'మూడు రాజధానులు వద్దు మహాప్రభో' అంటున్న ప్రజలు!!

దాదాపు రెండు నెలలుగా ఏపీలో రాజధాని రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధానిగా అమరావతి సరైన ఎంపిక కాదని, గత ప్రభుత్వం హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతిలో రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్లు కావాలని... ఇలా రకరకాల కారణాలు చెప్పి.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు శ్రీకారం చుట్టింది. అయితే, సీఎం జగన్ ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన దగ్గర నుంచి తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా చేస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా, జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానుల విషయంలో వెనకడుగు వేసేది లేదంటోంది. ఇదిలా ఉంటే ఏపీ రాజధాని వివాదం జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్ గా మారింది. పలు మీడియా సంస్థలు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. ఏపీ మూడు రాజధానుల నిర్ణయంపై  ‘ది హిందూ బిజినెస్‌ లైన్‌’ అనే ఆంగ్ల వెబ్‌సైట్‌ సర్వే చేపట్టింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తెలివైనదేనా? అని సర్వే చేపట్టగా.. ఇప్పటివరకు 3,20,351 మంది దీనిపై స్పందించారు. వీరిలో 83 శాతం మంది ప్రజలు జగన్‌ నిర్ణయం తెలివైనది కాదని తేల్చి చెప్పారు. కేవలం 17 శాతం మంది మాత్రమే జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. దీన్నిబట్టి చూస్తుంటే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని అర్ధమవుతోంది.

అయోధ్యలో ఏప్రిల్ నుంచి రామాలయ నిర్మాణ పనుల ప్రారంభం...

అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు త్వరలో ఆలయ ట్రస్టు పనులు మొదలుపెట్టబోతోంది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ఏప్రిల్ నుంచి పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. విరాళాల సేకరణ, ఆలయ నమూనా, భక్తుల సౌకర్యాల వంటి వాటిపై ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఏప్రిల్ రెండున శ్రీరామనవమి కావడంతో అదే రోజు పనులు ప్రారంభం కావచ్చు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన కసరత్తు వేగవంతం అయ్యింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేయటంతో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. సీనియర్ అడ్వకేట్ పరాశరన్ ఛైర్మన్ గా పదిహేనుమంది సభ్యులతో కేంద్ర హోంశాఖ ట్రస్ట్ ను నోటిఫై చేసింది. ప్రయాగ్ రాజ్ లో ట్రస్టు తొలి సమావేశం జరుగుతుంది. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నది తొలి సమావేశంలో నిర్ణయిస్తారు. ఏప్రిల్ రెండున శ్రీరామ నవమి, ఏప్రిల్ ఇరవై ఆరున అక్షయ తృతీయ ఈ రెండింటిలో ఏదో ఒక రోజు ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ఆలయ నిర్మాణం కోసం నగదు, ఆస్తుల రూపంలో ఎవరు విరాళాలిచ్చినా షరతుల్లేకుండా స్వీకరిస్తామని ట్రస్టు ప్రకటించింది. అయోధ్యలో ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం ఏదైనా సంస్థ నుంచి రుణాలు తీసుకునే అధికారాన్ని కూడా ట్రస్టుకే కట్టబెట్టింది ప్రభుత్వం. ట్రస్ట్ బాధ్యతలు ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నిబంధనలను రూపొందించింది. ట్రస్ట్ శాశ్వత కార్యాలయం ఏర్పాటు విరాళాల సేకరణ ఆలయ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవటం ఇలాంటి ప్రతి అంశానికీ ట్రస్టుదే బాధ్యతని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి రెండేళ్ళల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన అమరావతి రైతులు

అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. రాజధాని తరలింపును అడ్డుకోవాలి అని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందుల్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. రాజధాని వికేంద్రీకరణను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అమరావతి జేఏసీ నేతలు ఢిల్లీ వేదికగా తమ వాణి వినిపిస్తున్నారు. జెఎసి ప్రతినిధులు మధ్యాహ్నం నితిన్ గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ప్రతినిధి బృందం మరియు పలు రాజధాని రైతుల ఢిల్లీ పర్యటన ఏడవరోజు కొనసాగుతుంది. రాజధాని రైతులతో పాటు టీడీపీ ఎంపిలు కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. యాభై రోజులుగా రాజధాని గురించి అమరావతిలో జరుగుతున్న ఆందోళన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, రైతులు తీసుకెళ్ళారు.  మధ్యాహ్నం పార్లమెంట్ లో నితిన్ గడ్కరితో కూడా భేటీ కాబోతున్నారు. అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలుసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల పదకొండు (ఫిబ్రవరి 11) వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు ఇక్కడే ఉండి ప్రధానమంత్రి నరేంద్రమోడిని, అమిత్ షాను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం రాజధాని విషయంలో రాష్ట్రాల పరిధిలో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కూడా అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, పలు రైతులు మాత్రం పూర్తిస్థాయిలో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న విశ్వాసంతో వారున్నారు. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరిని కలిసి వినతి పత్రం ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో జోక్యం చేసుకోకపోతే నష్టం జరుగుతుందన్న వాదనను కూడా ప్రధానంగా వారంతా వినిపిస్తున్నారు.

నన్ను కర్రలతో కొడతారా అయితే నేను సూర్య నమస్కారాల సంఖ్య పెంచుతా: ప్రధాని మోడీ

ఇరవై ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొన్నా, ఇప్పుడు రాటుదేలిపోయా. నన్ను కర్రలతో కొడతారా, అయితే నేను సూర్య నమస్కారాల సంఖ్య పెంచుతా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కామెంట్ లకు అదే రేంజ్ లో కౌంటరిచ్చారు ప్రధాని మోడీ. ఇటు నెహ్రూపై సైతం డైరెక్ట్ ఎటాక్ చేశారు. లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగం మొత్తం రాహుల్ కాంగ్రెస్ టార్గెట్ గా కొనసాగింది. తనదైన స్టైల్ లో సమాధానమిచ్చారు. ఓ వైపు కౌంటర్ ఇస్తూనే సెటైర్ లు వేశారు. ఆరు నెలల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించకుంటే మోడీని యువత కర్రలతో బాదుతారన్న రాహుల్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. కర్రల దాడిని తట్టుకునేందుకు తాను ప్రతిరోజూ చేసే సూర్యనమస్కారాల సంఖ్యను పెంచాలనుకుంటున్నట్టుగా చెప్పారు. రాహుల్ ని ట్యూబ్ లైట్ తో పోల్చారు ప్రధాని. ఆయన పేరు ప్రస్తావించకుండానే సెటైర్ లు వేశారు. తాను నలభై నిమిషాల నుంచి మాట్లాడితే ఇప్పుడు కరెంటు పాసైందని రాహుల్ ను ఉద్దేశించి కామెంట్ లు చేశారు మోడీ. మోడీ స్పీచ్ పై కౌంటరిచ్చారు రాహుల్, గంటన్నర ప్రసంగంలో యువత గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదన్నారు. తొలి ప్రధాని నెహ్రూను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు ప్రధాని మోడీ. ప్రధాన మంత్రి పదవి కోసం ఓ నేత దేశాన్ని చీల్చారని వ్యాఖ్యానించారు. సీఏఏ ని వ్యతిరేకిస్తే నెహ్రూ విధనాలు వ్యతిరేకించినట్లే అన్నారు మోడీ. బంగ్లా నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వ కల్పనకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలని నెహ్రూ చెప్పారన్నారు. ఇందుకు గతంలో అస్సాం ముఖ్యమంత్రికి నెహ్రూ రాసిన లేఖే నిదర్శనమన్నారు మోడీ.

దోషుల నాటకాలతో మరో వారం వాయిదా పడిన నిర్భయ దోషుల ఉరి...

