కేటీఆర్ క్రేజ్.. ఫోటో కోసం ఎగబడుతున్న నేతలు!

మునిసిపల్ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన సభ్యులు యువనేత కేటీఆర్ తో ఫోటోలకు క్యూ కడుతున్నారు. కొత్తగా గెలిచిన సభ్యులతో మర్యాద పూర్వకంగా భేటీ అవుతున్నారు కేటీఆర్. వారి కోరిక మేరకు ఒక్కొక్కరితో చాలా ఓపిగ్గా వందల మందితో కేటీఆర్ ఫోటోలు దిగుతున్నారు. కేసీఆర్ తర్వాత రాష్ర్టానికి కాబోయే సీఎం కేటీఆర్ అనే వార్తలు ఈ మధ్య కాలంలో జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ తో ఫోటో అంటే టిఆర్ఎస్ సభ్యుల్లో క్రేజ్ పెరిగింది. మునిసిపల్ సభ్యులతో పాటు వారి అనుచరులు కూడా పోటా పోటీగా ఫోటోలు దిగుతున్నారు. మూడు రోజుల పాటు దాదాపు 2000 మందితో కేటీఆర్ ఫొటోలు దిగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.  అయితే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులతో పాటు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా ఫోటోలు దిగుతున్నారు. వారిని కాదనకుండా కేటీఆర్ ఫోటోలకు ఓకే అంటే ఫోటోలు దిగిన వారు మాత్రం కాబోయే సీఎంతో ఫోటో అని సోషల్ మీడియాలో క్యాప్షన్ లు పెట్టడం మాత్రం కేటీఆర్ కు నచ్చలేదని తెలుస్తోంది. కేవలం ఓ జ్ఞాపకం కోసం మాత్రమే ఫోటోలు వాడుకోవాలి కానీ సోషల్ మీడియాలో ఫొటో అప్ లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త పడాలని కేటీఆర్ సున్నితంగా సూచన చేసినట్టు తెలుస్తోంది. కాబోయే సీఎం అంటూ క్యాప్షన్ పెట్టొద్దని సున్నితంగా నేతల్ని హెచ్చరించారు. మొత్తానికి కేటీఆర్ తో ఫోటో సెషన్ ఇప్పుడు టిఆర్ఎస్ లో క్రేజీగా మారింది.  

మమ్మల్నీ చంపేస్తారేమో? జగన్ చెల్లెలు ఆందోళన

వైఎస్ వివేకాను చంపిన హంతకులు తమనూ లక్ష్యంగా చేసుకునే అవకాశముందంటూ ఆయన కుమార్తె సునీత ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్ వివేకా హంతకుల నుంచి తనకు, తన భర్త రాజశేఖర్ కు ముప్పు పొంచి ఉందన్నారు. అందుకే, తమకు సాయుధ రక్షణ కల్పించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత కోరుతున్నారు. గతేడాది నవంబరు 21న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన సునీత... తాము ఏపీలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలంలూ విజ్ఞప్తి చేశారు.  వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సునీత... తమకు రక్షణ కల్పించాలంటూ ఏపీ డీజీపీకి రాసిన లేఖను కూడా జత చేశారు. వైఎస్ వివేకాను అత్యంత క్రూరంగా హత్య చేశారు. దర్యాప్తు వేగంగా సాగడం కోసం నేను, నా భర్త పోలీసులకు సహకరిస్తున్నాం. అయినా హంతకులెవరో ఇప్పటివరకూ గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో నా భద్రతపైనా, నా కుటుంబ భద్రతపైనా భయం కలుగుతోందని సునీత హైకోర్టుకు విన్నవించుకున్నారు.  నా తండ్రిని అత్యంత క్రూరంగా చంపిన వాళ్లు మమ్మల్నీ లక్ష్యం చేసుకునే అవకాశముందని అనుమానం వ్యక్తంచేశారు. అలాగే, ఈ కేసులో కీలకమైన శ్రీనివాస్ రెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో మిగతా నిందితులైన పరమేశ్వర్ రెడ్డి, యర్ర గంగిరెడ్డి, వాచ్ మన్ రంగయ్య ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తాము భావిస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు.

సమతా కేసు తుది తీర్పు నేడే...

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ అత్యాచారానికి బలైన సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమత హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాలని నిర్మల్ జిల్లా గోసాన్ పల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బెల్లూన్లు అమ్ముకుని జీవించే మహిళ పట్ల అత్యంత పాశవికంగా దుండగులు దారుణానికి పాల్పడటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. హంతకులను కఠినం గా శిక్షించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆందోళనలు సాగాయి. ప్రజల ఆందోళన నేపథ్యం లో ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ కూడా వేగవంతంగా పూర్తి చేసింది. ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఆ ప్రాంతీయులు ధర్నాలకు దీక్షలు పాల్పడ్డారని ఇప్పుడు సరైన తీర్పు వెలువడి సమతకు న్యాయం జరగని పక్షంలో తమ ఆడబిడ్డ కోసం ఎలాంటి చర్యలకైనా పాల్పడ్డానికి సిద్ధమని,పట్టణంలో ఉన్న వారికి ఒక న్యాయం తమకో న్యాయంగా కాకుండా తమ దలిత వర్గాలకు కూడా సరైన జరిగేలా చూడాలని గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నేడు వెలువడనున్న తీర్పుతో సమతకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.

తెలంగాణలో మరోసారి ఎన్నికల జోరు.. గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలం!

మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసి టిఆర్ఎస్ కారు జోరు కొనసాగుతొంది.ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం కనిపించనున్నట్లు సమాచారం. రైతులు సభ్యులుగా ఉండే సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్ లకు నియమించిన పర్సన్ ఇన్ చార్జ్ ల పదవీ కాలం ముగుస్తున్న మేరకు 3-4 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు.15ను రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని, కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు అధికారులు.  రాష్ట్రంలోని సహకార సంఘాలకు 2018 లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ మేరకు సంఘాల పాలకవర్గాల స్థానంలో పర్సన్ ఇన్ చార్జి లను నియమించారు. వారి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించింది.పర్సన్ ఇన్ చార్జిల పాలన పొడిగింపునకు అవకాశం ఇవ్వకుండా ఎన్నిక లకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.రాష్ట్రంలో 584 మండలాలకు గాను 906 సహకార సంఘాలే ఉండేవి. మండలాల సంఖ్య పెరిగాక 81 మండలాల్లో ఒక్క పీఏసీఎస్ లేకుండా పోయింది. 272 మండలాల్లో ఒక్కో పీఏసీఎస్ మాత్రమే మిగిలింది. మిగిలిన మండలాల పరిధిలోకి 2 నుంచి 3 పీఏపీఎస్ లు వచ్చాయి. రాష్ట్రంలో మండలాల పునఃవ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మండలా లతో పాటు ప్రతి మండలం యూనిట్ గా 2 పీఏపీఎస్ లు ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు 81 మండలాల్లో 2 చొప్పున 162 పీఏపీఎస్ లు కొత్తవి రాగా 272  మండలాల్లో ఒక్కో పీఏపీఎస్ ను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో కొత్తవి 434 రాగా పాతవి 906  కూడా కలుపుకుంటే మొత్తం 1340 పీఏపీఎస్ లకు తాజాగా ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సారి అయినా వాయిదా లేకుండా సజావుగా సాగుతుందో లేదో వేచి చూడాలి.  

నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేక మళ్లీ వాయిదా వేస్తారా?

ఈసారైనా డెత్ వారెంట్ ప్రకారం నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేక ఏవైనా కారణాలతో మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, నిర్భయ దోషుల ఉరితీత సమయం సమీపిస్తోన్నకొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడువు దగ్గరపడుతున్నకొద్దీ నిర్భయ దోషులు... పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ... ఉరిశిక్ష అమలును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ముఖేష్ సింగ్ పిటిషన్ తో ఒకసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడగా... ఇప్పుడు, దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ... క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. అలాగే, మరో దోషి అక్షయ్ సింగ్ సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఒకవేళ అక్షయ్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరిస్తే... రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్ధన పెట్టుకునే అవకాశముంది. దాంతో, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలవుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. తాజా పరిణామాలను గమనిస్తే, న్యాయవ్యవస్థలో వెసులుబాటును ఉపయోగించుకుంటూ ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనా... దారులన్నీ మూసుకుపోయినా... ఫిబ్రవరి ఒకటిన మాత్రం ఉరిశిక్ష అమలు కాకుండా పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. చివరికి క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించినా...కోర్టుల్లో పిటిషన్లను కొట్టివేసినా... మళ్లీమళ్లీ సుప్రీంను ఆశ్రయిస్తూ... ఉరిశిక్ష వాయిదా పడేలా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్... దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులకు అసలు జనవరి 22నే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా... ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్థనతో వాయిదా పడింది. ఇక, ఇప్పుడు మరో దోషి అక్షయ్ సింగ్... క్యూరేటివ్ పిటిషన్ వేయడంతో... మరోసారి ఉరి అమలుపై సందిగ్ధత నెలకొంది. అయితే, జనవరి 31 అర్ధరాత్రిలోపు ఎలాంటి అడ్డంకులు రాకపోతే మాత్రం.... నిర్భయ దోషులైన... వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్‌లను... ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఒకే ఉరికంబంపై ఒకేసారి ఒకే సమయంలో ఉరితీయడానికి అంతా సిద్ధమైంది. మరి, ఈసారైనా ఉరిశిక్ష అమలవుతుందో లేదో చూడాలి.

సీఐడీ నిర్మూలం కాబోతోందా..?

తెలంగాణలో సీఐడీ డిపార్ట్ మెంట్ మూలన పడింది. వందల కొద్దీ కేసులు సీఐడీ దగ్గర పెండింగ్ లో ఉండిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదొందల కేసులు దర్యాప్తు కొలిక్కి రాలేదు. సంచలన స్కాం ల దగ్గర నుండి సాధారణ కేసుల దాకా సీఐడీ పోలీసులు చేధించలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు సీఐడీ పోలీసులు అంటే హడల్, ఒక కేసు వారి చేతిలో పడిందంటే దర్యాప్తు త్వరగా ముగుస్తుంది. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉండేవారు, చిన్న కేసుల నుంచి సెన్సేషనల్ స్కాముల వరకు సీఐడీ పోలీసులు తమదైన స్టైల్ లో దర్యాప్తు చేసి నిందితులని కటకటాల వెనక్కి నెట్టేవారు కాని, కొన్ని రోజులుగా సిఐడి మూలన పడినట్లు కనిపిస్తోంది. అనేక కేసులు సీఐడీ పోలీసుల దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా దర్యాప్తు కొలిక్కి రావడం లేదు. ఈ సంచలన విషయాలన్నీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఐడీ పనితీరు మందగించింది. తెలంగాణ ప్రభుత్వం అప్పచెప్పిన తొలి కేసునే ఇప్పటి వరకూ తేల్చలేకపోయింది సిఐడి. ఉమ్మడి ఏపీలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల స్కామ్ లు ఓ కొలిక్కి కూడా తీసుకురాలేకపోయారు. దాదాపు ఆరేళ్ళు గడుస్తున్నా ఈ కేసులో నిందితులు ఎవరో తేలలేదు. తెలంగాణలో మొత్తం 3600 గ్రామాల్లో 23000 పైగా ఇళ్లను అప్పటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో వెయ్యికి పైగా ఇండ్లు కట్టనప్పటికీ కట్టినట్టు వాటికి సంబంధించిన నిధులని మళ్ళించారంటూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన తొలి కేసిది ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. అదేకాదు ఎంసెట్ స్కాం, సీఎంఆర్ఎఫ్ స్కామ్, బోధన్ స్కాం వంటి అత్యంత సంచలన కేసులని సీఐడీ నాంచుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఐడీ దగ్గర 242 కేసులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 510కి చేరింది. గతంలో వందకు పైగా కేసులని సీఐడీ డిస్పోజ్ చేసినప్పటికీ ఇంకా దర్యాప్తు చేయాల్సిన కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇవే ఆరోపణలతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కొన్ని నెలల క్రితం సీఎస్ కు లేఖ రాసింది. సీఐడీ వింగ్ లో మొత్తం 820 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎడిషనల్ డిజిపి స్థాయి నుంచి ఐజీ, డీఐజీ, ఎస్పీ, బీఎస్పీ తదితర సిబ్బంది ఉన్నారు. 2014 లో సీఐడీకి కోటి రూపాయల నిధులు ఉంటే, 2017 కు నిధులు మూడు కోట్లను దాటాయ్ కానీ, కేసులు మాత్రం అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ప్రభుత్వం ఏదైనా కేసును సీఐడీకి అప్పగిస్తే నిర్ణీత సమయంలోనే దర్యాప్తు పూర్తి చేసి న్యాయం జరిగేలా చూస్తుందని ప్రజలకు నమ్మకం కానీ, కొన్నేళ్లుగా కేసులు చేధించకుండా తమ దగ్గరే నాంచుతూ పెట్టుకోవటం పట్ల సీఐడీ విశ్వాసం కోల్పోతుంది. సీఐడీ వ్యవస్థను సియస్ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.

