ఖ్యాతి పెంచిన భారతీయుడు.. ప్రముఖ ఐబీఎం సంస్థ సీఈఓగా ఎంపికైన అరవింద్ కృష్ణ

భారత సంతతి నుండి ఇప్పటికే సుందర్ పిచై, సత్య నాదెళ్ల, అజయ్ బంగా, శాంతను నారాయణ్ వంటి దిగ్గజాలు ప్రపంచఖ్యాతి పొందారు. వారి వంటి స్థాయికి మరో దిగ్గజం చేరుకున్నాడు. అరవింద్‌ కృష్ణ అనే భారతీయుడు టెక్నాలజీ రంగంలోనే దిగ్గజమైన ఐబీఎం సంస్థకు నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా ఎంపికయ్యారు. ఇది వరకు అదే ఐబీఎం సంస్థలో సీనియర్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్న అరవింద్‌ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓగా ఎన్నుకుంది. ఐబీఎం నవ శకానికి అరవింద్‌ నాయకత్వం సరైనదని ప్రస్తుత ఐబీఎం సీఈఓ గిన్నీ రోమెట్టీ అన్నారు. ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, క్లౌడ్‌, క్వాంటం కంప్యూటింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ తయారీలో అరవింద్‌ బాగా కృషి చేశారని కొనియాడారు. రెడ్‌ హ్యాట్‌ కొనుగోలులో అరవింద్‌ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఉన్న ఐబీఎం సీఈఓ గిన్నీ రోమెట్టీ (62) ఈ ఏడాది చివర్లో రిటైర్‌ అవ్వనున్నారు. కాబట్టి అప్పటి వరకు ఆమె ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. 1990 సంవత్సరంలో అరవింద్‌ కృష్ణ (57) ఐబీఎంలో చేరారు. కాన్పూర్‌ ఐఐటీలో సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత ఇల్లినాయిస్‌ యూనివర్సీటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు అరవింద్ కృష్ణ. బోర్డు మెంబర్లు తనపై నమ్మకాన్ని పెట్టుకొని..సీఈఓగా తనను ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అరవింద్‌. తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ క్లయింట్ లకు ఎదురయ్యే సవాళ్లను మరింత సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమిస్తామని అన్నారు.

రైతులకు అండగా కేంద్రం.. రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు!

2020-21 బడ్జట్ లో ఉన్నత జీవన ప్రమాణాలు, ఆర్ధికాభివృద్ధి, సామాజిక భద్రత వంటి మూడు అంశాలపై దృష్టి సారించామని.. అవే బడ్జెట్ ప్రధాన లక్ష్యాలని సీతారామన్ వెల్లడించారు. ఆయుష్మాన్ భవ అద్భుత ఫలితాన్ని ఇచ్చిందని.. దాన్ని గుర్తు చేసుకుంటూ కాశ్మీరీ దీనానాద్ కౌల్ కవితను చదివి వినిపించారు నిర్మల సీతారామన్. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్షమని.. వ్యవసాయ మార్కెటింగ్ విధానం సరళతరంగా ఉన్న నేపధ్యంలో వ్యవసాయాభివృద్ధికి సంబంధించి మూడు కొత్త చట్టాలను రూపొందించామన్నారు. అది కాకుండా నీటి ఎద్దడి ఉన్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ని..20 లక్షల మంది రైతులకు సోలార్ పంపులను.. బీడు భూములకు సోలార్ ప్లాంట్లకు వేర్ హౌసెస్ నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని సీతారామన్ తెలియజేశారు.  గ్రామీణ స్టోరేజ్ స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని.. స్వయం సహాయక గ్రూపులకు ధాన్యలక్ష్మి రుణాలకు శ్రీకారం చుడుతున్నట్లు సీతారామన్ తెలియజేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్లో జాతీయ స్థాయిలో స్కీమ్ లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలియజేశారు. రైళ్ల ద్వారా పంటల రవాణాకు కిసాన్ రైల్ స్కీమ్ సౌకర్యం కలిగించడమే కాక మరింత విస్తృతంగా నాబార్డ్ రీ ఫైనాన్స్ స్కీమ్ ను ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు.కిసాన్ క్రెడిట్ స్కీమ్ కోసం రూ.15 లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2021లోపు 108 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళతామని వెల్లడించారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణభివృద్ధి రంగాలకు కలిపి రూ.2.83 లక్షల కోట్లు కేటాయించినట్లు సీతారామన్ వెల్లడించారు.

బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బడ్జెట్ ప్రసంగం ప్రారంభానికి ముందు వరకు లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు.. బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదువుతుండగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ భారీగా పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1,054.86 పాయింట్లు (2.59శాతం) నష్టంతో  అమాంతం 39668.63 వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం అదే బాటలో పయనించి, 246.25 (2.06 శాతం) నష్టపోయి 11715.85 వద్దకు పతనమైంది. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసిన కారణంగానే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో 63000 కు పైగా ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులకు జగన్ ఆదేశం...

ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమగ్ర క్యాలెండర్ ను రూపొందించి దశల వారీగా పోస్టుల భర్తీ చేపట్టాలని సూచించారు. వైద్య, విద్యారంగంలో అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఏపీలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను సత్వరమే భర్తీ చేసి ప్రజలకు సేవలందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఖాళీ ఉద్యోగాల గుర్తింపు, భర్తీపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో సమూల మార్పులు ఆశిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ పై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. నాడూ నేడూ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రుల రూపురేఖలను మారుస్తామన్న సీఎం దీంతో పెద్ద ఎత్తున రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని చెప్పారు. వీరికి సేవలందించేందుకు వీలుగా డాక్టర్ లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ లు, ఫార్మసిస్టు పోస్టులు పూర్తిగా భర్తీ అయి ఉండాలని కోరారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాడు నేడు చేపడుతున్నందున పాఠశాలల్లో సిబ్బంది లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వృధా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు సరిపడా లేకపోతే పాఠశాలల సమర్థత తగ్గుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. అప్పుడే స్కూళ్లల్లో మనం చేపడుతున్న ఆధునీకరణ పనులు, అమ్మఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతల కోసం తీసుకుంటున్న చర్యలకు అర్థం ఉంటుందన్నారు. పోలీసు విభాగంలో వారాంతపు సెలవులను సమర్థంగా అమలు చేయాలని డీజీపీ సవాంగ్ ను సీఎం జగన్ ఆదేశించారు. అయితే సెలవుల కారణంగా పోలీసు శాఖ సామర్థ్యం తగ్గకూడదని హితవు పలికారు. రెవెన్యూ విభాగంలోనూ ప్రాధాన్యత పోస్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చాలన్నారు. ప్రతి విభాగంలోనూ ప్రాధాన్యతా క్రమంలో పోస్టుల భర్తీపై చర్చించాలన్నారు. కాగా మూడు వారాల్లో ప్రాధాన్యత పోస్టులను నిర్ధారిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. అధికారులందరూ ఫిబ్రవరి 21 న సీఎంతో మరోసారి భేటీ అయి కార్యాచరణ తెలియ జేయాలని నిర్ణయించారు. ఉద్యోగార్ధుల గరిష్ఠ వయోపరిమితి సడలించే విషయం కూడా ఈ సమీక్షలో ఏపీపీఎస్సీ ప్రస్తావించింది. అయితే నలభై ఆరు సంవత్సరాలకు సడలించాలన్న అభిప్రాయం వ్యక్తమైనా ఏఏ పోస్టులకు సడలించాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఇరవై ఒకటిన జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టులు 63000 కు పైనే ఉండొచ్చని సీఎం జగన్ కు అధికారులు నివేదించారు. టీచరు పోస్టులు 21000, ఏపిపిఎస్సీ భర్తీ చేసే పోస్టులు 19000, పోలీసు విభాగంలో పోస్టులు 13000 ఉన్నాయి. అయితే వాటి సంఖ్య మరింత పెరగవచ్చని సమాచారం, ఆర్థిక శాఖ ప్రతి డిపార్ట్ మెంట్ తో మాట్లాడి ఖాళీలను నిర్ధారించి వాటిని ఏ విధంగా భర్తీ చేయాలన్న విషయంపై ఏజెన్సీలతో చర్చించనుంది.

సీతారామన్ స్టేట్ మెంట్.. కొత్తగా చేరిన 16 లక్షల మంది పన్ను చెల్లిపుదారులు

ఆర్ధికరంగం అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిలో నిర్మల సీతారామన్ ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ రాయితీల కోసం కార్పొరేట్ రంగాలు సైతం ఎదురు చూస్తున్నాయి.15వ ఆర్ధిక సంఘం రిపోర్టును సభలో ప్రవేశ పెడుతూ.. 2020-2021 బడ్జెట్ ను సైతం సభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యొల్బణాన్ని పరిశీలించి అదుపులో పెట్టడమే కాక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్ధిక సంస్కరణలు వేగవంతం చేశామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఆర్ధిక రంగ మూలాలు బలంగా ఉన్నాయి కానీ ఆర్ధిక సంస్కరణల్లో జీఎస్టీ చాలా కీలకమైనదనే అంశాన్ని గుర్తు చేశారు. జీఎస్టీ విషయంలో అరుణ్ జైట్లీ లాంటి వారు ముందు చూపుతో వ్యవహరించారని.. పాలన రంగంలో పూర్తి స్థాయి మార్పులు తీసుకువచ్చినట్లు సీతారామన్ తెలియజేశారు. 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారని రిటర్న్స్ లో సమూల మార్పులు తీసుకొచ్చామని అన్నారు. 40 కోట్ల మంది పన్ను రిటర్న్స్ ను ఫైల్ చేశారని సబ్ కా సాథ్, సబ్కా వికాస్ పథకాలు వేగంగా ప్రజలుకు చేరుతున్నాయని సీతారామన్ వెల్లడించారు. ఏప్రిల్ 2020 నుంచి పన్ను రిటర్నులకు మరింత సులభంగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలో ఇప్పుడు భారతదేశానిది అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అని సీతారామన్ తెలియజేశారు. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి 4 శాతం ఆదా అయిందని, కేంద్ర ప్రభుత్వ రుణాలు గణనీయంగా తగ్గాయని ఆవిడ వెల్లడించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రతి పౌరుడికి చేరేలా చూడడమే తమ లక్ష్యమని 2014-2019 మధ్య ఎఫ్ డీఐ లు 119 బిలియన్ డాలర్ల నుంచి 284 డాలర్లకు పెరిగాయని.. వృద్ధి రేటు 7.4 శాతం సాధించామని సీతారామన్ వెల్లడించారు. భారత ప్రజలు మోదీకి తిరుగులేని తీర్పు ఇచ్చారని.. రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్ధిక పురోగతి ఆశిస్తూ అధికారమిచ్చారని సీతారామన్ వెల్లడించారు. అన్ని వర్గాల కొనుగోలు శక్తికి ఊతమిచ్చెలా బడ్జెట్ ఉంటుందని సీతా రామన్ వెల్లడించారు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాకిచ్చిన జగన్ సర్కార్...

