డమ్మీ ఉరి.. నిర్భయ దోషుల ఉరికి ట్రైల్స్ వేయనున్న తలారి పవన్!

నిర్భయ దోషులు రేపు ( ఫిబ్రవరి 1వ తేదీన ) ఉదయం 6 గంటలకు ఉరికంబం ఎక్కనున్నారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి.. ఇవాళ మధ్యాహ్నం డమ్మీ ఊరి వేయనున్నారు తలారి పవన్. నిర్భయ దోషులకు పడిన మరణశిక్షను అమలు చేసేందుకు  ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నారు తలారి పవన్. తలారి కోసం తీహార్ జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక వసతి గది ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణం లోనే ఉంటూ ఉరితాడు సామర్థ్యంతో పాటు ఇతర విషయాలను పరిశీలిస్తున్నారు.  కొద్ది రోజుల ముందు నిర్భయ దోషులకు ఉరివేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్ నిర్వహించారు. బక్సర్ నుంచి ఉరితాళ్లను తెప్పించారు. అయితే తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఆపేందుకు నిర్భయ దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా నిర్భయ దోషి అక్షయ్ కుమార్ వేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దాంతో పాటు ఫిబ్రవరి 1వ తేదీన అమలు కానున్న ఉరిశిక్ష పై స్టే విధించాల్సిందిగా అతడు చేసిన మరో పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరో నిందితుడు వినయ్ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది.  

నామినేటెడ్ పదవుల కోసం కేటీఆర్ చుట్టూ గులాబీ నేతల ప్రదక్షిణలు!!

నామినేటెడ్ పదవుల భర్తీ కోసం గులాబీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలేవీ లేకపోటంతో కేసీఆర్ పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆశావహులంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కార్పొరేషన్ లు, కమిషన్ లు ఇతర సంస్థలు కలిపి 56 మందికి చైర్మన్ పదవులను కట్టబెట్టింది. అందులో 49 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి, వీటిలో కొన్ని మూడేళ్ల పదవీకాలం మరి కొన్ని రెండేళ్ల పదవీ కాలంతో నియామకాలు జరిగాయి. వీటి పదవీ కాలం కూడా ముగిసింది, ఇందులో కేవలం టీఎస్ ఐఏసీ చైర్మన్ బాలమల్లు, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పదవీకాలం మాత్రమే రెన్యువల్ అయ్యాయి. ఈ మధ్య పార్టీలో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. గతంలో పదవీ కాలం ముగిసిన ఛైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న గత చైర్మన్ లకు ఎదురు చూపులే మిగిలాయి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇదుగో అదుగో అంటూ ఊరించడమే తప్ప ఆచరణలోకి రాలేదన్న ఆవేదనకు పార్టీ నేతలు గురవుతున్నారు. జిల్లా స్థాయి పదవులతో కలిపి దాదాపు 500 వరకూ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని అంచనా. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నలుగురికి పైగా అవకాశం వస్తుంది. రాష్ట్రస్థాయి లోని కొన్ని కార్పొరేషన్ లు కనీసం ఆరుగురి నుంచి పదిహేను మంది దాకా డైరెక్టర్ లను, సభ్యులను నియమించే అవకాశం ఉంది. ఆ లెక్కన కార్పొరేషన్ చైర్మన్ లను ఏర్పాటు చేసి అనుబంధంగా నామినేటెడ్ పదవులను ఇస్తే సుమారు 500 మందికి పైగా నాయకులకు అవకాశం దక్కనుంది. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యే లకు, ఎమ్మెల్సీ లకు చీఫ్ విప్, విప్ పదవులు దక్కాయి. ఇక పదవులు దక్కని ఎమ్మెల్యేలు చాలామంది కూడా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. ఇక మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల అనుచరులు కూడా నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు ఎన్నికల్లో టిక్కెట్ దక్కక ఏదో ఒక మంచి పదవి ఇస్తానని టీఆర్ఎస్ నుంచి హామీ తీసుకున్నవారు ఇలా చాలా మంది పదవుల కోసం ఆశపడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలు అంతా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేశారు. ఎన్నికల్లో కష్టపడితే.. పని తీరును పార్టీ ముఖ్య నేతలు గుర్తిస్తారని భావించి పని చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఆశావహులంతా తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి పదవుల విషయం అడుగుతున్నారు. తాజాగా వివిధ మాజీ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు కేటీఆర్ ను కలిసి తమ పదవుల రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో పాటు మొదట్నుంచీ ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్యమంలో పాల్గొన్న నేతలు తమను గుర్తించాలనీ కేటీఆర్ ను కోరుతున్నట్టు తెలుస్తోంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మహిళా నేతలు కూడా తమకు పదవులు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. పలుమార్లు ప్రకటిస్తారని ప్రచారం జరిగినా ఏదో ఒక కారణంతో ఆగిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మున్సిపల్ ఫలితాల జోష్ లో ఉన్న కేసీఆర్ ఓ దఫా నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.

వికేంద్రీకరణ బిల్లుపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ!!