దేశంలో ఎకనామిక్ ఎమర్జెన్సీ..! గత పదేళ్లలోనే అత్యంత కష్టకాలం?

ఐదు శాతం వృద్ధితో జీడీపీ పదకొండేళ్ల కనిష్టానికి చేరింది... కేవలం ఒకే ఒక్క శాతం వృద్ధితో పెట్టుబడుల రంగం 17ఏళ్లనాటి స్థాయికి పడిపోయి అత్యంత నత్తనడకన సాగుతోంది. అలాగే,  తయారీ రంగం వృద్ధి 15ఏళ్ల కనిష్టానికి పడిపోగా... కేవలం రెండు శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది. ఇక, వ్యవసాయంలో కూడా వృద్ధిరేటు నాలుగేళ్ల అత్యల్పానికి పతనమై 2.8శాతం వృద్ధి రేటుతో మొత్తం దేశ ఆర్ధిక పరిస్థితినే భయపెడుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లో వృద్ధి రేటు పడిపోవడంతో ఈసారి బడ్జెట్లో అన్ని వర్గాలను సంతృప్తిపర్చడం కత్తిమీదసామే అంటున్నారు విశ్లేషకులు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా బడ్జెట్‌ను ఈసారి అంత ఈజీ కానే కాదని చెబుతున్నారు. ఎందుకంటే, గత పదేళ్లలో ఎన్నడూలేనంతగా దేశంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఒకవైపు వేగంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం దేశాన్ని భయపెడుతుంటే.... మరోవైపు దేశ ఆర్ధిక పరిస్థితి... ప్రపంచ రాజకీయాలు... ఇలా అన్నీ ప్రస్తుతం భారత్‌కు ప్రతికూలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రగతిని ముందుకు నడిపించే జీడీపీ వృద్ధిరేటు పతనం కావడం... నిరుద్యోగ రేటు 40ఏళ్ల గరిష్టానికి చేరడం... ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలవడం వంటి సమస్యలు.... ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు విసురుతున్నాయని అంటున్నారు. వృద్ధి అంచనాలు కూడా 42ఏళ్లలో అతిస్వల్పంగా నమోదుకావడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని... దాంతో, గత పదేళ్లలోనే అత్యంత కష్టమైన బడ్జెట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇక, కొనుగోళ్లు లేక జీఎస్టీ వసూళ్లు, ఆదాయపు పన్ను వసూళ్లు తగ్గడం వంటి అంశాలు కేంద్రాన్ని కలవరపెడుతున్నాయి. అలాగే, గత బడ్జెట్లో కేంద్రం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు అంచనాలు తప్పాయి. దాంతో, ఆ లోటు మరింత పెరగకుండా ఇఫ్పుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే, ఆర్ధిక కష్టకాలంలో వనరులను సమీకరించుకోవడం సవాలుతో కూడుకున్న పని కావడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మాత్రం చాలా టఫ్ అంటున్నారు. మరి, ఈ పెను సవాలును నిర్మలమ్మ ఎలా అధిగమిస్తారో చూడాలి.

ఓం తారే...తుత్తారే...తురే సోహా... కరోనాకు విరుగుడుగా తారామంత్రం

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతోంది... కరోనా పేరు వింటేనే ఆమడదూరం జరుగుతున్నాయి... ఇక, చైనా అయితే అతలాకుతలమవుతోంది... నగరాలకు నగరాలే స్తంభించిపోతున్నాయి... కరోనా దెబ్బకు చైనీయులంతా బెంబేలెత్తిపోతున్నారు... కరోనా కారణంగా ఇప్పటివరకు 150మంది మరణించగా.... వేలాది మంది ఈ వైరస్ బారినపడి అల్లాడిపోతున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో 70మందికి పైగా మృత్యువాత పడగా... గడిచిన 24గంటల్లో 30మంది మరణించడం చైనాను కలవరపెడుతోంది. ఇక, చైనాలో ఉన్న విదేశీయులైతే హుటాహుటిన తమ దేశాలకు పయనమవుతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే.... టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మాత్రం... చిన్న మంత్రం జపిస్తే చాలు... ప్రాణాంతక కరోరా దరిచేరదని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ ...తారా మంత్రం... పఠించాలంటూ చైనీయులకు సూచించారు. అంతేకాదు... ఓం తారే... తుత్తారే... తురే సోహా... అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను తన అనుచరుల కోసం దలైలామా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ తారామంత్రం... కరోనా వైరస్‌ దరిచేరకుండా... వ్యాపించకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అన్నారు. అయితే, దలైలామా చెప్పిన ఈ మంత్రం ఇప్పుడు చైనాలో వైరల్ అవుతోంది.

పట్టణీకరణపై జగన్ సర్కారు ఫోకస్... అభివృద్ధి వికేంద్రీకరణలో తొలి అడుగు...

పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమంటోన్న జగన్ ప్రభుత్వం... పట్టణీకరణపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ... తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ... అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీ పరిధుల్లోకి... పెద్దఎత్తున మున్సిపాలిటీలను, మండలాలను తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్న గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్ పరిధిలోకి కొత్తగా అమలాపురం, మండపేట, ముమ్మిడివరం, ఏలేశ్వరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను చేర్చింది. దాంతో, ప్రస్తుతం 2వేల 183 చదరపు కిలోమీటర్లున్న గోదావరి డెవలప్‌‌మెంట్‌ అథారిటీ పరిథి ఏకంగా 4వేల 396 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీలోకి రాప్తాడు నియోజకవర్గాన్ని చేర్చింది. రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లోని ఆత్మకూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు మండలాలను చేర్చడంతో... అహుడా పరిధి 6వేల 591 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి నగరి మున్సిపాలిటీతోపాటు 13 మండలాలను చేర్చడంతో... 4వేల 527 కిలోమీటర్లకు తుడా పరిథి పెరిగింది. గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ... తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ... అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీలోకి... పెద్దఎత్తున మున్సిపాలిటీలను, మండలాలను తీసుకొస్తూ... పురపాలకశాఖ ఉత్తర్వులు ఇవ్వడంతో... ఒక్కసారిగా వేల చదరపు కిలోమీటర్ల పరిధి... ఈ సంస్థల నియంత్రణలోకి వచ్చాయి. అయితే, ఈ మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని భారీగా పెంచిన ప్రభుత్వం... కొత్తగా చేర్చిన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధిని చేపడుతుందో చూడాల్సి ఉంది.

గెలుపు ధీమా.. ఢిల్లీ ఎన్నికల్లో విజయం తమదే అంటున్న ప్రధాన పార్టీలు!

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడి గెలుపును అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం పై జెండా ఎగుర వేసేందుకు ప్రధాన పార్టీలు వినూత్న ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. అయితే రాష్ట్రం చిన్నది అయినా అసెంబ్లీ సీట్లు తక్కువ గానే ఉన్నా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది ఢిల్లీ. దేశ రాజధాని కావడం అందులో అన్ని వర్గాల.. రాష్ర్టాల.. ప్రజలు నివసిస్తూ ఉండటమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల్లో దాదాపు కోటిన్నర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేవలం నెల వ్యవధిలోనే ఢిల్లీ ఓటర్లు పూర్తి భిన్నమైన తీర్పునిస్తారన్న దానికి గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. 2013 ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమాద్మీ పార్టీ 28 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని 48 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపే చేతులెత్తేసింది. తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏడు పార్లమెంటు స్థానాలకు ఏడు సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 67 స్థానాల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బిజెపి మాత్రం కేవలం మూడు స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇక ఈ సారి జరగనున్న ఎన్నికలు అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోరుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను అవకాశంగా చేసుకుని హస్తిన అసెంబ్లీలో పునః వైభవం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

లోకేష్ వర్సెస్ వంశీ.. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం!

వల్లభనేని వంశీ టీడీపీని వదలి వెళ్లిన సమయం నుండి వంశీ మరియు లోకేష్ ఒకరి పై ఒకరు సోషల్ మీడియా వేదికగా తెగ పొస్ట్ లు పెడుతున్నారు. మీడియాను ఆసరాగా చేసుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సెన్సేషనల్ గా మారారు.టీడీపీ యువనేత నారా లోకేష్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో హాట్ టాఫిక్ గా మారింది. టిడిపి ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నారంటూ వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, పోతుల సునీత తదితరుల ఫోటోలతో ఉన్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు.  నాడు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లినప్పుడు సంతలో గొర్రెల్లా తమ ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ కొనిందని జగన్ ఆరోపించారు. ఆయన మాటలనే ప్రస్తావిస్తూ వీరి ఫోటోను జత చేసేన లోకేష్ గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కొన్నారంటూ కామెంట్లు కూడా చేశారు.దీని పై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందిస్తూ వద్దంటే వెళ్లి మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడారని ఎద్దెవా చేశారు.మండలి కూడా రద్దు కావడంతో లోకేష్ కు పిచ్చి పట్టి కామెంట్లు చేస్తున్నారని వంశీ విమర్శించారు. గొర్రెలకే కాదు పిచ్చి కుక్కలకు తన దగ్గర వైద్యం ఉందని వంశీ జోడించారు. మితి మీరుతున్న వీరి కామెంట్లు ,పోస్టల పై నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సారీ.. నేను రాను... సీఎం రమేష్ కుమారుడి పెళ్లికి రానని చెప్పిన జగన్!!

