ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో 63000 కు పైగా ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులకు జగన్ ఆదేశం...
posted on Feb 1, 2020 @ 2:34PM
ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమగ్ర క్యాలెండర్ ను రూపొందించి దశల వారీగా పోస్టుల భర్తీ చేపట్టాలని సూచించారు. వైద్య, విద్యారంగంలో అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఏపీలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను సత్వరమే భర్తీ చేసి ప్రజలకు సేవలందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఖాళీ ఉద్యోగాల గుర్తింపు, భర్తీపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో సమూల మార్పులు ఆశిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ పై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. నాడూ నేడూ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రుల రూపురేఖలను మారుస్తామన్న సీఎం దీంతో పెద్ద ఎత్తున రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని చెప్పారు.
వీరికి సేవలందించేందుకు వీలుగా డాక్టర్ లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ లు, ఫార్మసిస్టు పోస్టులు పూర్తిగా భర్తీ అయి ఉండాలని కోరారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాడు నేడు చేపడుతున్నందున పాఠశాలల్లో సిబ్బంది లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వృధా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు సరిపడా లేకపోతే పాఠశాలల సమర్థత తగ్గుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. అప్పుడే స్కూళ్లల్లో మనం చేపడుతున్న ఆధునీకరణ పనులు, అమ్మఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతల కోసం తీసుకుంటున్న చర్యలకు అర్థం ఉంటుందన్నారు. పోలీసు విభాగంలో వారాంతపు సెలవులను సమర్థంగా అమలు చేయాలని డీజీపీ సవాంగ్ ను సీఎం జగన్ ఆదేశించారు.
అయితే సెలవుల కారణంగా పోలీసు శాఖ సామర్థ్యం తగ్గకూడదని హితవు పలికారు. రెవెన్యూ విభాగంలోనూ ప్రాధాన్యత పోస్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చాలన్నారు. ప్రతి విభాగంలోనూ ప్రాధాన్యతా క్రమంలో పోస్టుల భర్తీపై చర్చించాలన్నారు. కాగా మూడు వారాల్లో ప్రాధాన్యత పోస్టులను నిర్ధారిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. అధికారులందరూ ఫిబ్రవరి 21 న సీఎంతో మరోసారి భేటీ అయి కార్యాచరణ తెలియ జేయాలని నిర్ణయించారు.
ఉద్యోగార్ధుల గరిష్ఠ వయోపరిమితి సడలించే విషయం కూడా ఈ సమీక్షలో ఏపీపీఎస్సీ ప్రస్తావించింది. అయితే నలభై ఆరు సంవత్సరాలకు సడలించాలన్న అభిప్రాయం వ్యక్తమైనా ఏఏ పోస్టులకు సడలించాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఇరవై ఒకటిన జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టులు 63000 కు పైనే ఉండొచ్చని సీఎం జగన్ కు అధికారులు నివేదించారు. టీచరు పోస్టులు 21000, ఏపిపిఎస్సీ భర్తీ చేసే పోస్టులు 19000, పోలీసు విభాగంలో పోస్టులు 13000 ఉన్నాయి. అయితే వాటి సంఖ్య మరింత పెరగవచ్చని సమాచారం, ఆర్థిక శాఖ ప్రతి డిపార్ట్ మెంట్ తో మాట్లాడి ఖాళీలను నిర్ధారించి వాటిని ఏ విధంగా భర్తీ చేయాలన్న విషయంపై ఏజెన్సీలతో చర్చించనుంది.