యాభైవ రోజుకు చేరుకున్న రాజధాని ఆంధోళన.. రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటన...

  అమరావతి రైతుల ఆందోళనలు యాభైవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా ఈరోజు కూడా రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మరోవైపు తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ సర్కార్ పై టిడిపి అధినేత తీవ్ర విమర్శలు చేశారు. అయితే గతంలో రైతుల్ని అన్యాయం చేసి ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసిపి మండిపడింది. రాజధాని వికేంద్రీకరణపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తమ పార్టీ ధర్మం కోసం పోరాడుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సభలో మాట్లాడిన ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు 37 మంది చనిపోయారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు చంద్రబాబు. వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెనాలిలో చిల్లర రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారాయన. అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అటు తనను తెనాలి రానివ్వనన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ పై మండిపడ్డ బాబు ఈ పిల్ల కుంక నాకు రాజకీయాలు నేర్పిస్తాడా అంటూ ప్రశ్నించారు. మరోవైపు రాజధాని రైతుల్ని రెచ్చగొట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని వైసిపి మండిపడింది. కేవలం రియల్ ఎస్టేట్ కోసమే గతంలో ఇక్కడ భూసేకరణ చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయానికి రాజధాని రైతులతో కలిసి వెళ్ళిన ఆయన వారి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. రాజధాని రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇటు రాజధాని వికేంద్రీకరణపై రైతుల పోరాటం మొదలుపెట్టి నేటికి యాభై రోజులు అయ్యింది, ఈరోజు కూడా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించనున్నారు.

మహానగరాన్ని తలపిస్తున్న మేడారం జాతర...

వనమంతా జనమైంది, మహా జాతర ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి బయలుదేరారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు పయనమై వస్తున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభమవుతోంది. వేల సంఖ్యలో గుడారాలు, దుకాణాలతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం మహానగరాన్ని తలపిస్తోంది. అసలైన జాతర నాలుగు రోజుల పాటు జరగనుంది. నెల రోజుల నుంచే భక్తులు లక్షల సంఖ్యలో వనదేవతను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఇప్పటికే నలభై లక్షల మంది తల్లులను దర్శించుకున్నారు. జాతర నాలుగు రోజుల్లో అరవై లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభించింది. మేడారంలో భక్తులు తల్లులను దర్శించుకునేందుకు క్యూ లైన్ లు సిద్ధం చేశారు. జంపన్న వాగు స్నానఘట్టాల పొడవునా నాలుగు కిలోమీటర్ల మేర జల్లు స్నానాలకు ఐదు వేల షవర్లు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకునేందుకు పద్నాలుగు వందల కంపార్టుమెంట్ లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 8400 తాత్కాలిక మరుగు దొడ్లను నిర్మించారు. రాజమండ్రి నుంచి 3500 మంది, వరంగల్ మహానగర పాలక సంస్థ నుంచి 600 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారంలో తమ సేవలు అందిస్తున్నారు. మరోవైపు మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యార్థం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి ఎంటర్ సెక్టోరల్ బృందాలు ప్రతిరోజు సమావేశమై ప్రణాళిక రూపొందించుకుని ఉన్నాయి. మరోవైపు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ సారి కూడా అంచనాలకు మించి వస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్ సర్వీసు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల ఏడున సీఎం కేసీఆర్ అమ్మలను దర్శించుకోనున్నారు.

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ రివర్స్ గేమ్... యడియూరప్పకు షాకిచ్చేందుకు స్కెచ్...

నెంబర్ గేమ్ తో సంకీర్ణ సర్కారును కూలదోసి కర్నాటకలో గద్దెనెక్కిన బీజేపీకి అదే ఫార్ములాతో రివర్స్ షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పావులు కదుపుతున్నాయి. గతేడాది కాంగ్రెస్-జేడీఎస్ సర్కారుపై తిరుగు బావుటా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబల్ ఎమ్మెల్యేలు తాము ఆశించిన పదవులు దక్కకపోవడంతో మళ్లీ సొంత గూటివైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పదవులు ఆశించి ఆనాడు యడియూరప్పకు సహకరించిన కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు... ఆ తర్వాత అనర్హత వేటుతో తమ పదవులను కోల్పోయి... తిరిగి ఉపఎన్నికల్లో గెలిచారు. అయితే, వీళ్లంతా కేబినెట్లో పదవులు ఆశించగా భంగపాటు ఎదురైంది. దాంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.  మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కవన్న అంచనాకి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు యడియూరప్పపై తిరుగుబాటు ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు పంపుతున్నారు. అయితే, వాళ్ల సంకేతాలను గుర్తించిన కాంగ్రెస్, జేడీఎస్ లు... మళ్లీ సొంత గూటికి తిరిగొస్తామంటే పరిశీలిస్తామంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నాయి. దాంతో, కర్నాటకలో మళ్లీ నెంబర్ గేమ్ మొదలుకానుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలంతా తిరిగి రావాలంటూ కుమారస్వామే స్వయంగా పిలుపునివ్వడంతో కర్నాటక రాజకీయం మరోసారి రసవత్తరంగా మారనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి, రెబల్ ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు లొంగుతారో లేక మరోసారి నెంబర్ గేమ్ కు తెరలేపుతారో చూడాలి.