తెలుగుదేశం నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ , ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఇద్దరిది ఒకే జిల్లా కానీ ఇద్దరి మధ్య రాజకీయ వైరం తారాస్థాయిలో ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి టైం నుంచే సీఎం రమేష్ తో పొలిటికల్ రైవలరీ ఉండేది. టిడిపిలో ఉన్నంత వరకు జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు రమేష్. బిజెపిలో చేరిన తర్వాత సీఎం రమేశ్ కాస్త సైలెంట్ అయినా అప్పుడప్పుడు విమర్శల బాణాలు వేస్తూనే ఉన్నారు. ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నేపథ్యంలో సీఎం రమేష్ ఏకంగా సీఎం జగన్ ను అమరావతి వెళ్లి కలవడం.. ముసిముసి నవ్వులు నవ్వుకోవడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  సీఎం రమేష్ కుమారుడి వివాహం వచ్చే నెల మొదటి వారంలో జరగబోతోంది. దుబాయి లో ఎంగేజ్ మెంట్ ను అంగరంగవైభవంగా చేశారు రమేష్ . పెళ్లి వేడుకను అంతకు మించి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు సీఎం రమేష్. అమరావతి సచివాలయంలోని సీఎం ఆఫీసుకు కొడుకుతో పాటు సతీసమేతంగా వెళ్లి జగన్ కు ఆహ్వాన పత్రిక అందించారు. పక్కనే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. తన కుమారుడి వివాహానికి తప్పకుండా రావాలని పిలిచారు. కానీ సీఎం జగన్ రియాక్షన్ తో షాక్ అయ్యారట సీఎం రమేష్. పెళ్లికి రాలేనని చెప్పారట సీఎం జగన్. రావాలని పదేపదే అడిగినా జగన్ మాత్రం సారీ అన్నారని సమాచారం.  పెళ్ళికి రాలేను అని జగన్ చెప్పిన దానిపై చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. పెళ్లికి టిడిపి అధినేత చంద్రబాబు అలాగే ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు తన రాజకీయ ప్రత్యర్థులు వస్తారని అందుకే తాను రాలేనని సీఎం రమేష్ కు నవ్వుతూనే చెప్పారట జగన్. రాజధానుల అంశం ఇంగ్లీష్ మీడియంపై ఈ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఒకే వేదికలో కూర్చోవడం మాట్లాడటం తనకే కాదు వాళ్ళకి ఇబ్బందేనని అన్నారట జగన్. అయినా రావడానికి ప్రయత్నించాలని చెప్పి నవ్వుతూ వెళ్లిపోయారు సీఎం రమేష్ దంపతులు.  ఈ మధ్య సీఎం రమేష్ ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారని మాటలు వినపడుతున్నాయి. కొడుకు మ్యారేజ్ కి ఆహ్వానించడమే కాదు సీఎం జగన్ శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్ కార్యక్రమానికి హాజరయ్యారు రమేష్. కడపతో పాటు అనేక చోట్ల సీఎం రమేష్ కు కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు ఇంకా డబ్బులు రావలసి ఉండటంతో ఇదంతా చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వ మాత్రం బిల్లులు క్లియర్ చేయటం లేదట. దీంతో జగన్ తో వైరం పెంచుకుంటే బిల్లులన్నీ మరింత కాలం పెండింగ్ లో పడతాయని భావించిన సీఎం రమేష్ వైసీపీ అధినేతతో కయ్యం కన్నా వియ్యమే మేలని ఆలోచిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా రాయబారం నడుపుతూ జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అధిష్టానం కూడా జగన్ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పుడు తానెందుకు నెగిటివ్ గా ఉంటానని ఆలోచిస్తున్నారు. అందుకే జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సీఎం రమేష్ ను మాత్రం జగన్ దూరం పెడుతున్నారు. అందుకే కొడుకు పెళ్లికి సైతం రాలేనని సున్నితంగా బదులిచ్చారు సీఎం జగన్.

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని... ఇఫ్పుడు సిట్ ఎందుకు వేశారు? జగన్ కు చెల్లెలు సూటి ప్రశ్న

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.

బీజేపీలో చేరింది.. మోదీ కే మీ ఓటు అని ప్రచారం చెయ్యనున్న సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ జనరల్ సెక్రెటరీ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సైనా నెహ్వాల్ తో ఢిల్లీలో ఎన్నికల ప్రచార నిర్వహించబోతున్నట్లు సమాచారం. బిజెపి జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మోదీ దేశం కోసం పాటుపడుడుతున్న వైనం చూసి ఆయనతో పని చేయాలనే బీజేపీలో చేరినట్లు సైనా నెహ్వాల్ మీడియాతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు నడ్డాతో భేటీ అయ్యారు సైనా. రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైనాతో ప్రచారం చేయించాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ దేశ అభివృద్ధి కోసం, క్రీడ అభివృద్ధి కోసం పాటుపడడం చూసి కొందరు ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. దీని కోసం ముఖ్యమైన నేతలు, సెలబ్రిటీలతో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించే వ్యూహం చేసినట్లు సమాచారం. కేంద్ర మంతి అమిత్ షా తో పాటు వివిధ ముఖ్య నేతల సైతం ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కేజ్రివాల్ కు దీటుగా ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీని సైతం తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.

నిరాశపరిచిన ఫలితాలు.. టీఆర్ఎస్ మంత్రుల పై వేటు పడనుందా? 

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అంచనాలకు మించి విజయం సాధించింది. 100 పైగా పురపాలక సంఘాల్లో పాగా వేసింది. అయితే జడ్పీ తరహాలోనే జిల్లాలో అన్ని మున్సిపాల్టీలు కార్పొరేషన్ లు గెలిపించాలని..క్లీన్ స్వీప్ లక్ష్యమని నిర్దేశించారు కేసీఆర్. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు గానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కేసీఆర్ ఈ టార్గెట్ ఇచ్చారు. ఓడిపోతే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. పెద్ద పదవుల్లో ఉన్నవారైనా బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ఉన్నవాళ్ల పదవులు పోతాయని.. కొత్తవాళ్లకు పదవులు ఇవ్వమని స్పష్టం చేశారు.  కొన్ని చోట్ల ఫలితాలు పార్టీకీ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కొందరు మంత్రుల మెడపై పదవీ గండం కత్తి వేలాడుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వడ్డేపల్లి మునిసిపాలిటీలో టిఆర్ఎస్ ఓడిపోయింది. ఈ మున్సిపాలిటీకి ఇన్ చార్జిగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవికి గండం ఉన్నట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిరంజన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటారా వార్నింగ్ తో సరిపెడతారా అనే విషయం ఆసక్తిగా మారింది.  ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా టిఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. చండూరు, హలియ, నల్లగొండ మునిసిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ వార్డులు దక్కించుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుడితో కొన్ని చోట్ల చైర్మన్ పదవులు దక్కాయి. పార్టీ పనితీరు పై సిఎం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చిట్యాల, యాదగిరి గుట్ట, భువనగిరి లోనూ గులాబితో కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడింది. దీంతో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి వైపు నేతలు చూస్తున్నారు.  ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా టీఆర్ఎస్ కు ఫలితం అనుకూలంగా రాలేదు. అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. దీంతో ఎంఐఎం మద్దతు కీలకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ పార్టీకి సానుకూల ఫలితాలు రాలేదు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మరి జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై ఇది ప్రభావం చూపనుందా అని పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  ఇక గ్రేటర్ కు ఆనుకొని ఉన్న కొన్ని కార్పొరేషన్ లు మున్సిపాలిటీల్లోనూ గులాబీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. తుక్కుగూడలో బిజెపి గెలిచింది. మీర్ పేటలో స్వతంత్రులు ఆధిక్యంతో గెలిచారు. ఇక తుర్కయాంజల్లో ప్రతికూల ఫలితం వచ్చింది. పెద్ద అంబర్ పేటలో కారు జోరు చూపించలేకపోయింది. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై ఇవి ప్రభావం చూపే అవకాశముంది. మొత్తానికి ఐదు నుంచి ఆరుగురు మంత్రుల పని తీరు పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 1న ఉరి.. నిర్భయ దోషి ముఖేష్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

