రోజా అండ్ కుమార్ మధ్య గొడవకు కారణమేంటి? పెద్దిరెడ్డి పాత్రేంటి?
posted on Feb 1, 2020 9:03AM
వైసీపీలో రోజా ఆడియో టేప్ కలకలం సృష్టిస్తోంది. సొంత పార్టీ నాయకులకే ఆమె వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న కేజే కుమార్ ఫంక్షన్ కి నగరి వైసీపీ శ్రేణులను రోజా ఎందుకు వెళ్లొద్దన్నారంటూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ కేజే కుమార్ తోనూ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ గొడవేంటంటూ వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. కేజే కుమార్ ఫంక్షన్ కి వెళ్తే ...పార్టీ నుంచి వెళ్లిపోయినట్లేనంటూ రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం వెనుక కారణాలేంటని చర్చించుకుంటున్నారు.
కేజే కుమార్... ఇతను నగరి వైసీపీ స్థానిక నాయకుడు... గతంలో నగరి మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశాడు... అంతేకాదు స్థానికంగా కుమార్ కు మాంచి పట్టుంది. అయితే, రోజాకి కేజే కుమార్ అస్సలు పడదు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే, ఇద్దరూ ఉన్నది ఒకే పార్టీలో... పైగా ఒకటే నియోజకవర్గం... మరి, వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఎందుకొచ్చాయనుకుంటున్నారా? దానికి బలమైన కారణమే ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేజే కుమార్.... 2014లోనూ... అలాగే 2019లోనూ నగిరి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా లాబీయింగ్ చేశాడు. కానీ, జగన్ దగ్గర రోజాకున్న పలుకుబడి ముందు తేలిపోయాడు. దాంతో, మొన్నటి ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా కేజే కుమార్ పనిచేశాడని... ఓడించేందుకు కుట్ర పన్నాడని రోజా రగిలిపోతున్నారు. అందుకే, కేజే కుమార్ ఫంక్షన్ కు ఎవరూ వెళ్లొద్దంటూ రోజా అల్టిమేటం ఇవ్వడమే కాదు... స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఒకే పార్టీలో ఉంటూ... తనను ఓడించడానికి ప్రయత్నించిన కుమార్ ఫంక్షన్‌కు ఎలా వెళ్తారంటూ రోజా మాట.
అయితే, రోజా వార్నింగ్ తో నగరి వైసీపీ నేతలు, కేడరే కాదు.... అతిథులు సైతం గైర్హాజరైనట్లు తెలుస్తోంది. కారణాలేమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు రాకుండా ఆగిపోయారట. అంతేకాదు రోజాతో గొడవ నేపథ్యంలో రాలేమని చెప్పారట. అయితే, నగరి నియోజకవర్గంలో కోల్డ్ వార్ పై అధిష్టానం కోపంగా ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోవడం పార్టీకి మంచిది కాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.