మొత్తం సైన్యాన్ని ఢిల్లీలో మోహరించిన బీజేపీ... ఒక్కడ్ని ఓడించేందుకు కమలదళం తిప్పలు...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార ఆప్... అపోజీషన్ బీజేపీ... ఇంటింటి ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. సభలు, ర్యాలీలతో రెండూ పార్టీలూ హోరాహోరీగా క్యాంపైనింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ అండ్ బీజేపీ మధ్యే సాగుతోంది. దాంతో, ఆప్ అండ్ బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, సర్వే సంస్థలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతున్నా... ఈసారి మాత్రం ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ముందుకెళ్తోంది. అందుకే, సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న కమలనాథులు... టాప్ లీడర్స్ ను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. కేజ్రీవాల్ ను ఎలాగైనాసరే ఢిల్లీ గద్దె పైనుంచి కిందికి దింపాలనుకుంటున్న బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. సర్వేలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతుండటంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టాప్ లీడర్స్ అందర్నీ బీజేపీ రంగంలోకి దించుతోంది. ఏకంగా 11మంది ముఖ్యమంత్రులు, 59మంది కేంద్ర మంత్రులు, 200మంది ఎంపీలు, 1000మందికి పైగా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి ఢిల్లీ గల్లీల్లో ప్రచారం చేయిస్తోంది. కాషాయ ముఖ్యమంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు.  ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఎంపీలు, 15మంది ఎమ్మెల్యేల చొప్పున ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్న బీజేపీ ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకుండా అందర్నీ కలిసేలా ప్రచారం చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులైతే బూతుల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గైడెన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా... లక్షన్నర మంది బీజేపీ సైనికులు కూడా ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. ఇక, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ అయితే, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లను కోరుతున్నారు.

స్థానిక సమరం.. ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

ఏపీలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల ( ఫిబ్రవరి ) 17వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే నెల ( మార్చి ) 15వ తేదీలోగా ఎన్నికలను పూర్తి చేయాలి. ఈ ఎన్నికలకు ప్రభుత్వం రంగం చేస్తుంది. ముందుగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవ్వగానే.. నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. రిజర్వేషన్ల విషయాలో హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.  ఇక జగన్ సర్కార్ వేసిన మూడు రంగులు కూడా తొలగించాలని తీర్పును ఇచ్చింది హై కోర్టు. పార్టీ రంగులను గ్రామ పంచాయతీలకు వేయడాన్ని తప్పు పడుతూ.. అలా చేయడం మంచి పద్ధతి కాదని మందలించింది. మూడు రాజధానుల రభస.. రైతుల తిరుగుబాటు.. అన్ని అంశాలు ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.

వైష్ణవి హాస్పిటల్స్ ఎండీ అజయ్ కుమార్ ఆత్మహత్య

హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని వైష్ణవి హాస్పిటల్స్ ఎండీ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంత ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడే ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తన చావుకి నలుగురు వ్యక్తులు కారణం అంటూ ఏడు పేజీల సూసైడ్ నోట్ రాశారు అజయ్. వైష్ణవి ఆసుపత్రి బిల్డింగ్ యజమాని కరుణాకర్ రెడ్డి, అతడి బావమరింది కొండల్ రెడ్డితో పాటు సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెగా రెడ్డి, కాంగ్రెస్ నేత శివకుమార్ తనను మానసికంగా వేధించారని అందులో పేర్కొన్నారు అజయ్.  ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ లో పేర్కొన్న వ్యక్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక వారిని విచారించి ఆత్మహత్యకు గల అసలు కారణాలను వెల్లడించనున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. ఈ కేసు విచారణ వేగంగా పూర్తి చెయ్యడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఆ నలుగురు వ్యక్తులు దొరికే వరకు నిజానిజాలు తెలిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

జగన్ కి షాక్.. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే!

విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండగా.. విజిలెన్స్ కార్యాలయాలను కర్నూలుకు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26 వరకు కార్యాలయాల తరలింపునపై స్టే విధిస్తినట్లు హైకోర్టు పేర్కొంది. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ.. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై స్టే విధించింది.

ఢిల్లీ పొలిటికల్ వార్.. కేజ్రీవాల్ ఉగ్రవాది.. దమ్ముంటే అరెస్టు చెయ్యండి

కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది.. ఆయన ఓ టెర్రరిస్ట్ అని నిరూపించేందుకు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్. ఇక అదే మాటను ఎన్నికల ప్రచారంలో తెగ వాడేస్తున్నారు కేజ్రీవాల్. నేను ఉగ్రవాదినా..? మీరే చెప్పండి అంటూ అమాయకంగా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారు. అందుకు సమాధానంగా కేజ్రీవాల్ ఉగ్రవాదేనంటూ జవదేకర్ అన్నారు. ఒకానొక సమయంలో స్వయంగా తనకు తాను అరాచకవాదినని కేజ్రీవాల్ చెప్పుకున్న సంగతిని మంత్రి గుర్తుచేశారు. అరాచకాలకు పాల్పడే వారిని ఉగ్రవాదితో పోలిస్తే తప్పేంటి అని.. రెండింటికి పెద్ద తేడా లేదని ఆయన పేర్కొన్నారు.  ఇక ఈ వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచాయి. మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడ్డారు. అంతే కాకుండా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని సంభోదిస్తున్నపుడు భాష ముఖ్యమని గుర్తు చేశారు. ఇక మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన తరువాత ఆయన మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆప్ పార్టీ పేరును ముస్లిం లీగ్ అని మార్చుకోమంటూ హితవు పలికారు బీజేపీ నేత కపిల్ మిశ్రా.  

ఆట ఇంకా మొదలు కాలేదు.. రాజధానిని అంగుళం కూడా కదిలించలేరు

మూడు రాజధానుల అంశం ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారికి మద్దతుగా ప్రతిపక్షాలు నిలుస్తున్నాయి. ఇక ఎవరేమన్నా.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా లేదని అంటుంది జగన్ సర్కార్. ఈ సందర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. రాజధానిని అమరావతి నుండి ఒక్క అంగుళం కూడా కదిలించలేరంటూ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఆట ఇంకా మొదలు కాలేదని.. వీళ్ళు తీసుకునే నిర్ణయాలకు కేంద్రం ఏకీభవించదని తేల్చి చెప్పేశారు. సరైన సమయానికి కేంద్రం ఇందులో జోక్యం చేసుకుంటుందని చెప్పారు. రాజధాని విషయంలో రాజ్యాంగపరంగా , న్యాయపరంగానే ముందుకు వెళ్తామని.. అభివృద్ధి పేరుతో జగన్ కాలయాపన చెయ్యడమే కాకుండా ఉన్న పెట్టుబడిదారులను కూడా వెనక్కి పంపుతున్నారని అన్నారు. తమ సొంత తెలివితేటలతో కమిటీలు వేసి.. ఆ రిపోర్ట్ తామే ఇచ్చి ప్రజలను మభ్యపరుస్తున్నారని విమర్శించారు. నెగటివ్ కమిటీలను కాకుండా ధైర్యంగా ఒక పాజిటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని సుజనా సూచించారు. రాజధానిగా అమరావతిని స్వయంగా మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

ఏపీ డిప్యూటీ సీఎం లేఖపై హైకోర్టు సీరియస్.. అంతా మీ ఇష్టమేనా?

"దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు" అని రజినీకాంత్ డైలాగ్ చెప్పినట్టుగా.. "ఉపముఖ్యమంత్రి చెప్పాడు, నేను చేస్తాను" అంటూ ఓ జాయింట్‌ కలెక్టర్.. సామాన్యులపై ప్రతాపం చూపించాడు. చివరికి హైకోర్టు చేత అక్షింతలు వేయించుకున్నాడు. ‘కింద పేర్కొన్న రేషన్‌ షాపులను రద్దు చేయండి. వాటిని నేను సూచించిన వారికి ఇవ్వండి’ అంటూ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి లేఖ రాశారట. ఇంకేముంది, ఉప ముఖ్యమంత్రి లేఖతో జాయింట్‌ కలెక్టర్‌, మిగతా అధికారులు రంగంలోకి దిగారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెదకంటిపల్లిలో పి.మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్‌ షాపు అనుమతిని గతేడాది డిసెంబరు 2న రద్దు చేశారు. రేషన్‌ షాపు నిర్వహణలో లోపాలున్నాయని, అందుకే రద్దు చేశామని చెప్పుకొచ్చారు. అయితే, ఆ ఆరోపణల్లో నిజం లేదని, తాను వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా రేషన్‌ షాపు రద్దు చేసారంటూ మోహనాంబ హైకోర్టు గడప తొక్కారు. తన రేషన్‌ షాప్ రద్దు చేయాలని ఉపముఖ్యమంత్రి రాసిన లేఖను సైతం ఆమె కోర్టు ముందుంచారు.  ‘‘ మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్‌ షాపులో అధికారులు తనిఖీ కూడా చేయలేదు. ఆమె దుకాణాన్ని రద్దు చేయాలని గంగాధర నెల్లూరు తహసీల్దార్‌ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీనికి ఉప ముఖ్యమంత్రి లేఖే కారణం’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. మొత్తం ముగ్గురు డీలర్లను మార్చి, వారి స్థానంలో తాను సూచించిన వారిని ఎంపిక చేయాలని ఉపముఖ్యమంత్రి స్పష్టంగా పేర్లతో సహా సిఫారసు చేసినట్లు ఆ లేఖలో ఉందని తెలుస్తోంది.  ఉపముఖ్యమంత్రి మంచి రాజకీయ నాయకుడని, లేఖపై సంతకం ఆయనదే కానీ, ఏం సిఫారసు ఉందో ఆయనకు తెలియదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘‘డీలర్‌ను నియమించడానికి లేదా తొలగించడానికి ఒక విధానం ఉంది. ఉపముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించకూడదు. ఫలానా వ్యక్తిని డీలర్‌గా నియమించాలని సిఫారసు చేయకూడదు’’ అని కాస్త గట్టిగానే చెప్పారు. అధికారులు నాయకుల కనుసన్నల్లో కాదని, నిబంధనల మేరకు నడచుకోవాలని హితవు పలికారు.

ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన గల్లా జయదేవ్

లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తనపై భౌతిక దాడికి పాల్పడిందంటూ.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు అందజేశారు. కాగా, ఇటీవల అమరావతి రైతులకు మద్దతుగా అసెంబ్లీ ముట్టడికి గల్లా జయదేవ్ యత్నించినప్పుడు పోలీసులు ఆయనపై దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన చొక్కా చినిగిపోవడమే కాకుండా, ఒంటిపై స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ అంశంపై గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో తనను నిర్బంధించారని, రాత్రంతా పోలీసు వాహనాల్లో తిప్పారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీ అని కూడా చూడకుండా... తనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ కోరారు.

ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు.. త్వరలో ప్రధానిని కూడా!

అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని  కలిశారు. రాజధాని కోసం రైతుల ఆందోళనలు, రైతుల పట్ల పోలీసుల తీరును వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ‘రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చాం. ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు. తాము ఆందోళన వ్యక్తం చేస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు’ అంటూ రైతులు తమ గోడుని ఉపరాష్ట్రపతికి వినిపించారు. రాజధాని తరలిపోకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా సూచించాలని కోరారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ  అపాయింట్ మెంట్ లు కూడా కోరామని, వారిని కూడా కలిసి సమస్య వివరిస్తామని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ దొరికితే రైతులు ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సమ్మక్క సారక్కకు బెల్లం అంటే భలే ఇష్టం... అందుకే బెల్లంతో మొక్కులు...

వనదేవతలు సమ్మక్క సారాలమ్మలకు బెల్లం అంటే ప్రీతి. అందుకే, మేడారం జాతరకు వచ్చే భక్తులు... సమ్మక్క సారక్కలకు బెల్లం రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. అలా, వనదేవతలకు సమర్పించే బెల్లాన్ని బంగారంగా భావిస్తారు. కొందరు భక్తులు తమ బరువుకు తగ్గ బెల్లాన్ని తూకమేసి సమర్పిస్తారు. మెజారిటీ భక్తులు తమ స్థోమతకు తగినవిధంగా బెల్లం బంగారాన్ని తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, మేడారం జాతర వచ్చిందంటే బెల్లం ధరలకు ఒక్కసారి రెక్కలు వచ్చేస్తాయి. వ్యాపారులు ఒక్కసారిగా రేటు పెంచేస్తారు. సాధారణంగా కిలో బెల్లం ధర 35 రూపాయల్లోపు ఉంటే... మేడారం జాతర సందర్భంగా దాదాపు 15 రూపాయలు వరకు పెంచేసి కిలో 50కి అమ్ముతున్నారు. అయితే, బెల్లం ధరలు పెంచేసినా అమ్మవార్లకు మొక్కు చెల్లించడం తప్పనిసరి కావడంతో కొందరు భక్తులు చక్కెర సమర్పిస్తున్నారు.  

