ఆపరేషన్ కమలం.. భద్రాద్రి జిల్లాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమా?
posted on Jan 2, 2020 @ 4:04PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పై ప్రస్తుతం బీజేపీ కన్నేసింది. ఆపరేషన్ కమలం పేరుతో గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 5 స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. 6 నెలలు తిరిగే సరికి కాంగ్రెస్ పక్షాన గెలిచిన వనమా వెంకటేశ్వరావు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్ లు టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాత్రమే ప్రతిపక్షంలో మిగిలారు.
గత ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున కోరం కనకయ్య, కాంగ్రెస్ తరపున హరిప్రియ పోటీ చేశారు. ఎన్నికల్లో గెలిచిన హరిప్రియ ఆ తరవాత గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో పరిస్థితి ఒకే ఒరలో రెండు కత్తులు చందంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ సిట్టింగ్ టీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం ఉంది కనుక కోరం కనకయ్య డైలమాలో పడ్డారు ఇదే అదనుగా ఆయన వైపు బీజేపీ దృష్టి సారించింది. మొన్నటి ఎన్నికల్లో పినపాకలో టీఆర్ఎస్ పక్షాన పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పక్షాన రేగా కాంతారావు పోటీ చేశారు. ఎన్నికల్లో పాయం వెంకటేశ్వరరావు ఓడిపోయారు. గెలిచిన రేగా కాంతారావు అధికార పక్షంలోకి చేరి పోయారు. ఇక్కడ కూడా పాయం పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఆయనపై కూడా బిజెపి కన్నేసినట్టు సమాచారం. అశ్వరావుపేటలో గత ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు ఓడిపోయారు. ఆయన పై టీడీపీ నేత మెచ్చా నాగేశ్వరావు గెలిచారు. ఇక్కడ ఓడిన నేత లేదా టిడిపి పక్షాన గెలిచిన నేత వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీలోకి వచ్చేలా బిజెపి స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది. కోరం కనకయ్య ప్రస్తుతానికి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతానికి అధికార పార్టీలో కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాం కదా ఎన్నికల నాటికి టికెట్ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే అని కోరం కనకయ్య తన అనుచరులతో అంటున్నారు. పినపాకలో కాంగ్రెస్ పక్షాన గెలిచిన రేగా కాంతారావు టీఆర్ఎస్ లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉక్కపోత గురవుతున్నారు. ఏదో ఒక ముహుర్తం చూసుకొని ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు పైకి గంభీరంగా ఉంటున్నప్పటికీ లోలోపల మాత్రం బిజెపి తోనే తమ భవిష్యత్ ని తలపోస్తున్నట్టుగా వారి అనుచరులు చెప్పుకుంటున్నారు.
ఇదిలా వుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ విస్తరణ కోసం చాప కింద నీరులా తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది బీజేపీ. టీఆర్ఎస్ కు చెందిన మెజారిటీ నేతలను తమ వైపు ఆకర్షించాలని భావిస్తోంది. వచ్చే 6 నెలల వ్యవధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరున్న ఒక మాజీ ఎంపి బిజెపిలో చేరతారని ఆయన వెంట పెద్ద ఎత్తున అనుచర గణం కూడా కమలం పార్టీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. సదరు నేత బిజెపి లోకి వస్తే ఈ జిల్లాలో బీజేపీకి ఇక తిరుగుండదని చెప్పుకుంటున్నారు. దీంతో పాటు టీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని భావిస్తున్న నేతలు బిజెపి గూటికి వస్తారని పలువురంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడానికి బీజేపీ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. భద్రాద్రి రామాలయాన్ని 100 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాట తప్పారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్, కొత్తగూడెం మైనింగ్ యూనివర్సిటీ హామీలు కూడా అమలు కాలేదు. దీనికి తోడు పోడు భూముల వివాదాన్ని కూడా సీఎం కేసీఆర్ పరిష్కరించలేకపోయారు.ఈ అంశాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బిజెపి రంగంలోకి దిగబోతోంది. తెలంగాణలో ఎలాగైనా గద్దెనెక్కాలన్న పట్టుదలతో ఉంది బిజెపి. అందువల్ల ఆ పార్టీలో చేరితే వారే పోల్ మేనేజ్ వంటి అంశాలను చూసుకుంటారని గులాబీ పార్టీలోని అసంతృప్తులు భావిస్తున్నారు. గతంలో టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కోనేరు చిన్ని కొత్తగూడెంజిల్లా కమలం పార్టీలోకి తొలిగా చేరారు. అప్పటి వరకు స్థబ్దుగా ఉన్న బిజెపి చిన్ని చేరిక తరువాత స్పీడ్ పెంచింది. సింగరేణిలో తమ అనుబంధ సంఘమైన బీఎంఎస్ ను పటిష్టం చేయడంతో పాటు టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ను బలహీనపరచే పనిలో కమలదళం ఉంది. ఈ పరిస్థితిలో వచ్చే రోజులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని బిజెపి నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఖమ్మం జిల్లా నుంచే టీఆర్ఎస్ పతనం మొదలవుతోందని, రాముడు కొలువైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.