ఉచిత పథకాలతో ముప్పు... మాఫీలతో వ్యవస్థకే దెబ్బ
posted on Feb 1, 2020 @ 10:54AM
దేశ ఆర్ధిక వ్యవస్థ, స్థితిగతులకు అద్దంపట్టే ఆర్ధిక సర్వే కేంద్రానికి పలు కీలక సూచనలను చేసింది. దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధిబాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులు... ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపై ఆర్ధిక సర్వే పలు సూచనలు చేసింది. ముఖ్యంగా భారత్... ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారాలంటే మాత్రం నైతిక విలువలతో కూడిన సంపద చాలా కీలకమంటూ తేల్చిచెప్పింది. ఇక, రానున్న ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆర్ధిక వృద్ధి 6 నుంచి 6.5 శాతం ఉండొచ్చని ఆర్ధిక సర్వే అంచనా వేసింది. మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం... వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం... ఆర్ధిక వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా... ఇది సాధించవచ్చని తెలిపింది. రానున్న ఆర్ధిక సంవత్పరంలో అంతర్జాతీయ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయని అంచనా వేసింది. అయితే, ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు ఉండాలని ఆర్ధిక సర్వే అభిప్రాయపడింది. అలాగే, లాభదాయకత, సామర్ధ్యం, పోటీతత్వం, నైపుణ్యం పెరగాలంటే... వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ జరగాలని ఆర్ధిక సర్వే నిపుణులు సూచించారు. ఇక, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో జీఎస్టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశముందని అంచనా వేసింది.
ఇక, తాలినామిక్స్ పేరుతో అర్ధశాస్త్రాన్ని సామాన్యుడికి అన్వయించే ప్రయత్నం చేసిన ఆర్ధిక సర్వే నిపుణులు.... ఒక ప్లేటు భోజనం కొనుగోలు చేసే శక్తి 29శాతం మెరుగుపడిందని తేల్చారు. ఇక, ఉచిత పథకాలు ఆర్ధిక వ్యవస్థకు నష్టదాయకమని ఆర్ధిక సర్వే తేల్చిచెప్పింది. ఉచిత పథకాల లబ్ధిదారులు తక్కువ ఖర్చు పెడతారు... తక్కువ పొదుపు చేస్తారు... అలాగే, తక్కువ పెట్టుబడి పెడతారని విశ్లేషించారు. అలాగే, మాఫీలు కూడా రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆర్ధిక సర్వే స్పష్టంచేసింది. మొత్తంగా దేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన పలు కీలక సూచనలను కేంద్రం ముందుంచింది ఆర్ధిక సర్వే. మరి, వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందో లేదో.