3 శ్లాబులు 6 శ్లాబులు అయ్యాయి.. ఇక పన్ను ఎగవేత క్రిమినల్ నేరం కాదు!
posted on Feb 1, 2020 @ 1:27PM
2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయమని ఆమె చెప్పారు. అదేవిధంగా, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవని మంత్రి తెలిపారు. పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదు..త్వరలో చట్ట సవరణ చేస్తామన్నారు.
నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఆదాయ పన్ను పరిమితులను వివరించారు. ఆదాయపన్ను శ్లాబులో భారీగా మార్పులు చేశారు. ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను అంశంలో ఇప్పటివరకు 3 శ్లాబులు ఉండగా, ఇప్పుడు వాటిని 6 శ్లాబులు చేశారు. రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను.. రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను.. రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను విధించారు. రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను లేదు.