నిజామాబాద్ పై కమలం కన్ను... పరువు కోసం అర్వింద్ పోరాటం...
posted on Jan 3, 2020 @ 10:18AM
నిజామాబాద్ కార్పొరేషన్‌పై కమలం కన్నేసింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాషాయ జెండాను ఎగురవేసి అధికార టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్.... ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్‌పై గురిపెట్టారు. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం దగ్గర్నుంచి ...గెలుపు బాధ్యతలను తానే తీసుకుంటూ... కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గల్లీగల్లీలో ప్రచారం నిర్వహించి ఎలాగైనాసరే నిజామాబాద్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీనే ప్రచారాస్త్రంగా మార్చుకోవాలనుకుంటున్నారు అర్వింద్.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ బలంగానే కనిపిస్తోంది. అయితే, 20 డివిజజన్లపై ఎంఐఎం ప్రభావం తీవ్రంగా ఉండటంతో... మిగతా డివిజన్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ. గత ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. టీఆర్‌ఎస్ 10, ఎంఐఎం 16, కాంగ్రెస్ 16, బీజేపీ 6 డివిజన్లను గెలుచుకున్నాయి. ఇక, బీజేపీ నుంచి గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లలో ఐదుగురు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే, ఈసారి కరుడుగట్టిన కాషాయవాదులకే టికెట్లు ఇవ్వడంతోపాటు కనీసం 30 డివిజన్లు గెలిచేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు ఎంపీ అర్వింద్. కాంగ్రెస్ నుంచి మెజారిటీ నేతలు బీజేపీలో చేరడం.... టీఆర్ఎస్ కార్పొరేటర్లపై ప్రజల్లో వ్యతిరేకత... టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది.
మొత్తానికి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏకైక కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కంకణం కట్టుకున్నారు. పార్టీలో తన పట్టు నిలుపుకోవాలన్నా... తన మాట నెగ్గాలన్నా... నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీని గెలిపించుకోవడం ఎంపీ అర్వింద్‌కు కీలకంగా మారింది. మరి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాషాయ జెండాను ఎగురవేసిన ధర్మపురి అర్వింద్.... అదే జోరును కొనసాగిస్తారో లేదో చూడాలి.