పాలన వికేంద్రీకరణ బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కమిటీలు వేయొద్దని కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని సమాచారం. చైర్మన్ నిర్ణయం పాటించొద్దు అంటూ ఉప ముఖ్యమంత్రి, చీఫ్ విప్ లు లేఖలు రాశారు. దీంతో కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. పాలన వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు కాకుండా జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కమిటీల ఏర్పాటు జరగకుండా చూడాలని ప్రభుత్వ, వేసి తీరాల్సిందేనని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉండటంతో ఉత్కంఠ భరితంగా మారింది. సెలక్ట్ కమిటీల ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి కార్యదర్శికి ఏకంగా లేఖ రాయగా కమిటీల్లో నియమించేందుకు తమ సభ్యుల పేర్లను టిడిఎల్పీ ఇప్పటికే ఇన్ చార్జి కార్యదర్శి రాజ్ కుమార్ కు అందజేసింది. దీంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకంగా మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం తుది నిర్ణయం తీసుకుని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేదాకా మండలి కొనసాగుతుంది. ఈలోపు సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కాకుండా మండలి ఇన్ చార్జి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెలక్ట్ కమిటీల్లో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండల ఇన్ చార్జి కార్యదర్శికి ఇప్పటికే చైర్మన్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు కానీ, ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండటంతో ఆయన ఇంత వరకూ ఈ లేఖలు పంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో టిడిపి శాసన సభాపక్షం తమ తరపున పదిమంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందజేసింది. ఒక్కో కమిటీలో టిడిపి కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్టు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు. ఇది తెలిసి అధికార పక్షం వెంటనే రంగంలోకి దిగింది. మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ లు విడివిడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని తమ పార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమారెడ్డి తన లేఖలో తెలిపినట్టు ప్రచారం జరుగుతుంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం.. నియమాలకు విరుద్ధమని అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వపక్షం మాట కాదనలేక, ఇటు చేరిపోయిన ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేక ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మండలిలో సభా నాయకుడి లేఖను జతపరుస్తూ.. పై అభ్యంతరాల దృష్ట్యా తాను సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేనని చైర్మన్ కు లేఖ రాయాల్సిందిగా కార్యదర్శికి ప్రభుత్వం సూచించిందని అంటున్నారు. మరి ఆయన అలా రాస్తారా లేదా అన్నది చూడాలి.

జేడీ లక్ష్మీ నారాయణకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!!

జనసేనకు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. పవన్ కళ్యాన్ ది నిలకడలేని విధానమని అందువల్లే పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించిన పవన్.. అన్నీ తెలుసుకొని లేఖలో ప్రస్తావిస్తే బాగుండేదని అన్నారు. లక్ష్మీ నారాయణ జనసేనకు రాజీనామా చేశారు. తిరిగి సినిమాల్లో నటిస్తున్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ది నిలకడలేని విధానమని అందువల్ల పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం పవన్ కు లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విదానాలు లేవని తెలుస్తుంది, అందువల్ల తాను పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని లేఖ రాశారు. వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.  లక్ష్మీ నారాయణ రాజీనామాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమోదించారు. ఆయన భావాలను గౌరవిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు, సినిమాలకు సంబంధించి రాజీనామా లేఖలో తనను ఉద్దేశించి లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కానని అన్నారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి అన్నారు. వారి కోసం, కుటుంబం కోసం పార్టీకి ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరంటూ చెప్పుకొచ్చారు. సినిమాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుని లక్ష్మీ నారాయణ తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని పవన్ అన్నారు. పార్టీకి రాజీనామా చేసినా వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఆయనకు శుభాభినందనలు అని పవన్ ప్రకటించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. భవనాలకు పార్టీ రంగులు తీసేయడానికి నిధులు కరువు!!