నిర్భయ దోషి ముకేష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాష్ట్రపతి తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు ముకేష్. దీనిపై వాదనలు విన్న జస్టిస్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉరి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు తీహార్ జైలు అధికారులు. ముఖేష్ ను జైలులో లైంగికంగా వేధించారని అలాగే స్పెషల్ సెల్ లో నిర్బంధించారని ఆరోపించారు అతని తరపు న్యాయవాది అంజనా ప్రకాశ్. ఈ ఆరోపణలను కొట్టిపారేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ మెహతా. దోషి ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి క్షమాభిక్ష ఎలా ప్రసాదిస్తారని ప్రశ్నించారు. వాడి వేడిగా సాగిన ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం ముఖేష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది.

వైఎస్ వివేకా కేసులో 15మందిపై అనుమానాలు... కారణాలు చెప్పిన జగన్ చెల్లెలు సునీత...

తన తండ్రి హత్య కేసులో ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపిన వైఎస్ వివేకా కుమార్తె సునీత... అందుకు కారణాలను కూడా వివరించారు. హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో ముగ్గురు నలుగురు మినహా అందరూ వైఎస్ కుటుంబ సభ్యులు, వాళ్ల సన్నిహితులే కావడంతో... ఎందుకు అనుమానిస్తున్నారో క్లారిటీ చెప్పుకొచ్చారు సునీత.   1. వైఎస్ భాస్కర్ రెడ్డి (కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి) - వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక భాస్కర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించగా వైఎస్ వివేకానందరెడ్డి వ్యతిరేకించారు. 2. వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న) - వైఎస్ వివేకా బెడ్రామ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకలను శుభ్రం చేయమని మనోహర్ రెడ్డి తనకు చెప్పారంటూ యర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. మేము జైల్లో యర్ర గంగిరెడ్డిని కలిసినా ఇదే విషయం చెప్పారు. 3. వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ) - వైఎస్ వివేకా హత్య జరిగాక మొదట ఇంటికి వెళ్లిన వ్యక్తి... ఉదయం 6గంటలకే ఘటనాస్థలానికి వెళ్లిన మొదటి కుటుంబ సభ్యుడు... శంకర్‌ రెడ్డి గదులను శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్నారు.. అందుకే, శంకర్‌ రెడ్డిని అవినాష్ రక్షిస్తున్నాడని భావిస్తున్నాం... అలాగే, కడప ఎంపీగా అధికారులపై ప్రభావం చూపించగలరు..  4. వాచ్ మన్ రంగయ్య ( వైఎస్ వివేకా ఇంటి కాపలాదారు ) - వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఇంటి దగ్గరే ఉన్నాడు... మార్చి 14న మధ్యాహ్నం 12-45కి తన భర్త రాజశేఖర్ కు ఫోన్ చేసి పులివెందుల ఎప్పుడు వస్తున్నారని ఆరా తీశాడు... ఆ తర్వాత తాను ఫోన్ చేయలేదని మాట మార్చాడు... ఫోన్ చేయమని వాచ్ మన్ కి చెప్పిందెవరు?... వివేకా హత్య జరిగిన రోజు తాను నిద్రలో ఉన్నాను... తనకేమీ వినబడలేదని వాచ్ మన్ చెబుతున్నాడు... కానీ, ఇంట్లో ఎన్నో వస్తువులను బద్దలు కొట్టారు... ఆ శబ్దాలు రంగయ్యకు ఎందుకు వినిపించలేదో తెలియడం లేదు?... వివేకానంద రెడ్డిని చివరిగా చూసింది వాచ్‌మన్‌ రంగయ్యే... ఏం జరిగిందో బయటకు చెప్పడానికి భయపడుతున్నాడు? సహజంగా రంగయ్య తక్కువ నిద్రపోతాడు. అతను వేకువజామున 5గంటలకే మేలుకొంటాడు. కానీ, సంఘటన జరిగిన రోజు ఉదయం 6గంటల వరకు నిద్రలోనే ఉన్నాడు. కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, ప్రకాశ్‌ వచ్చే వరకూ లేవలేదు. ఎందుకలా? వివేకానంద రెడ్డి బాత్రూంలో ఉన్నట్లు మొదటగా గుర్తించింది రంగయ్యే. సహజంగా అతను ఇంట్లోకి వెళ్లడు. ఎవరి సూచనలు లేకుండా పక్క తలుపుగుండా అతను ఎందుకు లోపలికి వెళ్లాడు? 5. డి.శివశంకర్‌రెడ్డి... ఇతను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు... గతంలో అతనికి నేరచరిత్ర ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్థానంలో పోటీ చేయాలని భావించారు. 2010లో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో శంకర్‌రెడ్డి సాంఘిక వ్యతిరేక కార్యాకాలపాలకు వ్యతిరేకంగా వివేకా ధర్నా చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వివేకా బతికుండగా ఆయన ఇంటికి శంకర్‌ రెడ్డి వచ్చేవారు కాదు. కానీ వివేకా మృతి చెందిన రోజు ఉదయం మాత్రం వివేకా బెడ్రూమ్‌లోనే శివశంకర్‌రెడ్డి ఉన్నారు. ఇతరులను లోనికి రానీయలేదు. ఫొటోలు తీసుకోవడానికి అనుమతించలేదు. కానీ ఆ ప్రాంతం శుభ్రం చేయడాన్ని మాత్రం ఆపలేదు. అంటే ఈ పరిణామాల గురించి ఆయనకు తెలిసే శుభ్రం చేయడానికి అనుమతించాడా? వివేకానంద రెడ్డికి హార్ట్‌ ఎటాక్‌ అని సాక్షి మీడియా హెడ్‌ బాలకృష్ణకు రిపోర్ట్‌ చేశారు. ఆయన ఎందుకలా చెప్పారు? 2016 ఎన్నికల్లో వివేకా స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నారు. అది జరగకపోవడంతో అతను మృతునికి దూరంగా జరిగారు. అతను టీడీపీ నుంచి డబ్బును అనుమతించారు. అంతేగాక వైసీపీ వారు టీడీపీకి ఓటు వేయవచ్చన్న పరిస్థితిని వైసీపీలో కల్పించారు. 6. యర్ర గంగిరెడ్డి: వైఎస్‌ వివేకానందరెడ్డికి 40ఏళ్లుగా అత్యంత సన్నిహితుడు. గంగిరెడ్డి ...వివేకాను హత్య జరిగిన రోజు రాత్రి 11.15 గంటలకు ఆయన ఇంటి వద్ద వదిలేశారు. ఇల్లు మొత్తం ఆయనకు తెలుసు. ఆరోజు 7 గంటలకు సంఘటనా స్థలికి వచ్చిన గంగిరెడ్డి.... భార్య, కుమార్తె, అల్లుడు ఫోన్‌ చేసినా తీయలేదు. అంతేగాక వివేకాది సహజ మరణమని ప్రతి ఒక్కరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తెచ్చాడు. సీఐ సమక్షంలో ఘటనా స్థలిని శుభ్రం చేయడం, మృతదేహం డ్రెస్సింగ్‌, క్లీనింగ్‌ వంటి పనులను పర్యవేక్షించాడు. కుటుంబ సభ్యులం లేకుండానే అదే రోజు అంత్యక్రియలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టాడు. అయితే, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి చెప్పినందుకే సంఘటన స్థలాన్ని శుభ్రం చేయించాల్సి వచ్చిందని ఆ తరువాత తెలిపాడు. 7. