్తిస్తున్నారు. అలాగే, తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే నిరాహర దీక్ష 17వ రోజుకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు, రైతు కూలీలు దీక్షలో పాల్గొంటున్నారు. రాజధాని పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం తాము భూములు ఇచ్చామని...చంద్రబాబుకు ఇవ్వలేదని చెబుతున్నారు.
ఇదిలాఉంటే, రాజధాని రైతుల ఉద్యమం కోసం చంద్రబాబు సతీమణి గాజులివ్వడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు... గోదావరి పుష్కరాల్లో 30 మంది మరణించినప్పుడు... సమైక్యాంధ్ర ఉద్యమం నడిచినప్పుడు... ఈ భువనేశ్వరి గారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అసలు భువనేశ్వరి ప్రేమ.. అమరావతి రైతుల మీదా... లేక అక్కడి భూముల మీదా అంటూ ఎగతాళి చేశారు.