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో గ్రామ సచివాలయం భవనాలకు పార్టీ రంగులు తీసేయడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే దీనికి నిధులు ఎక్కడి నుంచి తీసుకు రావాలంటూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. హైకోర్టు సూచనల ప్రకారం ఈ రంగులు మార్చాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై పడింది. అయితే కమిషన్ ఆదేశాలను అధికార యంత్రాంగం పాటిస్తుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. గ్రామ సచివాలయాల వ్యవస్థ అమలులోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం వాటితో పాటు కమ్యునిటీ భవనాలు, నీళ్ల ట్యాంకులు ఇతర ప్రభుత్వ భవనాలు కొన్ని చోట్ల పాఠశాల భవనాలను సైతం వైసీపీ రంగులలోకి మార్చింది. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు వేయకూడదు అని తెలిసినా పంచాయతీ రాజ్ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చి అధికారికంగా మెమో ఇచ్చారు. అదే బాటలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఎన్ సీ నడిచారు. గతంలో పెయింట్ లు వేసిన కొత్త పంచాయతీ భవనాలు కూడా వైసిపి రంగుల్లోకి మారిపోయాయి.  యాభై శాతం రిజర్వేషన్ లపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వడంతో హై కోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాలన్నీ మళ్లీ తెల్ల రంగులోకి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీల్లో నిధులు ఉన్నా లేకున్నా ఆయా పంచాయతీల కార్యదర్శులు నిధులు సమీకరించుకుని మరీ భవనాలకు వైసీపీ రంగులు వేయించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1300 కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఇదే విషయమై ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా సచివాలయ భవనాలకు పార్టీ రంగులేయడంపై ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని రంగులు మార్చాలని సూచించారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆదేశాలు వెంటనే అమలు చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్ట్ ఇచ్చిన పలు ఆదేశాలను అమలు చేయడం కన్నా ఏదో ఒక వంకతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ విషయం లోనూ కాలయాపన చేస్తుందంటున్నారు. గతంలో వైసీపీ పెయింట్ లు వేసేందుకు పంచాయతీ నిధులు వినియోగించుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు వాటిని మార్చేందుకు ఎస్ ఈ సీ వద్ద నిధుల్లేవు. ఎన్నికల నిర్వహణపై హై కోర్టు ఆదేశిస్తే ఒక నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ లకు మరో నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈలోపు సచివాలయాలతో పాటు ప్రభుత్వ భవనాల రంగులు మార్చడం సాధ్యమేనా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధ్యత ఎన్నికల కమిషనర్ ది అని హై కోర్టు పేర్కొనడంతో ఈసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోడ్ అమలు లోకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఆదేశించగలమని ఎస్ ఈ సి ఇప్పటికే సందేహాలు వ్యక్తం చేసింది. కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి అమలు చేయాలంటే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులపై మరోసారి భారం పడుతోందని అంటున్నారు. అంతేకాకుండా ఇంత తక్కువ సమయంలో పెయింట్ లు మార్చడం వీలుకాదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గతంలో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేసి కోడ్ ముగిసిన తర్వాత తొలగించారు. ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సమావేశాలు సఫలం అయ్యేందుకు సహకరించాలని అఖిల పక్ష సమావేశంలో విపక్ష నేతలను మోదీ కోరారు. ఈ మీటింగ్ లో వైసిపి, టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈరోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష భేటీలో ఇరవై ఆరు రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. పార్లమెంటు సమావేశాలు ఫలప్రదమయ్యేందుకు నాయకులు తమ వంతు పాత్ర పోషించాలని మోదీ విపక్షాలను కోరారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం తదితర అంశాలను అన్నా డీఎంకే మినహా ఇతర విపక్షాలు ఈ భేటీలో లేవనెత్తాయి. జమ్మూ కశ్మీర్ లో నిర్బంధంలో ఉన్న నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.  అటు అఖిల పక్ష సమావేశంలో టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ శాసన మండలి రద్దు, రాజధాని మార్పు అంశాలను పార్లమెంట్ లో చర్చించాలని టిడిపి ఎంపీలు పట్టుబట్టారు. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్ సభ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు రాష్ర్టానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి అన్నారు. వెంటనే కల్పించుకున్న టిడిపి ఎంపిలు తాము కేంద్రంతో సంప్రదించిన తర్వాతే అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాదన తీవ్రస్థాయికి చేరింది. గందరగోళం నెలకొనడంతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కల్పించుకుని వైసీపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. టిడిపి ఎంపీల అభిప్రాయాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రకటించారు. ప్రస్తావన మాత్రమే తీసుకువచ్చారని సభలో చర్చించాలా లేదా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. ఇది కేవలం చర్చపై జరుగుతున్న సమావేశం మాత్రమేనని చర్చించే అంశాలపై గొడవకు దిగడం సరి కాదని రాజ్ నాథ్ హితవు పలికారు. రాజధానికి నిధులు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు అంటూ విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఏ విధంగా నిధులు అడుగుతారని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కౌంటరిచ్చారు. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి పదకొండు (ఫిబ్రవరి 11) వరకూ కొనసాగుతాయి. విరామం తర్వాత మళ్లీ మార్చి రెండు (మార్చి 2) నుంచి ఏప్రిల్ మూడు(ఏప్రిల్ 3) వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

పవన్ కి బిగ్ షాక్... జనసేనకు రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ!

జనసేనాని పవన్ కళ్యాణ్ కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ.. పవన్‌ కల్యాణ్‌కు లక్ష్మీనారాయణ లేఖ రాశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. ఇక సినిమాల్లో నటించబోనని చెప్పిన పవన్.. ఇప్పుడు మాటమార్చారని ఆరోపించారు. పవన్‌లో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోందని లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇన్నిరోజులు తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