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి - వివేకా మృతి గురించి ఉదయ్‌కు తెలుసని, ఆ రోజు వేకువజామున 3.30 గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన స్నేహితులతో ఆయన తల్లి తెలిపింది. అదే సమయంలో హాస్పిటల్లో పరమేశ్వర్‌ రెడ్డికి ఒక విజిటర్‌ ఫోన్‌లో ఏదో చూపించాడు. ఉదయ్‌, ఈసీ సురేందర్‌ రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి 14వ తేదీ అర్ధరాత్రి కలిసినట్లుగా రిపోర్టులున్నాయి. శివశంకర్‌ రెడ్డికి ఉదయ్‌ సన్నిహితుడు. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ప్రకాశ్‌ రెడ్డి, సతీశ్‌ రెడ్డి, డాక్టర్‌ మధులను గత ఆగస్టులో విచారించారు. ఆ తరువాత వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఈసీ సురేంద్రనాధ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి మంగళగిరిలో డీజీపిని ఎందుకు కలవాల్సి వచ్చింది? కొన్ని అరెస్టులు జరుగుతాయన్న అనుమానంతోనే కలిశారా? ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ మధుసూధన్‌ రెడ్డిలను విచారణ కోసం కడప తీసుకెళ్తుండగా కొన్ని ఫోన్లు రావడంతో నందిమండలం నుంచే తిప్పిపంపారు. వారిని అభిషేక్‌ మహంతి నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రశ్నించకుండా అడ్డుకున్నది ఎవరు? 8. పరమేశ్వర్‌ రెడ్డి: ఈయన స్థానిక నాయకుడు. ఆయన భార్య ఎంపీపీ. పరమేశ్వర్‌ రెడ్డికి నేర చరిత్ర ఉంది. గత ఏడాది మార్చి 13వ తేదీన దినేశ్‌ నర్సింగ్‌ హోంలో చేరుతున్నట్లుగా అడ్మిషన్‌ కార్డు అడిగాడు. అందుకోసం ఆ ఆసుపత్రికి వెళ్లాడు. సాధారణంగా అతను హాస్పిటల్లో రిజిస్టర్‌ చేసుకోడు. 14 తేదీ ఉదయం ఛాతీ నొప్పితో సన్‌రైజ్‌ హాస్పిటల్లో చేరాడు. వివేకాకు తను సన్నిహితుడినని ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకలా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది? అతనికి ఆ రోజు కొన్ని అస్వస్థత లక్షణాలున్నా మిగిలినదంతా నార్మల్‌గానే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ఎంఆర్‌ఐ కూడా తీశారు. కానీ ముఖ్యమైన పని ఉందంటూ సాయంత్రం సమయంలో గంటన్నర బయటకు వెళ్లాడు. అలాంటి స్థితిలో అతనికి అంత ముఖ్యమైన పని ఏముంది? అతను ఆ రోజు అత్యధికంగా ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. డాక్టర్‌ వద్దంటున్నా వినకుండా బయటకు వెళ్లి సాయంత్రం 8.30 గంటల సమయంలో మళ్లీ అడ్మిట్‌ అయ్యాడు. ఆ సమయంలో అతనేం చేశాడు? వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 3.40 గంటల ప్రాంతంలో ఒకరు అతనిని కలిసి సెల్‌ఫోన్‌ ఇచ్చారు. ఇది సీసీ టీవీలోనూ నమోదైంది. అతను సెల్‌ఫోన్‌లో ఏదో చూశాడు. ఆ ఫోన్‌ ముందురోజు అతని చేతిలో ఉన్నది కాదు. ఆ తరువాతి రోజు తిరుపతి వెళ్లి మరో ఆసుపత్రిలో చేరాడు. 9. శ్రీనివాస్‌ రెడ్డి: ఇతను పరమేశ్వర్‌ రెడ్డికి చాలా వ్యాపారాల్లో భాగస్వామి. పరమేశ్వర్‌ రెడ్డి నార్కో అనాలిస్‌ నుంచి వచ్చాక శ్రీనివాస్‌ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు భిన్న చేతిరాతలతో అతని పేరుతో లేఖ దొరికింది. వివేకా హత్యకు సంబంధించి పోలీసుల వేధింపుల వల్లనే అతను మృతిచెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ వివేకా హత్యకు, శ్రీనివాస్‌ రెడ్డి మృతికి సంబంధముందని మేం నమ్ముతున్నాం. 10. సురేంద్రనాధ్‌ రెడ్డి - అవినాశ్‌ రెడ్డికి బంధువు. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సురేంద్రనాధ్‌ రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం శంకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆగస్టు 31వ తేదీన అవినాశ్‌ రెడ్డి, శివ శంకర్‌రెడ్డిలతో పాటు డీజీపి కలిశారు. ఆ తర్వాతే దర్యాప్తు నత్తనడకన సాగింది. 11. సురేంద్ర రెడ్డి - పరమేశ్వర్‌ రెడ్డి బావమరిది. ఆసుపత్రిలో ఉన్న సురేంద్రరెడ్డి ఫోన్‌ తీసుకుని ఉదయం 3.40 గంటల ప్రాంతంలో పరమేశ్వర్‌ రెడ్డికి ఏవో వివరాలు చూపించారు. అదే సమయంలో ఉదయ్‌ కుమార్‌ కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ వివరాలు గమనిస్తే హత్య పథకం పూర్తయినట్లు వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 12. శంకర్‌ (సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌): ఉదయం 7.10 గంటలకు శంకర్‌ ఘటనాస్థలికి వచ్చారు. ఎం.కృష్ణారెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలన్న దానికి అతనే సాక్ష్యం. రాజశేఖర్‌ రెడ్డి ఫోన్‌లో చెప్పాకే ఆయన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం ఆయనకు ఎందుకు ఇష్టంలేదు? ఏడు అడుగులు విస్తరించిన రక్తపు మడుగును చూపిస్తూ అది సహజమరణం కాదని షేక్‌ ఇనయతుల్లా వివరించాడు. అయినప్పటికీ వివేకా కిందపడి మరణించి వుంటాడని శంకరయ్య నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. పక్కనున్న వాళ్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. 13. రామకృష్ణా రెడ్డి, ఏఎస్‌ఐ: శివ శంకర్‌ రెడ్డికి సన్నిహితుడు. దర్యాప్తులో పాల్గొన్న ఏఎస్‌ఐనే ఆ తర్వాత సాక్షిగా తీసుకున్నారు. ఇదెలా? 14. ఆదినారాయణరెడ్డి - సంఘటన జరిగినప్పుడు ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉన్నారు. వివేకానంద రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆది నారాయణ రెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి కాంటాక్ట్‌లో వున్నాడు. మార్చి 14వ తేదీ సాయంత్రం శంకర్‌ రెడ్డి టీడీపీ వారిని కలిశారు. అక్కడ వారేమైనా హత్యకు ప్రణాళిక రూపొందించారా? ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వారు అతనిని రక్షిస్తామన్నారా? 15. బీటెక్‌ రవి - 2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాపై బీటెక్‌ రవి విజయం సాధించారు. రవి విజయానికి శివశంకర్‌ రెడ్డి సాయం చేశారు. అప్పుడు వారు కలిసి పని చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కోసం పని చేశారు. వివేకా మృతితో వైసీపీ నేతల్ని అరెస్టు చేస్తారు, జిల్లాలో గందరగోళం ఏర్పడుతుందన్నది వారి అభిప్రాయం కావచ్చు.