జగన్ లాగా ఒక్క ఛాన్స్ అంటున్న మోడీ... మరి, ఇస్తారో లేదో?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార ఆప్... అపోజీషన్ బీజేపీ... ఇంటింటి ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. సభలు, ర్యాలీలతో రెండూ పార్టీలూ హోరాహోరీగా క్యాంపైనింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ అండ్ బీజేపీ మధ్యే సాగుతోంది. అయితే, సర్వే సంస్థలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతున్నా... ఈసారి మాత్రం ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ముందుకెళ్తోంది. అందుకే, సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న కమలనాథులు... టాప్ లీడర్స్ ను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ.... బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ రాజధాని ప్రజలను కోరారు. అభివృద్ధిని, మార్పును కోరుకుంటున్న ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్న నరేంద్రమోడీ... ఒక్క అవకాశమిస్తే... డెవలప్ మెంట్ అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తామన్నారు. బీజేపీని గెలిపించండి... అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానంటూ ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ మొత్తం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు పౌర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రజల ఓటు... దేశంలో తమ ప్రభుత్వం చేపడుతున్న మార్పులకు బలం చేకూర్చేలా ఉండాలని మోడీ సూచించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం మార్పు కోసం ఫిబ్రవరి ఎనిమిదిన ఓటుతో బీజేపీకి, ఎన్డీఏకి పట్టం కట్టాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే ఢిల్లీని అభివృద్ధిచేసి చూపిస్తామన్నారు.

వామ్మో రఘునందన్... అత్యాచార ఆరోపణలు నిజమేనా?

చట్టాలు, రూల్సూ రెగ్యులేషన్స్, నీతి నిజాయితీ, నిబంధనలు అంటూ మాట్లాడే తెలంగాణ బీజేపీ నేత ఎం.రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పొలిటికల్ లీడర్ కంటే ముందుగా రఘునందర్ రావు లాయర్ కావడంతో ఆ మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేత, లాయర్ రఘునందన్ రావు తనపై అత్యాచారం చేశాడంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కి మహిళ ఫిర్యాదు చేసింది. విడాకుల విషయంలో తనను ఆఫీసుకు పిలిచిన రఘునందర్ రావు... మత్తు మందు కలిపిన కాఫీ ఇచ్చి... ఆ తర్వాత అత్యాచారం చేశాడని మహిళ ఆరోపిస్తోంది. తనపై అత్యాచారం చేస్తున్నప్పుడు తీసిన వీడియోను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. రఘునందన్ రావు దురాగతంపై ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపిన బాధితురాలు.... తనకు న్యాయం చేయాలంటూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కోరింది. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆ మహిళ ఫిర్యాదు చేసిందని బీజేపీ నేత రఘునందన్ రావు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేవారిపై కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే తనపై ఎవరో ఈ ఫిర్యాదు చేయించారని రఘునందన్ చెబుతున్నారు. హెచ్ ఆర్సీ నుంచి ఫిర్యాదు పత్రాల కాపీని తీసుకుని మహిళ ఆరోపించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు.  అయితే, ఓ మహిళ తనపై రఘునందన్ అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తున్నాడని... హెచ్ఆర్సీని, పోలీస్ కమిషనర్ ఆశ్రయించిందంటే అసలేమీ నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటున్నారు. ఒకవేళ ఆ మహిళ ఆరోపణలు నిజమైతే రఘునందన్ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. అయితే, దిశ ఘటన జరిగినప్పుడు మీడియా డిబేట్స్ లో నీతి వ్యాక్యాలు వల్లివేసిన రఘునందన్ రావుపై... ఓ మహిళ... తనపై అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తున్నాడని ఆరోపించడం మాత్రం కలకలం రేపుతోంది.

