తెలంగాణ ఆర్టీసీలో అవినీతి.. సమ్మె కాలం లెక్కలు తేలుస్తారా?
posted on Jan 2, 2020 @ 5:56PM
తెలంగాణలో ఇటీవల సుదీర్ఘ కాలం సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె పెద్ద ప్రభావమే చూపింది. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కొందరు కార్మికులు కూడా మరణించారు. ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ కార్మికులు అన్నట్టుగా ఈ పోరాటం సాగింది. ఒకానొక దశలో కార్మికులు సమ్మెకు ముగింపు పలికారు. దసరాకు ముందు నుంచి మొదలైన సమ్మె కాలంలో తాత్కాలిక సిబ్బంది తోనే బస్సులను నడిపింది ఆర్టీసీ యాజమాన్యం. నాడు చర్యలు కాస్త ఉపశమనం కలిగించినా ఆ మధ్య యూనియన్ల నాయకుల సవాళ్లతో మొదలైంది అసలు కథ. సమ్మె కాలంలో నూటికి నూరుపాళ్లు అవినీతి జరిగిందని వారు బలంగా ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు అందినకాడికి దండుకున్నారుని దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ నాయకులు చేసిన డిమాండ్లు ఆర్టీసీలో అంతర్గత చర్చకు దారితీశాయి. బిల్లులూ, రసీదులు అసలు లేకపోవటంతో ఆర్టీసీలో ఆ 52 రోజుల లావాదేవీల లెక్క తేలక పోవడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోందనే గుసగుసులు వినిపిస్తున్నాయి.
అసలే అప్పుడు దసరా పండుగ సీజన్, ఆపై లెక్కాపత్రం లేని వ్యవహారం, అసలు సమ్మె కాలంలో వచ్చినది ఎంత? పోయింది ఎంత? అనే దానిపై అధికారులకు ఇప్పటికే స్పష్టత లేదు. అందుకే అసలు ఏ డిపోలు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మొత్తం ఖర్చయింది ఆ లెక్కలేమిటీ అనే దానిపై ఆర్టీసీలో ఇంటర్నల్ ఆడిటింగ్ చేశారని తెలిసింది. దాదాపు నెల రోజుల పాటు 15 డిపోలో ఆడిటింగ్ నిర్వహించగా అంతటా లెక్కలూ గజిబిజి కనిపించింది. సమ్మె తొలినాళ్లలో తాత్కాలిక కార్మికులు టికెట్ లెస్ కలెక్షన్ లతో బస్సులు నడిపారు. ఈ కారణంగా అసలు ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై స్పష్టత కొరవడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మిగతా రోజులకు సంబంధించి కొంత క్లారిటీ ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే ఎక్కడో లెక్క తప్పుతుందనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోందని సమాచారం. టీఎస్ ఆర్టీసీలో కొందరు అధికారులైతే సమ్మె కాలంలో అసలు ఆదాయం వచ్చిందెంతో పోయింది ఎంతో ఎవరికి తెలుసు అని నిర్లక్ష్య ధోరణిలో వ్యాఖ్యానిస్తున్నారు. పైగా అప్పుడు కార్మికులు ఎవరూ లేక పోయినా తాత్కాలిక సిబ్బందితో తాము కష్ట పడి పనిచేయించామని అధికారులు తమకు తామే కితాబిచ్చుకున్నారు.
మొత్తం 97 డిపోలలో ఆడిటింగ్ జరిగాక అసలు ఎంత డబ్బు పక్కదారి పట్టింది అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు. అయితే ఈ తతంగ మంతా పూర్తి కావటానికి ఇంకా కొంత కాలం పడుతుందని అయినా అందులో తేలని లెక్కలు జాబితానే ఎక్కువగా ఉంటుందనీ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నల్ ఆడిటింగ్ మొత్తం పూర్తయిన సందట్లో సడేమియాలా ఎవరిదనేది తేలడం కష్టమేనని కూడా భావిస్తున్నారు.మొత్తం మీద ఆర్టీసీ సమ్మె రోజుల్లో నోటి లెక్కల కాలం సాగినందున అసలు లెక్కల ఆధారాల కోసం వెతకటం వృధా అనే అంటున్నారు. ఆడిటింగ్, విచారణల్లో బయటపడుతుందో లేక ఆరోపించినవారే ఆధారాలను బయటపెడతారో తెలియదు కానీ సమ్మె కాలంలో జరిగిన లావాదేవీల్లో అవినీతి అంశం మాత్రం తేలని గజిబిజి లెక్కగానే మిగిలిపోతోంది. పైగా అధికారుల పొంతన లేని మాటలతో ఈ అంశం సమాధానం దొరకని బేతాళ ప్రశ్నలా మిగిలి పోతుందనే వాదనలు ఉన్నాయి.