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. గతంలో కేటాయించిన సున్నపురాయి గనుల లీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని జేసీకి సంబంధించిన త్రిశూల్ సిమెంట్స్ కు కొనుప్పలపాడులో కేటాయించిన 649.896 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ భూములు రాశి సిమెంట్ కు లీజులో ఉండేవి. వీటి కాల పరిమితి 2004 మార్చి 31 కి పూర్తయింది, 2005 లో ఈ భూములను వైఎస్ ప్రభుత్వం త్రిశూల్ సిమెంట్స్ కు లీజుకిచ్చింది. మూడేళ్ళలో త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సూచించింది. 2010 కి లీజు కాల పరిమితి ముగిసింది, మళ్లీ దరఖాస్తు చేసుకోగా 2015 ఆగస్టు 1 వరకు ప్రభుత్వం పొడిగించింది. అప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోవడంతో మరో అయిదేళ్లు పొడగించాలని ప్రభుత్వాన్ని కోరగా 2020 జూలై 31 వరకు గడువు పొడిగించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.  ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోయినా 38,212 మెట్రిక్ టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వి విక్రయించారన్న ఆరోపణలున్నాయి. లీజుకు సంబంధించి 38,3,376 రూపాయలు చెల్లించకపోవడం, ఇప్పటి వరకు సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోవటం, అక్రమంగా మైనింగ్ చేయడం వంటి కారణాలతో లీజ్ ను రద్దు చేశారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ గనుల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై జేసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తనపై పగతో రగిలిపోతుంది అని అన్నారు. అనుమతుల రద్దుపై తనకు బాధగా లేదని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే తనకు జరిగినది చిన్నపాటిదేనని చెప్పారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులపై వైసీపీ సర్కారు దృష్టి సారించింది. సరైన అనుమతులు లేవంటూ పలు బస్సు సర్వీసులను సీజ్ చేసింది. తాజాగా వారి సిమెంట్ గనుల లీజును రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.  

కొత్త ట్రెండ్.. కుటుంబ సగటు భోజన ఖర్చును ఆర్ధిక సర్వేలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం

ప్రజల కొనుగోలు శక్తిని కొత్త విధానంలో లెక్కించింది కేంద్ర ఆర్థిక శాఖ. భోజనం కోసం ఒక్కో కుటుంబం పెట్టే ఖర్చు ఆధారంగా ఎకనమిక్ సర్వే విశ్లేషించింది. 2006-2007 నుంచి 2019-20 మధ్య వెజ్ మీల్స్ కొనుగోలు శక్తి 20 శాతం పెరిగిందని నాన్ వెజ్ మీల్స్ కొనుగోలు శక్తి 18 శాతం పెరిగిందని వివరించింది. థాలినామిక్స్ , ది ఎకనమిక్స్ ఆఫ్ ఎ ప్లేట్ ఆఫ్ ఫుడ్డింగ్ ఇండియా పేరుతో 27 పేజీల చాప్టర్ ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా చేర్చింది. 2019-20 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ క్రిష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఈ సర్వేను తయారు చేశారు. వెజ్ థాలిలో అన్నం లేదా రొట్టెలు, కూరగాయలు, పప్పు, నాన్ వెజ్ థాలిలో అన్నం లేదా రొట్టెలు, కూరగాయలు, మాంసాహారాన్ని సర్వే పరిగణనలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 సెంటర్లలో పరిశ్రమల్లోని కార్మికుల నుంచి డేటా సేకరించారు. 2006 ఏప్రిల్ నుంచి 2019 అక్టోబర్ అంటే 13 ఏళ్ల ఇండెక్స్ ఆధారంగా విశ్లేషణ చేశారు.  ఐదుగురు సభ్యులున్న కుటుంబం రోజుకు రెండు పూటల భోజనానికి చేసే ఖర్చు రోజువారి ఆదాయం ఆధారంగా కొనుగోలు శక్తిని లెక్కగట్టారు. 2015-16 ఏడాది వరకు ఆహార ధాన్యాల రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉందని ఆ తర్వాత తగ్గుతూ వచ్చిందని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక కుటుంబం ఏడాది కాలంలో భోజనం పై చేసే ఖర్చు 2015-16 తరువాత కాలంలో బాగా తగ్గిందని ఎకనామిక్ సర్వే తెలిపింది. ఈ లెక్కన వెజ్ మీల్స్ తినే కుటుంబానికి ఏటా సగటున 10,887 రూపాయల ఖర్చు తగ్గిందని లెక్కేసింది. అదే నాన్ వెజ్ తీనే ఫ్యామిలీకి సగటున 11,787 మిగిలిందని వివరించింది. అదే సమయంలో రోజువారీ సగటు ఆదాయంలో భోజనానికి చేసే ఖర్చు ఆధారంగా 2006-2007 నుంచి 2019-20 వరకు వెజ్ మీల్స్ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 29 శాతం పెరిగినట్లు అంచనా వేసింది. అదే విధంగా నాన్ వెజ్ మీల్స్ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 18 శాతం పెరిగినట్లు లెక్క గట్టింది. ఇతర రంగాల్లో ఇదే రీతిలో కొనుగోలు శక్తి ఉందని వివరించింది. తెలంగాణలో ఐదుగురు సభ్యుల కుటుంబంలో ఒక్కరి రోజు సగటు సంపాదన 479 రూపాయల ఆరు పైసలు ఉందని సర్వే పేర్కొంది. అందులో 40 రూపాయల రెండు పైసలను కుటుంబం సగటున రోజుకు నాన్ వెజ్ కి ఖర్చు చేస్తుందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోజువారి సంపాదన ఎక్కువని విశ్లేషించింది.

3 శ్లాబులు 6 శ్లాబులు అయ్యాయి..  ఇక పన్ను ఎగవేత క్రిమినల్ నేరం కాదు!