బీ కేర్ ఫుల్.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. కొత్తగా 1700 లకు పైగా కేసులు నమోదైనట్లు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 170కి పెరిగింది. అంచనాలకు అందని విధంగా వైరస్ వ్యాపిస్తుండంతో చైనా సర్కారు సైన్యాన్ని రంగంలోకి దించింది. మరోవైపు అక్కడి భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. చైనాలో కరోనా వైరస్ కాటు రోజురోజుకు పెరుగుతోంది. వైరస్ విస్తృతి టిబెటును తాకింది. టిబెట్ లో తొలి వైరస్ కేసు నమోదైంది. మరో 38 మంది మరణించడంతో మృతుల సంఖ్య 170 కి చేరింది. కొత్తగా మరో 1700 కేసులు నమోదు కాగా మొత్తం వైరస్ సోకిన బాధితుల సంఖ్య 7,711 కు చేరింది. వారిలో 1370 మంది పరిస్థితి క్లిష్టంగా ఉంది. మరో 12,167 మందికి కూడా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న చైనా హెల్త్ కమిషన్ వెల్లడించింది. కరోనా వైరస్ ను భూతంతో పోల్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వైరస్ లు నియంత్రించాల్సి ఉందన్నారు. సమయానుసారం వైరస్ సమాచారాన్ని తమ ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తుందని తెలిపారు. వైరస్ తీవ్రత భయంకర స్థాయిలో ఉండడంతో చైనా సర్కారు సైన్యాన్ని రంగంలోకి దించింది.  మరోవైపు భారత్ సహా ఇతర దేశాలు చైనాలో ఉన్న తమ పౌరుల్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలో 23,000 పైగా భారతీయ విద్యార్థులు ఉండగా అందులో 21,000 మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ముంబయిలో 423 సీట్లతో కూడిన జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఈ విమానం చైనా బయలుదేరనుంది. హాంకాంగ్ లో మరో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. బకాంల్లో 7, తైవాన్ లో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు చైనా హెల్త్ కమిషన్ తెలిపింది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా చైనాలోని పలు నగరాలకు తమ సర్వీసులను నిలిపేయాలని ఎయిరిండియా, ఇండిగో, బ్రిటిష్ ఎయిర్ వేస్, లైన్ ఎయిర్ తదితర విమానయాన సంస్థలు నిర్ణయించాయి. ఇప్పటికే భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు చైనా పర్యటనకు వెళ్లొద్దని తమ పౌరులకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్వో సూచించింది. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఆ అంశం పై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

కేంద్రం ఆమోదం.. నచ్చకపోతే ఆరవ నెలలో కూడా అబార్షన్ చేసుకోవచ్చు

మహిళా హక్కులు , భ్రూణ హత్యలు రెండూ వేరు వేరు అనే అంశంపై కేంద్రం మొదటి వాదనకే కట్టుబడి ఉంది. దీంతో ఓ మహిళ తన ఆరు నెలల గర్భాన్ని కూడా తొలగించుకునేలా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో అబార్షన్ల విషయంలో ఇప్పటి దాకా ఉన్న 20 వారాల గడువు నుంచి 24 వారాలకు పెరగనుంది. ఇది కేవలం మహిళలకు తమ పునరుత్పత్తి పై పూర్తి హక్కులను కలిగించే దారిలో ఓ సంస్కరణగా మాత్రమే కేంద్రం చెబుతోంది. స్త్రీల నుంచి డాక్టర్ల నుంచి ఈ రకమైన డిమాండ్ వచ్చిందని కేంద్రం చెబుతోంది. మహిళల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇప్పటి దాకా గర్భం దాల్చిన 20 వారాల తరువాత అబార్షన్ చేయడం నేరమే అని చట్టం చెబుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తరువాత ఆడశిశువులను పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడమే ఇందుకు కారణం. చట్టం ఏం చెప్పినా వాస్తవంలో మాత్రం భ్రూణహత్యలు ఆగడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర మహిళా హక్కుల పేరుతో అబార్షన్లకు 24 వారాల వరకు గడువు పెంచడం కొంత చర్చకు దారి తీసింది. అలా చేస్తే తల్లి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. కానీ జన్మించే శిశువు ఎదుగుదలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అబార్షన్ ను చేయించడం తప్పని సరి అవుతుంది. అలాంటప్పుడు 20 వారాల గడువు అలాంటి అబార్షన్లకు అడ్డంకిగా మారేది. ఇప్పుడు కేంద్రం చట్టానికి సవరణ చేయడంతో 24 వారాలు అంటే ఆరు నెలలు అయినా అవసరాన్ని బట్టి గర్భ విచ్ఛిత్తికి చట్ట పరంగా కూడా వీలు చిక్కనుంది. అయితే దీనికి పార్లమెంటులో ఆమోదం దక్కాల్సి ఉంది.  

టీడీపీ-వైసీపీ ఎంపీల లొల్లి.. విజయసాయికి క్లాస్ పీకిన రాజ్‌నాథ్‌ సింగ్‌!!

