చిన్న యేసు బతికొచ్చాడు... మరి ఆ మృతదేహం ఎవరిది? తూర్పుగోదావరిలో డెడ్ బాడీ మిస్టరీ
posted on Feb 1, 2020 @ 10:15AM
తూర్పుగోదావరి జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. పిఠాపురం మండలం కుమారపురం గ్రామం మురికి కాలువలో ఒక మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు... ఆ మృతదేహాన్ని బయటికి తీశారు. అయితే, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో చొక్కా ఆధారంగా గ్రామానికి చెందిన చిన్నయేసుగా గ్రామస్తులు అనుమానించారు. చిన్నయేసు భార్య కూడా తన భర్తేనంటూ గుర్తించింది. గ్రామస్తులు, చిన్నయేసు భార్య మాట మేరకు పోలీసులు... పోస్టుమార్టం పూర్తి చేయించి డెడ్ బాడీని చిన్నయేసు కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో, చిన్నయేసు కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే, ఇక్కడే కథ మలుపు తిరిగింది. మురికి కాలువలో దొరికిన మృతదేహాన్ని తన భర్తే అనుకుని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా... సడన్‌గా చిన్నయేసు ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు కంగుతిన్నారు. చనిపోయాడనుకున్న చిన్నయేసు ఎలా బతికొచ్చాడంటూ ఆశ్చర్చపోయారు. ఇక, కుటుంబ సభ్యుల ఆనందానికైతే ఆవధుల్లేకుండా పోయాయి. చనిపోయాడనుకున్న భర్త తిరిగిరావడంతో భార్య ఉబ్బితబ్బియ్యింది. అయితే, ఇక్కడే మరో సస్పెన్స్ మొదలైంది. మరి, మురికి కాలువలో మృతదేహం ఎవరిది? అసలు అతనెవరు? గ్రామస్తులు చిన్నయేసుగా ఎందుకు చెప్పారు? చిన్నయేసు భార్య కూడా తన భర్తేనని ఎలా చెప్పింది? పొరపాటున చెప్పారా? లేక ఇందులో ఏమైనా తిరకాసు ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
అయితే, చనిపోయాడనుకున్న చిన్నయేసు ధరించిన చొక్కా.... మురికి కాలువలో దొరికిన మృతదేహంపైనున్న చొక్కా.... ఒకేవిధంగా ఉండటంతో.... తాము పొరపడ్డామని గ్రామస్తులు అంటున్నారు. తాగుడుకు బానిసైన చిన్నయేసు... నాలుగైదు రోజులుగా కనిపించకపోవడంతో... మరణించింది అతేనని అనుకున్నామని అన్నారు. చిన్నయేసు భార్య కూడా.... కాలువలో కనిపించిన మృతదేహం తన భర్తేనని చెప్పిందని అన్నారు. అయితే, పని నిమిత్తం తాను కాకినాడ వెళ్లానని.... కానీ నేను చనిపోయానని తన భార్య, గ్రామస్తులు అనుకున్నారని చిన్నయేసు అంటున్నాడు. అయితే, తాను సజీవంగా తిరిగి రావడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆనందంతో ఆశ్చర్యపోతున్నారని చెబుతున్నాడు.
అయితే, గ్రామస్తులు... చిన్నయేసు భార్య... చెప్పిన ప్రకారమే.... తాము పోస్టుమార్టం నిర్వహించి డెడ్‌బాడీని అప్పగించామని, కానీ చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో.... దొరికిన మృతదేహం ఎవరనేది గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి, చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా తిరిగి రావడంతో ఒక ట్విస్ట్ అయితే... అసలు మురికి కాలువలో దొరికిన మృతదేహం ఎవరిదనేది సస్పెన్స్ గా మారింది.