కుంభమేళా తర్వాత మేడారమే... మహా జాతరకు హెలికాప్టర్లు...

సమ్మక్క సారక్క జాతర... ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగ... ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను ...తెలంగాణ ప్రభుత్వం... రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహిస్తోంది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం సకల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇక, మేడారం వెళ్లేందుకు ఆర్టీసీ, రైల్వేలు ప్రత్యేక రైళ్లు, బస్సులను నడుపుతుండగా.... తెలంగాణ టూరిజం... హెలికాప్టర్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి మేడారానికి హెలికాప్టర్లను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే ప్రతి హెలికాప్టర్లో మొత్తం ఆరుగురు ప్రయాణించవచ్చు. అందుకు లక్షా 80వేలు ఛార్జ్ చేస్తారు. అలాగే, జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మేడారం తీసుకెళ్లడమే కాకుండా గద్దె దగ్గర వీఐపీ దర్శనం కల్పిస్తారు. ఇక, మేడారం జాతర ప్రాంగణాన్ని హెలికాప్టర్ ద్వారా తిలకించేందుకు కూడా తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఒక్కొక్కరి 2999 రూపాయల చొప్పున రేట్ ఫిక్స్ చేశారు. హెలికాప్టర్ సదుపాయం కోసం 94003 99999 నెంబర్ ను కాంటాక్ట్ చేయొచ్చని తెలంగాణ టూరిజం ప్రకటించింది.  అయితే, దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతి మధ్య జరిగే మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు, హెలికాప్టర్ ద్వారా దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతిని, లక్షలాది మంది భక్తుల్ని తిలకించడం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

ఏపీ వైద్యారోగ్య మంత్రి ఇంటి పక్కన దుస్థితి ఇది... ఇక, రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందో?

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి... డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరులో ప్రజల ప్రాణాలను భరోసా దొరకడం లేదు. వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని నివాసానికి దగ్గరలో ఉన్న ఏలూరు పెద్దాసుపత్రిలో వైద్యం అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరితే తిరిగి ప్రాణాలతో బయటపడతామనే నమ్మకం లేకుండా పోతోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏలూరు పెద్దాసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులను పట్టించుకోకుండా సొంత పనుల్లో మునిగితేలుతున్నారని అంటున్నారు. ఇటీవల ఆస్పత్రి ఆవరణలోనే డీజే పెట్టుకుని డ్యాన్సులేసిన వైద్యులు, సిబ్బంది... విధి నిర్వహణలోనూ అదే తీరుతో ఉంటున్నారని మండిపడుతున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందిస్తామని జగన్ సర్కారు చెబుతుంటే... ఏలూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మాత్రం ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు.  ఇటీవల కళ్లు తిరుగుతున్నాయంటూ ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఓ మహిళ... వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో క్షణాల్లో శవంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఇలా ఎంతోమంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, దాంతో ఈ హాస్పిటల్ కి రావాలంటేనే వణికిపోతున్నారని అంటున్నారు. జనరల్ వార్డులోకి పంపేసి చేతులు దులుపుకుంటున్న వైద్యులుచ ఆ తర్వాత చికిత్స కోసం రోగుల బంధువులు కాళ్లావేళ్లాపడ్డ రావడం లేదని ఆరోపిస్తున్నారు. రోగుల ప్రాణాలకే కాదు... మృతదేహాలకు కూడా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో రక్షణ కరువవుతోంది. పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకొస్తున్న మృతదేహాలను ఎలుకలు పీక్కుతినేస్తున్నాయి. పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన ఓ మృతదేహం కళ్లను ఎలుకలు తినేయడంతో రిపోర్టే తేడా వచ్చిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇలా, ఒకటి కాదు రెండు కాదు.... అనేక దారుణాలకు ఏలూరు ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా మారుతోంది. ఏకంగా, వైద్యారోగ్యశాఖ మంత్రి సొంత ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై రోగుల బంధువులు మండిపడుతున్నారు.  అయితే, ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోని పెద్దాసుపత్రిలోనే ఇలాంటి దుస్ధితి ఉంటే... ఇక, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పుత్రుల్లో పరిస్థితి ఎలాగుందో ఊహించుకోవచ్చని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో... కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వాస్పతుల్లో వైద్యం అందిస్తామని చెబుతుంటే... స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఇలాకాలోని పెద్దాసుపత్రిలోనే వైద్యం అందక రోగులు మరణించడం విమర్శలకు తావిస్తోంది.