ఏపీ రాజధానిపై వైసీపీ-టీడీపీ పార్టీల మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొనసాగింది. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని మార్పు, శాసనమండలి రద్దు అంశాలను పార్లమెంట్‌లో చర్చించాలని టీడీపీ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని మార్పు రాష్ట్రానికి సంబంధించిన అంశమని విజయసాయి అన్నారు. అయితే టీడీపీ ఎంపీలు మాత్రం అప్పుడు తాము కేంద్రంతో సంప్రదించిన తర్వాతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని గుర్తుచేశారు. ఇలా మాట మాట పెరిగి.. ఇరు పార్టీల నేతల మద్య వాదన తీవ్రస్థాయికి చేరింది. దీంతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కల్పించుకుని.. వైసీపీ ఎంపీలకు క్లాస్ పీకారని తెలుస్తోంది. టీడీపీ ఎంపీల అభిప్రాయాలను ఎందుకు అడ్డుకుంటున్నారని రాజ్‌నాథ్‌ ప్రశ్నించారు. వారు ప్రస్తావన మాత్రమే తీసుకువచ్చారని.. సభలో చర్చించాలా లేదా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. ఇది కేవలం చర్చపై జరుగుతున్న సమావేశం మాత్రమేనని.. చర్చించే అంశాలపై ఇలా గొడవకు దిగడం సరికాదని రాజ్‌నాథ్‌ హితవు పలికారు. దీంతో ఎంపీలు సైలెంట్ అయ్యారు.

లోకేష్ పదవి పోతుందనే మండలి రద్దుకు అడ్డుపడుతున్న చంద్రబాబు!

గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని బాగుచేసుకునే అవకాశం భగవంతుడు ఇప్పుడు కల్పించినా చంద్రబాబు అడ్డుపడుతున్నాడంటూ రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయటానికి నిర్ణయించారని.. అందుకు కూడా చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు.  ఇప్పుడైనా ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం జగన్ ద్వారా భగవంతుడు కల్పిస్తే దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని.. అందుకు మొన్న అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు చూస్తే అర్థమవుతుంది. గతంలో శాసన మండలి అవసరం లేదన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు తన కొడుకు పదవి పోతుందనే భయంతో యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారు మనం చూస్తున్నామని రోజా మండిపడ్డారు.

చీకటి ఒప్పందం.. మూడు రాజధానుల నివేదిక ఇచ్చిన బోస్టన్ గ్రూప్ తో రూ. 6 కోట్ల డీల్!

మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.

హై అలెర్ట్.. భారత్‌లోకి ప్రవేశించిన కరోనా వైరస్‌

దాదాపు వందమందికి పైగా చైనీయులను పొట్టనపెట్టుకుని, చైనాతో పాటు ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. చైనాలోని వుహాన్‌ యూనివర్శిటీలో చదువుతోన్న విద్యార్థి ఇటీవల కేరళకు వచ్చాడు. అయితే అతను అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించగా, పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతనికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ఈ మేరకు భారత ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నాం. ప్రస్తుతం  అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం.’’ అని కేంద్రం ప్రకటించింది.

వివేకా కేసులో అన్నీ అనుమానాలే... సునీత పిటిషన్లో సంచలన ఆరోపణలు... 

