స్థానిక నేతలపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. ఎవరి కాళ్లూ పట్టుకోను
posted on Jan 3, 2020 @ 11:32AM
స్థానిక వైసీపీ నేతలపై కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అసహనం వ్యక్తం చేశారు. జూపాడుబంగ్లా మండలం బన్నూరు గ్రామసచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు గురువారం ఆయన విచ్చేశారు. అయితే ఆయన స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా నేరుగా వచ్చేశారు. దీంతో సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తమకు చెప్పకుండా రావటం ఏంటని.. పార్టీ కోసం పనిచేసిన తమకు కనీసం కబురు చేయకుండా అవమానించారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. తానిక ఓట్లు అడుక్కోనని.. ఎమ్మెల్యే గా పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికే నాకు చాలా అయింది. ఈ ఐదేళ్లలో ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరి దగ్గరకూ వచ్చి కాళ్లు పట్టుకోను. మీకేమైనా పని కావాలంటే నా దగ్గరకు రండి అని కార్యకర్తలపై ఆర్థర్ విరుచుకుపడ్డారు.