2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయమని ఆమె చెప్పారు. అదేవిధంగా, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవని మంత్రి తెలిపారు. పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదు..త్వరలో చట్ట సవరణ చేస్తామన్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఆదాయ పన్ను పరిమితులను వివరించారు. ఆదాయపన్ను శ్లాబులో భారీగా మార్పులు చేశారు. ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను అంశంలో ఇప్పటివరకు 3 శ్లాబులు ఉండగా, ఇప్పుడు వాటిని 6 శ్లాబులు చేశారు. రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను.. రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను.. రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను విధించారు. రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను లేదు.  

తెలంగాణ మిర్చికి కరోనా వైరస్ దెబ్బ... లబోదిబోమంటున్న రైతులు...

కరోనా వైరస్... ఇదిప్పుడు మనుషులనే కాదు... మిర్చిని కూడా భయపెడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే... తెలంగాణ మిర్చి రైతులు కూడా అల్లాడిపోతున్నారు. అదేంటి... కరోనాకు భయపడాల్సింది మనుషులు కదా? మరి మిర్చికి కరోనాకి లింకేమిటి అనుకుంటున్నారా? పొరపాటున మిర్చికి ఏమైనా కరోనా వైరస్ సోకిందనుకుంటున్నారా? కానే...కాదు? అయితే, కరోనాకు మిర్చికి వ్యాపారులు లింకుపెట్టారు. దాంతో, మిర్చిపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. అది ఎంతలా ఉంటే... మిర్చి రైతు కోలుకోలేనంతగా. ఎందుకంటే, ఈ ఒకే ఒక్క వదంతు... మిర్చి రైతుని నిండా ముంచేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుని నాలుగు రూపాయలు జేబులో వేసుకుందామనుకున్న రైతును అప్పులుపాలు చేసింది. కరోనా దెబ్బకు నిన్నమొన్నటివరకు 30వేలు పలికిన క్వింటాలు మిర్చి.... ఇప్పుడు అమాంతం ఏడెనిమిది వేలకు పడిపోయింది. దాంతో, కనీసం కూలీ డబ్బులు కూడా దక్కక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్నమొన్నటివరకు 30వేల రూపాయలు పలికిన క్వింటా మిర్చి ధర... ఇప్పుడు ఒక్కసారిగా ఏడెనిమిది వేలకు పడిపోవడంతో ఖమ్మం మిర్చి యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. అయితే, మిర్చి ధర పడిపోవడానికి అధికారులు చెప్పిన కారణం తెలుసుకుని కంగుతిన్నారు. కరోనా వైరస్ కారణంగానే మిర్చి ధర పడిపోయిందని చెప్పడంతో మిర్చి రైతులు మండిపడుతున్నారు. అసలు కరోనాకి... మిర్చికి సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని... అందుకే, మిర్చి ధర అమాంతం పడిపోయిందని ఖమ్మం మార్కెట్ యార్డు పాలకపక్షం, అధికారులు అంటున్నారు. ఇక్కడ కొనుగోలు చేసే మిర్చి.... ఎక్కువగా చైనాకే ఎగుమతి అవుతుందని... అయితే, కరోనా కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతున్నారు. ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారని అధికారులు అంటున్నారు. అయితే, కరోనా పేరుతో తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేస్తున్న బడా వ్యాపారులు... వాటిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసి.... ఆ తర్వాత అధిక ధరకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తు్నారు. కరోనా సాకుతో తమను నిలువు దోపిడీ చేస్తున్నారని మిర్చి రైతులు మండిపడుతున్నారు. ధర తగ్గించడానికి కావాలనే కరోనా పేరు చెబుతున్నారని మిర్చి రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని... మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

అర్ధరాత్రి ఉత్తర్వులు.. మూడు రాజధానుల ఏర్పాటుకు తొలి అడుగు పడింది

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతోంది. ఒక పక్క ఉగాది నుండి విశాఖ వేదికగా పాలన సాగించాలని చూస్తున్న జగన్ సర్కార్.. తాజాగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. కర్నూలుకు తరలిస్తున్న కార్యాలయాల్లో రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలకు అవసరమైన భవనాలను ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖకు, కర్నూలు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అర్థరాత్రి దాటాక ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కర్నూలు ఉన్నతాధికారులు ప్రస్తుతం కార్యాలయాల ఏర్పాటు పనిలో నిమగ్నమయ్యారు.

విజయసాయి కనుసన్నల్లో విశాఖ.. సార్ పిలిచారంటే చాలు!!

