అనుమానించినట్లే జరిగింది... మూడోసారి వాయిదా పడింది...
posted on Feb 1, 2020 9:11AM
అంతా అనుమానించినట్లే జరిగింది... చివరి నిమిషంలో ఉరి ఆగిపోయింది... ఎలాగైనా ఉరిశిక్షను వాయిదా పడేలా చేయాలన్న నిర్భయ దోషుల ప్రయత్నం ఫలించింది. న్యాయవ్యవస్థలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకున్న నిర్భయ దోషులు మూడోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడేలా చేసుకున్నారు. డెత్ వారెంట్ ప్రకారమైతే ఈపాటికి నలుగురు నిర్భయ దోషులు ఈ భూమ్మీద లేకుండా పోయేవారు. కానీ, ఉరిశిక్ష అమలుకు సరిగ్గా పది పన్నెండు గంటల ముందు ఢిల్లీ పాటియాలా కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే కొత్త డెత్ వారెంట్ జారీ చేస్తామని తెలిపింది.
ఉరిశిక్షను సవాలు చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ పాటియాలా కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ దోషులు కోరారు. అయితే, ఒక్కడి మెర్సీ పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉన్నందున మిగతా ముగ్గుర్నీ ఉరితీయోచ్చంటూ ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, ఒక కేసులో మరణశిక్ష పడిన దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలన్న నిబంధన ఉండటంతో దోషుల వాదనను సమర్ధిస్తూ ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా కోర్టు స్టే విధించింది.
మూడోసారి ఉరిశిక్ష వాయిదా పడటంతో నిర్భయ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయంటూ కంటతడి పెట్టారు. వాళ్లను ఎప్పటికీ ఉరి తీయరంటూ దోషుల తరపు లాయర్ ఏపీసింగ్ సవాల్ విసిరాడని మీడియాతో చెప్పారు. అయితే, దోషులకు ఉరిశిక్ష అమలుచేసేవరకు తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.