అర్ధరాత్రి ఉత్తర్వులు.. మూడు రాజధానుల ఏర్పాటుకు తొలి అడుగు పడింది
posted on Feb 1, 2020 @ 12:00PM
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతోంది. ఒక పక్క ఉగాది నుండి విశాఖ వేదికగా పాలన సాగించాలని చూస్తున్న జగన్ సర్కార్.. తాజాగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. కర్నూలుకు తరలిస్తున్న కార్యాలయాల్లో రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలకు అవసరమైన భవనాలను ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖకు, కర్నూలు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అర్థరాత్రి దాటాక ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కర్నూలు ఉన్నతాధికారులు ప్రస్తుతం కార్యాలయాల ఏర్పాటు పనిలో నిమగ్నమయ్యారు.