  అన్నీ సవ్యంగా జరిగితే ఇప్పటికే శిక్ష అమలయ్యేది కానీ, నిర్భయ దోషుల నాటకాలతో ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో న్యాయ హక్కుల వినియోగానికి వారికి కేవలం వారం మాత్రమే గడువిచ్చింది ఢిల్లీ హై కోర్టు. ఇటు దోషుల్ని వెంటనే ఉరితీసేలా ఆదేశాలివ్వాలని సుప్రీం లో పిటిషన్ వేసింది కేంద్రం. ఆ పిటిషన్ పై ఈరోజు సుప్రీంలో విచారణ జరగబోతోంది, నిర్భయ కేసులో దోషులకు ఉరి అమలుపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు కొట్టేసింది. స్టే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయలేమని న్యాయస్థానం పేర్కొంది. దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన హక్కులు వినియోగించుకునేందుకు వారం రోజులు గడువిచ్చింది. వారం రోజుల గడువు ముగిసిన తర్వాత వారి ఉరికి సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పింది ఢిల్లీ హైకోర్ట్. ఇదిలా ఉండగా దోషులు నలుగురినీ విడిగా ఉరి తీయలేమని ఢిల్లీ హైకోర్ట్ తోసిపుచ్చింది. దీనిపై కేంద్రం దోషులను వెంటనే ఉరి తీయటానికి అనుమతించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. మరణ మృదంగాన్ని తప్పిచ్చుకునేందుకు అనేక నాటకాలు వేసి దోషులు కాలయాపన చేస్తున్నారు. ఏడేళ్ళ నుంచి తమకు అన్యాయం జరుగుతుందని నిర్భయ తల్లితండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

దేశ రాజధాని పాలకుడిని నిర్ణయించటానికి సమాయత్తమవుతున్న ఓటర్లు...

  ఢిల్లీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ప్రచార హోరు ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. రేపు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనేందుకు వీలుగా అనేక సంస్థలు ఆఫర్ లు ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రచారం చివరి రోజు నిర్వహించిన ఓపెన్ పోల్స్ కూడా అధికారం ఆప్ దేనని  స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు దేశ రాజధానిని పాలించేది ఎవరో నిర్ణయించేందుకు ఢిల్లీ ఓటర్లు సమాయత్తమవుతున్నారు. నిన్నటివరకు అన్ని పార్టీల ప్రచారాన్ని హామీలనూ ఓపిగ్గా విన్న సగటు ఢిల్లీ ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు. రేపు జరిగే పోలింగ్ లో మొత్తం కోటి నలభై ఏడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఢిల్లీ రాష్ట్ర పరిధిలో మొత్తం పదమూడు వేల ఏడు వందల యాభై పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ సీ కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. నూట తొంభై కంపెనీలకు చెందిన సెంట్రల్ పారామిలిటరీ బలగాలను ఈ సారి భద్రత కోసం వినియోగిస్తున్నారు.  రెండు వేల పంతొమ్మిది లోకసభ ఎన్నికల్లో ఢిల్లీలో మోహరించిన బలగాల సంఖ్య కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనేందుకు వీలుగా కొన్ని సంస్థలు ఆఫర్ లు ప్రకటించాయి. ఢిల్లీలో ఓటు హక్కు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారికి స్పైస్ జెట్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. స్పైస్ డెమోక్రసీ పేరుతో ఉచిత ప్రయాణ టికెట్ లను జారీ చేస్తోంది. ముందుగా నమోదు చేసుకున్న వాళ్లకు బేస్ పేరును రద్దు చేస్తారు, కేవలం పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు ఓటర్ల సౌకర్యం కోసం ఢిల్లీ మెట్రో రైల్ గంటన్నర ముందు నుంచే సర్వీసులు ప్రారంభిస్తోంది. ఉదయం నాలుగు గంటల నుంచే ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నా ఒపీనియన్ పోల్స్ సర్వేలు మాత్రం మరోసారి ఆప్ దే అధికారం అంటున్నాయి. జనవరి ఆరు నుంచి నిన్నటి వరకు ఆరుసార్లు వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అన్నింటిదీ ఒకటే మాట ఆమ్ ఆద్మీ పార్టీ నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు కైవసం చేసుకుంటుందన్నది ఓపీనియన్ పోల్స్ సారాంశం.  ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, బస్తీవాసులకు నాణ్యమైన వైద్యం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ఇలాంటి మధ్యతరగతిని ప్రభావితం చేసే అనేక పథకాలను అమలు చేస్తున్న కేజ్రీవాల్ కు ఢిల్లీ ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారు అంటున్నాయి సర్వేలు. 2015 ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితమైన బిజెపి ఈ సారి ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో బీజేపీకి ఇవి అగ్నిపరీక్ష అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ లో కొనసాగుతున్న ఆందోళనలు కూడా ఈ సారి ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించబోతున్నాయి. గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది కూడా చూడాలి.

