బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
posted on Feb 1, 2020 @ 3:10PM
2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బడ్జెట్ ప్రసంగం ప్రారంభానికి ముందు వరకు లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు.. బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదువుతుండగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ భారీగా పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1,054.86 పాయింట్లు (2.59శాతం) నష్టంతో అమాంతం 39668.63 వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం అదే బాటలో పయనించి, 246.25 (2.06 శాతం) నష్టపోయి 11715.85 వద్దకు పతనమైంది. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసిన కారణంగానే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.