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆయన కుమార్తె సునీత... అందుకు పలు కారణాలను న్యాయస్థానం ముందు ఉంచారు. తాము సీబీఐ దర్యాప్తు కోరడానికి బలమైన కారణాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇప్పటివరకూ సిట్ ను మూడుసార్లు మార్చారని... గతంలో అదనపు డీజీ స్థాయి అధికారి సిట్ అధిపతిగా ఉండగా... ఇఫ్పుడు ఎస్పీస్థాయి అధికారిని నియమించారని... ఇలా, పదేపదే సిట్ ను, చీఫ్ ను మార్చడంపై తమకు అనుమానాలు ఉన్నాయని సునీత హైకోర్టుకు తెలిపారు. అలాగే, వైఎస్ వివేకా హత్య జరిగిన పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపైనా, స్వాధీనంచేసుకున్న ఆధారాలపైనా పోలీసులు ఎందుకు మాట్లాడ లేదని సునీత ప్రశ్నిస్తున్నారు. అసలు అనుమానితుల కాల్ డేటాను పోలీసులు పరిశీలించారా? అలాగే, ప్రధాన అనుమానితుడైన కసునూరు వైసీపీ లీడర్ పరమేశ్వర్ రెడ్డి... వివేకా హత్య జరిగిన రోజు ఉదయం ఆస్పత్రిలో చేరి... ఆ తర్వాత ఓ హోటల్లో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలవడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇక, వివేకా మర్డర్ జరిగిన రోజు కుటుంబ సభ్యులు... సన్నిహితులు వ్యవహరించిన తీరుపైనా సునీత అనేక అనుమానాలు వ్యక్తంచేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు ప్రధాన అనుచరుడైన డాక్టర్ శివశంకర్ రెడ్డి... వివేకా మృతదేహమున్న బెడ్రూమ్ లో ఎందుకున్నారు? గామాలకు డ్రెస్సింగ్ చేసి కుట్లు వేయాలని ఎందుకు హడావిడి చేశారు. బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకలను శుభ్రం చేయాలని వంట మనిషి లక్ష్మమ్మను యర్ర గంగిరెడ్డి ఎందుకు ఆదేశించారు? వివేకా ఇంట్లో ఆరోజు పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు ఉండగా... సాక్ష్యాలు చెరిపేశారన్న అభియోగంపై వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అంటూ అనేక అనుమానాలను సునీత హైకోర్టు ముందు పెట్టారు. బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకలు ఉండగా... వివేకా తలపై లోతైన గాయాలు ఉండగా...ఉదయం పదకొండున్నర వరకు గుండెపోటుతో మరణించారని టీవీ ఛానెళ్లలో ఎలా ప్రసారమైంది? వివేకా మృతదేహంపై గాయాలున్న ఫొటోలు, వీడియోలు తమ దృష్టికి వచ్చేవరకు గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. ఇక, ఉదయమే ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించిన సీఐ... అనుమానాస్పద మృతిగా కేసు ఎలా నమోదు చేశారు. అలా, కేసు నమోదు చేయాలని అతనికి సూచించిందెవరు? అసలు కేసే వద్దని యర్ర గంగిరెడ్డి ఎందుకు ఒత్తిడి తెచ్చారు? దీని వెనుక ఉన్నది ఎవరు? అంటూ సునీత అనేక అనుమానాలను లేవనెత్తింది. వివేకా హత్య జరిగిన రోజు వాచ్ మన్ రంగయ్య ఇంట్లోనే ఉన్నాడని, కానీ తనకేమీ తెలియదని చెబుతున్నాడని సునీత హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, తాము పులివెందుల ఎప్పుడొస్తున్నారంటూ ఫోన్ చేసి రంగయ్య ఆరా తీశాడని, కానీ ఇఫ్పుడు తాను ఫోనే చేయలేదని మాట మార్చాడని సునీత న్యాయస్థానికి తెలిపారు. అసలు, రంగయ్య కాపలాగా ఉండగా హంతకులు ఇంట్లోకి ఎలా వెళ్లగలిగారు? రంగయ్యకు తెలియకుండా ఎలా వెళ్లిపోయారు? అసలు, వాచ్ మన్ రంగయ్య పక్క తలుపులో నుంచి లోపలకు ఎలా వెళ్లాడు? అసలు ఆ తలుపు తెరిచి ఉందని రంగయ్యకు ఎలా తెలుసు? ఈ చర్యలన్నీ రంగయ్య వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని సునీత అంటున్నారు. అయితే, వివేకా శరీరంపై ఉన్న గాయాలు... ఇంట్లో సీన్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే... ఒకరి కంటే ఎక్కువ మంది ఈ హత్య చేసినట్లు అనిపిస్తోందని సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

శాసనమండలి రద్దు నిర్ణయంతో నిరాశకు గురైన వైసిపి నేతలు!!