హైదరాబాద్ మెట్రో రైల్ మరో రికార్డు... దేశంలో రెండో స్థానం...

హైదరాబాద్ మెట్రో రైల్ మరో ఘనతను సాధించింది. ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో రైల్ గా అవతరించింది. అయితే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్టుగా వరల్డ్ రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైల్ లో మరో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే, నాగోల్ టు రాయదుర్గం.... ఎల్బీనగర్ టు మియాపూర్ రూట్స్ లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, ఇప్పుడు కొత్తగా జేబీఎస్ టు ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. కారిడార్-3గా పిలిచే ఈ మార్గంలో 11 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు తిరగనున్నాయి. దాంతో, మొత్తం 68 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. అయితే, హైదరాబాద్లో అతిపెద్ద బస్ స్టేషన్లయిన జేబీఎస్ అండ్ ఎంజీబీఎస్ మధ్య మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడే అవకాశం నగర వాసులకు లభించింది. ఎందుకంటే, ట్రాఫిక్ రద్దీ కారణంగా దాదాపు గంట సమయం పట్టే ఈ మార్గంలో కేవలం పదిహేను నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు. జూబ్లీ బస్ స్టేషన్... మహాత్మాగాంధీ బస్ స్టేషన్ల నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు... అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకు ఈ మెట్రో రైల్ మార్గం ఎంతో ఉపయోగకరం కానుంది. మొత్తానికి, భాగ్యనగరానికే తలమానికంగా మారిన హైదరాబాద్ మెట్రోరైల్ అతి తక్కువ సమయంలోనే గ్రేటర్ ప్రజల మనసును దోచుకుంటోంది. ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు నగరవాసులంతా మెట్రోను ఆశ్రయిస్తుండటంతో రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.

రాజ్యసభకు కేసీఆర్..? టీఆర్ఎస్ లో ఆసక్తికరమైన చర్చ..!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారంటూ ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతుండగా.... రీసెంట్ గా ఉపముఖ్యమంత్రి పదవి చేపడతారంటూ వార్తలొచ్చాయి. ఇక, కేటీఆర్ సోదరి కవిత... అతిత్వరలోనే రాష్ట్ర కేబినెట్లోకి రానుందంటూ మరో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రెండింటినీ మించిన మరో చర్చ గులాబీ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ ... ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ కు అప్పగించి.... ఆయన రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం నడుస్తోంది. మరి, ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ... కేసీఆర్ రాజ్యసభకు వెళ్తే కనుక... గజ్వేల్ ఉపఎన్నిక బరిలోకి కవిత దిగుతారని అంటున్నారు. ఎప్పట్నుంచో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్... రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని చెబుతున్నారు.  రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటున్న గులాబీ శ్రేణులు.... ఇలాంటి అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఎందుకంటే, కవితకు మంచి రాజకీయ భవిష్యత్ కల్పించడం కేసీఆర్ ఏమైనా చేస్తారని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ లో కేసీఆర్ అండ్ కవిత పొలిటికల్ స్టెప్స్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ నిజంగానే రాజ్యసభకు వెళ్తారా? అలాగే, కవిత రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారా? లేదా? అన్నది తేలాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

తెలంగాణ మంత్రిగా కవిత..! అతిత్వరలోనే కేబినెట్లోకి..?

కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు త్వరలోనే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుందంటూ ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త టీఆర్ఎస్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ సోదరి కవితను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లోకి తీసుకోబోతున్నారని అంటున్నారు. మొన్నటివరకు రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ ఊసే వినిపించడం లేదు. ఎందుకంటే, కవితకు అసలు రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నారట. అందుకే, తనకు రాజ్యసభ సభ్యత్వం వద్దంటూ కవిత తేల్చిచెప్పిందంటూ గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందువరకు రాజకీయంగా ఫుల్ యాక్టివ్ గా ఉన్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్ లో ఓడిపోవడంతో అప్పట్నుంచి కొంత సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ తనయురాలిగా, మంచి వాక్చాతుర్యమున్న వక్తగా, తనదైన శైలిలో... లోక్ సభలో గట్టిగా తెలంగాణ సమస్యలను వినిపిస్తూ పార్లమెంట్లో చురుకుగా వ్యవహరించిన కవిత... నిజామాబాద్లో ఓడిపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యారు. దాంతో, ఏడాదిగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, కవితను మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాజ్యసభకు పంపాలని భావించారు. కవిత కూడా అందుకు ఒప్పుకుందనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు సడన్ గా కవిత మనసు మార్చుకున్నారట. రాజ్యసభకు కాకుండా రాష్ట్రంలోనే ఉంటూ చక్రం తిప్పాలని డిసైడయ్యారని కవిత సన్నిహితులు, అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి, అతి త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో కవిత యాక్టివ్ కాబోతున్నారనే టాక్ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారని చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్సీగా కేబినెట్లోకి వస్తారా? లేక అనూహ్య పరిణామాలతో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ కి ఉపఎన్నిక వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారో? త్వరలో క్లారిటీ వస్తుందని అంటున్నారు.

నిప్పు లేనిదే పొగ రాదు... కియా రగడకు అసలు కారణమిదే?

దక్షిణ కొరియా దిగ్గజ కార్ల కంపెనీ కియా మోటార్స్ ...ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం... ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. రాయిటర్స్ కథనంతో జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హుటాహుటిన మీడియా ముందుకొచ్చిన మంత్రి బుగ్గన.... కియా ఎక్కడికి తరలిపోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నేతలే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ కావాల్సినవన్నీ ఇస్తున్నామని, తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కియా యాజమాన్యం పూర్తి సంతృప్తితో ఉందన్నారు. అయితే, కియాతోపాటు ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని బుగ్గన అన్నారు. అయితే, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కార్ల కంపెనీగా పేరుగాంచిన కియా మోటార్స్... భారత్‌లోకి ఎంట్రీ ఇస్తూ తన తొలి ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పింది. పరిశ్రమ ఏర్పాటుకు అనంతపురం జిల్లాను ఎంచుకున్న కియా.... రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత...  గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. దాదాపు 14వేల కోట్ల రూపాయల వ్యయంతో, ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన అనంతపురం ప్లాంట్‌లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. అయితే, ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే కియాకు ఇబ్బందిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. స్థానికంగా నిపుణులు లేకపోతే 75శాతం ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమంటూ కియా అభ్యంతరం చెప్పిందని, ఇదే వివాదానికి కేంద్ర బిందువైందని అంటున్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కియా మోటార్స్ కూడా జగన్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయే అలాంటి ఆలోచనకు వచ్చేరేమోనంటూ తెలుగుదేశం లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, కియా వివాదంపై లోక్‌సభలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోవాలనుకుంటోందని... కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సభ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, రామ్మోహన్ నాయుడు స్పీచ్‌కు అడ్డుతగిలిన వైసీపీ ఎంపీలు.... కియాపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ కౌంటరిచ్చారు. అయితే, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.... రామ్మోహన్ నాయుడు సీటు దగ్గరకు వెళ్లడంతో సభలో కలకలం రేగింది. స్పీకర్ వారించడంతో మాధవ్ తిరిగి తన సీట దగ్గరికి వచ్చి కూర్చున్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలను వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఖండించారు. కియా పరిశ్రమ ఎక్కడికి తరలిపోవడం లేదని... తెలుగుదేశం నేతలు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా రాయిటర్స్ కథనంపై స్పందించారు. కియా తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. కియా మోటార్స్ తరలిపోతోందన్న వార్తల్లో అస్సలు నిజం లేదన్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయంటూ మంత్రి గౌతమ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే, నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా స్థానికులకు 75శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనతోనే జగన్ ప్రభుత్వానికి, కియా యాజమాన్యానికి మధ్య రగడ మొదలైందని తెలుస్తోంది. అయితే, కియా తరలిపోనుందా? అంటూ కథనం రాసిన రాయిటర్స్ కూడా ఆషామాషీ సంస్థ కాదు. అందుకే, ఆగమేఘాల మీద రాయిటర్స్ కథనంపై మంత్రులు, వైసీపీ ఎంపీలు, ముఖ్యనేతలు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష... హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు....

తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు బాలికలపై పాశవికంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా అత్యంత కిరాతంగా చంపేసి బావిలో పాతిపెట్టిన నరరూప రాక్షసుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష విధించింది. హాజీపూర్ హర్రర్ కేసుల్లో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు... మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ రెడ్డే నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్ఏ, బ్లడ్ టెస్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్... ఇలా అనేక టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సమర్పించడంతో తప్పించుకోలేకపోయాడు. పోలీసులు అందజేసిన ఎవిడెన్స్ ఆధారంగా ముగ్గురు బాలికలను శ్రీనివాస్ రెడ్డే అత్యాచారం చేసి హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. మొత్తం 101మంది సాక్షులను సుదీర్ఘంగా విచారించిన కోర్టు... శ్రావణి, కల్పన, మనీషా కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చింది. అయితే, మూడు కేసుల్లోనూ నేరం రుజువైందంటూ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి న్యాయమూర్తి తెలియజేయగా, తనకేం సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ జడ్జికి విన్నవించుకున్నాడు. తన తల్లిదండ్రులను తానే పోషించాలని... తన ఇల్లు కూల్చేశారంటూ న్యాయమూర్తికి తెలియజేశాడు. భూతగాదాలతోనే తనను ఈ కేసుల్లో ఇరికించారంటూ న్యాయమూర్తికి చెప్పుకున్నాడు. అయితే, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసా? అసలు, మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అంటూ శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా, తనకు తెలియదని అతను సమాధానమిచ్చాడు. మొత్తానికి హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై బాధితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే, వెంటనే ఉరిశిక్ష అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.

ఏపీలో కరోనా వైరస్... రాజధాని ప్రజలారా అప్రమత్తం కండి!!

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. ఆంధ్రప్రదేశ్ ని తాకిందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఒకరికి కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలతో ఒకరు హాస్పిటల్ లో చేరగా, కరోనా సోకినట్లు నిర్దారించారని తెలుస్తోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసు నమోదు అయినట్లుగా.. హాస్పిటల్ సూపరింటెండెంట్ అంగీకరించారని వార్తలొస్తున్నాయి.  చైనాలో ఎంబీబీఎస్ చదువుతోన్న అవనిగడ్డకి చెందిన ఓ స్టూడెంట్ కి కరోనా లక్షణాలు ఉన్నాయని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయవాడలో నమోదైన కేసు, అవనిగడ్డ స్టూడెంట్ ఒక్కరేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రభుత్వ వర్గాలు మాత్రం.. ఈ వార్తల్లో నిజంలేదు అంటున్నాయి. ఇంతవరకు కరోనా కేసు నిర్దారణ కాలేదు అని చెప్పుకొస్తున్నాయి. నిజంగానే కరోనా కేసు నమోదు కాలేదా? లేక ప్రజలు భయబ్రాంతులకు గురవుతారని ప్రభుత్వం నిజం దాస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అమరావతి పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

'కియా'తో మేం సంప్రదింపులు జరపలేదు: తమిళనాడు!!

కియా మోటార్స్‌ ఏపీ నుండి తమిళనాడుకు తరలిపోతుందని 'రాయిటర్స్‌' సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు తరలిపోతున్నాయి అంటూ.. విపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. కియా మోటార్స్‌- ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ స్పష్టం చేశారు. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉంటే, కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. తాము కియా యాజమాన్యంతో టచ్‌లో లేమని, వారితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి.. ఏపీ పరిశ్రమల కార్యదర్శికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. 

సెలక్ట్ కమిటీలను నియమించిన మండలి చైర్మన్.. వైసీపీ దూరం!!