ఎందుకో తెలియదు వైసీపీకి విశాఖ అంటే ప్రత్యేక ఆసక్తి. అందుకేనేమో! సీఎం జగన్ కు కీలక సహచరుడు ఇంకా చెప్పాలంటే అత్యంత విశ్వసనీయుడైన విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి రాకముందు ఒకటి రెండేళ్ల ముందు నుంచి సాయిరెడ్డి విశాఖను తన రెండో ఇల్లుగా మార్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశాఖను దత్తతకు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అధికార యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుంది. విజయసాయిరెడ్డి నెలకు కనీసం రెండు మూడు సార్లయినా నగరంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిపైనా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షిస్తుంటారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా ప్రభుత్వ అతిథి గృహానికి పిలిపించుకుని కీలక అంశాలపై చర్చిస్తుంటారు. ఒక్కోసారి తన ఇంటికి కూడా పిలిపించుకుంటారు, ఇలా ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరు.వారికి కనీస సమాచారం కూడా ఉండదు, ఇలాంటి రహస్య భేటీలో ఎక్కువగా భూములకు సంబంధించిన అంశాలపైనే చర్చిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  విజయసాయిరెడ్డి విశాఖ జిల్లాకు వైసీపీ ఇన్ చార్జ్, ఆ హోదాతో ఆయన పార్టీ కార్యక్రమాలపై సమీక్షించవచ్చు, ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలపై సమీక్షించే అధికారం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. అయినా సరే సార్ పిలిచారంటే చాలు ఐఏఎస్, ఐపిఎస్ లు రెక్కలు కట్టుకొని వాలి పోవాల్సిందే. ఇక కలెక్టరేట్ లో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో సాయిరెడ్డి మధ్యలో కూర్చుంటారు. కలెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరూ ఆయనకే అన్ని వివరాలూ చెబుతారు. విశాఖ జిల్లాలో మంత్రుల కంటే ఆయనే పవర్ ఫుల్, ఆయన అపాయింట్ మెంట్ కూడా ప్రముఖులకే లభిస్తుంది. తాము హాల్లో కూర్చుని వెనక్కి రావాల్సిందే తప్ప ఆయనను కలిసే భాగ్యం దక్కదని పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతుంటారు. నిజానికి పార్టీ ఇన్ చార్జి గా ఆయన వైసీపీ కార్యకర్తలు, నేతలకే ఎక్కువగా అందుబాటులో ఉండాలి కానీ, అధికారిక సమీక్షల పైనే అధికంగా దృష్టి సారిస్తుంటారు. ఇక సాయిరెడ్డి విశాఖ నగరంలోకి వచ్చారంటే చాలు పోలీస్ కమిషనరేట్ లోని ఒక అధికారి పూర్తిగా ఆయన సేవలోనే ఉంటారు. సీతమ్మధారలో ఎంపీ తీసుకున్న నివాసంలోనే మకాం వేస్తారు. సాయిరెడ్డి తిరిగి వెళ్లేదాకా అదే డ్యూటీ. ముందే చెప్పినట్లు సాయిరెడ్డికి విశాఖ పైన ప్రత్యేక ఆసక్తి, రాజ్యసభ సభ్యుడిగా విశాఖనే దత్తత తీసుకున్నారు. మరెక్కడా కాకుండా ఇక్కడే ప్రగతి భారతి పేరిట ఒక సేవా ట్రస్ట్ ను స్థాపించారు. అధికారంలోకి రాగానే ఏర్పాటైన ఈ ట్రస్టుకు విశాఖ నగరంలోని ప్రముఖులు వ్యాపారులు పోటీలు పడి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. విశాఖ లోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ ట్రస్టుకు నిధులు ఇవ్వాలని సాయి రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ జిల్లాకు గతంలో మోపిదేవి వెంకట రమణ ఇన్ చార్జి మంత్రిగా ఉండేవారు. మూడు నెలల క్రితమే ఆయనను మార్చి కన్నబాబును నియమించారు. ఇక్కడ సాయిరెడ్డి అన్ని వ్యవహారాలూ చూసుకోవడంతో ఇన్ చార్జి మంత్రి విశాఖ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని చెబుతారు. ఇటీవల సాయిరెడ్డి విశాఖకు వచ్చారు, నెలకు రెండు మూడు సార్లు వస్తూనే ఉంటారు కదా ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా ఖచ్చితంగా ఉంది. ఈ సారి కొందరు న్యాయ నిపుణులతో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన సిరిపురంలోని ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లారు. ఐఏఎస్ అధికారులు వినయ్ చంద్ సృజన కోటేశ్వరరావులను పిలుపించుకున్నారు. ఈ అతిథి గృహానికి ఎదురుగా ఉన్న వాల్తేరు క్లబ్, పక్కనున్న దస్పల్లా భూముల పైనే చర్చ జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతరుల స్వాధీనంలో ఉన్న ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. విశాఖలో అగ్రశ్రేణి వాల్తేర్ క్లబ్ లీజుకు తీసుకున్న స్థలంలోనే నడుస్తోంది. ఆ భూముల వారసులు వాటిని విక్రయించాలనే యోచనలో ఉన్నారు. క్లబ్ ను ఖాళీ చేయాలని కోరగా కార్య వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అలాగే దసపల్లా భూములు కూడా చేతులు మారి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భూములపై ఐఏఎస్ అధికారులతో సాయిరెడ్డి ప్రత్యేకంగా చర్చించడం సంచలనం సృష్టించింది. అధికారుల నుంచి పూర్తి సమాచారం తీసుకుని న్యాయ నిపుణుల సలహాలతో వాటిని కోరుకున్న వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. తిరిగి వెళ్తూ రెండు అట్టపెట్టెల్లో ఫైళ్లు కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. ఏదేమైనా విజయసాయి తీరు విశాఖ లోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఉచిత పథకాలతో ముప్పు... మాఫీలతో వ్యవస్థకే దెబ్బ

