తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం.. నిధులు ఉన్నాయా? ఎన్నేళ్లు పడుతుంది?
posted on Jan 3, 2020 @ 1:08PM
కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదని బడ్జెట్ అంచనాలను కూడా సవరించామని గతంలో చెప్పిన ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి ఎన్ని నిధులు కేటాయించగలదని,అంత మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేయగలదా అని ప్రశ్నించింది. ఆర్ధిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భవన నిర్మాణానికి ఎన్నాళ్లు పడుతుంది అని నిలదీసింది. సచివాలయ భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హై కోర్టు డివిజన్ బెంచ్ మరోసారి విచారించింది. సచివాలయ భవన సముదాయంలోని 25 ఎకరాల స్థలంలో ఎంత విస్తీర్ణంలో కొత్తగా కడతారని, నూతన భవనానికి ప్లాన్ ఎక్కడని అదనపు ఏజీని ప్రశ్నించింది. భవన సముదాయాన్ని ఫేజ్ ల వారీగా నిర్మించాల్సి ఉంటుందని ఈ లెక్కన 5 నుంచి 6 ఏళ్ల పాటు నిర్మాణం కొనసాగే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజస్థాన్ హై కోర్టు నిర్మాణాన్ని 2007లో ప్రారంభిస్తే 2018 లో పూర్తయ్యిందని సుమారు 12 ఏళ్లు పట్టిందని గుర్తు చేసింది. దీని ప్రకారం చూస్తే సచివాలయం నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందని పదేళ్ల,పన్నెండేళ్ల అని ప్రశ్నించింది. పుట్టగొడుగుల్లా రాత్రికి రాత్రే భవనాల నిర్మాణం పూర్తి కాదు కదా అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని హై కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
నూతన సచివాలయ భవనం నిర్మాణానికి గత ఏడాది జూన్ 27 న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలతో పాటు 2016 లో దాఖలైన మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. సచివాలయ భవనాలను కూల్చివేసి అదే స్థలంలో కొత్త భవనం నిర్మించాలని అందుకు అనువుగా ప్రస్తుత సచివాలయాన్ని ఇతర భవనాల్లోకి తరలించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.ఇది మధ్యంతర నిర్ణయం మాత్రమేనని తుది నిర్ణయం ఏది అని ధర్మాసనం ప్రశ్నించింది. సచివాలయ భవనాలను కూల్చవద్దని మాత్రమే మౌఖిక ఆదేశాలు ఇచ్చామని ఎటువంటి స్టే ఇవ్వలేదని తెలిపింది. నూతన సచివాలయానికి డిజైన్ల రూపకల్పన చెయ్యొద్దని ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదని గుర్తు చేసింది. ఉన్న సచివాలయాన్ని కొన్ని నెలల్లో తరలిస్తామని చెప్పారని కొత్తది కట్టడానికి ఎంత కాలం పడుతుందని కోర్టు ప్రశ్నించింది. మూడు నుంచి ఐదేళ్లలో కడతారు అనుకుంటే అంతకాలం అధికారులు ఎక్కడి నుంచి ఎలా పనిచేస్తారో అని శాఖల మధ్య సమన్వయం ఎలా చేయగలరని ప్రశ్నించింది. రహస్యంగా ఉండాల్సిన ఫైళ్లను ఆయా శాఖలకు ఎలా తీసుకెళ్తారని వాటి భద్రత మాటేంటని మార్గ మధ్యంలో ఎవరైనా దోచేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. సచివాలయ సమీపంలోని బూర్గుల రామకృష్ణా రావు భవన్ లోకి 70 % శాఖలను తరలించామని హెచ్వోడీలు మిగిలిన శాఖలను వేరువేరు భవనాల్లోకి మార్చామని ఏఏజీ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయన్నారు. అయితే సుప్రీం కోర్టు ఏం చెబుతుందో తమకు తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సహేతుకంగా ఉండాలని లేని పక్షంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద తాము కల్పించుకోవచ్చునని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం హైకోర్ట్ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.