సెలెక్ట్ కమిటీల విషయంలో ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పంతం నెగ్గించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోని ఆయన.. గురువారం సెలెక్ట్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా రెండు సెలెక్ట్ కమిటీల్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా, వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీ నుంచి సోము వీర్రాజు నియమితులయ్యారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి నారా లోకేష్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి.. పీడీఎఫ్‌ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్‌, వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఇదిలా ఉంటే సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ మండలి చైర్మన్‌ షరీఫ్ కు వైసీపీ లేఖ రాసింది. కమిటీల్లో తాము భాగస్వాములు కాబోమని లేఖలో పేర్కొంది. సెలెక్ట్ కమిటీల ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని, మండలి రద్దు బిల్లు సైతం పార్లమెంటులో పెండింగ్ లో ఉందని, ఇలాంటి సమయంలో పేర్ల ప్రకటన అవసరం లేదంటూ.. మండలి చైర్మన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్‌, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లేఖ రాశారు. అయితే, కమిటీల ఏర్పాటుపై తన విచక్షణాధికారాల్ని ఎవరూ ప్రశ్నించలేరని మండలి చైర్మన్ షరీఫ్ అన్నట్లు తెలుస్తోంది. సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు గడువు బుధవారం ముగిసింది. ఇప్పటికే ఆయా పార్టీలు సభ్యుల పేర్లను సూచిస్తూ.. లేఖలు ఇవ్వడంతో చైర్మన్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. మరోవైపు, సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగలేదు కాబట్టి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోనని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్దంటున్నా మండలి చైర్మన్ పట్టుదలతో సెలెక్ట్ కమిటీలను ప్రకటించడంతో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

న్యాయం గెలిచింది... ఇంతియాజ్ కి ఉరిశిక్ష

నెల్లూరు ఎనిమిదవ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నెల్లూరు జిల్లా హరనాథపురం తల్లీకూతుళ్ళ హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 12 న మెడికో భార్గవి, తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. ఇద్దరు తల్లి కూతుర్లు దారుణమైన హత్యకు గురైన సమయంలో భార్గవి తండ్రి దయాకర్ రెడ్డి కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రి లో చికిత్స పొందుతూ బ్రతికాడు. ఈ కేసుకు సంబంధించి ఇంతియాజ్ అనే నిందితుడికి ఉరిశిక్షను అమలు చేసింది ధర్మాసనం. భార్గవి వాళ్ళ కుటుంబం ఇళ్ళు కడుతుండగా దానికి సంబంధించిన ఇంటీరియర్ డెకరేషన్ కోసం పని చేయడానికి వచ్చిన ఇంతియాజ్ ఇంటిలో డబ్బు, నగలు ఎక్కువగా ఉన్నాయని గమనించాడు. వాటిని దొంగలిద్దామన్న నేపధ్యంలో వారి పై దాడికి ప్రయత్నించగా ఆ దాడిలో భార్గవి మరియు తన తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి మాత్రం తీవ్ర గాయల పాలయ్యాడు. ఇంతియాజ్ కు సహాయ పడిన ఇద్దరు మైనర్లకు కోర్ట్ గతంలోనే శిక్షను విధించగా, నేడు నెల్లూరు కోర్ట్ ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.  

రక్తంతో తడిసిన చొక్కాతో చంద్రబాబుని కలిశాడు

టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ బాధితుడు కలిశాడు. టీడీపీకి మద్దతుగా ఉన్నందుకు తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ వాపోయాడు. మాచర్లకు చెందిన దండు పెద వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో వెంకయ్య టీడీపీ కార్యాలయానికి వెళ్లి, పార్టీ అధినేతతో తనపై జరిగిన దాడి గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రక్తంతో తడిసిన చొక్కాతో వెంకయ్య రావడంతో.. అతడిని చూసి చంద్రబాబు చలించిపోయారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడి కోసం వచ్చి తనపై దాడి చేశారని వెంకయ్య భోరున విలపించాడు. టీడీపీకి మద్దతుగా ఉన్నందుకే దాడి చేశారని వెంకయ్య వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తారనే ఉద్దేశంతోనే.. వెంకయ్యపై దాడి చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసుంటారని అంటున్నారు. కాగా, బాధితుడికి ప్రాథమిక చికిత్స చేయించి.. డీజీపీ, ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లాలని వర్ల రామయ్యకు చంద్రబాబు సూచించారు.