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకే కాదు వైసీపీ నేతలకు కూడా తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తాజాగా శాసనమండలిని రద్దు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ లోని పలువురు నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే ఉద్దేశంతో ఏకంగా శాసన మండలినే ఏపీ ప్రభుత్వ పెద్దలు రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిక్కుముడి విప్పబోయి వంద చిక్కుముడులు వేసినట్టుగా ఉంది జగన్ తీరు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం వల్ల ఆ పార్టీలోని ఎందరో నేతల ఎమ్మెల్సీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో వారంతా పార్టీ అధినేత తీరుపై అసహనంతో ఉన్నారు.  మండలి రద్దు నిర్ణయంతో చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలు ఆశలు అడియాసలయ్యాయి. అందులో ఒకరు కె చంద్ర మౌళి కాగా రెండోవారు ఎస్సీవీ నాయుడు. తాము అధికారంలోకొస్తే ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడదే జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మండలి సభ్యత్వం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరి పరిస్థితేమిటన్నది పార్టీ శ్రేణులకు కూడా అంతుబట్టడం లేదు. సీఎం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవరు తప్పుపట్టకపోయినా సన్నిహితుల వద్ద మాత్రం వారు ఆక్షేపిస్తున్నారు.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కె చంద్ర మౌళి కుప్పం నియోజకవర్గంలో 2014-19 ఎన్నికల్లో వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటి చేసారు. పోటీ చేసిన రెండు సందర్భాలలో కూడా చంద్రబాబు మెజారిటీని కొంత తగ్గించగలిగారు. ఇదిలా ఉంటే కుప్పంలో చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఒకవేళ బాబుపై గెలవకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తామని కూడా వాగ్దానం చేశారు. దీనికి తోడు 2019 ఎన్నికల్లో చంద్రమౌళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనలేకపోయారు. దీంతో పార్టీ వర్గాల్లో ఆయనపై బాగా సానుభూతి ఏర్పడింది. వయసు రీత్యా కూడా ఇది చివరి అవకాశం అనే భావన అందరిలో ఉంది వీటికి తోడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా హామీ ఇచ్చినందున చంద్ర మౌళికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని కుప్పం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. చంద్రమౌళి కూడా ఇదే ధీమాతో ఉన్నారు, మండలిలోకి చంద్రమౌళి అడుగుపెడతారని అదృష్టం కలిసొస్తే మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దు తీర్మానం చేయడంతో ఈ అంశం చంద్రమౌళి పాలిట పిడుగుల మారింది.  శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రాజకీయంగా అనేక పార్టీలలో కొనసాగినప్పటికీ స్థానికంగా బలమైన నేత. శ్రీకాళహస్తితోపాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్తివేడులోనూ నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజక వర్గంలో ఆయనకు బాగా పట్టుంది. గత పాతికేళ్ల నుంచి శ్రీ కాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆశతో అప్పటికే తాను కొనసాగిన పార్టీలో టిక్కెట్ ఆశించి భంగపడిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి ఈ ఆశతోనే ఆయన పలు పార్టీలు మారినట్టుగా స్థానికులు చెబుతుంటారు. 2004ఎన్నికల సమయంలో ఎస్సీవీ నాయుడు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించింది, తొలిసారి గెలిచి చట్ట సభలోకి అడుగు పెట్టారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఎస్సీవీ నాయుడు తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చారు. అప్పటి నుంచి టిడిపిలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు, టికెట్ లభించకపోవడంతో టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ కాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కూడా ఎస్సీవీ నాయుడు పట్టు ఉండటంతో ఆ మూడు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గట్టిగా కృషి చేశారు. అయితే పార్టీలో చేర్చుకునే సమయంలో ఎస్సీవీ నాయుడుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. వయసు రీత్యా నాయుడు కూడా ఈ ఐదేళ్ళలోనే సముచిత పదవులు పొందాలనే ఆశ పెట్టుకున్నారు. జగనిచ్చిన మాట నెరవేరుతుందని తన అనుచర వర్గంతో కూడా చెబుతూ వచ్చారు.  అయితే మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడంతో ఏకంగా మండలి పైనే వేటు వేశారు సీఎం జగన్. ఈ పరిస్థితుల్లో ఎమెల్సి పదవులపై ఆశ పెట్టుకున్న నేతల్లోనే కాకుండా వారి అనుచర వర్గాల్లో కూడా తీవ్ర నిరాశ చోటుచేసుకుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇతర పదవులేమైనా ఇస్తారని ఆశించాలన్నా అలాంటి అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్ పాటించేలా విధాన పరమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కడం దాదాపు అసాధ్యమని ఆయా నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ నిర్ణయంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు బహిరంగంగా మాత్రం విమర్శించటం లేదు కానీ, అంతర్గతంగా బాగా రగిలిపోతున్నారట. మండలి రద్దును స్వాగతించే వారికన్నా విమర్శించే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

సమత కేసులో సంచలన తీర్పు.. దోషులకు ఉరిశిక్ష

కొమరంభీం జిల్లాలో జరిగిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు. ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి ఉరిశిక్షను ఖరారు చేయగానే.. దోషులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. తామే కుటుంబానికి ఆధారమని, శిక్ష విషయంలో కనికరం చూపాలని నిందితులు వేడుకున్నారు. అయితే మీరు చేసిన నేరం చాలా ఘోరమైనదని చెబుతూ న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. తీర్పుపై సమత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. డిసెంబర్ 27న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో వారికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

వైసీపీ ఎంపీలకు అవమానం? నిరూపిస్తే క్షమాపణ చెబుతానన్న మంత్రి నాని

పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశాన్ని వైసీపీ ఎంపీలు బాయ్ కాట్ చేశారు. దాంతో, ఈ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశ మందిరానికి ముందుగా వచ్చిన ఇన్ ఛార్జ్ మంత్రి పేర్నినాని, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని... అలాగే కలెక్టర్ ముత్యాలరాజులు వేదికపై కూర్చున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వేదికపైకి వెళ్లారు. అనంతరం వచ్చిన వచ్చిన ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్ లు వేదిక ముందున్న మొదటి వరుసలో కూర్చున్నారు. అయితే, అంతకు ముందే వేదికపైకి వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణంరాజు హఠాత్తుగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. దాంతో, మరో ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా  రఘురామకృష్ణంరాజు వెంటే బయటికి వెళ్లిపోయారు. దాంతో, సమావేశంలో కలకలం రేగింది. అయితే, వేదికపై కూర్చోకూడదని కొందరు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సూచించారని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన బయటకు వచ్చేశారన్నది సహచరులు చెబుతున్నారు. ఇదే విషయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సమావేశం నుంచి బాయ్ కాట్ చేయగా... మరో ఎంపీ ఎంపీ మార్గాని భరత్‌ సైతం సమావేశం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. తాము ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతినిధులమనీ, వేదికపై తమకు చోటు లేకపోవడం అవమానమని అన్నారు. ఎంపీలకు ప్రొటోకాల్‌ పాటించకపోతే ఎలా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే, అందరికీ ప్రొటోకాల్‌ పాటిస్తూనే ఉన్నామన్నామని పశ్చిమగోదావరి జిల్లాఇన్ ఛార్జ్ మంత్రి పేర్నినాని వివరణ ఇచ్చారు. ప్రొటోకాల్‌ పాటించలేదని ఎవరైనా నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు.    అయితే, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి బాయ్ కాట్ చేయడంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారుల కంటే తామే ఎక్కువన్నారు. దిశ కమిటీకి, లోక్‌సభలో సబ్‌ ఆర్డినేట్‌ లెజిస్లేటివ్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్న తనకు డీఆర్సీ మీటింగ్ లో సముచిత స్థానం ఉంటుందని భావించానని, కానీ అలా జరగలేదన్నారు. తనకు జరిగిన ఈ అవమానం... తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నానన్నారు. అధికారులు తమ కంటే ఎక్కవని నిబంధనలు చెబితే... తాను అలాంటి మీటింగ్‌లకు ఇక మీదట వెళ్లబోమన్నారు. ఈ విషయమై జిల్లా మంత్రి ఆళ్ల నాని క్షమాపణ చెబుతారని భావిస్తున్నా అన్నారు. తదుపరి సమావేశాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని అనుకుంటున్నానన్నాని... ఒకవేళ అలా జరగకపోతే ఇక ముందు జరిగే మీటింగ్‌లకు వెళ్లబోమని రఘురామకృష్ణంరాజు తేల్చిచెప్పారు.