దేశ ఆర్ధిక వ్యవస్థ, స్థితిగతులకు అద్దంపట్టే ఆర్ధిక సర్వే కేంద్రానికి పలు కీలక సూచనలను చేసింది. దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధిబాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులు... ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపై ఆర్ధిక సర్వే పలు సూచనలు చేసింది. ముఖ్యంగా భారత్‌... ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారాలంటే మాత్రం నైతిక విలువలతో కూడిన సంపద చాలా కీలకమంటూ తేల్చిచెప్పింది. ఇక, రానున్న ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆర్ధిక వృద్ధి 6 నుంచి 6.5 శాతం ఉండొచ్చని ఆర్ధిక సర్వే అంచనా వేసింది. మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం... వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం... ఆర్ధిక వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా... ఇది సాధించవచ్చని తెలిపింది. రానున్న ఆర్ధిక సంవత్పరంలో అంతర్జాతీయ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయని అంచనా వేసింది. అయితే, ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు ఉండాలని ఆర్ధిక సర్వే అభిప్రాయపడింది. అలాగే, లాభదాయకత, సామర్ధ్యం, పోటీతత్వం, నైపుణ్యం పెరగాలంటే... వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ జరగాలని ఆర్ధిక సర్వే నిపుణులు సూచించారు. ఇక, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో జీఎస్టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశముందని అంచనా వేసింది. ఇక, తాలినామిక్స్ పేరుతో అర్ధశాస్త్రాన్ని సామాన్యుడికి అన్వయించే ప్రయత్నం చేసిన ఆర్ధిక సర్వే నిపుణులు.... ఒక ప్లేటు భోజనం కొనుగోలు చేసే శక్తి 29శాతం మెరుగుపడిందని తేల్చారు. ఇక, ఉచిత పథకాలు ఆర్ధిక వ్యవస్థకు నష్టదాయకమని ఆర్ధిక సర్వే తేల్చిచెప్పింది. ఉచిత పథకాల లబ్ధిదారులు తక్కువ ఖర్చు పెడతారు... తక్కువ పొదుపు చేస్తారు... అలాగే, తక్కువ పెట్టుబడి పెడతారని విశ్లేషించారు. అలాగే, మాఫీలు కూడా రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆర్ధిక సర్వే స్పష్టంచేసింది. మొత్తంగా దేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన పలు కీలక సూచనలను కేంద్రం ముందుంచింది ఆర్ధిక సర్వే. మరి, వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందో లేదో.

రోజా - పెద్దిరెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం... తలలు పట్టుకుంటున్న వైసీపీ శ్రేణులు...

ప్రతిపక్షంలో ఉండగా సైలెంట్ గా ఉన్న వైసీపీ లీడర్లు... అధికారంలోకి వచ్చాక ఆధిప్యతం కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఆమధ్య నెల్లూరు జిల్లాలో ఎమ్మెుల్యేలు కోటంరెడ్డి-కాకాని గొడవలతో సింహాపురి వైసీపీ పరువు రోడ్డున పడగా... ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ముఖ్యనేతల మధ్య హైఓల్టేజ్ వార్ మొదలైంది. ప్రస్తుతానికి ఇది ప్రచ్ఛన్నయుద్ధంగానే సాగుతున్నా... ఏదోఒకరోజు మాత్రం అగ్నిపర్వతంలా బద్ధలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నగిరి వైసీపీ లీడర్ కేజే కుమార్ కేంద్రంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.... నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా మధ్య మొదలైన సైలెంట్ వార్ తారాస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇరువురి మధ్య ప్రచ్ఛన యుద్ధం జరుగుతోందని అంటున్నారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పెరిగిపోయాయని చెబుతున్నారు. తాజాగా బయటికి వచ్చిన రోజా వాయిస్ మెసేజే ఇందుకు రుజువు అంటున్నారు. నగరి వైసీపీ లీడర్ కేజే కుమార్ ...తన షష్టిపూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆదిమూలంను ఆహ్వానించాడు. అయితే, రోజాతో ఉన్న విభేదాలతో నియోజకవర్గ ఎమ్మెల్యే అయినాసరే ఆమెను కేజే కుమార్ పక్కనబెట్టాడు. దాంతో, మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న కేజే కుమార్ కార్యక్రమానికి వెళ్లొద్దంటూ తన నియోజకవర్గ వైసీపీ నేతలకు, కార్యకర్తలకు రోజా అల్టిమేటం ఇచ్చారు. తన మాటను కాదని ఎవరైనా వెళ్తే శాశ్వతంగా పార్టీకి దూరమవుతారంటూ నగరి వైసీపీ శ్రేణులను రోజా హెచ్చరించారు. మొత్తానికి నగరి వైసీపీ నేత కేజే కుమార్‌ బర్త్‌డే వేడుకల కేంద్రంగా చిత్తూరు జిల్లా వైసీపీలో బయటపడిన ఆధిపత్య పోరు కలకలం రేపుతోంది. ఒకరు సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... మరొకరు ఫైర్ బ్రాండ్ రోజా కావడంతో... ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని జిల్లా వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయి.

చిన్న యేసు బతికొచ్చాడు... మరి ఆ మృతదేహం ఎవరిది? తూర్పుగోదావరిలో డెడ్ బాడీ మిస్టరీ