విశాఖలో ల్యాండ్ పూలింగ్.. పేదలు భూములు ఇస్తే ఉగాదికి కొత్త ఫ్లాట్

విశాఖకు రాజధాని ప్రకటనతో స్టీల్ సిటీలో ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ శివారు గ్రామాల్లో 6,000 ఎకరాల సేకరణకు సర్కారు జీవో జారీ చేసింది. జీవో 72 ప్రకారం సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెదగంట్యాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారుల హడావుడి మొదలయ్యింది. ల్యాండ్ పూలింగ్ కింద సేకరించే భూములను విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీకి అప్పగించారు. ఇప్పటికే అధికారులు ఆయా మండలాల పరిధిలో అసైన్డ్ ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ స్థలాల్లో వీఎంఆర్డీఏ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనుంది. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వ భూములతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తుంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటోందని సిపిఎం మండిపడుతోంది. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తామన్నారు సీపీఎం పార్టీ నేత మధు. భూ సేకరణ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. 

ఆనాడు సీబీఐ కావాలన్నారు? ఇప్పుడెందుకు వేయరు? వైఎస్ జగన్ పై సోదరి సంచలన ఆరోపణలు...

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై... వైఎస్ వివేకా కూతురైన సునీత సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన జగన్మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. సీఎం పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలైనా ఇఫ్పటివరకు ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదని ప్రశ్నను సునీత లేవనెత్తారు. సిట్ అధికారులను పదేపదే మార్చడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. పైగా కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగుతోందని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. ఈ కేసులో జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అసలైన నిందితులను వదిలేసి... అమాయకులను ఇరికిస్తారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తన లాయర్ ద్వారా హైకోర్టుకు వాదనలు వినిపించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత.... 15మందిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి... అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి.... చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి తదితర పేర్లను ప్రస్తావించింది.  వివేకా హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు... లేదా సీబీఐకి అప్పగించాలని ఆయనభార్య వైఎస్ సౌభాగ్యమ్మ... అలాగే, అప్పటి ప్రతిపక్ష నేత... ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు... అప్పట్లో హైకోర్టు వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే, అప్పటి మంత్రి ఆదినారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై ఆరోపణలు రావడంతో... వాళ్లు కూడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అలాగే, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి మరో వ్యాజ్యం చేశారు.అయితే, వైఎస్ వివేకా హత్యపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన హైకోర్టు...కేసును  సీబీఐకి అప్పగించానికి అభ్యంతరం ఏమిటంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  అయితే, వైఎస్ వివేకా కుమార్తె సునీత లేవనెత్తిన ప్రశ్నలే ఇప్పుడు సంచలనంగా మారాయి. సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా తమకు అనుమానాలు ఉన్నాయని వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా... కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారేమోనన్న డౌట్ రాక మానదు. మరి వైఎస్ వివేకా కేసులో అసలు నిందితులెవరో తేలతారో లేక... సునీత అనుమానిస్తున్నట్లుగా అమాయకులను ఇరికించి నిజాలను సమాధి చేస్తారో చూడాలి.