తప్పదా?.. అధిష్టానాన్ని కాదని పోటీ చేసిన అభ్యర్థులపై వేటు వేయనున్న టీఆర్ఎస్!

తెలంగాణలో కొత్త పాలక మండలి కొలువు తీరింది. అయినా టీఆర్ఎస్ లో ఆ హీట్ ఇంకా పోలేదు. ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన రెబల్స్ పై వేటు వేయాలని పార్టీ నేతలు కొందరు ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పోటీ చేసిన వారిని వదిలిపెట్టకూడదని కోరుతున్నారు. తమ ఓటమికి కారణమైన రెబల్స్ పై వేటు వేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. కొల్లాపూర్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన వారి జాబితా ఇప్పటికే మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఒక వైపు గులాబీ బాస్ కేసీఆర్ కూడా రెబల్స్ తో పాటు వారిని ప్రోత్సహించిన వారి పై గుర్రుగా ఉన్నారు. అయితే ఈ టైంలో వేటు వేస్తే పార్టీకొచ్చే లాభమేంటి అని ఆలోచనలో ఉంది టిఆర్ఎస్ అధిష్టానం.  ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేవు.. ఇప్పుడు వేటు వేస్తే లాభం లేదని.. అందుకే కొంతకాలం సైలెంట్ గా ఉండాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. మరో వైపు వేటు వేయకపోతే పార్టీలో సీరియస్ నెస్ అనేది లేకుండా పోతుందని భవిష్యత్ లో మరోసారి ఇలా పార్టీకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వీరిపై వేటు వేయాలా అనే అంశంపై పార్టీ పెద్దలు తర్జన భర్జన అవుతున్నారు. నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినా పార్టీ అధిష్టానం మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్నాయి కాబట్టి పార్టీ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తేనే అప్పుడు రెబల్స్ బెడద ఉండదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

ఇంటికి రప్పించండి.. చైనాలో చిక్కుకున్న భారతీయ ఉద్యోగుల ఇళ్లల్లో ఆందోళన

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కు ఏపీ ప్రజలు భయపడిపోతున్నారు. ఇక్కడ నుంచి చైనాకి ఉద్యోగం కోసం వెళ్లిన వారి బంధువుల కోసం ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి విస్తృతం కావడంతో చైనాలోని వుహాన్ నగరంలో ఉంటున్న 58 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. చైనా వుహాన్ నగరం లోని అప్టోడిస్ ప్లే టెక్నాలజీ ప్రైవేటు కంపెనీలో 58 మంది భారతీయుల ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 23 న ఛైన్ అప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ట్రైనింగ్ లో భాగంగా 58 మంది భారతీయులను వుహాన్ సిటీకి పంపించింది సదరు కంపెనీ.  ముఖ్యంగా కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వుహాన్ సిటీకే ఉంది అనే హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడి టీసీఎల్ ఉద్యోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్ కు లేఖ రాశారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా సేమ్ జగన్ కు లేఖ రాశారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి అక్కడి జననంతో పాటుగా వుహాన్ నగరంలో ఉద్యోగాలు చేస్తున్న 58 మంది భారతీయుల తల్లిదండ్రులను కూడా భయపెడుతోంది. తమ వాళ్లను వైరస్ బారిన పడకుండా వెంటనే స్వదేశానికి రప్పించేయాలని తలిదండ్రులు వేడుకుంటున్నారు. విశాఖ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో దుబాయి ఫ్లైట్ లో దిగిన ఒక వ్యక్తి దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో అతడికి వైద్యులు స్క్రీనింగ్ చేశారు. అక్కడి నుంచి కేజీహెచ్ కు తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షల తర్వాత కరోనా వైరస్ సోకలేదని తేలడంతో డిశ్చార్జ్ చేశారు.