పబ్లిక్‌గా మోహన్ బాబుకి ముద్దిచ్చిన చిరంజీవి... గొడవలపై క్లారిటీ...
posted on Jan 2, 2020 @ 5:42PM
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో అరుదైన దృశ్యం ఆవిష్కృమైంది. మెగాస్టార్ చిరంజీవి... డైలాగ్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహాన్ని, ప్రేమను మరోసారి చాటుకున్నారు. మోహన్ బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చిరంజీవి... తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదంటూ ప్రేమగా బుగ్గపై ముద్దుపెట్టారు. ఈ సన్నివేశం అక్కడున్న సినీ ప్రముఖులను, మీడియా ప్రతినిధులను కట్టిపడేసింది.
అయితే, మోహన్ బాబు, చిరంజీవి బంధాన్ని టామ్ అండ్ జెర్రీతో పోల్చుతున్నారు. ఎందుకంటే, పలు వేదికలపై ఒకరిపై మరొకరు పంచ్ డైలాగులు విసురుకుంటారు... అంతలోనే తమ మధ్య ఎలాంటి గొడవులు లేవంటారు. తామిద్దరమూ మంచి స్నేహితులమని, తమ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెబుతారు. అయితే, ఇరువురి మధ్య ఉండే సత్సంబంధాలు, స్నేహం కంటే... ఆయా వేదికలపై ఒకరిపై మరొకరు పేల్చుకున్న మాటల తూటాలే ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయి. దాంతో, మోహన్ బాబు, చిరంజీవి మధ్య శత్రుత్వం ఉందని భావన ఎక్కువమందిలో కలుగుతోంది.
అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురూ తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చాటి చెప్పారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తుంటాయని.... తమ మధ్య కూడా అంతేనని.... కానీ తామిద్దరమూ మంచి స్నేహితులమంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతే... కుర్చీలో నుంచి లేచి మోహన్ బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చిరంజీవి.... బుగ్గపై ముద్దిచ్చి.... తమ మధ్య ఎలాంటి గొడవల్లేవంటూ క్లారిటీ ఇచ్చారు.