ఓరుగల్లులో పన్నుల మోత... టీఆర్ఎస్ కు వార్నింగ్ బెల్స్...
posted on Jan 3, 2020 @ 10:42AM
వరంగల్ కార్పొరేషన్‌లో పన్నుల మోత మోగుతోంది. వరంగల్ నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.... కార్పొరేషన్ పాలకులు మాత్రం... ప్రజలపై భారం మోపుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు... ఆస్తి, ఇంటి పన్నులను భారీగా పెంచేయడంపై వరంగల్ వాసులు భగ్గుమంటున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్లే పెద్ద పట్టణం. టూరిజం, వ్యాపారం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్ రంగాల్లో హైదరాబాద్‌తో పోటీ పడుతోంది. కానీ కనీస సౌకర్యాల కల్పనతో మాత్రం వెనుకబడిపోతోంది. గుంతల మయమైన రోడ్లతో నిత్యం నరకం చూస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అయితే అధ్వాన్నంగా తయారైంది. 58 డివిజన్లు, 15లక్షలకు పైగా జనాభా ఉన్న వరంగల్ కార్పొరేషన్‌లో ప్రజల దుస్థితి ఇలాగుంటే... మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు... ఆస్తి, ఇంటి పన్నులను భారీగా పెంచేశారు. అయితే, పాలకమండలి నిర్ణయంపై ప్రజలు, విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇంటి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరో ఏడాదిన్నరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత పాలకపక్షానికి బుద్ధి చెబుతామంటున్నారు.
ఎన్నికలు జరుగుతోన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే, వరంగల్‌లో మాత్రం పన్నుల భారం మోపడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. ముందుగా, రోడ్ల మరమ్మతు చేపట్టి, పారిశుద్ధ్యాన్ని చక్కదిద్దాలని కోరుతున్నారు. వరంగల్ నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 12వందల కోట్లు కేటాయించాయని, అవన్నీ ఏమైపోయాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.