ఇన్ సైడర్ ట్రేడింగ్ పై... వైసీపీ వీడియో ప్రజెంటేషన్...
posted on Jan 3, 2020 @ 10:21AM
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే, అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు, బంధువులు భారీగా భూములు కొనుగోలు చేశారంటూ వీడియోను ప్రదర్శించారు. రాజధాని ప్రకటన నాటి కంటే ముందే అంటే 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు భూముల కొనుగోల్ మాల్ జరిగిందంటూ వివరించారు. పథకం ప్రకారం రకరకాల పేర్లను ప్రచారం చేస్తూ... ఈలోపు అమరావతిలో తక్కువ ధరకే భూములు కొన్నారని ప్రధానంగా ఆరోపించారు. కావాల్సిన వాళ్లంతా భూములు కొన్నాకే రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించారని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు, తన అనుయాయులకు అనుగుణంగా సీఆర్డీఏ అలైన్ మెంట్ ను మార్చారని... ఇన్నర్ రింగ్ రోడ్డును ఇష్టానుసారంగా మార్చారని వివరించారు. మొత్తంగా 4వేల 70 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు వీడియోలో తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా... సర్కారుకు వెన్నుదన్నుగా నిలిచిన వారంతా... ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ది పొందారంటూ... వీడియోలో ఆరోపించారు వైసీపీ నేతలు. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ...తన కుటుంబ సభ్యుల పేర్లపై 15.30 ఎకరాలు... అలాగే, పయ్యావుల వ్యాపార భాగస్వామి, తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా భూములు కొన్నారని వివరించారు. పల్లె రఘునాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యులపై 7.5 ఎకరాలు.... అభినందన హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై టీడీపీ నేత కొమ్మలపాటి శ్రీధర్ 68.6 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. అలాగే, పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్ ఆర్ ఇన్ ఫ్రా అవెన్యూస్ పేరుపై భూములు కొనుగోలు చేశారని వివరించారు. యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్ పేరుపై 7 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ...శశి ఇన్ ఫ్రా పేరుతో 17.13 ఎకరాలు..... గుమ్మడి సురేశ్ పేరుపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు.... ధూళిపాళ్ల నరేంద్ర... తన కుమార్తె వీర వైష్ణవి, దేవరపు పులయ్య పేరుపై 13.5 ఎకరాలు కొనుగోలు చేశారని వివరించారు. ఇక, అప్పటి పురపాలక మంత్రి నారాయణ... తన దగ్గర పనిచేస్తున్న వారి పేర్లపై 55.27 ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. రావెల కిశోర్ బాబు ...విశాఖకు చెందిన మైత్రీ ఇన్ ఫ్రా పేరుపై 40.85 ఎకరాలు.. జీవీ ఆంజనేయులు అనుమానిత బినామీల పేరుపై 53.48 ఎకరాలు కొన్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ తన కుటుంబ సభ్యులపై మొత్తంగా 62.77 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మాజీ ఎంపీ మురళీ మోహన్ కు చెందిన 53.29 ఎకరాలను ఇన్నర్ రింగ్ రోడ్డులోకి తీసుకొచ్చి లబ్ది చేకూర్చారని తెలిపారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేశ్ తో క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని వీడియోలో ఆరోపించారు. లింగమనేని కుటుంబ సభ్యులు, సంస్థలకు చెందిన 351.25 ఎకరాలను... సీఆర్డీఏ పరిధి నుంచి మినహాయిండం ద్వారా లబ్ది చేకూర్చారని చెప్పుకొచ్చారు. లింగమనేని భూములకు రాజధాని సరిహద్దు రేఖ... కేవలం 10 మీటర్ల దూరంలోనే ఆగడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. అందువల్లే కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్ ను చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారని వీడియోలో ఆరోపించారు.
ఇక, నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితులకు సీఆర్డీఏ పరిధిలో ప్లాట్లు దక్కాయని... వైసీపీ విడుదల చేసిన వీడియోలో వివరించారు. ముఖ్యంగా దళితులు, నిరుపేదల నుంచి అసైన్డ్ భూములు లాక్కుని.. వాటిని ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చి ప్లాట్లు చేజిక్కించుకున్నారని ఆరోపించారు. అందులో కొల్లి శివరాం 47.39 ఎకరాలు, గుమ్మడి సురేశ్ 49.925 ఎకరాలు, బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలు.. ఇలా మొత్తం మొత్తం 338.887 ఎకరాలను స్వాధీనం చేసుకుని.. వీటికి అనుగుణంగా ప్లాట్లను పొందారని వీడియోలో వివరించారు.
అయితే, వైసీపీ వీడియో ప్రజెంటేషన్ లో అన్నీ అబద్ధాలేని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై టీడీపీ... ఏ విచారణకైనా సిద్ధమన్నారు. మొత్తం కలిపితే 50 ఎకరాలు కూడా లేవని... మరి, 4వేల 69 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.