ఆర్మూరులో కాంగ్రెస్ ఆగమాగం... టీఆర్ఎస్-బీజేపీ మధ్యే పోటీ...!
posted on Jan 3, 2020 9:21AM
ఆర్మూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆగమాగం అవుతోంది. ఆర్మూరులో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హస్తం పార్టీకి... ఇప్పుడు నాయకుడే కరువయ్యాడు. దాంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలో తెలియక ద్వితీయశ్రేణి నేతలు, కేడర్ అయోమయానికి గురవుతున్నారు. గెలుపు మాట దేవుడెరుగు... కనీసం పోటీయే చేయలేని పరిస్థితి నెలకొందంటున్నారు. దాంతో, ఎన్నికలకు ముందే ఆర్మూరులో కాంగ్రెస్ చేతులెత్తేసిందనే ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఆర్మూరులో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ...ఇప్పుడు పూర్తిగా డీలా పడింది. దాంతో, ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంటోంది. ఆర్మూరు మున్సిపాలిటీలో 54వేల మంది ఓటర్లు ఉండగా, వార్డుల సంఖ్య 36కి పెరిగింది. అయితే, గత ఎన్నికల్లో 11 వార్డుల్లో గెలుపొంది కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 10 వార్డులను గెలుచుకున్న టీఆర్ఎస్.... బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లను తనవైపు లాక్కుని ఆర్మూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసింది. అయితే, ఇప్పుడు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ కనిపించడం లేదంటున్నారు.
ఆర్మూరులో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న సురేష్‌రెడ్డి... అసెంబ్లీ ఎన్నికలకు ముందే గులాబీ గూటికి చేరగా.... కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఆకుల లలిత ...ఆ తర్వాత హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. దాంతో, ఆర్మూరులో కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడే లేకుండా పోయారు. ద్వితీయ శ్రేణి నేతలున్నా... నియోజకవర్గాన్ని నడిపించే సత్తా లేకపోవడంతో... కాంగ్రెస్ కేడర్ మెల్లగా టీఆర్‌ఎస్, బీజేపీ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం ఆర్మూరులో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించిన బీజేపీ... స్థానికంగా మంచి పట్టు సాధించింది. దాంతో, ఆర్మూరు మున్సిపాలిటీలో పోటీ... టీఆర్ఎస్, బీజేపీగా మారింది.
ఆర్మూరులో కాంగ్రెస్ డీలా పడటంతో... వార్ వన్ సైడేనంటూ టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. బీజేపీ అసలు తమకు పోటీనే కాదంటున్నారు. అయితే, ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తోన్న బీజేపీ నేతలు... ఆర్మూరు మున్సిపాలిటీపై ఈసారి కాషాయ జెండా ఎగురవేస్తామని చెబుతున్నారు.