ఏపీలో 58 ఐఏఎస్‌ పోస్టులు ఖాళీ!!

ఆంధ్రప్రదేశ్‌లో 58 ఐఏఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ప్రమోషన్ల ద్వారా ఏపీలో 239 మంది ఐఏఎస్‌ అధికారులను నియమించాల్సి ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 181 మాత్రమే ఉంది. ఈ విషయాన్ని కేంద్రం ధృవీకరించింది. రాజ్యసభలో గురువారం వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌ సింగ్‌.. ఏపీలో 58 ఐఏఎస్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయని వెల్లడించారు. ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం నిరంతరం ప్రక్రియ అని మంత్రి చెప్పారు. కాలానుగుణంగా ఐఏఎస్‌ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అలాగే స్టేట్‌ కేడర్‌ అధికారులకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.  వివిధ రాష్ట్రాలలో ఏళ్ళ తరబడి భర్తీ కాకుండా మిగిలిపోతున్న ఐఏఎస్‌ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అదనంగా 1000 ఐఏఎస్‌లను నియమిస్తుందా అన్న మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ అలాంటి ఆలోచన లేదని చెప్పారు. కేడర్‌ మేనేజ్‌మెంట్‌లో సమన్వయం పాటించడం, ఐఏఎస్‌ అధికారుల భవిష్యత్తు అవకాశాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 180 మంది ఐఏఎస్‌లను మాత్రమే రిక్రూట్‌ చేసుకోవాలన్నది ప్రభుత్వ విధానం అని చెప్పుకొచ్చారు. 2017 నుంచి 2019 వరకు ఏటా 180 ఐఏఎస్‌లను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చూస్తే ఏపీకి 2017లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 6, ప్రమోషన్ల ద్వారా 6.. 2018లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 12, ప్రమోషన్ల ద్వారా 21.. 2019లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 11, ప్రమోషన్ల ద్వారా 6 చొప్పున ఐఏఎస్‌ పోస్టుల భర్తీ జరిగినట్లు మంత్రి వివరించారు.

టీడీపీ హయాంలో పెట్టుబడులు వచ్చిన మాట నిజమే: బుగ్గన

కియా మోటార్స్ తరలింపు వార్తలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. రాయిటర్స్ సంస్థ పబ్లిష్ చేసిన కథనం వాస్తవం కాదని.. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. కియా పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు. ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్లాంటును విస్తరణకు ప్రణాళికలు చేస్తుంటే, ఇక తరలిపోయే అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు. అదేవిధంగా, విశాఖలోని మిలేనియం టవర్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఓ ఐటీ సంస్థను ప్రభుత్వం అదేశించినట్టుగా జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమన్నారు.  మా ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాం అన్నారు. 2019 అక్టోబర్ వరకు పెట్టుబడులు వచ్చాయి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెబుతోందని తెలిపారు. గతంలోను వచ్చాయి.. మొత్తం మేము క్రెడిట్ తీసుకోవాలని కూడా భావించటం లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందని.. గత టీడీపీ ప్రభుత్వంలా అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు పెండింగ్ లో పెట్టారు. 3 వేల కోట్ల బకాయిలు పెట్టేసి వెళ్లారని ఆరోపించారు. తమ హయాంలో, 1051 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. జూన్ 2019 నుంచి 15,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరో 8 వేల కోట్ల  మేర కంపెనీలు ఉత్పత్తి కి సిద్ధంగా ఉన్నాయి. అయినా మేము ప్రచారం చేసుకోడానికి విరుద్ధమని బుగ్గన చెప్పుకొచ్చారు.

తరలిపోతున్న ఐటీ కంపెనీలు.! జగన్ సర్కారు నిర్ణయంతో 18వేల ఉద్యోగాలు మటాష్.! 

కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.