తూర్పుగోదావరి జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. పిఠాపురం మండలం కుమారపురం గ్రామం మురికి కాలువలో ఒక మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు... ఆ మృతదేహాన్ని బయటికి తీశారు. అయితే, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో చొక్కా ఆధారంగా గ్రామానికి చెందిన చిన్నయేసుగా గ్రామస్తులు అనుమానించారు. చిన్నయేసు భార్య కూడా తన భర్తేనంటూ గుర్తించింది. గ్రామస్తులు, చిన్నయేసు భార్య మాట మేరకు పోలీసులు... పోస్టుమార్టం పూర్తి చేయించి డెడ్ బాడీని చిన్నయేసు కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో, చిన్నయేసు కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే, ఇక్కడే కథ మలుపు తిరిగింది. మురికి కాలువలో దొరికిన మృతదేహాన్ని తన భర్తే అనుకుని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా... సడన్‌గా చిన్నయేసు ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు కంగుతిన్నారు. చనిపోయాడనుకున్న చిన్నయేసు ఎలా బతికొచ్చాడంటూ ఆశ్చర్చపోయారు. ఇక, కుటుంబ సభ్యుల ఆనందానికైతే ఆవధుల్లేకుండా పోయాయి. చనిపోయాడనుకున్న భర్త తిరిగిరావడంతో భార్య ఉబ్బితబ్బియ్యింది. అయితే, ఇక్కడే మరో సస్పెన్స్ మొదలైంది. మరి, మురికి కాలువలో మృతదేహం ఎవరిది? అసలు అతనెవరు? గ్రామస్తులు చిన్నయేసుగా ఎందుకు చెప్పారు? చిన్నయేసు భార్య కూడా తన భర్తేనని ఎలా చెప్పింది? పొరపాటున చెప్పారా? లేక ఇందులో ఏమైనా తిరకాసు ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  అయితే, చనిపోయాడనుకున్న చిన్నయేసు ధరించిన చొక్కా.... మురికి కాలువలో దొరికిన మృతదేహంపైనున్న చొక్కా.... ఒకేవిధంగా ఉండటంతో.... తాము పొరపడ్డామని గ్రామస్తులు అంటున్నారు. తాగుడుకు బానిసైన చిన్నయేసు... నాలుగైదు రోజులుగా కనిపించకపోవడంతో... మరణించింది అతేనని అనుకున్నామని అన్నారు. చిన్నయేసు భార్య కూడా.... కాలువలో కనిపించిన మృతదేహం తన భర్తేనని చెప్పిందని అన్నారు. అయితే, పని నిమిత్తం తాను కాకినాడ వెళ్లానని.... కానీ నేను చనిపోయానని తన భార్య, గ్రామస్తులు అనుకున్నారని చిన్నయేసు అంటున్నాడు. అయితే, తాను సజీవంగా తిరిగి రావడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆనందంతో ఆశ్చర్యపోతున్నారని చెబుతున్నాడు. అయితే, గ్రామస్తులు... చిన్నయేసు భార్య... చెప్పిన ప్రకారమే.... తాము పోస్టుమార్టం నిర్వహించి డెడ్‌బాడీని అప్పగించామని, కానీ చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో.... దొరికిన మృతదేహం ఎవరనేది గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి, చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా తిరిగి రావడంతో ఒక ట్విస్ట్ అయితే... అసలు మురికి కాలువలో దొరికిన మృతదేహం ఎవరిదనేది సస్పెన్స్ గా మారింది.

బడ్జెట్ బాగుంటే తారాజువ్వలా... లేదంటే కుదేలే... నిర్మలమ్మ పద్దు ఎలాగుంటుందో?

తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, ఉల్లి ధరల నుంచి ఆర్ధిక మందగమనం వరకు అనేక సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు కనిపిస్తున్నాయి. దేశ ఆర్ధిక పరిస్థితి... ప్రపంచ రాజకీయాలు... ఇలా అన్నీ భారత్‌కు ప్రతికూలంగా పరిణమించాయి. ముఖ్యంగా దేశ ప్రగతిని ముందుకు నడిపించే జీడీపీ వృద్ధిరేటు పతనం కావడం... నిరుద్యోగ రేటు 40ఏళ్ల గరిష్టానికి చేరడం... ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలవడం వంటి సమస్యలు... ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు విసురుతున్నాయి. వృద్ధి అంచనాలు కూడా 42ఏళ్లలో అతిస్వల్పంగా నమోదుకావడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధి రేటు, ఆర్ధిక మందగమనం పెనుసవాలు విసురుతున్నాయి. ఇలాంటి, పరిస్థితుల్లో దేశంలో అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తి మీద సామే అంటున్నారు. అయితే, నిర్మలా బడ్జెట్‌ అన్ని వర్గాలను ఆకట్టుకుందో లేదో స్టాక్ మార్కెట్లు క్షణాల్లో చెప్పేస్తాయని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యయాలు బాగుండి... వ్యవస్థలోకి నగదు ప్రవాహం ఉండేలా చూస్తే మార్కెట్లు తారాజువ్వలా పెరుగుతాయని... బడ్జెట్ బాగుందనడానికి ఇదే రుజువని చెబుతున్నారు. ఒకవేళ ఆత్మరక్షణ వ్యూహంతో బడ్జెట్ సాగితే మాత్రం మార్కెట్లు భారీగా పతనమవడం ఖాయమని అంటున్నారు. గతేడాది నిర్మలా బడ్జెట్ తర్వాత మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని... దానికి అనుగుణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఇబ్బందుల్లోకి జారిపోయిందని గుర్తుచేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా ఆరు రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్, అగ్రికల్చర్, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్‌, మెటల్‌ అండ్ ఇన్వెస్ట్‌ మెంట్‌ రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, గత పదేళ్లలోనే అత్యంత కష్టమైన బడ్జెట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, నిర్మలమ్మ... ఈ సవాళ్లను ఎలా అధిగమించి... అందరినీ మెప్పించేలా బడ్జెట్‌ను ప్రవేశపెడతారో లేదో చూడాలి. అయితే, నిర్మలమ్మ బట్జెట్ బాగుంటే స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా లేస్తాయని... లేదంటే, భారీగా పతనమవుతాయని... అన్ని వర్గాలను సంతృప్తిపర్చారో లేదో తెలియాలంటే ఇదే రుజువు అంటున్నారు. 

అనుమానించినట్లే జరిగింది... మూడోసారి వాయిదా పడింది...

అంతా అనుమానించినట్లే జరిగింది... చివరి నిమిషంలో ఉరి ఆగిపోయింది... ఎలాగైనా ఉరిశిక్షను వాయిదా పడేలా చేయాలన్న నిర్భయ దోషుల ప్రయత్నం ఫలించింది. న్యాయవ్యవస్థలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకున్న నిర్భయ దోషులు మూడోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడేలా చేసుకున్నారు. డెత్ వారెంట్ ప్రకారమైతే ఈపాటికి నలుగురు నిర్భయ దోషులు ఈ భూమ్మీద లేకుండా పోయేవారు. కానీ, ఉరిశిక్ష అమలుకు సరిగ్గా పది పన్నెండు గంటల ముందు ఢిల్లీ పాటియాలా కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే కొత్త డెత్ వారెంట్ జారీ చేస్తామని తెలిపింది. ఉరిశిక్షను సవాలు చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ పాటియాలా కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ దోషులు కోరారు. అయితే, ఒక్కడి మెర్సీ పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉన్నందున మిగతా ముగ్గుర్నీ ఉరితీయోచ్చంటూ ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, ఒక కేసులో మరణశిక్ష పడిన దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలన్న నిబంధన ఉండటంతో దోషుల వాదనను సమర్ధిస్తూ ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా కోర్టు స్టే విధించింది.  మూడోసారి ఉరిశిక్ష వాయిదా పడటంతో నిర్భయ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయంటూ కంటతడి పెట్టారు. వాళ్లను ఎప్పటికీ ఉరి తీయరంటూ దోషుల తరపు లాయర్ ఏపీసింగ్ సవాల్ విసిరాడని మీడియాతో చెప్పారు. అయితే, దోషులకు ఉరిశిక్ష అమలుచేసేవరకు తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

రోజా అండ్ కుమార్ మధ్య గొడవకు కారణమేంటి? పెద్దిరెడ్డి పాత్రేంటి?

వైసీపీలో రోజా ఆడియో టేప్‌ కలకలం సృష్టిస్తోంది. సొంత పార్టీ నాయకులకే ఆమె వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న కేజే కుమార్ ఫంక్షన్ కి నగరి వైసీపీ శ్రేణులను రోజా ఎందుకు వెళ్లొద్దన్నారంటూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ కేజే కుమార్ తోనూ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ గొడవేంటంటూ వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. కేజే కుమార్ ఫంక్షన్ కి వెళ్తే ...పార్టీ నుంచి వెళ్లిపోయినట్లేనంటూ రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం వెనుక కారణాలేంటని చర్చించుకుంటున్నారు. కేజే కుమార్... ఇతను నగరి వైసీపీ స్థానిక నాయకుడు... గతంలో నగరి మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశాడు... అంతేకాదు స్థానికంగా కుమార్ కు మాంచి పట్టుంది. అయితే, రోజాకి కేజే కుమార్ అస్సలు పడదు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే, ఇద్దరూ ఉన్నది ఒకే పార్టీలో... పైగా ఒకటే నియోజకవర్గం... మరి, వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఎందుకొచ్చాయనుకుంటున్నారా? దానికి బలమైన కారణమే ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేజే కుమార్.... 2014లోనూ... అలాగే 2019లోనూ నగిరి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా లాబీయింగ్ చేశాడు. కానీ, జగన్ దగ్గర రోజాకున్న పలుకుబడి ముందు తేలిపోయాడు. దాంతో, మొన్నటి ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా కేజే కుమార్ పనిచేశాడని... ఓడించేందుకు కుట్ర పన్నాడని రోజా రగిలిపోతున్నారు. అందుకే, కేజే కుమార్ ఫంక్షన్ కు ఎవరూ వెళ్లొద్దంటూ రోజా అల్టిమేటం ఇవ్వడమే కాదు... స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఒకే పార్టీలో ఉంటూ... తనను ఓడించడానికి ప్రయత్నించిన కుమార్‌ ఫంక్షన్‌కు ఎలా వెళ్తారంటూ రోజా మాట. అయితే, రోజా వార్నింగ్ తో నగరి వైసీపీ నేతలు, కేడరే కాదు.... అతిథులు సైతం గైర్హాజరైనట్లు తెలుస్తోంది. కారణాలేమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు రాకుండా ఆగిపోయారట. అంతేకాదు రోజాతో గొడవ నేపథ్యంలో రాలేమని చెప్పారట. అయితే, నగరి నియోజకవర్గంలో కోల్డ్ వార్ పై అధిష్టానం కోపంగా ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోవడం పార్టీకి మంచిది కాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

తగ్గనున్న పన్ను భారం.. బడ్జెట్ పై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది

జామియా చుట్టూ తిరుగుతున్న హస్తిన రాజకీయం!

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జామియా వర్సిటీ ప్రాంగణంలో గత నెలలో జరిగిన హింసాత్మక ఘటనలు మరువక ముందే మరో ఘటన జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ చేసిన జామియా వర్సిటీ విద్యార్థుల పై ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడిలో ఓ వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపు లోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన పై రాజకీయ దుమారం రేగుతోంది. జామియా వర్సిటీ దగ్గర జరిగిన కాల్పుల ఘటన పై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని ఇలాంటి ఘటనలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నేరస్తులు ఎక్కడికీ తప్పించుకోలేరన్నారు. పౌరసత్వ  సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదే కోరుకుంటున్నారా అంటూ ప్రశంసించింది. జామియా కాల్పుల ఘటన పై ప్రియాంక గాంధీ కూడా ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటనకు బీజేపీయే కారణమంటూ ఆమాద్మీ పార్టీ ఆరోపించింది. రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీ చర్యల వల్లే పోలీసులు మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్షాల పై బిజెపి ఎదురు దాడికి దిగింది. సీఏఏ కు వ్యతిరేక నిరసనని ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రోత్సహిస్తోందని పలువురు బిజెపి నాయకులు ఆరోపించారు. షహీన్ బాగ్ లో జరిగిన నిరసనలకు కూడా ఆ పార్టీయే కారణమని.. ఆ ఆందోళనలకు సంబంధించిన ఖర్చులను కూడా ఆప్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుగానే పరిగణించాలని ఈసీని కోరారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను రికార్డులను ఈసీకి సమర్పించింది. మొత్తానికి మరోసారి జామియా వర్సిటీలో సీఐఏ మంటలు చెలరేగాయి. తమకు రక్షణ కల్పించాలంటూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కాస్తా రాజకీయ రంగు పులుముకుని పార్టీల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది.